శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమెరికాలో వీరాంజనేయుడు

>> Saturday, September 1, 2012

అమెరికాలో వీరాంజనేయుడు


శ్రీరామ ముద్రిక ఒక చేత, గదాయుధం మరొక చేత ధరించి సీతాన్వేషణార్థం సాగర లంఘనం చేస్తున్న నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల ఎత్తుగల వీరాంజనేయుని చలువరాతి మూర్తి మనకు అమెరికాలో దర్శనమిస్తుంది. టెక్సాస్ రాష్ట్రానికి పొరుగున, మెక్సికో దేశానికి సరిహద్దున ఉన్న న్యూమెక్సికో రాష్ట్రంలోని టావోస్ పట్టణానికి సరిహద్దులో ఉన్న ఒక ఆశ్రమాలయంలో శ్రీ వీరాంజనేయ ఆలయం ఉంది. చుట్టూ ఎటు చూసినా కొండకోనలతో, పచ్చని చెట్లతో, పురి విప్పి ఆడే నెమళ్లతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఆశ్రమాలయం ఉంది. సమున్నత పర్వతాల మధ్య రియోగ్రాండ్ ఉపనది ప్రక్కగా సాగిపోయే ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తుంటే మందాకినీ నది ఒడ్డున హిమాలయ పర్వత శ్రేణి నడుమ వెళ్తున్న చార్దామ్ యాత్ర అనుభవం గుర్తుకు వస్తుంది.

రాజస్థాన్‌లో తయారీ
ఉత్తర భారతానికి చెందిన నీమ్ కరోలీబాబా స్వామి జ్ఞాపకార్థం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని, అందులోనే ఒక మారుతి ఆలయాన్ని నిర్మించి దాన్ని ఆశ్రమాలయంగా మార్చారు. సర్వమానవ సౌభ్రాతృత్వం, శాంతి, దయ, ప్రేమల ప్రాతిపదికగా నీమ్ కరోలీబాబా చేసిన ఉద్బోధలు ఆయన శిష్యగణాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. ఆయన శిష్యులు గురువాగారి బోధనలను ప్రచారం చేస్తూనే హనుమంతుని ఆలయాన్ని కూడా నిర్వహిస్తున్నారు. పాలరాతి విగ్రహాలకు పుట్టినిల్లయిన రాజస్థాన్‌లోనే ఈ ఆంజనేయుని విగ్రహం తయారై, పసిఫిక్ సముద్రం మీదుగా న్యూమెక్సికో రాష్ట్రానికి చేరింది. భారతీయులతోపాటు ఈ ఆశ్రమాలయానికి అమెరికన్ భక్తులు కూడా చాలామంది వస్తుంటారు.

వేడుకగా పండుగలు
హనుమజ్జయంతి, గురుపౌర్ణమి, నీమ్ కరోలీబాబా జయంతి, అమెరికా స్వాతంత్య్ర దినం(జూలై 4వ తేదీ) మొదలైన పండుగలు ఇక్కడ వేడుకగా జరుపుతారు. వేడుక రోజుల్లో రోజుకు విదేశీయులు, దేశీయులు కలిపి సుమారు 500 మంది వరకు వీరాంజనేయుని దర్శించడానికి వస్తుంటారు. స్వామివారి విగ్రహాన్ని చూస్తూ దేశీయ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. హార్మోనియం వాయిస్తూ భక్తిగా హనుమాన్ చాలీసాను శ్రావ్యంగా ఆలపించే అమెరికన్ భక్తులను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

మరొక అమెరికన్ భక్తుడు రెండు భుజాలపై శివుడు, మారుతి, నవగ్రహాలు, బుద్ధుడు మొదలైన బొమ్మల్ని రంగుల టాటూలుగా వేయించుకుని అందరికీ చూపించి సంబరపడటం చూసి ఆశ్చర్యపడటం మన వంతవుతుంది. వేడుక దినాల్లో భారతీయ భక్తులు పాల్గొన్నా తక్కిన రోజుల్లో అమెరికన్ భక్తులు ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచడం, వంటశాలలో మన దేశీయ ప్రసాదాలను(కేవలం శాకాహారమే, వెల్లుల్లి కూడా వాడరు) తయారు చేస్తారు. మొత్తానికి న్యూమెక్సికో, టెక్సాస్ ప్రాంతాల్లో పేరొందిన హిందూ దేవాలయంగా టావోస్ వీరాంజనేయ దేవాలయం గుర్తింపు పొందింది.

- గాంధీ బందా
డల్లాస్, టెక్సాస్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP