శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అంబిక అక్షిత్రయము

>> Tuesday, January 31, 2012

శ్రీ గురుభ్యోన్నమః

నమస్తే


జగన్మాత తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడుకునేందుకు ప్రత్యక్షంగా ఏదో ఓ
రూపంలో ప్రతిచోటా ఉంటుంది. ఐతే అలా రాశీభూతమైన అంబికా తత్త్వానికి
గుర్తుగా మూడు ముఖ్య ప్రదేశాలలో ఉన్న అమ్మవారి రూపాలను చెపుతారు.
అక్కడనుండి అమ్మవారు అన్ని కోట్ల జీవరాసులను మూడురకాలుగా కాపాడుకుంటూనే
ఉంటుంది. వానినే అంబికా అక్షిత్రయము అని పిలుస్తారు.
అవే ౧) కామాక్షి ౨) మీనాక్షి ౩) విశాలాక్షి.

కామాక్షి స్పర్శద్వారా తన భక్తులను కాపాడుతూ ఉంటుంది, కామాక్షి అంటే ఆమె
కన్నుల యొక్క చూపులచేతనే కోరికలు తీర్చే తల్లి అని అందరూ అంటారు కదా మరి
స్పర్శ చేత ఎలా కాపాడుతుంది అన్న అనుమానం రావచ్చు. అందుకే జగద్గురువులైన
శంకరులు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ
...శృతీనాం మూర్ధానో దధతి తనయౌ శేఖరతయా
మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః...
అంటే "తల్లీ, నీ పాదాలను శృతి శిరస్సులు అని పిలవబడే ఉపనిషత్తులు దాల్చి
ఉంటాయి. అటువంటి నీ పాదములను నా శిరస్సుపై ఉంచి నన్ను అనుగ్రహించు." అని
ఆ తల్లి ఇచ్చే దీక్షాపూర్వక రక్షణను సూచించారు. అంటే ఆ తల్లి భక్తులను
స్పర్శ దీక్ష లేదా దానినే కుక్కుట దీక్ష అంటారు.

మీనాక్షి, ఈ అమ్మ మీన నేత్రములు కలది. చేపలు గుడ్లు పెట్టి ఆ గుడ్లను తమ
చూపులచే పొదుగుతాయి అని మన శాస్త్ర వచనం. దీనినే నయన దీక్ష లేదా వీక్షా
దీక్ష లేదా మత్స్య దీక్ష అంటారు. అంటే ఈ తల్లి తన పిల్లలను ఎక్కడ ఉన్నా ఆ
అమ్మ తన చూపులతో చూస్తూ కాపాడుకుంటుంది.

విశాలాక్షి. ఈ తల్లి కళ్ళు బహు విశాలమైనవి. ఆమె తన పిల్లలను స్మరిస్తూ
కాపాడుతుంది. విశాలాక్షి అంటే బాహ్యంలో అత్యంత విశాలమైన కళ్ళున్నవి అన్న
అర్థం ఉన్నా, ఆమె తన స్మరణచే అంతర్ముఖత్వంలో లోకంలోని ప్రతి ఒక్కరి
బాగును కోరుకుంటుంది అంత విశాలమైనవి ఎక్కడో ఒక్క చోట కూర్చోపెట్టి మనం
పూజించినా సమస్త లోకాలని చూస్తూ కాపాడుకుంటున్న తల్లి ఆతల్లి. దీనినే కమఠ
దీక్ష అంటారు. మన శాస్త్ర వచనం ప్రకారం తాబేలు గుడ్లు ఎక్కడో ఒడ్డు మీద
పెట్టి నీటిలోకి వెళ్ళిపోతుంది తరవాత తన గుడ్లను స్మరిస్తూ ఉంటుంది ఆ
స్మరణలచేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలై రక్షింపబడతాయి. దీనినే స్మరణ దీక్ష
లేదా కమఠ దీక్ష అని అంటారు.

ఇలాంటి దీక్ష చేతనే ప్రపంచాన్ని రక్షించే మహాత్ములు కొందరుంటారు వారే
గురువులు లేదా ఆచార్యులు. వారూ ఇవే దీక్షలద్వారా తమ శిష్యకోటిని
రక్షిస్తూ ఉంటారు. జగన్మాత యొక్క అక్షిత్రయరూపమునకు కొనసాగింపే
గురుస్వరూపాలు. ఆమెయే గురుమండల రూపిణి. అందుకే ఆమె దీక్షావిధానములైన
స్పర్శ, నయన, స్మరణ దీక్షలద్వారా లోకాన్ని కాపాడుతుంది. ఏకంసత్
జ్ఙానాన్ని బోధించవలసినప్పుడు నాలుగవరూపమైన గురుస్వరూపాన్ని
శిష్యునివద్దకు పంపుతుంది.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
[satsamgam group]

శ్రీ గురుభ్యోన్నమః

నమస్తే.
అంబికా అక్షిత్రయము, ౧) కామాక్షి ౨) మీనాక్షి ౩) విశాలాక్షి, మరియు త్రిదీక్షా విధానము గురించి చాలా వివరముగా తెలియచేసినందుకులకు
మీకు మా ధన్యవాదాలు తెలుపుకొంటూ. ఆ మహా తల్లులు లే కాదు మన తల్లులు కూడా అదే త్రి దీక్షా విధానముతో ఈ లోకములో తమ పిల్లలను సంరక్షిస్తూ వస్తున్నారు.
పిల్లలు దూరముగా వున్నప్పుడు గాని లేక విదేశములలో వున్నప్పుడు గాని, వారి తరపున పూజలు, వ్రతములు, స్తోత్రములు చేయాలంటే, వారికి ఆ ఫలితములు అతి శ్రీఘ్రముగా అందాలంటే మాతృ మూర్తులు తమ గర్భస్థ స్థానమున (పొత్తికడుపు) తమ చేతిని వుంచి చేస్తే, ఆ ఫలితములు తమ బిడ్డలకు అందుతాయి. కర్పూర హారతి కూడా ముందు తాము అద్దుకొని, తరువాత తమ గర్భస్థ స్థానమున కద్దితే అది పిల్లలకు అందుతుంది. ఇది నిక్కము. మాతృ మూర్తికి వున్న గొప్ప విశేషము ఇది. ఇలా చేయుట వలన తమ వంశము నిలబడుతుంది.

మీ
కామరాజుగడ్డ రామచంద్రరావు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP