"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు
>> Wednesday, March 13, 2013
6. పూర్ణత్వమునకు ఎన్నో మార్గములు
దీక్షలు పలు రకములు. దీక్షా మార్గములు ఎన్నో ఉన్నా, గమ్యం ఒక్కటే. ఒకే గురువు తన శిష్యులలో ఒక్కొక్కరికీ ఒక్కో మార్గం నిర్దేశించవచ్చు. కానీ ఆచార్యుడు మాత్రం శిష్యులకు ఒకే సాంప్రదాయమును ఉపదేశిస్తాడు.
గురువులు శిష్యులను మంత్ర, తంత్ర, యోగాద్వైత మార్గములలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చును. తిరుమంత్రం అనే గ్రంధంలో తిరుమూలర్ అనే సిద్ధుడు వివిధ మార్గములను విశదీకరించి యోగ జ్ఞానములతో ముగింపు చేశాడు. తిరుమూలర్ తో ఒక గురుపరంపర ఆరంభమైనది. ఈ పరంపరలో సారమామునివర్ ఒకరు. ఆయన తిరుచినాపల్లిలో ఒక మఠాన్ని స్థాపించాడు. ఈ మఠానికి ఒక సమయంలో మౌనగురువు అనే ఆయన అధిపతిగా ఉండేవారు. తాయుమానివర్ కి ఈయనే గురువు. తాయుమానివర్ క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందినవాడు. మౌనగురువు అనంతరం ఈ మఠం ధర్మపుర అధీనం కిందకు వచ్చింది.
దక్షిణామూర్తి స్వామి సనకాది మునులకు మౌనవ్యాఖ్యా రూపంగా జ్ఞానబోధ చేస్తున్నాడు. తాయుమానవర్ కూడా అన్నిమార్గాలు చిట్టచివర మౌనమార్గంలో లయిస్తాయని చెప్తున్నాడు.
మన నిజతత్త్వం మౌనమే. ఆ మౌనాన్ని మరచిపోలేని సంసారంలో పడుతున్నాము. సంసారం అంటే మాయ. అమ్మవారే మహామాయ. ఆ మహామాయయే జ్ఞానాంబికగా అవతరించి మన అజ్ఞానాన్ని పోగొడుతూ ఉంది. ఈ జ్ఞానబోధకే ఆమె గురుస్వరూపిణి అవుతున్నది. ఆ జగన్మాత మనకి జ్ఞానమనే క్షీరాన్ని ఇస్తున్నది. ఈ లోకంలో, చెట్టూ, చేమలూ, పక్షులూ, పండ్లూ, వివిధ వస్తుజాలమూ అంతా ఆమె సృష్టియే. ఎన్నో రంగులు, ఎన్నో వాసనలు, ఎన్నో రూపాలు మనుష్యులలో ఎన్నో మనోభావాలు. అంతా ఆ మహామాయ విలాసమే. ఆమెయే లిపి రూపంగానూ, భాషారూపముగానూ, శాస్త్రరూపముగానూ ఉన్నది. అన్నిటికి ఆవల మౌనం, మహామౌనం. మౌనగురువుగా ఆమె అవతరించి శిష్యునికి జ్ఞానబోధ చేస్తుంది. "ఏకంసత్" అని.
7. గురువూ ఆచార్యుడూ ఒక్కరే
మొత్తం మీద నేను చెప్పేది (అంటే పరమాచార్య స్వామి వారు..), మనకి జ్ఞానం దానం చేసే వారిని గురువు, ఆచార్యుడూ అని పిలుస్తున్నాము. మహత్త్వమున్నందున గురువు అని పేర్కొంటున్నాము. శ్రోత్రియుడూ, అనుష్టానపరుడూ, సంప్రదాయజ్ఞుడూ అయిన వానిని ఆచార్యుడు అంటున్నాము. ఆచార్యుడు సాంప్రదాయ మర్మములను మనకి తెలిపి మనలను అనుష్టాన పరులుగా చేస్తున్నాడు. గురువు తన మహత్వం చేతా, అనుగ్రహం చేతా మనకు జ్ఞానం దానం చేస్తున్నాడు. ఆచార్యుడు శాస్త్ర సాంప్రదాయాల మూలకముగా మనకు ఆచార అనుష్టానాలను తెలిపి జ్ఞానం పొందడానికి తోడ్పడుతున్నాడు.
ఈ విధంగా ఆచార్యునికీ, గురువుకీ కించిత్ భేదమున్నప్పటికీ, పాత్రత ఉన్న ఆచార్యుడు గురువు కూడా కాగలడు. ఆచార్యుడు ఒక సాంప్రదాయానికి చెంది తదనుసారులైన ఆచార అనుష్టానాలను బోధిస్తున్నా, తన వరకూ ఒక విధానానికి కట్టుబడక ఈశ్వరానుభవమూ, ఆత్మానుభవమూ పొంది ఉండినట్లైతే, అతడు అనుగ్రహదానం చేయగలడు. మన ఆచార్య పురుషులందరూ ఈ కోవకి చెందిన వారే.
ఆధ్యాత్మిక జీవనారంభంలో కొన్ని కట్టుబాట్లు ఉండవలసినదే. అపుడే మనసుకు ఒక నిలకడ ఏర్పడగలదు. అందులకు మన పెద్దలు యమ నియమాలు చెప్పారు. ఈ కట్టుబాట్లు ఉన్నంత వరకూ మనమందరమూ శిష్యులమే. నిర్భందముగా అనిపించే ఈ నియమాలు కొంత కాలానికి సహజమైపోతాయి. అతనికి నియమ పాలనం చేస్తున్నానని కూడా అనిపించదు. అపుడు అతడు ఇతరులను కూడా ఆ మార్గములో ప్రవేశపెట్టగలడు. అట్టివాడు చేసే ఉపదేశాలు ఇతరులని గాఢంగా ప్రభావితులను చేయగలవు.
ఆచార్యుల స్థానంలో వచ్చిన ఈకాలం
ఆచార అనుష్టానాలున్నవారినే ఆచార్యుడు అని పిలిచేవారు. అనుష్టానము అంగమే కానీ లక్ష్యం కాదు. అనుష్టానం అనుభూతిలో ముగియాలి. అట్టి అనుభూతి పరునకు ఆచారం స్వాభావికమైపోతుంది.
అనుష్టానము ఉన్నప్పుడే విద్యకు పూర్ణత. అనుష్టానానికి పూర్ణత్వం అనుభూతియే. అనుభూతి కలవాడే గురువనీ, అనుష్టానపరుడు మాత్రమే ఆచార్యుడనీ చెబితే అదీ సరికాదు. నిజమైన ఆచార్యునికి ఆచరమూ, అనుష్టానము రెండూ ఉంటాయి. బాహ్య జీవనం అనుష్టాన బద్ధముగా ఉంటూ, ఆంతరంగికముగా అతడు ఏ కట్టుబాటూ లేక కైవల్యంలో ఉంటాడు. అట్టివాడే మార్గదర్శకముగా ఉండగలడు. అతడు ఆంతరంగ మౌనం భజిస్తూ, బయత ఉపదేశ, ఉపన్యాస కార్యావళిలో మగ్నుడై ఉంటాడు.
గురువు-ఆచార్యుడు ఇద్దరూ ఒక్కటే. ఆదికాలం నుంచి వీనిని పర్యాయపదాలుగానే వాడుతున్నారు. ఉపనిషత్తులు వేదశిఖరములు. వానిలో పూర్తిగా ఆచార్య పదప్రయోగమే చేయబడినది. ఆచార్య దేవోభవ అనీ, ఆచార్యునికి అతను కోరిన దక్షిన ఇవ్వవలెననీ, ఆచార్యవాన్ పురుషోవేదా - ఆచార్యుడున్న వాడే జ్ఞాని కాగలడు అనీ ఉపనిషత్తులు చెబుతున్నవి. అయినప్పటికీ ఆచార్యునితో సహవాసం చేస్తూ విద్యాభ్యాసం చేసే విధానాన్ని గురుకులవాసమని అన్నారు కానీ ఆచార్యవాసమని అనలేదు. ఆచార్యుని కృతజ్ఞతా పూర్వకముగా ఆరాధించే దినమును గురుపౌర్ణమి అన్నారు. వ్యాసాచార్యులు, శుకాచార్యులు, గౌడపాదాచార్యులు, గోవిందభగవత్పాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు వీరినందరినీ చేర్చి 'గురుపరంపర' అని వ్యవహరిస్తున్నాము. వారిని ఆచార్య పరంపర అని అనడం లేదు. ఇదే విధంగా రామానుజ, వల్లభాచార్య, మధ్వాచార్య సాంప్రదాయములలో కూడా గురువందనమనే అంటారు.
శైవ సిద్ధాంతాన్ని పాటించే గురువులను కూడా ఆచార్యులనే అంటారు. మైకండాచార్య, సంతనాచార్య మొదలైనవారు శైవసిద్ధాంతానికి చెందిన వారు. గురువులు సిద్ధిపొందినదినము తమ గురుస్మారకముగా ఆరాధన చేస్తారు. అదే గురుపూజ అంటారు.
(సశేషం ......)
సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
[అనువాదం ః శ్రీ విశాఖ]
0 వ్యాఖ్యలు:
Post a Comment