అమరావతిలో దేవేంద్రుడు చేసిన మాహాదేవి పూజ
>> Saturday, July 10, 2010
ఓ సారి పరాశక్తి కి ప్రియ భక్తుడైన దుర్వాసమహర్షి దేవలోకం వెళ్లాడు. అక్కడ వైభవోపేతం గా ఏదో ఉత్సవం జరుగుతున్నది. ఆఏర్పాట్లనుచూసి ఆశ్చర్యపోయిన ఆయన పక్కనున్న దేవర్షి నారదుని ఏమిటీ విశేషమని అడిగాడు. మహర్షీ ! నీకు తెలియదా ! ఈరోజు పౌర్ణమి .దేవేంద్రుడు ఎంతో వైభవోపేతంగా శ్రీమాతను పూజిస్తున్నాడు అని బదులిచ్చాడు.పూజామందిరానికెళ్ళిన దుర్వాసమహర్షి లోకంలో కనీ వినీ ఎరుగనంత గొప్పగా జరుగుతున్న శ్రీదేవి పూజ ఏర్పాట్లను చూసి అవాక్కయ్యాడు . మణిమాణిక్య రత్నఖచిత బంగారు పల్లేలలో వివిధ దివ్యపష్పాలు వేలకొలది రకాలు అమర్చబడి ఉన్నాయి . వేద ఘోషలు మార్మోగుతుండగా దేవేంద్రుడు ముల్లోకాలలో ఎవరూ ఎరుగనంత గొప్పగా అమ్మవారిని అర్చిస్తున్నాడు .
ఎంతో సంతోషమైనది దుర్వాసునికి . ఇంత లోకోత్తరమైన పూజ చూశాను కదా అని తన్మయుడయ్యాడు .అంతే కాదు దేవికి ఆంతరంగిక భక్తుడుకనుక అమ్మవారికే ఈ పూజగూర్చి చెప్పాలని ఆనందంతో జగన్మాత నివాసమైన శ్రీనగరమునకు చేరుకున్నాడు . అయితే అక్కడ ద్వారపాలకులైన దేవీగణం ఆయనను అడ్డుకున్నారు . మహర్షీ ఇప్పుడు జగన్మాత దర్శనం కుదరదు. అంబికాదేవి అశ్వస్థులుగా ఉన్నారు అని వారించారు .
ఆయన ఆశ్చర్యపోతూ ఏమిటి మీరు చెప్పేది ? జగన్మాతకు అస్వస్థతేమిటి ? ఏమిటీ పిచ్చిమాటలు ? అంటూ వారిని తొలగించుకుంటూ లోనికి వెళ్లాడు.
నిజమే .ద్వారపాలకులు చెప్పినట్లుగా శ్రీమాత ఒంటినిండా పెద్దపెద్ద బొబ్బలు ఉన్నాయి ఆతల్లి పర్యంకం మీద ఉన్నది.
తల్లీ ! ఇదే్మిటమ్మా ,నీ దివ్యశరీరం లో ఈ బొబ్బలేమిటి ? అని ఆవేదనగా అడిగాడు.
నాయనా దుర్వాసా ! కొంతసేపటి ముందు నువ్వుచూసి పరవసించి న ఆ మహేంద్రుని పూజ యొక్క పర్యవసానమే ఇది. అన్నది జగన్మాత.
ఆ పూజఫలం ఇలా జరింగిదేమిటమ్మా ? అడిగాడాయన .
మహర్షీ ! మహేంద్రుడు తన ఐశ్వర్యాన్నంతా లోకాన ప్రదర్శించాలనే గర్వంతో కదా ఇంత ఆడంబరంగా పూజ జరిపాడు . ఆపుష్పాలన్నీ నాకిలా బొబ్బలుగా పరినమించాయి అని వివరించింది .
అమ్మా మరి ఈ విపత్తు నివారణకు ఔషధమేమిటని ఆయనప్రశ్నించాడు.
నాయనా ! భూలోకంలో వారణాశి లోని విశాలాక్షీ ఆలయం లో దీనికి వైద్యుడున్నాడు అని పలికింది
తక్షణం ఆఋషి వైద్యున్ని వెంటపెట్టుకెళ్లాలనే ఆతృతతో వారణాసిలోని ఆలయానికెళ్లాడు. అక్కడెవరూ వైద్యుడు కనిపించలేదు. అమ్మవారి సన్నిధిలో కూర్చుని కన్నీరు కారుస్తూ ఉన్న పరమదరిద్రుడొకడుతప్ప మరెవరూ లేరా ఆలయం లో .
మహర్షి అతని దగ్గరి కెళ్ళి నాయనా ఇక్కడెవరన్న వైద్యుడున్నాడా ? అని అడిగాడు .
ఇక్కడెవరూ వైద్యులు లేరు స్వామి > మీరెవరు అని అడిగాడతను .
నేనెవరైతే నీకెందుకు అని అన్నిచోట్ల వెదకి వైద్యుడు కానరాక నిరాశతో దేవీలోకానికి తిరిగెళ్ళాడాయన.
అక్కడకెళ్ళేసరికి ఘల్లుఘల్లు మని అందెల రవళులు వినిపించాయి .అమ్మవారు ఆన్ందంగా నృత్యం చేస్తున్నారు.
పూర్తి స్వస్థతతో ఉన్న అమ్మనుచూసి మరింత ఆశ్చర్యపోయిన దుర్వాసుడు అమ్మా ! జగన్మాతా , మీ ఆరోగ్యం బాగుపడిందా ! ఒక్క బొబ్బకూడాలేదే ? నాట్యం కూడా చేస్తున్నారు ! ఎల తగ్గిందమ్మా అని అడిగాడు అమాయకంగా .
నీవు వైద్యున్ని చూడలేదా ? అని అడిగింది ఆతల్లి .
లేదమ్మా అక్కడంతా వెదికాను కానీ వైద్యుడెవరూ అక్కడ లేడు ఒకముసలివాడు ఏడుస్తూ ఉన్నాడు అతనిని కూడా అడిగాను ఎవరూ లేరని చెప్పాడు వివరించాడు.
ఆతల్లి చిద్విలాసంగా నవ్వుతూ , నాసన్నిధిలో దు:ఖిస్తూ కనపడ్డ ముసలివాడే నేను పేర్కొన్న వైద్యుడు . నా పరమ భక్తుడైన అతని ప్రేమాశ్రువుల అభిషేకం తో నా బొబ్బలన్నీ అణగిపోయాయి వివరించింది అమ్మ.
అకుంఠిత భక్తివలన హృదయం ద్రవించి స్రవించే అశ్రుధారలే మహాదేవి శరీరానికి ,మనస్సుకూ చల్లదనం చేకూరుస్తాయని గ్రహించిన దుర్వాసుడు పులకిత హృదయంతో తల్లికి మోకరిల్లాడు.
2 వ్యాఖ్యలు:
చాలా చాలా చాలా..........................బాగుందండి ఈ టపా.అమ్మవారి అనుగ్రహాన్ని ఇంతకన్నా ఎక్కువ గా వ్రాయలేను. మౌనం గా మనసు తో ఆ ఆనందం అనుభవించడం తప్ప.
అమ్మ అనుగ్రహం అపారం. కథ బాగుంది.
శ్రీవాసుకి
Post a Comment