భక్తి బాంధవ్యం
>> Sunday, April 18, 2010
- చిమ్మపూడి శ్రీరామమూర్తి సమాజంలోని ప్రతి కుటుంబానికీ ఈ మంచి లక్షణం అవసరం. ఈ సత్సంప్రదాయం సమాజంలో పరివ్యాప్తం కావాలంటే కుటుంబసభ్యులంతా చేయవలసిందేమిటి? వారి బాధ్యతలెలా ఉండాలి? చెప్పుకోవడానికిది చాలా సులభంగా కనిపించినా, ఆచరించడానికి చాలా కష్టతరమైన పని. ప్రధానంగా కుటుంబసభ్యుల్లో పరస్పరం ప్రేమాభిమానాలను సర్వదా పెంచుకుంటూనే ఉండాలి. ఒకరిపట్ల ఒకరికిగల బాధ్యతల్ని గుర్తెరగాలి. వాటిని నిర్వర్తించడంలో ఏ క్షణమూ సందేహించకూడదు. నిజానికి ఈ సంస్కారం అంతతేలికగా అబ్బదు. ఇది విజ్ఞులనీ, గురువులనీ విని, చూసి అనుకరించవలసిఉంటుంది. మంచి పుస్తకాలను అధ్యయనం చేయాలి. విషయాలన్నీ ఆకళింపు చేసుకోవాలి. మంచిని కనాలి, మంచిని వినాలి, మంచిని ఆచరించాలి. ఈ మూడు లక్షణాలను ఒంటబట్టించుకుంటే మానవుడు సమాజంలో ప్రతి ఒక్కరిపట్లా తన వంతుగా వ్యవహరించే విధానాన్ని అనుసరించగలడు. శాశ్వతమైన సుఖశాంతులనిచ్చే అనుబంధ-బాంధవ్యాలను మనమందుకోవలసి ఉంది. అవి పారలౌకిక, పారమార్ధిక, బాంధవ్యాలు. ఈ బాంధవ్యానికి సంపదతో, ఆస్తితో, ఐహిక సౌఖ్యాలతో, తాత్కాలిక ఆనందాలతో ఎంతమాత్రమూ సంబంధంలేదు. పదవులతో, హోదాలతో, అధికారాలతో, భేషజాలతో సంబంధంలేదు. అన్ని బాంధవ్యాలకంటే ఈ బాంధవ్యం అత్యున్నతమైనది. అతీతమైనది. మహిమాన్వితమైనది. అదే భక్తిబాంధవ్యం. ఇది తెలుసుకుని ఆచరించిన మహనీయులు శాస్త్ర, పురాణేతిహాసాలలో ప్రతి పుటలోను దర్శనమిస్తారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నారదుడు, హనుమ, విదురుడు, రుక్మిణి, శబరి, పోతన, సుదామ, గోపన్న, త్యాగయ్య, మీరా, కబీరు, తులసీదాసు మొదలైన మహామహులెందరో మహోత్తమమైన భక్తితోనే పవిత్రమైన బాంధవ్యాన్ని పటిష్ఠం చేసుకొని జన్మకు సార్ధకత కల్పించుకున్నారు. తమ వ్యక్తిత్వాన్ని భక్తిభావరసంలో రంగరించి చరితార్ధత చేకూర్చుకున్నారు. ఈ సృష్టిలో చెడని పదార్థం భక్తి ఒక్కటే, చెడనివాడు భక్తుడొక్కడే! పరమేశ్వరుడొక్కడే. ఎందరు దేవుళ్లను ఏ పేర్లతో స్తుతించినా అన్నీ ఆయనకే చేరుతాయి. అటువంటి శ్రేష్ఠతమైన భక్తిని పొందడంలో సనాతన ధర్మం సంపూర్ణంగా సహకరిస్తుంది. సనాతన ధర్మం అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. భక్తిప్రాప్తికి సనాతనం సాధనం. సనాతనుడు ప్రతిష్ఠించిన ధర్మం కనుక సనాతనమైంది. దేవుడు దగ్గరవాలంటే ఆయన దారిలో నడవాలి. భక్తికెంత శక్తి ఉన్నదో, భక్తి బాంధవ్యానికెంతటి ఫలితమున్నదో ఈ కథ చెబుతుంది మనకు. ఒక పండితుడు కష్టపడి, సత్సంగం చేసి శాస్త్ర పురాణాలు చదువుకున్నాడు. తాను నేర్చుకున్నదాన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రవచన రూపంలో భక్తులకు బోధించేవాడు. అలా మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. ఎన్నో గ్రంథాలు రూపొందించాడు. అవి ముద్రించేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు. అకస్మాత్తుగా ఆ పండితుడోరోజున స్వర్గస్తుడయ్యాడు. ఆయనకిద్దరు పుత్రులు, ఒక కూతురు. ఇంట్లో వున్న కాస్త వెండి బంగారాన్ని ఆ మరునాడే కూతురు తీసుకువెళ్లిపోయింది. పెద్దకుమారుడు పండితుడు కట్టుకున్న గృహాన్ని ఆక్రమించుకొని 'తమ్మూడూ! నీవు భక్తుడివి కదా! నాన్నగారు రాసిన లిఖిత ప్రతులన్నీ తీసుకో. ఈ ఇంటిని నేనట్టే పెట్టుకుంటాను' అని ఆ కాగితాలన్నీ తమ్ముడికిచ్చి బైటికి వెళ్లగొట్టాడు. ఇంతలో అక్కడికి పండితుడి భక్తులు, శిష్యులు తండోపతండాలుగా చేరి తమ్ముణ్ని ఓదార్చారు. 'నాయనా! మీ నాన్నగారు తన అద్భుతమైన ప్రవచన ప్రబోధతో మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. కృతజ్ఞతగా ఆయన రచించిన ఈ గ్రంథాలన్నింటినీ మా సొంత ఖర్చులతో ప్రచురించి, విక్రయించి, వచ్చిన సొమ్ముతో మీ జీవనోపాధికి అవరోధం కలగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా గ్రంథ విక్రయం మీద లక్షలకు లక్షలు ద్రవ్యం సమకూరింది. ఇదంతా తండ్రి భక్తిప్రపూరిత ప్రసంగాల ఫలితమేనని గ్రహించిన తమ్ముడెంతో సంతోషించి, పరమభక్తుడై గ్రంథాలన్నీ అధ్యయనం చేసి తానూ గొప్ప పౌరాణిక ప్రాసంగికుడిగా అఖండకీర్తిని ఆర్జించాడు. భక్తిని నమ్ముకున్న భాగవతుడికి భగవంతుడితో ఏర్పడే బాంధవ్యం, సాన్నిహిత్యం అసమానవైనవని సుగ్రాహ్యమవుతోంది. భక్తి బాంధవ్యం వల్లనే మానవ కల్యాణం, అఖిల విశ్వకల్యాణం సుసాధ్యమవుతాయి. [ఈనాడు నుండి] |
0 వ్యాఖ్యలు:
Post a Comment