శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భారతదేశం దిక్కుమాలిన సెక్యులరిజం

>> Friday, August 10, 2018

MVR Sastry

Friday, 22 June 2018
హిందూ మతాతీదిక్కుత లౌకిక రాజ్యం

పెక్యులరిజం - 1
- ఎం.వి.ఆర్‌.శాస్త్రి



    మనకో పెద్ద భ్రమ

    మనది మతాతీత లౌకిక రాజ్యమని! రాజ్య వ్యవహారాల్లో మతాల ప్రసక్తి, ప్రమేయం ఉండనే ఉండవని! ఒక మతం ఎక్కువ, వేరొక మతం లేక మతాలు తక్కువ అన్న వివక్ష లేకుండా భారత రాజ్యం, రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూస్తాయని!!

    వాస్తవానికి మనది 'హిందూ మతాతీత లౌకిక రాజ్యం'. రాజ్య వ్యవహారాల్లో ఒక్క హిందూ మతానికి మాత్రమే ప్రమేయం ఉండదు.ప్రాముఖ్యం ఉండదు.

     క్రైస్తవులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 126 ఉన్నాయి. వాటిని క్రిస్టియన్‌ దేశాలు అనడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. ముస్లింలు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 50 ఉన్నాయి. వాటిని ముస్లిం దేశాలు అనడానికి మన మేధావులకు అభ్యంతరం ఉండదు.

     ప్రపంచంలో మూడవ పెద్ద మతం హైందవం. హిందువులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో మూడే మూడు. 1. భారత్‌, 2. నేపాల్‌ 3. మారిషస్‌. మూడింటిలోకి అతి ముఖ్యమైనదీ, అన్నిటికంటే పెద్దదీ, ప్రపంచంలో హైందవానికి ఏకైక ఆలంబనంగా చెప్పుకోగలిగిందీ భారతదేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో 79.8 శాతం హిందువులు. అయినా దీన్ని హిందూ దేశం అంటే మన మహామేధావులు, రాజకీయ జీవులు చచ్చినా ఒప్పుకోరు!

      దేశ ప్రజల్లో నూటికి 80 మంది హిందువులే అయినా సరే ఇది హిందూజాతి కాదట! ఇక్కడున్న జాతీయ సమాజం హిందువులది కాదట! ఈ దేశంలో విలసిల్లేది హిందూ సంస్కృతి కానే కాదట.

     ప్రపంచంలో ఏ దేశంలోనూ నూటికి నూరుగురు ఒకే మతానికి చెంది ఉండరు. నూటికి 80 మంది క్రైస్తవులైన దేశాల్లో 20 శాతం అయినా క్రైస్తవేతరులు ఉంటారు. నూటికి 80 మంది ముస్లింలైన ఇస్లామిక్‌ రాజ్యాల్లోనూ 20 శాతం అయినా మహమ్మదీయేతరులు ఉంటారు. ఆ క్రైస్తవేతరులకీ, ఈ మహమ్మదీయేతరులకీ వారివారి మతాలు, సంస్కృతులు వేరే ఉంటాయి. అంత మాత్రాన ఆ దేశాలది మిశ్రమ సంస్కృతి అని, అక్కడున్నది భిన్న రీతులు, ప్లూరలిస్టిక్‌ సమాజాలనీ బుద్ధున్నవాడు ఎవడూ అనడు. 20 శాతమో, అంతకంటే ఎక్కువో తక్కువో ఇతర మతాలను, సంస్కృతులను అనుసరించే వారు ఉన్నప్పటికీ అత్యధిక సంఖ్యాకులు ఎటువైపు అన్నదానిని బట్టి ఆయా దేశాలను క్రైస్తవ దేశాలుగానో, ఇస్లామిక్‌ దేశాలుగానో పరిగణించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. క్రైస్తవ దేశాల్లో క్రైస్తవానికీ, ఇస్లామిక్‌ దేశాల్లో ఇస్లామ్‌కీ జన జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వటానికి తలకాయ ఉన్నవాడెవడూ అడ్డురాడు.

      చిత్రమేమిటంటే - మిగతా ప్రపంచం విషయంలో కనపరిచే ఈ కామన్‌సెన్సు ఇండియాలో హిందూమతం దగ్గరికి వచ్చేసరికి మన విచిత్ర బుద్ధిజీవులకు మటుమాయమవుతుంది. 'ఎప్పుడైనా, ఎందులోనైనా మెజారిటీకే పెద్దపీట' అన్న ప్రజాస్వామ్య మూల సూత్రాన్ని కూడా ఇండియాలో హిందువుల దగ్గరికి వచ్చేసరికి సోకాల్డ్‌ ప్రజాస్వామ్య వాదులు తుంగలో తొక్కుతారు. ఇతర మతాల వారు 20 శాతం ఉన్నారు కాబట్టి ఆ మైనారిటీలను నెత్తిన పెట్టుకొని, వారికి ఎలాంటి అసౌకర్యం లేక మనస్తాపం కలగకుండా అతి జాగ్రత్త చూపుతూ, ఒళ్లు దగ్గర పెట్టుకొని అణిగిమణిగి ఉండటమే మెజారిటీ మతస్తుల ప్రారబ్దం అయినట్టు బుద్ధిలేని బుద్ధిజీవులు మన దేశంలో సుద్దులు చెబుతారు. 'బ్రూట్‌ మెజారిటీ' తొక్కి వేయకుండా సుకుమారపు మైనారిటీలను కళ్లలో వత్తులు వేసుకొని కాపాడటమే పాలకుల ప్రథమ కర్తవ్యమని వారు జంకు లేకుండా దబాయిస్తారు.

      సౌదీ అరేబియా లాంటి అనేక ఇస్లామిక్‌ దేశాల్లో ఒక హిందువు తన జేబులో రాముడి బొమ్మో, కృష్ణుని బొమ్మో పెట్టుకుంటే నేరం. తలుపులు మూసుకుని తన ఇంట్లో తాను ఏ గణపతి పూజో, సత్యనారాయణ వ్రతమో చేసుకోవటం మహాపరాధం. అధికారిక మతం అయిన ఇస్లామ్‌ను మినహా వేరొక మతాన్ని ఆచరించరాదని, వేరొక దైవాన్ని పూజించరాదని నిషేధించటం మానవ హక్కులకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమని అనడానికి ఏ హేతువాదికీ గొంతు పెగలదు. 'వారి మతం వారిష్టం. వారి దేశంలో ఉన్నప్పుడు వారు చెప్పినట్టే నడుచుకోవాలి' అంటూ పిరికి సమర్థింపు ఒకటి.

     అదే హిందూ దేశంలో 80 శాతంగా ఉన్న హిందువులు తమ ఇష్ట దైవాలను బహిరంగంగా పూజించటం, తమ మతాచారాలను, సంప్రదాయాలను బాహాటంగా పాటించటం ఇదే 'హేతువాదుల'కు సహించరాని మతోన్మాదంగా కనపడుతుంది. చదువుల తల్లి సరస్వతి దేవిని పాఠశాలల్లో రోజూ ముందుగా స్తుతించాలని కోరడం హిందూ ఫాసిజంగా, మైనారిటీల సెంటిమెంట్లను, మత హక్కులను భంగపరిచే కవ్వింపు చర్యగా మన విద్యావంతులకు ఒళ్లు మండిస్తుంది. దేశంలో 80 శాతంగా ఉన్న హిందువులకు ఆరాధ్య దైవాలు, ఆదర్శ పురుషులు, జాతీయ వీరులు అయిన శ్రీరామచంద్రుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి బడి పిల్లలకు బోధించాలని చెప్పడం మెదళ్లు పుచ్చిన మన మేధావుల దృష్టిలో మహాపరాధం, క్షమించరాని మతమౌఢ్యం. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ ఖర్చుతో నడిచే మదరసాల్లో పరమత ద్వేషం ప్రబోధించడాన్ని, హిందూ కాఫిర్లను తిట్టి పోయడాన్ని తప్పు అని మన మేధావులు సుతరామూ ఒప్పుకోరు. వారి దృష్టిలో అదంతా మైనారిటీల న్యాయబద్ధ, మత హక్కుల్లో భాగమే. భారతదేశంలో ఉంటూ భారతమాతకు జై అనము పొమ్మని మొరాయించవచ్చు. జాతి పౌరులుగా సమస్త హక్కులు అనుభవిస్తాము కాని, జాతీయ గేయమైన వందేమాతరాన్ని గౌరవించము అని మొండికేయవచ్చు. అదంతా మైనారిటీల మతస్వేచ్ఛగానే భావించవలెను. అందులో జాతి ధిక్కారాన్ని చూసేవాడిని నీచ నీకృష్ట హిందూ కమ్యూనలిస్టుగా, భారతదేశపు కాంపొజిట్‌ కల్చర్‌కు పరమ శత్రువుగా కుళ్లబొడవవలెను.

     కోర్టు కచేరీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో రామనవమి కళ్యాణోత్సవం, నవరాత్రి వేడుకలు లాంటివి జరపటం తప్పు. కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వాలు ఇఫ్టార్‌ విందులు ఇవ్వటం ఒప్పు. ఈ దేశ ప్రధాని గంగానదికి హారతి ఇస్తే తప్పు. ముఖ్యమంత్రులు చర్చిలకు, మసీదులకు వెళ్ళి అన్యమత ప్రార్థనలు చేసినట్టు నటించటం రైటు. ఇస్లామిక్‌ దేశాలు కూడా ఇవ్వని సబ్సిడీలు హజ్‌ యాత్రికులకు విరగబడి ఇవ్వటం సముచితం. అదేరకమైన సౌకర్యాలు, రాయితీలు అమర్‌నాథ్‌, మానస సరోవర యాత్రికులకు కూడా కల్పించమని అడగటం దుర్మార్గం.

      మైనారిటీలకు చెందిన గవర్నమెంటు ఎయిడెడ్‌ స్కూళ్లలో బైబిల్‌ను, ఖురాన్‌ను బోధించటం రాజ్యాంగబద్ధం. రామాయణాన్ని, భగవద్గీతను పిల్లలకు నేర్పించాలని హిందువులు అడగటం కమ్యూనలిజం! గోద్రా హత్యాకాండ గురించి మాట్లాడటం కరెక్టు. అదే గోద్రాలో రామభక్తుల సజీవ దహనాల గురించి ప్రస్తావించటం తప్పు. మహమ్మద్‌ ప్రవక్తమీద వచ్చిన కార్టూన్‌ను, చర్చిమీద పడిన రాయిని తెగనాడటం పుణ్యం. కాశ్మీర్‌లో వేలాది హిందువుల ఊచకోతను గుర్తు చేయటం పాపం.

     ఇలా  చెబుతూ పోతే చేంతాడంత! మన సంస్కార వంతుల విచిత్రరీతులు ఎంత చెప్పినా తరగనివి!!

     క్రైస్తవం అధికార మతం కాని అమెరికాలో కూడా నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారం వంటి వేడుకల్లో క్రైస్తవ మతాచార్యులకు ప్రాముఖ్యం ఇస్తారు. మెజారిటీ మతానికి సముచిత ప్రాధాన్యం ఇస్తూనే మైనారిటీ మతాలకూ తగినంత స్వేచ్ఛ కల్పించటం ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాల్లో చూస్తున్నాం. అదే సరైన పద్ధతి అని మేధావిలోకం అంగీకరిస్తుంది. కాని భారత్‌ విషయం వచ్చేసరికి మేధావి గణానికి మాయరోగం కమ్ముతుంది. మెజారిటీ మతాన్ని చీదరిస్తేగాని, మెజారిటీ మత విశ్వాసాలను, సెంటిమెంట్లను చులకన చేస్తేగాని మైనారిటీలకు న్యాయం జరగదు. మన ప్లూరలిజానికి సార్థక్యం ఉండదు అని వారి పెడబుద్ధికి తోస్తుంది.

    ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని ఈ వెర్రిమొర్రి ఆలోచనా విధానానికి మన మహానుభావులు పెట్టిన ముద్దుపేరు 'సెక్యులరిజం'.

      మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని నంగిరి కబుర్లు ఎన్ని చెప్పినా, మన రాజకీయ, పరిపాలక వ్యవస్థల్లో అడుగడుగునా ఉన్నది మత ప్రమేయమే! అధికారిక మతం అని ప్రత్యేకంగా ఏ ఒక మతాన్ని ప్రకటించక పోయినా, వాస్తవానికి మన రాజ్య వ్యవస్థకూ ఒక మతం ఉంది.

       ఆ అప్రకటిత అధికార మతం పేరు 'సెక్యులరిజం'.

       చాలా మతాల్లాగే దానికీ ఒక ప్రవక్త ఉన్నాడు. ఒక అలిఖిత పవిత్ర గ్రంథం ఉంది. అందులో ఎన్నో సువార్తలున్నాయి.

     నడమంత్రపు అధికార మతానికి ప్రవక్త పేరు జవహర్‌ లాల్‌ నెహ్రూ. కొత్త మతం స్థాపనకు ఆయన పడిన కష్టం, చేసిన తపస్సు, చూపిన దార్శనికత, అందులో బోలెడు సృజనాత్మకత వివరించాలంటే పెద్ద గ్రంథమవుతుంది.




      మతమన్నాక ఎంతో కొంత మతమౌఢ్యం ఉంటుంది. విదేశీయ మతాల్లో మరీనూ. ఉత్పత్తి స్థానం విదేశీయం కాబట్టి మన అధికార మతంలోనూ మూఢత్వం పాలు జాస్తి. సెక్యులరిజం ఒక్కటే సత్యం. అది మాత్రమే నిత్యం, శాశ్వతం. మన పౌర సమాజంలో మర్యాదస్తుడిగా, పెద్దమనిషిగా గుర్తింపు పొందాలనుకునే ప్రతివాడూ తిరుగులేని ఈ దైవ వాక్కును అంగీకరించి తీరాలి. Only True Religion  ఏకైక సత్యమతంగా సెక్యులరిజాన్ని ఎవడన్నా ఒప్పుకోకపోతే వాడికి మూడిందే. సెక్యులరిజానికి చందా కట్టని వాడికి సమాజంలో పుట్టగతులుండవు.

      ఇంతకీ 'సెక్యులరిజం' అనేది ఎప్పుడు పుట్టింది? ఎక్కడ, ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో పుట్టింది? ఇది భారతదేశానికి ఎన్నడు వచ్చింది? ఎలా రూపు మార్చుకొంది? ఏకైక సత్య మతంగా ఏ ప్రకారం అవతారమెత్తింది? దీని ప్రవక్త ఏమి చెప్పాడు ? కొత్త మతాన్ని ఎలా ముందుకు తీసికెళ్ళాడు? తనను నమ్మని అవిశ్వాసులను ఎలా శిక్షించాడు? తన మతంలో చేరని ద్రోహుల ధిక్కారాలను ఎలా అణచివేశాడు? కొత్త మతం వ్యాప్తికి ఏ అపొస్తలులను ఎంచుకున్నాడు? వారి సువార్తల ఫలమేమిటి? ప్రభావమేమిటి? అధికార మతానికి మూల సూత్రాలు, కమాండ్‌మెంట్లు ఏమిటి? వాటిని పాటిస్తే కలిగే లాభమేమిటి? పాటించకపోతే వాటిల్లే కీడు ఎలాంటిది? కాలక్రమంలో మొత్తం భారతీయ వ్యవస్థ మీద, ముఖ్యంగా హిందూ సమాజం మీద కొత్త మతం వేసిన చెరగని ముద్ర ఎటువంటిది? దాని మంచిచెడ్డలేమిటి?

       తరువాయి వ్యాసాల్లో వరసగా చర్చిద్దాం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP