శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సంతాన సాఫల్యానికి సూర్యశక్తి

>> Tuesday, January 31, 2012

లండన్, జనవరి 30: ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్.. ఇది మన పూర్వులు చెప్పిన మాట. పాశ్చాత్య పరిశోధకులూ ఒప్పుకొన్న నిజం. ఇప్పుడింకో పరిశోధనలోనూ అదే తేలింది. సూర్యకిరణాల నుంచి లభించే డి విటమిన్.. పురుషుల్లోనూ, స్త్రీలలోనూ సంతాన సాఫల్య శక్తిని పెంచుతుందని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ గ్రాజ్ (ఆస్ట్రియా) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డి విటమిన్ పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచుతుందని, మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యాన్ని సరిచేసి సంతాన సాఫల్య శక్తిని పెంచుతుందని వివరించారు. డి విటమిన్ లోపం కారణంగా సంతానభాగ్యం పొందలేకపోతున్నవారు ఖరీదైన చికిత్సల వెంట పరుగులు తీయకుండా... నిత్యం సూర్యకాంతిని పొందగలిగితే ఫలితం ఉంటుందని సూచించారు.

దీనివల్ల మహిళల సెక్స్ హార్మోన్లయిన ప్రొజెస్టిరోన్ 13 శాతం, ఈస్ట్రోజన్ 21 శాతం మేర పెరుగుతాయని, రుతుచక్రం సవ్యంగా ఉంటుందని విశ్లేషించారు. అదేవిధంగా ఎండలో కాసేపు గడపడం వల్ల పురుషుల సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ స్థాయులు పెరుగుతాయట. అయితే, ఉదయపు ఎండలో కాసేపు ఇలా గడిపితే సరిపోతుందని, అదేపనిగా తీక్షణమైన ఎండలో ఎక్కువసేపు గడిపితే ఇతరత్రా సమస్యలు వస్తాయని హెచ్చరించారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీలో వారి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి.


బీపీ.. రెండు చేతులకూ చూడాల్సిందే!

లండన్, జనవరి 30: ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరకెళ్తాం. రోగ లక్షణాలు విన్నాక ఏ డాక్టరైనా ముందుగా చేసే పని బీపీ చెక్ చేయడం! ఒక చేతికి మాత్రమే ఇలా చెక్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. అలా ఒక చేతికి కాకుండా రక్తపోటును రెండు చేతుల్లోనూ కొలవాల్సిందేనని బ్రిటన్ పరిశోధకులంటున్నారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత జబ్బులను ముందుగానే పసిగట్టవచ్చని వారు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ ఎక్సీటర్, పెనిన్సులా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీకి చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ క్లార్క్, బృందం చెబుతున్న ప్రకారం.. రెండు చేతులకూ బీపీ చెక్ చేసినప్పుడు సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌లో 10ఎంఎం తేడా ఉంటే కాళ్లకు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడుతున్నట్టు సూచన అని వారు వివరించారు. ఈ తేడా ఉన్న వారు గుండె జబ్బులకు గురయ్యే ముప్పు అధికమని హెచ్చరించారు. ఆ తేడా 15 ఎంఎం కంటే ఎక్కువ ఉంటే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇబ్బందులు ఉన్నట్టేనని తెలిపారు.

ఈ తేడా ఉందని ముందస్తుగా తెలుసుకోవడం వల్ల బాధితులకు ఆ ఇబ్బందిని అధిగమించేందుకు అవసరమైన సూచనలు చేసే అవకాశం వైద్యులకు ఉంటుంది. "నిజానికి బీపీ చెకింగ్ రెండు చేతులకూ చేయాల్సిందేనని ఇప్పటికే మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరూ చేయట్లేదు'' అని క్రిస్టోఫర్ క్లార్క్ అన్నారు. రోగికి ధూమపానం అలవాటు ఉంటే దాన్ని మానేయడం, రక్తపోటును తగ్గించే మందులు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్తలతో గుండెజబ్బుల ముప్పును నిరోధించవచ్చని వివరించారు.


[ఆంధ్రజ్యోతి డైలీ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP