శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎంతటి కృపాసింధువు ! ఆ జగత్ప్రభువు గురువాయూరప్ప .

>> Wednesday, July 7, 2010


పూంతానం గురువాయూరప్పర్ యొక్క పరమ భక్తుడు . శ్రీ గురువాయూరప్పన్ పై నారాయణీయమ్ రచించి పాడిన భట్టాదిరి యొక్క మితృడు . భట్టాద్రి తన స్నేహానికి చిహ్నంగా ప్రీతితో ఒక అంగుళీయకాన్ని పూంతానం కు ఇచ్చాడు .దానిని ఆయన ఎంతో ప్రీతిపూర్వకంగా ధరిస్తుండేవాడు . ఆయన నివసించే అంగాడీ పురంనుండి అరణ్యమార్గం ద్వారానడచి వెళ్ళి గురువాయూరప్పన్ ను దర్శిస్తుండటం అలవాటు పూంతానం నకు .

ఓ సారి కృష్ణనామ స్మరణ చేస్తూ అరణ్యమార్గం లో వెళుతున్న పూంతానం ను ముగ్గురు గజదొంగలు అడ్డగించారు . నీ దగ్గరున్నవి ఇమ్మని గద్దించారు . ఒక్క కృష్ణనామము మాత్రం తప్ప నాదగ్గర విలువైనవేవీ లేవని ఆయన చెప్పినా వినకుండా దొంగలు ఆయన మీద పడి బంధించారు. ఆపద్భాంధవా ! అనాథరక్షకా ! గురువాయూరప్పా ! అని ఆభక్తుడు బిగ్గరగా పిలుస్తున్నాడు . ఈతను ఎదో దాచాడనుకుని దొంగలు అతన్ని హింసించటానికి పూనుకొన్నారు .అయితే ఆసమయం లో దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు ,కాగడాల వెలుతురూ కనిపించటం తో ఎవరో అధికారులు సైన్యం తో వస్తున్నారనుకుని దొంగలు పలాయనం చిత్తగించారు .
ఆ వచ్చినది గురువాయూర్ దివాను ఆయన భటులు . అయ్యో ! ఈయన మహా భక్తుడు పూంతానం కదా అని వారు దారిలో కట్టిపడవేసి యున్న పూంతానం ను గుర్తించి బంధవిముక్తున్ని కావించారు. అంతట పూంతానం దివానుగారితో అయ్యా ! ఆ జగత్ప్రభువే నన్ను కాపాడటానికి మిమ్మల్ని పంపించాడు . మీకు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్ధం కావటం లేదు అని పూంతానం దివానుగారిని ప్రార్ధించాడు .
అంతట ఆ దివాను అయ్యో దానికేముంది ఇది మా బాధ్యత . ఐనా అంతగా అడుగుతున్నారు కనుక మీ చేతికున్న ఉంగరం ఇవ్వండి అదే మహాద్భాగ్యం మాకు అన్నాడు .
మిత్రుడిచ్చిన అంగుళీయకాన్ని ఇలా ఇవ్వటం సబబా అని సందేహం వచ్చినా , భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆంగుళీయకాన్ని దివాను గారికి ఇచ్చాడు ఆ భక్తుడు . వాళ్ళు ఆయనను అరణ్యం దాటించి వేరే దారిలో వెళ్ళిపోయారు
ఆ రాత్రి ప్రధానార్చకునికి స్వామి కలలో కనపడి తన పాదాలవద్ద ఒక అంగుళీయకం ఉందని అది పూంతానం నాకు ఇచ్చిన బహుమతి కనుక దానిని ఉదయాన్నే ఆ భక్తునికే ఇవ్వమని ఆదేశించాడు . అర్చకుడు ఉదయాన్నే వెళ్ళి చూడగా భక్తజన వల్లభుడగు గురువాయూరప్పని సన్నిధిలో ఉంగరమ్ ఉన్నది . ఆయనద్వారా విషయం తెలుసుకున్నఆఊరివారంతా పూంతానం వంటి మహాభక్తుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ విషయాలే వీ తెలియన్ పూంతానం గురువాయూర్ చేరుకుని తటాకం లో స్నానం చేసి ఆలయాని కొచ్చాడు . భక్తులు జయజయ ధ్వానాలు చేస్తుండగా ప్రధానార్చకుడు ఎదురేగి స్వాగతం పలికి స్వామివారికి మీరిచ్చిన బహుమతి అటకదా ! వారి ఆజ్ఞానుసారం ఈ అంగులీయకం ఇస్తున్నాము స్వీకరించండి అని దానిని ప్రసాదించాడు .

అ ర్ధం కాలేదు మొదట విషయమేమిటో . అర్ధమవుతున్నకొద్దీ ఒడలు పులకించగా ,ధారాపాతంగా కారుతున్న కన్నీటితో ప్రభువు పాదాలపైబడి విలపిస్తున్నాడు పూంతానం . ప్రభూ ఎంత కారుణ్యమూర్తివి నీవు . నన్ను కాపాడటానికి నీవే స్వయంగా వచ్చవా ? ఏమి నీకృప . భక్తజనబాంధవా పాహి ...పాహి అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడాభక్తశిరోమణి గురువాయూరప్ప సన్నిధిలో ...............

4 వ్యాఖ్యలు:

Anonymous July 7, 2010 at 9:14 PM  

అత్యద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు...ధన్యవాదములు...!!
మరిన్నింటిని కోరుకుంటూ...మీ శివ.

సురేష్ బాబు July 8, 2010 at 12:52 AM  
This comment has been removed by the author.
సురేష్ బాబు July 8, 2010 at 12:53 AM  

ఓ గురువాయూరప్పా! నీవు జగతికే గురువయ్యావప్పా!
పూతననూ అనుగ్రహించావు, పూంతానం నూ అనుగ్రహించావు!
భేధమెరుగని నీ కృపాదృష్టికి ఇవే మా అనంత జోతలు,
అందుకోగ రావయ్యా మా కృతజ్ఞతా భక్తి పుష్పాలు.

రాజేశ్వరి నేదునూరి July 8, 2010 at 8:39 AM  

బాగుంది చక్కని విషయాన్ని తెలియ జెప్పినందుకు అభినందనలు చదువు తున్నంత సేపు ఏదో అవ్యక్త మైన అనుభూతి భగవత్సాన్నిధ్యం లొ ఉన్నంత ఆనందం కళ్ళకు కట్టి నట్టున్న దృశ్యం

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP