శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మరణమంటే మార్పే!

>> Monday, April 15, 2013

మరణమంటే మార్పే!


మరణమంటే మార్పే. మార్పు చెందేది దేహమే. ఇంతకాలం దేహంలోనే వుండి కంటికి కనబడక, మనసుకు అనబడక, దేనికీ లోబడక, పరిణామమెరుగని ఆత్మ, పరమచరమంగా వెలుగుతున్నా, అది శాశ్వతమని శాస్త్రాలు ఘోషిస్తున్నా, మనిషి మరణం దుఃఖాన్నే కలిగిస్తున్నది, మిగులుస్తున్నది. దశరధుడు మరణించినపుడు రామచంద్రుడు దూరంగా వున్నాడు. ఇంద్రజిత్ దెబ్బకు లక్ష్మణుడు మూర్చపోతే తమ్ముడికేమౌతుందోనని ఖేద పడ్డాడు.

హనుమ సంజీవని తెచ్చేదాకా రాముడు పడిన పరివేదన దుర్భరం. ఎవరి మరణమూ కృష్ణుణ్ణి ప్రభావితం చేసిన సందర్భం లేదు. తల్లి ప్రాణ నిర్గమన వేళ శంకర భగవత్పాదుల నిరామయ స్థితి, అద్వైత భావస్థితే! రమణ మహర్షి తల్లి అళగమ్మ మరణించగానే "అంతా అయింది. ఎవరి పనిలో వాళ్లముందాం'' అంటూ "అంటుకోవటానికి ఏముంది?'' అంటూ సహజస్థితిలో నిలకడ చెందటం, లోకానికి పరిచయమే.

అది సహజ పరిణామం
మరణాన్ని సహజ పరిణామంగా భావించటం జ్ఞానుల సాధనా స్థితి. అది లోకానికి అనుసరణీయం. మాతృమూర్తిగా, వాత్సల్యామృత వర్షిణిగా, అమ్మగా లోకంలో ఎందరికో ప్రేమను పంచిన అమ్మ, "మిమ్మల్నందర్నీ కని లోకంలో తల్లులకు పెంపుడిచ్చాను'' అని ప్రకటించిన అమ్మ, వేదాంతాన్ని కేవలం బోధించిందా? ఆచరించిందా? అని చూస్తే అమ్మ ఆచరించినదంతా వేదాంతమే. అనుకున్నదానికి, అయినదానికి మధ్య తేడాలేని రీతి అది. అమ్మ కన్న బిడ్డ హైమ మరణం సమకాలీన అధ్యాత్మ చరిత్రలో ఒక పరమాద్భుత దైవఘటన.

రాజకుమారుడు కలకాలం జీవించాలట. తండ్రి పాప భారాన్ని, కరిగేదాకా మోయటానికి. మునికుమారుడు ఎక్కువ కాలం జీవించనక్కరలేదట. మునివన్నీ పుణ్యకార్యకలాపాలు కనుక. ఆతడి పుత్రుడు అనుభవించటానికి ఏమీ లేదు కనుక. సాధు పురుషుడి పుత్రుడు జీవించి వున్నా అపేక్షలు లేకుండా వుంటాడు.

మరణానంతరమూ కలకాలం జీవించి వుంటాడు. వేటగాడి కొడుకు అటు మరణించనూ లేక, యిటు జీవించనూ లేక నిత్య యాతనకు గురౌతుంటాడు. మరణాన్ని గురించి మరణానంతర జీవితాల గురించి పురాణ కాలం నుండీ ఆధునిక వైజ్ఞానిక యుగం వరకు ఆలోచనలు సాగుతూనే వున్నయ్. అంతు చిక్కినట్లున్నా అంతుపట్టని రహస్యం యిదొకటే!

స్పందనలు కానరాని జ్ఞాని
ఎందరెందరివాడో ఈ జీవుడు, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు అని అన్నమాచార్యులవారు, తనువుతో బంధాలు తనువుతోనే తెల్లవారుతయ్ అని తేల్చేస్తారు. ఇంతవరకు తెలుసుకోవటం సులభమే. దీన్నంతా స్వయంగా అనుభవించవలసి వస్తే సాధకులకీ, సాధారుణలకీ, మధ్య వుండే తేడా స్వల్పమే. జ్ఞాని మాత్రం దీనికి భిన్నంగా వుంటాడు. స్పందనలు కానరాని వైఖరి అది. అవతారమూర్తుల విషయం వీటన్నిటికీ పూర్తి భిన్నం.

వారికి ప్రపంచంలో జరిగేదంతా వేడుకే. ఏదీ అంటదు. మాతృశ్రీ అమ్మ కుమార్తె హైమ, అసాధారణ కన్యక. మానవ సంబంధాల పట్ల, జీవుల పట్ల, అందరి పట్ల, అన్నిటి పట్ల ఆమె స్పందనలన్నీ తీవ్రంగా, సహజంగా, కరుణాభరితంగా, ప్రేమపూరితంగా, అతి మానుషంగా వుండటం హైమను ప్రత్యేకంగా నిలిపినయ్. ఆమె మంచితనం, నెమ్మదితనం, ప్రశాంతవదనం అందరికీ ఒక ప్రసన్నతా ప్రసాదనం. కాలగమనంలో ఆమె మరణించటం ఒక ఆఘాతం.

నిజానికి మానవజన్మే ఒక ఆఘాతం. ఎందరో బిడ్డలకు మాతృమమకారాన్ని అవ్యాజంగా పంచిన అమ్మకు, అది ఆఘాతమా? వేడుకలో ఒక భాగమా? అని విచారించినపుడు, అమ్మ ఆ సందర్భంలో చూపించినదంతా అవతారస్పర్శే! "ఆమె మంచితనం కన్నా, బయటకు కనిపిస్తున్న దానికన్నా, ఆమె పడిన ప్రళయ బాధే నన్ను చలింపచేసింది. బాల్యంలో స్తన్యం ఎలా యిచ్చానో, సమాధిగతము అలాగే చేశాను. క్రియలకు అంత్యం వుందిగానీ చైతన్యానికి అంతెక్కడ?'' అంటూ అమ్మ అనటం వెనుకదాగినదంతా అచలమే. జీవుడికే రాక, పోక.

ఆత్మకు ఉండటమే అసలు స్థితి.క్రితం రాత్రి వరకు సమాధి సంబంధిత కార్యకలాపాలలో, బిడ్డ మరణాన్ని, వెనక్కు నెట్టి ఒక గ్రం«థావిష్కరణ కార్యక్రమాన్ని యధాతథంగా జరిపించటం, అందరితోపాటు తీర్థం కోసం చేయిచాపటం, శుభలేఖనందుకుని ఆశీర్వదించటం, ఏమీ జరగనట్లే దైనందిన కార్యక్రమాలను నడిపించటం...యివన్నీ అమ్మ సహజంగా ధరించిన దైవీతత్వమే. పాంచభౌతిక దేహం ధరించినా, లోకంతో ముడిపడి సంచారం సాగినా, మహాత్ముల జీవితమే, మహికి సందేశం. ప్రతి సంఘటనను యధాతథంగా కాక, దాని వెనక దాగిన అంతరార్థాన్ని గ్రహించి స్ఫూర్తిని పొందాలి.
గురువును, మహాత్ములను అనుకరించకూడదు.

అనుసరించకుండా వుండకూడదు.
అనుసరిస్తూ, ఆచరిస్తూ, అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ, స్వస్వరూపాను సంధానం కోసం తీవ్ర ప్రయత్నం చేయాలి. అదే సాధనం. సూర్యుడి నుండీ సూర్యకిరణం, చంద్రుడి నుండీ సువర్మా కిరణం, బంగారం నుండి బంగారం వచ్చినట్లు, అమ్మ నుండి వచ్చి, అమ్మలో లయమైన హైమ, అమ్మ కంటే భిన్నమా? అమ్మకు అనంత సృష్టికి వున్నది, అభేదమే!

వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP