గురుపౌర్ణమి రోజు పూజా విధి
>> Friday, July 23, 2010
గురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నారు. గురుపౌర్ణమి నాడు (ఆషాఢ శుద్ధ పౌర్ణమి- 25వ తేదీ)న గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
వ్యాసపూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. పూజకు పసుపు రంగు అక్షతలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి.
గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి. పూజకుముందు శ్రీ సాయిబాబా, దత్త స్తోత్రములు, శ్రీ గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి. లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి
అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్‌ల సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది. అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది.
అలాగే గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్తకాలతో ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment