ఈసామూహిక యాగాలు,పూజలు అవసరమా ? పదేపదే ఇలా పిలవాలా !
>> Thursday, April 22, 2010
వ్యక్తి సంఘజీవి . ఇక్కడ సమాజం ఎంత శాంతిసౌభాగ్యాలతో విలసిల్లుతుందో దానినాశ్రయిమ్చే వ్యక్తిజీవితం నడుస్తుంది. అది మంచిగాని చెడుగాని ఆచర్యల ప్రభావం ఆ సమాజంలో అందరిపైన పడుతుంది. కనుకనే వ్యక్తిగత పొరపాట్లకంటే సామాజికంగా జరిపే సామూహిక పొరపాట్లు తీవ్రమైన అనర్ధాలను తెస్తాయి .తెస్తున్నాయి కూడా. ఇక భగవంతుని కి వ్యక్తికున్న సంబంధాలు , సామూహికంగా సంఘం లోజరిగే మార్పులపై ఆధారపడిఉండవు. కానీ భగవంతుని వైపు పయనం జరిపే మార్గంలో నడకను ప్రభావితం చెయ్యగలవు. కనుకనే సాధకునికి పైస్థాయిని చేరుకున్నదాకా పరిసరవాతావరణం శుభ్రం గాను,శుభప్రదంగాను ఉండాల్సిన అవసరం ఉంది.
అదీగాక భగవంతుడు పరమకరుణతో ఇచ్చిన ప్రకృతి సంపదను కాపాడుకోవలసిన అవసరం తప్పనిసరి. అలాగే నీతి నియమాలను ,ధర్మాన్ని ,దైవీభావాలను సంరక్షించుకోవాల్సిన అవసరం మానవ మనుగడకు తప్పదు . వీటిని మనం మెరుగుపరచాల్సిన అవసరమేమీ లేదు ఉన్న దానిని ఎలా సృష్టించబడినదో అలానే ఉండనిస్తే చాలు. కానీ మనమలా ఉండమే ! కొంత అహం ,మరికొంత మూఢత్వం , ఇలా అవలక్షణాలు పెరిగేకొద్దీ మన వికృతమైన ఆలోచనలతో ప్రకృతిని ధ్వంసమొనరుస్తూనే ఉన్నాము. మనిషిగా జన్మించి మాహోన్నతంగా ఎదగాల్సిన పయనం వెనుక్కు తిరిగి మృగత్వం వైపుకు మల్లుతున్నది.
సృష్టి సంరక్షణార్ధం పరమాత్మపదేపదే అవతారాలు ధరించి దీనిని సరిదిద్దుకోవటమెలాగో చూపించాడు . ఈ సంరక్షణా కర్తవ్యం మనుషులదేనని బోధించాడు. కనుకనే ఇప్పటివరకు వచ్చిన భగవదవతారాలలో చివరిదైన కృష్ణావతారంలో మానవ కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వచించాడు.పరమాత్మ. ఒకస్త్రీ కి అవమానం జరుగుతుంటే మౌనం వహించిన భీష్మద్రోణ,కర్ణాది మహాపురుషులను సహితం దగ్గరుండి శిక్షింపజేసి ,మనం ధర్మాన్ననుసరింపకపోతే ఏమి జరుగుతుందో,తానేమి చేస్తానో చూపి హెచ్చరించాడు.
ఇక యుగధర్మాన్ననుసరించి ఈ కలియుగాన జిహ్వ,అంగ చాపల్యములతో మనసులను వికారింపజేసి మానవులను పతితులనుచేస్తానని కలిపురుషుడు ప్రతినబూనాడు. ఈర్ష్య ,అసూయ ,కలహాలే అన్నింటా వర్ధిల్లుతున్నాయి. ఎక్కడచూసినా ,ఈ చాపల్యాలతో నిండిపోయి మనమనసులు కలుషితమై క్రమేపీ మానవత్వం మరుగయ్యే స్థితి దాపురించింది. దీనివలన జరుగుతున్న సామూహిక పాపం సామూహికమైన పెనుప్రమాదాలను సృష్టిస్తున్నది.
కనుక మానవుడు తాను ధర్మాన్ననుసరించి బ్రతకటమేకాదు. ధర్మాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యతకూడా ఉంది. ఒకవైపు కలిపురుషుడు ,ఆయన సేన ,కరాళనృత్యం చేస్తూ మానవులలో దివ్యగుణాలను ద్వంసంచేస్తూ ,కేవలం కాముకులుగాను ,భోగలాలసులుగానూ, తయారుచేసేందుకు నస్తిక,భౌతిక, కాముక వాదాలను ప్రచారం చేస్తూ ఉంటే . వీటినుండి కాపాడగల భగవత్ శక్తిని వేడుకుని పిలవగల ధార్మిక ఆచరణలు ,మార్గాలు క్రమేపీ కనుమరుగవనున్నాయి. తల్లడిల్లుతున్న భూదేవి వేదనలు విలయాలను తెస్తున్నాయి.
ఈస్థితి సరిదిద్దాలని మానవునిలో మృగత్వలక్షణాలను పెరగనీయకూడదనే సత్సంకల్పంతో మహాత్ములు ,సిద్ధమండలి భువిన తీవ్ర శ్రమతో ధర్మరక్షణకు పూనుకున్నారు. ఇక భారము వారిదే అని మనం చూస్తూ కూర్చోవటం పాపహేతువు. ఎవరికి వీలైన పద్దతిలో సద్భావనలను, ధర్మవిధులను వారు పాటించాలి ,ప్రచారం చేయాలి. అయితే ఇక్కడ కాచుకుని కూర్చున్న కలిసేన మాయాప్రభావానికి లోనై స్వార్ధపరతతో ఈకార్యక్రమాలు గాడిదప్పితే సాధకునికే కాదు, లోకానికీ కీడే . ఆవిషయంలో జాగ్రత అవసరం. భగవత్ సేవాభావంతో సామూహిక పూజలు,యాగాలు .సత్సంగాలు విస్తరిల్లవలసిన అవసరం ఈసమయంలో అత్యవసరం. ఈపనులు చేపట్టటానికి మహాత్ములే అవసరం లేదు. మనలాంటి మామూలు మనుషులు కూడా అర్హులే.
కనుకనే నాకు చేతైన అవకాశమున్నరీతిలో భగవత్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. నేనునడిచే బాట మహాత్ముల నడకతో బాగా నలిగిన దారి కనుక నేను నడుస్తూ నాతోటివారిని రమ్మని పిలుస్తున్నాను. అయితే ఇక్కడ మాత్రం నేనెవరో .నాస్థాయి ఏమిటో ఒల్లుమరచి మాట్లాడే మానసికదౌర్భల్యానికి లోనవలేదు. నేను నమ్మినది భగవంతున్ని, ఆశ్రయించమని ఎలుగెత్తి చెబుతున్నది ఆయనశక్తినే. అందుకు అవసరమైన సాధనా సామాగ్రి నా అల్పబుద్దినుంచి అతితెలివితో సృష్టించినదికాదు. మహాత్ములు అనుగ్రహం తో లోకానికి ఇచ్చినదిమాత్రమే. ఎవరన్నా ఈబాటలో నడుస్తూ మేలుపొందినా,నాకన్నా ముందుకు సాగినా , అది ఖచ్చితంగా సాధకులభక్తి,పరమాత్మశక్తిమాత్రమే అని ఎప్పుడు చెబుతూనే ఉంటాను. అసలిది చెప్పటానికైనా అర్హత ఉండవద్దా ? అని పెద్దలనవచ్చు. ఎక్కడో చదివాను .రామకృష్ణులు ఒకాయనను ఎందుకయ్యా! అలా ధర్మం గూర్చి ఊరికే మాట్లాడుతుంటావు ?అని. అప్పుడాయన .స్వామీ స్వయంగా నీచమైన దైనా చీపురు శుభ్రపరచగలుగుతుందికదా అని.వివరణ ఇచ్చుకుంటాడు. ఇక్కడ నన్ను నేను అన్వయించుకుంటున్నాను.
ధర్మోరక్షతి రక్షిత: అన్నారు పెద్దలు . కనుక త్రికరణశుద్ధిగా మన మహర్షుల బోధలను నమ్మి ,ఏపూర్వజన్మపుణ్యం తోనే లభించిన భగవత్ సేవను ధర్మబధ్ధమైన నాస్వంత సంపాదనతోనూ, ,భగవదాదేశానుసారంగా కలసివచ్చే మితృలతో కలసి నిర్వహిస్తున్నాను .అది నేను ఎక్కడ పదిమందితో మాట్లాడగలిగితే అక్కడ. ప్రచారం చేస్తున్నాను . ఇదెవరినో ఉద్ధరించడానికి మాత్రం కాదు. నన్నునేను సంస్కరించుకోవడానికి .స్వీయ శ్రేయస్సుకూడా సమాజశ్రేయస్సుతో ముడిపడిఉంది అని నమ్మి.
గత సంవత్సరం ఈసమయంలో నిర్వహించిన" హనుమత్ రక్షాయాగం "లో పాల్గొన్న సాధకుల అనుభవాలు మహాత్ములు ప్రసాదించిన సాధనా సంపత్తి మహిమను ప్రత్యక్షంగా నిరూపించాయి . కాకికి ఒకముద్ద ఆహారం దొరికితే పదికాకులను పిలుచుకుంటుంది .అది దాని సామాజిక జీవనంలో నిబద్దత . మనుషులమైయుండి మనం లబ్దిపొందినమార్గాన్ని పదిమందికి అందజేయటం .అదీ లోకానికంతటకు మేలుచెసేదైనప్పుడు తప్పేమిటీ ?
ఇక దీనిపై వచ్చే కువిమర్శలు , కారుకూతలు వీటన్నింటికి చలించే బలహీనతలేదు కనుక అలాంటివారు అనవసర శ్రమతీసుకొనక పోవటం మంచిది. దానివలన నాప్రయాణ మాగదు కానీ నేనేదన్నా తెలియచేసిన దోషాల ఫలితం మాత్రం పాపమై ఈ కువిమర్శకుల నెత్తికి చుట్టుకుంటుంది. దారినబోయే దరిద్రాన్ని నెత్తికితెచ్చుకోవటం తెలివిగలవారు చేయవలసిన పనికాదనుకుంటాను . మీకుచేతనైన రీతిలో లోకానికి మేలుచేయండి ,కీడుచేయకుండా ఊరకున్నా పరవాలేదు. కానీ ప్రత్యక్షగా నిజమేమిటో తెలియకుండా [తెలుసుకోవాలనికూడా ప్రయత్నించకూండా] పరనిందకు పాల్పడవద్దని మనవి.
.లోకాస్సమస్తా సుఖినోభవంతు.
జైహనుమాన్
1 వ్యాఖ్యలు:
>>కాకికి ఒకముద్ద ఆహారం దొరికితే పదికాకులను పిలుచుకుంటుంది .అది దాని సామాజిక జీవనంలో నిబద్దత . మనుషులమైయుండి మనం లబ్దిపొందినమార్గాన్ని పదిమందికి అందజేయటం .అదీ లోకానికంతటకు మేలుచెసేదైనప్పుడు తప్పేమిటీ ?
ఎంత బాగా చెప్పారు. దేహానికి ఆహారము మనస్సుకి ధ్యానము రెండూ ముఖ్యము ఆరోగ్యానికి.మనము నమ్మిన మనపని మనము చేసుకు పోవటమే జీవితంలో తృప్తి నిచ్చేది.
Post a Comment