శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తరించటమే అంతరించటం

>> Monday, March 12, 2012

తరించటమే అంతరించటం

ఒక వైణికురాలు భగవాన్ దగ్గరికి వచ్చి వీణా వాదనం చేసింది. ఈయన ఉలకరు, పలుకరు, మాట్లాడరు. ఏ రకమైనా స్పర్శ లేదు. ఏ రకమైన అనుభూతీ లేదు. వింటునట్లు ఉన్నారు. విననట్లూ ఉన్నారు. మూడురోజులయింది. ఇక మరునాడు ఆమె వెళ్లిపోవాలి. ఆ క్షణంలో భగవాన్ లేచారు. వెళ్ళబోతున్నారు. వెళ్ళబోతూ ఆమె వైపు చూశారు. చూడగానే ఆమె లేచి వినమ్రంగా, "భగవాన్, వీణావాదన చేస్తూ చేస్తూ, త్యాగరాజ స్వామి, కీర్తనలు పాడి పాడి ఎలా తరించారో అలా నేను తరించాలి వీణావాదనలో.

అలా యాజ్ఞవల్క్య మహర్షికి మాత్రమే యోగం దక్కిందట. మీరు నాకు ఆ అనుగ్రహం ఇవ్వాలి అని అడిగినప్పుడు "ఏమన్నావు'' అన్నారు. మళ్లీ ఆమె రిపీట్ చేసింది. ఆమె 'త్యాగరాజస్వామి వలె ఇదిగో ఈ వీణ వాయించి తరించాలి అని. ఆయన చెప్పారు, "త్యాగరాజస్వామి పాడి తరించలేదమ్మా, తరించి పాడారు'', తరించిన తరువాత పాడాలి. రామదర్శనం అయిన తరువాత రాముడి గురించి జగత్తుకి చెప్పాడు. పాడి తరించేది మామూలుస్థాయి, తరించి పాడేది ఉదాత్తస్థాయి. రెండే మాటలు, చూడండి ఎంత అద్భుతమైన మాటలో. అంతే! మానం వహించారు.

ఆయన నన్ను చూశారు.. చాలు! అలా అనేకమైన సందర్భాలు, బర్త్‌డే జరుగుతుంది. భగవాన్ బర్త్‌డే అంటే కోలాహలం. జగత్తుకి కల్యాణం జరుగుతున్నట్లుగా, జగత్తు పుట్టినట్లు ఉన్నది. ఆ సమయంలో విందు ఏర్పాటయింది కొన్ని వేల మందికి. భగవాన్ లోపలికి నడిచి వెళ్ళిపోయారు. వెళుతుంటే ఒక తొంభైయేళ్ళ అవ్వ భగవాన్! భగవాన్! అని అరుస్తున్నది. ఆయన వెంటనే వెనక్కి తిరిగి వచ్చారు. ఆమె చేతిలో అప్పుడే కాచిన గంజి ఉన్నది. ఆ ముంత తీసుకొని గడగడ తాగేశారు ఆయన. సనాతన బ్రాహ్మణులంతా చుట్టూ ఉన్నారు. అదేమిటి? ఈ స్త్రీ గంజి కాచుకురావడమేమిటి? అని అంటూ ఆమెతో ఒక మాట అన్నారు.

"ప్రతిరోజు వస్తావు గదా! ఈ రోజే రావాలా? చూడు అందరితో పాటు నువ్వూ భోంచెయ్యాలి గానీ, కాచిన గంజి తెచ్చి భగవాన్ చేతిలో పెట్టావు. ఆయనకి గంజీ, పరమాన్నం రెండూ ఒకటే. నిజమేగానీ, సందర్భం ఇది కాదుగదా!'' అని అంటే భగవాన్ చెప్పారు. 'ఇవాళ నాచుట్టూ వేల మంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరూ లేని రోజుల్లో నేను గిరి ప్రదక్షిణానికి వెళుతున్నప్పుడు అది అన్నామలై గుడి వాకిట్లో, ఈ ముసలి అవ్వ గంజి కాచుకొని నా కోసం కాచుకుని ఉండేది. కొన్ని సంవత్సరాలు ఆ గంజి తాగి ఈ దేహం నిలబడింది' అంటూ ఆయన అక్కడి నుంచి సాగిపోయారు. అయినా వాళ్ళు ఆమెను వదిలిపెట్టలేదు. ఆ ముసలమ్మని ఇంకాస్త వేధించారు. అప్పుడామె అన్నది, "నేను భగవాన్‌ని చూడాలని రాలేదు.

ఎందుకంటే, నాకు ఎలాగూ కళ్ళు లేవు. నేను భగవాన్‌ని ఎన్ని సార్లు చూసి ఏం లాభం? ఆ భగవాన్ నన్ను ఒకసారన్నా చూడాలి కదా! దానికోసం నేనొచ్చా. ఈ వేళ నన్ను చూశాడు భగవాన్. ఇంతకు ముందు ఆయన్ని నేను చూశాను. నేను చూడటంలో పరమార్థం లేదు. ఆయన నన్ను చూశారు. నా జన్మ ధన్యమయింది. అంటే ఎంత సమూహంలో ఉన్నా ఎన్నాళ్ళకు కలిసినా, ఆ గురువు ఎంత కరుణాపూర్ణ సుధాబ్ధివలె ఉంటాడో, ఎంత దయ్రార్దంగా ఉంటాడో, ఒక తల్లి వలె, ఒక తండ్రివలె, గురువు వలె, దైవం వలె, ఆప్తుని వలె, స్నేహితుని వలె ఎలా పలకరిస్తాడో ఒక్కసారి అనుభవంలోకి వచ్చినప్పుడూ ఆ అనుభవం హృదయైక వేద్యం. ఆ అనుభవం మనం పొందాలి. పొందకుండా దాని గురించి ఎంత వర్ణించినా మనకు దాని అనుభవం రాదు కాబట్టి అటువంటి అనుభవాల కోసం గురువు గురించి ప్రార్థన చేయాలి. ంవి.యస్.ఆర్ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP