శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శంకరుడు శుభకరుడు

>> Saturday, March 9, 2013

శంకరుడు శుభకరుడు



శివుడు సకల జగాలకు పాలకుడు. లోకాలకు శోకాలను తొలగించి శుభాలనిచ్చే దేవుడు. ఈ చరాచర జగత్తును లయం చేసేవాడు. జఢమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే 'లయ'కారకుడు. శివుడు భక్త సులభుడు. భోళా శంకరుడు. అభిషేక ప్రియునిగా భక్తులచే పూజలందేవాడు. పరమేష్ఠిగా పూజలందే శంకరుడు స్థిరుడు, అద్వితీయుడు. సర్వమయుడు, సర్వసృష్టికి ఆదియైనవాడు. జగతికి అది గురువు దక్షిణామూర్తిగా జ్ఞాన బోధ చేసిన అఖండ విజ్ఞానస్వరూపుడు, మోక్షకారకుడు. వేదమయుడు, వేదవిభుడు, ఇంద్రాద్రి దేవతలచే సైతం తెలుసుకోలేని అనంత తత్వమయుడు.

'శివా' అని భక్తితో అన్నంతనే భక్తులను బ్రోచే శంకరుడు భక్తవశంకరుడు. తనువును పులకింపచేసేది, మానవకోటికి మోక్షమార్గదర్శిని అయినది 'శివ పంచాక్షరి'. పరమ మంత్రమైన 'ఓం నమశ్శివాయ' అనే చిన్న జపంతో, నిరంతర తపంతో సాధ్యం కాని మహాకార్యాలు సైతం మనకు సులభంగా సాకారమవుతాయి. చైతన్యానికి మూలబిందువైన ప్రణవం శివ-శక్తి సమన్వితం. అంటే ప్రకృతి పురుషుల సమైక్య శక్తి. ఆ ప్రణవ ఓంకారం నుంచే పంచాక్షరి ఆవిర్భవించింది.

జ్యోతిర్మయ స్వరూపమే శివుడు
శివారాధన హైందవ సంస్కృతిలో అంతర్భాగమై, భక్తజనుల భాగ్యమై చిరకాలంగా నిలిచి ఉంది. జనుల హృదయాలలో ఉన్న తమస్సును తొలగించే జ్యోతిర్మయ స్వరూపునిగా శివుడు జ్యోతిర్లింగాలలో కొలువై ఉన్నాడనేది ఐతిహ్యం. శివునికి అత్యంత ప్రీతిపాత్రమై, మోక్షధామాలుగా వాసికెక్కినవి విశాల భారతావనిలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిర్లింగాలూ, మన రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలే గాక, ఊరూరా, వాడవాడలా వ్యాపించిన శివాలయాలలో శివపూజలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శివుడు నిరామయుడు. నిరాడంబరుడు. భస్మాన్ని పూసుకునే అలంకారాన్ని కలిగినవాడు కాబట్టే భస్మ భూషితాంగుడని పిలువబడ్డాడు. రౌద్రమయ స్వరూపంగా భాసించేవాడు కాబట్టి రుద్రునిగానూ దేవతలలో ప్రసిద్ధుడు. శివుడు చంద్రుని శిరస్సున దాల్చి 'చంద్రమౌళి'గా పూజించబడుతున్నాడు.

గరళకంఠుడు
సృష్టి మేలుకోసం తానే సర్వమూ అయ్యే సర్వాత్ముడు శివుడు. అమృతోత్పత్తి కోసం దేవతలు, దానవులు అత్యంత ఉత్సాహంతో క్షీరసాగర మథనంలో పాలు పంచుకున్నప్పుడు ముందుగా ఆవిర్భవించింది 'హాలాహలం'. గరళాన్ని సేవించి స్థిరంగా తనలో నిలుపుకోగల మహితమైన దైవం శివుడే అని తలచిన దేవదానవులు పాపహరుడైన హరుని ప్రార్థించగానే చిరునవ్వుతో ఆ కాలకూట విషాన్ని తన గొంతులో నింపుకుని గరళకంఠుడయ్యాడు స్వామి. ఈ మహత్తర కార్యంతో లోకాలకు ఎటువంటి కీడూ వాటిల్లకుండా చేసిన వాత్సల్య సింధువు నీలకంధరుడు.

పంచభూతాల్లో ముఖ్యమైనది, ప్రాణికోటికి అత్యంత ఆవశ్యకమైనది జలం. భగీరధుడు దివి నుంచి భువికి గంగను తీసుకు వచ్చినప్పుడు బిరబిర జరజర దూసుకువచ్చే గంగమ్మను క్షణాన నిలువరించి, విశేషమైన జలధారలను తాను ఒడిసిపట్టి, ఆ వేగాన్ని అదుపుచేసి, తగినంతగా ఆ జలధారలను భూమి మీదకు వదిలి భూమి మీద జీవులకు ప్రాణాధారమైన జలాన్ని అందించడమే ఆ శివమూర్తి అపారమైన కారుణ్యానికి ఉదాహరణ. ఈ జగాన మహోన్నతమైన శక్తిగా మహేశ్వరుడు లింగాకృతిలో ఆవిర్భవించిన బృహత్సమయమే మహాశివరాత్రిగా వాసికెక్కింది.

మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయాన ఆవిర్భవించిన ఆ దివ్యఘడియలే మహాశివరాత్రిగా ప్రసిద్ధమైనదే గాక, ఆ పుణ్య ఘడియలలో శివుని అర్చించి పూజించిన వారికి కైవల్యం ప్రాప్తిస్తుందని సాక్షాత్తూ శివుడే అనుగ్రహించినట్లు శివపురాణం స్పష్టం చేస్తోంది. శివునికి నిష్ఠతో మహాశివరాత్రి పుణ్యదినాన అభిషేకాన్ని పవిత్రజలంతో నిర్వహించి, బిల్వపత్రంతో పూజిస్తే పునర్జన్మ ఉండదనేది పురాణ ప్రోక్తంగా చెప్పబడింది.

శివరాత్రి జాగరణ విశిష్టత
శివరాత్రినాడు జాగరణ చేయటం ఆనాటి విధులలో అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. నిఖిల ప్రకృతిలో అంతర్లీనంగా అఖిలమై భాసించే శివశక్తిని అహరహమూ స్మరిస్తూ, శివరూపాన్నే తలుస్తూ, 'శివ' అన్న పదాన్నే శ్వాసిస్తూ జగత్వానికి ప్రతిరూపమైన నిద్ర నుంచి దూరంగా ఉండి సకల శక్తులను జాగృతం చేయడమే శివరాత్రి జాగరణలోని ఆంతర్యం.

పావనమైన శివపూజలో సాయుజ్యం, పవిత్రమైన శివభజనలో సామీప్యం, 'శివ' నామాన్నే తోటివారితో కలిసి స్మరించడంలో సాలోక్యం, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని వచించిన ఆదిశంకరుల అమృత వాక్కులు ప్రత్యక్ష తార్కాణంగా శివరాత్రి జాగరణలో సాక్షాత్కరిస్తాయని భావించవచ్చు. పరమేశ్వరుడు నాశము లేని వాడు, సర్వాధిపతి, సర్వశ్రేష్ఠుడు అని ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది. అంతేగాక ఆ దేవదేవుని నిత్య నిర్గుణుడు అంటే ప్రాకృత గుణ రహితుడు అనీ, నిత్య సగుణుడు అంటే స్వరూపమయమైన దివ్య కళ్యాణ గుణగణ విభూషితుడు అంటూ ఆ స్వామిరూపాన్ని ఈ ఉపనిషత్తు పేర్కొంది.

పార్వతి ప్రకృతి, శంకరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల అపూర్వ యోగానికి వీరిద్దరే నిదర్శనం. పార్వతీపరమేశ్వరుల అమేయ అర్ధనారీశ్వర తత్వం జగానికంతటికీ ఆరాధనీయం, దాంపత్య అన్యోన్య జీవనానికి సదా ఆచరణీయం. శివపూజ పవిత్రమైనది. శివనామం శుభకరమైనది. శివుని గురించిన తలపే నిరంతర చిరంతన ఆనంద హేతువు. ముక్కోటి దేవతలనూ ముందుకు నడిపే మూలధాతువు ముక్కంటి. ఈ మహాశివరాత్రి పుణ్యదినాన శివకైంకర్యం చేసి సకల శుభాలను పొందుదాం. శంకరుని అపార కరుణతో మనలోని శంకలు తొలగి ఆయన కృపకు పాత్రులమవుదాం.

వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు

-----------------------------------------------------------------------------------------------------------

 

సర్వం శివమయం


సర్వం శివమయం జగత్. చరాచర ప్రపంచం అంతా శివమయం. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీ లేదు. ఈ సమస్త సృష్టి పంచభూతాలతో నిండి వుంది. వాటికి ప్రతీకలుగా పరమేశ్వరుడు కంచిలో పృథ్వీలింగంగా, శ్రీ కాళహస్తిలో వాయులింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, అరుణాచలంలో తేజోలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా - పాంచభౌతిక లింగాకృతిని ధరించి, నిరంతరం పూజింపబడుతున్నాడు. మనం పరమశివుని లింగాకృతిలో పూజిస్తాం. అనంతము, అజరామరమూ, గుణత్రయాత్మకమూ అయిన మూలప్రకృతే లింగము. అదే సృష్టి, స్థితి, లయకారకుడైన ఈశ్వరుడు. శివలింగం సర్వదేవాత్మకమైనది. నిత్యామూ శివలింగాన్ని పూజించే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని ఆగమసూత్రాలు చెబుతున్నాయి.

శివరాత్రికి ఏం చేయాలి? శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం వుండి, శివపూజ చేస్తూ, రాత్రివేళ జాగారం చేయడం ధర్మం. నదిలోగాని, చెరువులో గాని మహాశివరాత్రి నాడు తెల్లవారుఝామునే స్నానం చేసి, అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తరువాత శివునికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో అర్చించటం శివరాత్రి వ్రత నియమంగా పెద్దలు చెప్పారు. ఉపవాసం అంటే దేవునికి సమీపంలో నివసించడమే. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటికి దూరంగా వుండటమే ఉపవాసం. భౌతిక రుచులను కాస్త దూరంగా పెట్టి, శివనామస్మరణలో లీనం అయిపోవటమే ఉపవాసం. ం డా.జంధ్యాల పరదేశీ బాబు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP