ఆంజనేయం ఆత్మ నిబ్బరం
>> Tuesday, April 16, 2013
ధైర్యానికి, యుక్తికి, శక్తికి మారుపేరైన దేవతా స్వరూపుడు శ్రీ ఆంజనేయస్వామి. సీతానే్వషణ కార్యంలో ఆమె కనపడలేదని, తన ప్రయత్నం సఫలం కాలేదని చింతించిన హనుమంతుడు ఒక దశలో- ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని సమాప్తం చేసుకుందామనే ఆలోచన చేయడం పరిశీలించాల్సిన విషయం. నిజంగా ఆ మహానుభావుడు ఆ పని చేసి ఉంటే ఆయనొక సాధారణ మర్కటంగానే మిగిలిపోయేవాడు. కానీ, భగవంతుడు గొప్ప వివేచనా శీలి. జీవుల పట్ల ఆయన ప్రేమ అపారం. మానవుల పట్ల ఆయనకు మరింత అభిమానం. అందుకే ఆయన సృష్టిలో మరే ఇతర ప్రాణికి ఇవ్వనటువంటి ‘‘బుద్ధి’’ని మానవులకు ప్రసాదించాడు. బుద్ధిని ఉపయోగించుకుని తను ప్రసాదించిన ఈ మహత్తర మానవ జన్మను సార్ధకం చేసుకోవాలని ఆ పరమాత్మ సంకల్పం.
సుందరకాండలో వాల్మీకి మహర్షి ఆంజనేయుడి స్థితిని వర్ణిస్తూ, సీత కనబడని ప్రారంభ దశలో తీవ్రమైన విషణ్ణతకు లోనైనట్లు చెబుతారు. వానప్రస్థుడిగా ఉండిపోతానని, ఉపవాస దీక్షను స్వీకరించి ప్రాయోపవేశం చేస్తానని... ఇలా పరిపరి విధాలుగా స్వామి నిరాశాపూరిత మనః స్థితిలోకి జారిపోతాడు. సుందరకాండలోని 13వ సర్గలో ఈ సంగతి మనం గ్రహించగలము. పైగా ఇటువంటి నిర్యాణ పద్ధతి మహర్షులు ఆమోదించినదే అని తన నిరాశాపూరిత నిర్ణయాన్ని హనుమ సమర్ధించుకుంటాడు.
అంటే- హనుమంతుడంతటివాడు తన ప్రయత్న లోపాన్ని (నిజానికి ఆ మనో స్థితి సమయానికి స్వామి అశోక వనాన్ని సందర్శించనే లేదు) కప్పిపుచ్చుకునే యత్నాలలో చాలా దుందుడుకుగా ఆలోచన చేసినట్టు మనం గ్రహించాలి. తర్వాత నెమ్మదిగా స్వామి ఆలోచనా విధానం సకారాత్మకంగా మారుతుంది. ఆత్మత్యాగానికి సిద్ధపడిన స్వామి మరలా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇలా యోచిస్తాడు.
‘‘వినాశే బహవో దోషా జీవన్ భద్రణి పశ్యతి!
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధృవో జీవిత సంగమః!!’’
నశించడం వల్ల నష్టాలు ఎక్కువ. బతికి ఉంటే ఎప్పటికైనా శుభాలు చూడవచ్చు. అందుచేత ప్రాణాలు విడిచిపెట్టను. జీవితానికి శ్రేయస్సంగమం నిశ్చయం. ఈ విధంగా యోచించిన స్వామి మరింత సంకల్పబలాన్ని పుంజుకుని బుద్ధికుశలతను పెంచుకుని కార్యసాధకుడిగా మారతాడు.
అదే విధంగా మనోదౌర్భల్యానికి గురైన మరొక వ్యక్తి సుందరకాండలో సీత. రావణుడు తన మాటల దాడితో సీతను మానసికంగా భయపెట్టినప్పుడు ఆమె ‘‘ఎందుకీ మానవ జన్మ! చావడానికి కూడా వీలు కాదాయె!’’ (మానవులు ఆత్మత్యాగానికి అర్హులు కారని గ్రహించాలి)-అని విలపిస్తుంది. ఆంజనేయ దర్శనం తర్వాతనే ఆమెలో బతుకు పట్ల ఆసక్తి, అనురక్తి కల్గుతాయి.
నిరాశా నిస్పృహలలో కూరుకుపోయినపుడు, ‘‘బతకడం వృథా’’అనే భావన బలపడుతున్నప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఆంజనేయస్వామి ఆరాధన. కేవలం గుడికి పోయి, అర్చన టిక్కెట్టు తీసుకుని పూజ చేయించడంతో సరిపెట్టుకోకుండా, స్వయంగా సుందరకాండ పారాయణ గావించాలి. వచనం నిక్షేపంగా ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. సమస్యలు ఉన్నపుడు తప్పనిసరిగా స్వామిని ఆశ్రయంచాలి. ఆంజనేయస్వామిని మనం ఆశ్రయించడం బతుకుపోరులో మన విజయానికి ఆరంభం.
ప్రపంచ ప్రఖ్యాత టీవీ ‘‘టాక్ షో’’ వ్యాఖ్యాత ఓఫ్రావిన్ జీవిత సమరంలో పోరాడిన తీరు, గెలిచి నిలబడిన వైనం చాలా స్ఫూర్తిదాయకం. చిన్న వయస్సులోనే ఆమె అనేకసార్లు అనేక విధాలుగా వంచనకు గురైంది. ఏ మాత్రం అధైర్యపడకుండా జీవన సమరంలో పోరాడి విజయ శిఖరాలు అందుకుంది. ఈమె లాగే మనం కూడా సమస్యలను ఆహ్వానించాలి. ఎదుర్కోవాలి. మన సత్తాచూపాలి. అలాగని ఉద్దేశ పూర్వకంగా తప్పుదారిన నడవరాదు.
తెలిసి చేసినా, తెలియక చేసినా భగవంతుని లెక్కల్లో పుణ్యం, పాపం దేని ఖాతాలో అది జమఅవుతుంది. గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమంటే- మనం సుఖంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అధికారంలో ఉన్నాం, సంపదలు కలిగి ఉన్నాం.. అంటే మన ఖాతాలో పుణ్యం నిల్వ బాగా ఉందని గ్రహించాలి. పుణ్యం నిల్వ తరిగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం మనదే! సకల వేదాలు, పురాణాలు, కృతులు, స్మృతులు వీటన్నింటి సారం ఒక్క మాటలో చెప్పగలవా?-అని ఒక మహారాజు మహామేధావిగా పరిగణింపబడే మహామంత్రిని అడిగాడు.
‘‘పరోపకారమే పుణ్యం, పరపీడనమే పాపం!’’ అని ఒక్క మాటలో తేల్చేసాడు మహామంత్రి. స్థిమితంగా ఆలోచిస్తే మనందరికీ అది నిజమేనని తెలుస్తుంది.
--------------------------------------- - కందాళ శ్రీనివాసరావు
1 వ్యాఖ్యలు:
mana ఖాతా లో ఏది జమ అవుతుంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే బాగుంటుంది.
చాల విషయాలు తెలిసాయి ఈరోజు ..
Post a Comment