శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సమతే ముక్తి!

>> Tuesday, February 14, 2012

సమతే ముక్తి!

మానవుడంటే అంగాంగీ భావంతో ఉండే జీవి మాత్రమే కాదు. ఆత్మ, సాక్షాత్తు రూపుదాల్చితే అతడే మానవుడు. ఆత్మ అంటే చైతన్యమే. కనుక మానవుడి నిజతత్వం చైతన్యమయం. అనిత్యమైన శరీరంలో నిత్యమైన చైతన్యం నిలకడగా ఉన్నదన్న సత్యం గ్రహించడానికి శుద్ధజ్ఞానం కావాలి. శుద్ధజ్ఞానం ఎవరెవరి మనోస్థితిని అనుసరించి వారి అనుభవంలోకి వస్తుంది. మనుసుకు లోబడటం అజ్ఞానం. మనసును లోబరుచుకోవటమే జ్ఞానం. అణగిన మనస్సు, మానవుణ్ణి అంతరంగం వైపు నడిపిస్తుంది. చివరకు అహం స్పురణగా మారి ఆత్మానుభవం కలిగిస్తుంది. చిక్కంతా మనసుతోనే.

అహంకారం అనర్థం
మనసు ఒక సాలీడు. తాను అల్లిన గూటిని తానే మింగి ఆ వృతం పూర్తి చేసుకుంటుంది. ప్రపంచాన్ని కల్పించిన మనస్సు, తిరిగి తనలోనే దానిని లీనం చేసుకుంటుంది. చేసుకోవాలి. అది నిజమైన సాధన. భౌతికంగా కనిపిస్తున్నదంతా అనిపిస్తున్నదూ. అనిపిస్తున్నదంతా అంతరించేదే. తెరమీద బొమ్మ, తెరను అంటకుండా కనిపిస్తున్నట్లు, మనోయవనికపైన ఆడే బొమ్మే ఈ ప్రపంచం. బొమ్మ కనపడటానికి, కనపడకుండా ఉండటానికి, బయట వస్తువులే కారణం. ఆ వస్తువులు తమ పని ఆపగానే బొమ్మ కనపడటమూ ఆగిపోతుంది. కాలగమనంలో తెరకూడా శిథిలమౌతుంది. కనుక ఇందులో ఏ ఒక్కటీ శాశ్వత వస్తువు కాదు. దేహమూ అంతే! దేహాలు మారటం ఒక అనివార్యమైన ప్రక్రియ. దేహంలో ఉన్న చైతన్యం మారకపోవటం ఒక సహజస్థితి.

ప్రపంచం మంచిదీ కాదు. చెడ్డదీ కాదు. అది అంతే! చూసే దృష్టిని బట్టి అది అనుభవమవుతుంది. అందుకే మహర్షి తత్వంలో మంచి, చెడు అనేవి లేవు. మనోభూమికకు పరిమితమైనంతవరకు, మంచి చెడు అనే విభజన తప్పనిసరి. అహంకారమే చెడు. తన ఉనికిని తప్ప మరొక దేనినీ అంగీకరించని స్థితి అహంకారం. ఇతరుల లోపాలను ఎన్నటమే చెడు. ఈ పనిచేస్తున్నది మనసని మనకు స్పృహ కలిగినపుడు మనసును నియంత్రించగలిగితే అహంకారం సన్నగిలి అహం స్ఫురణ కలుగుతుంది. మంచి మొలకెత్తి ఆత్మాన్వేషణపై ఆసక్తి ప్రారంభమౌతుంది.

దేనినైనా పోగొట్టుకోగలిగితేనే కావలసిన దానిని రాబట్టుకోగలం. ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రేమ ఇష్టం, అయిష్టం, ద్వేషం, రాగం, మోహం, వ్యామోహం, వ్యసనం...ఎరుగని మనస్వికి ఉన్నదంతా మంచే. కనపడేదంతా మంచే. ఆనందం తప్ప అన్యంలేదు. దీనికి స్వీయ సంస్కరణ ప్రధానం. ఆదర్శము, విస్తృతమైన సరళ భావజాలము, ఆనందం తాలూకు నీడలే. సుఖం సంతోషం కాదు. అది ఆనందమూ కాదు. అవన్నీ స్థితులే. ఆనందం, అంతరంగికం. అది ఒక రసైక స్థితి. మనో నియంత్రణ ద్వారా పొందవలసిన ఒక మహనీయ అనుభవమే ఆనందం.

ప్రాపంచిక జీవితం స్వల్పం
త్యాగం, సమతకు దారితీయాలి. భిన్నత్వాన్ని రూపుమాపాలి. తద్వారా శాంతి లభిస్తుంది. ఆనందం మోసులెత్తి మానవుడు ప్రేమమయుడవుతాడు. నిజానికి మనం జీవించవలసినదంతా ఆధ్యాత్మ జీవితమే. అందులో ప్రాపంచిక జీవితం అతి స్వల్పంకావాలి. కానీ జరుగుతున్నది దానికి భిన్నం. మన అంతరంగంలో మనం భావించే సమతా భావం వలన స్పర్థలు నశించి, వికాసం కలిగి, అన్నింటిని ప్రేమించగలిగే స్థితి ఏర్పడుతుంది. ఆత్మదర్శనం సహజంగా లభిస్తుంది.

నామరూపాతీతమైన ఆత్మే అన్నీ గురువు, ఆత్మే దైవం, ఆత్మే అన్ని అనే భావనలో మహర్సి వంటి వారు సర్వత్రా ఆత్మనే దర్శిస్తుంటారు. మహాపండితుడైన గణపతి మునిని, సాధారణ స్త్రీమూర్తి అయిన సూరినాగమ్మని, పాల్‌బ్రంటన్, చాడ్విక్, కోహెన్ వంటి మేధావులను, పరమహంస యోగానంద, శివానంద, నారాయణగురు వంటి మహోన్నత వ్యక్తులను సమస్త జంతుజాలాన్ని, చివరకు తమ దేహంపై మొలిచిన రాచపుండుని, ఆత్మగానే మహర్షి భావించారు. ఎక్కడా భిన్నత్వం లేదు.

వారనుభవించిన ఎరుక, చివరకు వారిని ఎరుకగా నిలిపింది. ఆత్మదర్శనమే అసలు ముక్తి. జీవన్ముక్తుడే మహర్షి. ముక్తజీవనమే అసలు జీవితం. భగవాన్ రమణులు లోకపరిధిలో సంచరించిన పరబ్రహ్మ మూర్తి. ఋణమెరుగని అరుణుడు. చలించటమే తెలియని అచలుడు, అరుణాచల శ్రీరమణుడు.

వి.యస్.ఆర్ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP