శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివమెత్తిన పరవశం

>> Monday, September 3, 2012

శివమెత్తిన పరవశం


భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో 1896 సెప్టెంబర్ 1వ తేదీ పరమ పవిత్రమైనది. భగవాన్ రమణ మహర్షి అరుణాచల పుణ్యక్షేత్రం చేరుకున్న రోజు. అప్పటికాయన వయస్సు 17 సంవత్సరాలు. అరుణాచలేశ్వరాలయంలో తనను తాను సమర్పణం చేసుకుని, తదనంతర కాలమంతా అక్కడే గడపటం చరిత్ర. ఆత్మానుభవం కలిగిన తరువాత 54 సంవత్సరాలు వారు సాగించినదంతా మహాయోగమే.

అక్షరమణమాల!
అరుణాచలమనేది సాధారణ జీవికి ఒక కొండ. భగవాన్ రమణుల అనుభవం మాత్రం భిన్నం. కరుణాసముద్రుడైన శివుడే, ఘనీభవించిన కొండయై నిలిచాడన్న అనుభూతి వారిది. తనకు, అరుణాచలానికి తేడా ఏమీ లేదన్న అభేద, అద్వైత స్థితి. ద్వైత స్థితిలో అరుణాచలాన్ని రమణులు సంబోధించిన పరమాద్భుత కవితావైఖరి ఆపాతమధురం. మణమాల అంటే కళ్యాణమాల. అది నాశమెరుగని, వసివాడని జీవాత్మ పరమాత్మల బంధమైతే, అదే అక్షరమణమాల! ఇదొక దివ్యసాధనామార్గం. ద్వైతంతో ప్రారంభమై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం అక్షరమణమాల. లోతుగా అధ్యయనం చేసి, అనుభూతి చెందగలిగితే, అది సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించదని చెప్పే సాధనాగీతం. రమణుల సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం!

- "అరుణాచల అంటూ నామస్మరణ చేసే వారి అహాన్ని నిర్మూలించు.

- నా మనసనే యింట్లో దూరావు. నన్ను బయటకు లాగి నీ హృదయంలో బంధించావు. నీ అనుగ్రహం విచిత్రం కదా! ఒకసారి నన్ను నీవాణ్ణి చేసుకుని, నన్ను వదిలిపెడితే లోకం నిన్ను నిందించదా?

- నా మనసు ప్రపంచంలో కలిసి, చెడిపోకుండా ఉండాలంటే నువ్వు నా మనసులో ఎల్లవేళలా ఉండాలి.

- పంచేంద్రియాలనే దొంగలు నాలో ఉన్నారు. నా హృదయంలో నీవుండి, నన్ను వారి బారి నుండి రక్షించు.

- నీవు ఓంకార సమానుడివి. కంటికి చూచే శక్తినిచ్చే అసలు కన్నువు. దేనినైనా చూడాలంటే నీకు కన్నెందుకు? నా దోషాలు తెంచు. గుణాలను పెంచు.

- లోకభావనలు నన్ను మోసగించకుండా రక్షించు.

- నీ కరుణాపూరిత జ్ఞానకిరణాలతో నా మనసును వికసింపచేసి అభయవరం దానం చెయ్.

- నా హృదయాన్ని ఆనందసముద్రంగా మార్చు. మనసు మలగి, మౌనం వెలిగి, జ్యోతిర్మయుడవై నా యందుండు.

- లోకవిద్యలన్నీ అంతరించే మార్గం చూపిస్తున్నయ్. తరించే ఆత్మవిద్యను అనుగ్రహించు.

- నువు కొండవు. పలుకవు. నన్నూ మాట్లాడవద్దంటివి. ఎట్లా? విషయ వాంఛలు నశించి, పరమానందం నా స్వంతం చేశావు. నువు నిత్యుడివి.

- కర్మానుసారం నాకు దూరం చేశావు. అది సంతోషమే. జ్ఞానమార్గాన్ని చూపించు.

- ఏమీ చేయకుండానే ఏ సాధనా తెలియకుండానే, తత్త్వం అంటే ఏమిటో తెలిసేటట్లు చేశావు. తెలుసుకున్నది నిజమనే స్థిరబుద్ధిని అనుగ్రహించు.

- సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే స్థితిని స్థిరపరచు.

- నిన్ను అనుభూతి చెందాలంటే మౌనమనే శుద్ధవాక్కు, వినిర్మల మనసు కావాలి. వాటిని నాకు చెందించు. నువ్వెంతో నన్నంతటి వాణ్ణి చెయ్.

- అభేద, అద్వైత భూమికలో, నన్ను నిత్యానందమయుణ్ణి చెయ్. పరమాత్మ రూపం నీ సహజరూపం. కొండవలె స్థూలంగా కనిపిస్తున్నావు. ఆలోచనా తరంగాలు నన్ను అడ్డుకుంటున్నయ్. స్వస్వరూపాను సంధానం చెయ్.

- మాయా విషము తలకెక్కకుండా నన్ను రక్షించు.

- కోరికలు నశింపచేశావు. నిన్ను కోరుకుంటున్న ఆ కోరికను సైతం పోగొట్టు.

- ఆద్యంతరహితమైన చిజ్జడ గ్రంథిని విప్పి నన్ను కాపాడు. అజ్ఞాన భూమికలో కొట్టుమిట్టాడుతున్న నాకు జ్ఞానం ప్రసాదించు.

- దేశకాలాతీతమైన ఆత్మభూమికలో మనం ఇద్దరంగా కాక ఒక్కటిగా ఉండిపోదాం.

- నువు నాకు దొరకటం నేను పొందిన లాభమే. నీకు ఏం లాభం?

- నన్ను నీ దగ్గరకు నీవు పిలిచిన క్షణమే, నా అహం, ఉనికి, అస్తిత్వం, వ్యక్తిత్వం నశించినయ్.

- ప్రాణం వదిలే సమయంలో నిన్ను మరిచినట్లయితే, దుఃఖభరితమైన జన్మ వస్తుందేమో? మరణ క్షణంలో నీ స్మరణ మరువకుండా చెయ్.

- అభేదవేద స్వరూపాన్ని నాకు అనుభవంగా అనుగ్రహించు. సాలెపురుగు తాను అల్లుకున్న గూటిలో చిక్కుకుని మరణించినట్లు, నీ కృపావలయంలో చిక్కుబడి పోయాను. ఎందరో భక్తులు నిన్ను కీర్తించి, ఎముకలు అరిగేట్లు సాధన చేయటం నీకు ఆనందం కలిగించింది. నా మాటలు కూడా విను.

- అంటున్నవన్నీ అవిద్యాస్వరూపాలే. మన్నించు.

నేను సమర్పిస్తున్నది ప్రేమమాల! నీవందించవలసినది అనుగ్రహమాల!'' భగవాన్, అక్షరమణమాలలో కూర్చిన ఈ అనంత భావ సంపద, సాధకుడి కనుగ్రహించిన సమర్పణా రీతి. శరణాగత భావన. వినయదృష్టి. భక్తి గుణం. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ, ఎల్లరికీ ఉంది. సాధించుకోవలసింది అర్హత! అదీ గుర్వనుగ్రహం వల్లనే సాధ్యం! ఇంతకీ గురువంటే ఎవరు? ఈశ్వరుడన్నా, గురువన్నా, ఆత్మన్నా ఒకటే!

- వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

3 వ్యాఖ్యలు:

, September 3, 2012 at 10:19 AM  

'ఆధ్యాత్మిక శాస్త్రవేత్త'
Spiritual Scientist.

Sir,
intha pedda BIRUDU meeku meere ichchukunnara, evaranna ichchara ?

Paravaledu,
U can answer.
Comment block chesthe
meeku athma saakshi ledani
anukovaali !
Popularity kosam ramana maharshi
akkaraledu,
inkaa chaala mandi vunnaru.
Paapam ayananu enduku vaadukuntaaru?

durgeswara September 4, 2012 at 12:18 AM  

kshamimchaali
idi andhrabhumi dinapatrika lo item

vaari peru krimdavraasaanu chudamdi

idi naa sveeyarachana kaadu anenamtavaadini kaadu

mee abhimaanaaniki dhanyavaadamulu

durgeswara September 4, 2012 at 12:19 AM  

khamimchaali

idi andhrajyothi daily 3-9-2012

lonidi

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP