యోగము- మతము
>> Thursday, May 2, 2013
మీరు ఏ మతము వారైనా యోగ సాధన చేసి లాభపడవచ్చు. ఎందుకంటే యోగ ఒక టెక్నాలజీ(సాంకేతిక పరిజ్ఞానం). సాంకేతిక పరిజ్ఞానానికి మీ నమ్మకాలూ అపనమ్మకాలతో పని లేదు. మీ నమ్మకము(మతము) అన్నది పూర్తిగా మీ మానసిక విధానం. మతానికీ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లబ్ధి పొందడానికీ ఏ విధమైన సంబంధమూ లేదు. ఉదాహరణకు గురుత్వాకర్షణ సిద్ధాంతం క్రైస్తవ మతానికి చెందిన ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించాడని అది క్రైస్తవ మతానికి సంబంధించిందే అవుతుందా? అదే విధంగా యోగ ఉపయోగించుకోవడానికి మతంతో సంబంధం లేదు. ఆసక్తి ఉన్న వారెవరైనా ఉపయోగించుకోవచ్చు.
యోగాకు కూడా మతం రంగు వేయడం హాస్యాస్పదం. ఆధ్యాత్మికత, యోగ మతాలు పుట్టక ముందే ఉన్నాయి. మానవతను విభజించే విధంగా మతాలను ఏర్పాటు చేసే ఆలోచన మానవులకు రాక ముందు నుంచే యోగ ఉన్నది. అసలు మానవుడు పరిణితి చెందగలడన్న తలంపే ఆదియోగి శివుని నుంచి వచ్చింది.
హిందూ అనేది ఒక మతం కాదు
యోగ శాస్త్రాలు హిందూ మతానికి సంబంధించినవి ఎందుకు ముద్రవేయబడ్డాయంటే అవి ఈ సంస్కృతితో పెరిగాయి కాబట్టి. అసలీ సంస్కృతే సహజం(తర్కపరంగా)గా పరిణితి చెందింది కాబట్టి ఈ యోగ శాస్త్రాన్ని కూడా శాస్త్రీయంగా, ఈ ప్రాంతపు జీవన విధానమైన హిందు సంస్కృతి పటుత్వం ద్వారా ప్రచారమయ్యాయి. అసలు 'హిందు' అన్న మాట ఒక నదియైన 'సింధు' అనే పదం నుంచి ఉత్పన్నమైంది. అసలు ఈ సంస్కృతి సింధూ లేక ఇందు నది ఒడ్డున పెరిగింది కాబట్టి ఈ సంస్కృతి హిందూ సంస్కృతిగా పేరుగాంచింది. ఇది భౌగోళికపరమైన గుర్తు. అదే క్రమేణా సాంస్కృతిక పరమైన గుర్తుగా మారింది. దురాక్రమణదారు మతాలు ఈ భూమిపై దండెత్తినప్పుడు పెద్ద పోటీ ఏర్పడింది. ఈ ప్రాంతంవారు ఒక మతంగా తయారు అవడానికి ప్రయత్నించారు.-అలా ఇంకా జరగలేదు.
మనం హిందు అన్నది ఒక మతం కాదు. హిందు అంటే ఒక విధమైన నమ్మిక విధానం కాదు. ఈ సంస్కృతిలో జరిగేదే హిందు. ఈ హిందు జీవనశైలిలో ఫలానా దేవుడు, ఫలానా సిద్ధాంతం అని ఏమీ లేదు. ఈ సంస్కృతిలో ఒక మగ దేవుని ఆరాధించి హిందువుగానే ఉండవచ్చు. ఆడ దేవతను ఆరాధించి హిందువుగానే ఉండవచ్చు. ఒక ఆవుని ఆరాధించి హిందువుగానే ఉండవచ్చు. అసలు ఏ ఆరాధనలూ లేకుండా కూడా హిందువుగానే ఉండవచ్చు. అంటే ఒకరికి నమ్మకాలు ఉన్నా లేకపోయినా హిందువుగా ఉండవచ్చు.
దేవుళ్లనే తయారు చేసేవారు
ఇన్ని విభిన్నతలు ఉన్నా ఈ సంస్కృతిలో అన్నింటినీ పెనవేసే ఒక ధ్యేయం ఉన్నది. ఈ సంస్కృతిలో ఉన్న ఒకే ధ్యేయం ముక్తి. అసలు ఈ 'జీవం' అనే వలయం నుంచి విడుదల లేక విముక్తి, మీకు తెలిసిన అన్ని హద్దుల నుంచీ విడుదల. ఈ సంస్కృతిలో దేవుడిని పరమోన్నత స్థితిగా తలచబడలేదు. ఇక్కడ దేవుడు పరమోన్నత స్థితికి చేరుకోవడానికి ఒక ఉపాధి(ఉపకరణం) మాత్రమే. 'దేవుడు' అంటే 'ఇది' అని నిర్ధారణగా చెప్పని మతం ఈ భూమండలంలో ఈ సంస్కృతి ఒక్కటే. మీరు ఒక రాయిని, ఒక గోవుని, మీ తల్లిని- మీకు ఏది కావాలనుకుంటే దానిని ఆరాధించవచ్చు.
ఎందుకంటే ఈ సంస్కృతిలో దేవుడిని సృష్టించింది మనమేనని మొదటినుంచీ తెలుసు. మిగతా అన్ని చోట్లా దేవుడే తమని సృష్టించారని నమ్ముతారు. కాని ఇక్కడ దేవుడిని మనమే సృష్టించాము. మనకే రకమైన దేవుడు కావాలో ఆ రకంగా సృష్టించుకునే పూర్తి స్వాతంత్య్రం మనకు ఉన్నది. ఇది మానవుని తమ పూర్తి సామర్ధ్యం వ్యక్తపరచగలిగే శాస్త్రం.
0 వ్యాఖ్యలు:
Post a Comment