నన్నొదలి పోయాయి , నానవ్వుల తోటలో పూబాలలన్నీ ..నన్నిలా నిదురలేని నిశీథిలో గడపమని .... [పాఠశాల మూసివేశాము]
>> Friday, June 18, 2010
నేనవ్విన నవ్వులన్నీ నేనిప్పటదాకా ప్రత్యక్షంగా చూడగలిగాను నిర్మలమైన పసి మోములమీద . నామనసులో సంతోషాన్ని ,ఆనందాన్నీ వందల అద్దాలలో ఒకేసారి చుసుకునే నేను ఇప్పుడీ గాఢాంధకారంలో దిశతెలియక దిక్కుతోచక నిలుచున్నాను . గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న దు:ఖాన్ని పెల్లుబికి బయటపడనీయకుండా ఉండేందుకు మౌనాన్ని ఆశ్రయించి నేనూ నాసహచరి మౌనవ్రతంలో మునిగిపోతున్నాము.. ఎలా తట్టుకోవాలి ? పదహారు సంవత్సరాల నుంచి పిల్లలతో కలసి పిల్లలలోకంలో వాళ్ల నవ్వుల పువ్వుల మధ్యనుండి ఇలా ఒంటరి తనపు ఎడారి లో కొచ్చిపడతామని ఊహించలేదు . ఈ కఠినపరీక్షకు తట్టుకోలేక పోతున్నాము. కన్నీళ్ళు దాచి ఉంచటం మహా కష్టంగా ఉంది.
అప్పుడెప్పుడొ పదహారు సంవత్సరాలక్రితం బ్రతుకు దెరువుకని ఊరికి దూరంగా మా పొలంలో చిన్న పాక నిర్మించి ప్రారంభించిన పాఠశాల ఇంతై అంతై అనుబంధాల సంతై .......అలా పెరిగి పెరిగి బాహ్య ప్రపంచం నుంచి నన్ను నేను దరిదాపుగా దూరం చేసుకుని నాదైన ఈప్రపంచాన్ని ఒక్కరోజు కూడా వదలి ఉండలేని స్థితికి తెచ్చింది. మొదట ఏడవతరగతి వరకు మొదలెట్టి తరువాత పదవతరగతి వరకు క్లాసులను పెంచాము . పగలు పాఠశాల పూర్తయ్యాక ఇళ్ళకు వెళ్ళినా రాత్రికి పెద్దపిల్లలంతా మరలా మాదగ్గరకు చేరుతారు .మాతోపాటు తినటం ... అన్నం తెచ్చుకోని వారికి వాళ్ల టీచర్ ఎలాగూ వండి పెడుతుంది .మాతోపాటు వాళ్ళూ ఆదివారాలుకూడా విడిచి వెళ్లక ఇక్కడె ఉంటారు. వాళ్లతో కలిసి ఆటలు పాటలేకాదు ,పూజలూ యాగాలతో ఇంత కాలం ఎప్పుడు గడచిపోయిందో తెలియనే లేదు. వాళ్లు నవ్వితే మాకు నవ్వు , మాముఖంలో ఏదైనా చిన్న విచారపు ఛాయ కనపడితే అది వాళ్లకో పెద్ద విషాదం. దుర్గాసార్ ,జయప్రదామేడం అంటే వాళ్ళుకు తల్లిదండ్రులతోపాటు ఆత్మీయులక్రిందలెక్క . ఇప్పటికీ పైచదువులకెళ్ళినవాళ్ళు ఇళ్ళకొస్తే ముందు ఇక్కడే దిగుతారు . ఎక్కడున్నా ఫోన్లు చేస్తుంటారు .
అంత పెద్ద ప్రతిష్టాకలాపాన్ని అవలీలగా చేస్తున్న మా పిల్లలను చూసి నెల్లూరు నుంచి వచ్చిన ప్రతిష్టాచార్యులు ముక్కునవేలేసుకున్నారు . వీళ్ళు పిల్లలు కాదు ..... మాస్టారూ పిడుగులు . మే ము ఎన్ని ప్రతిష్టలు చేశామో ! కానీ ఇలాంటి ప్రతిష్ట చూడలేదు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని అపరహనుమంతుల్లా చేసే స్తున్నారు అని ఆశ్చర్య పోయారు.
ఏదైనా క్షేత్రదర్శనానికి వెళ్లి నప్పుడు అక్కడ వీళ్ల ధ్యానం పూజ చూసి అందరూ అడిగేవాళ్లు మీ స్కూల్ ఎక్కడ ? రెసిడెన్షియల్ అవకాశం ఉందా అని. పీఠానికి వచ్చిన వాళ్ళు మాస్టర్ గారూ ! మీకు నిజంగా అమ్మవారిచ్చిన వరమండీ ! ఈ పిల్లలతో సాంగత్యం అని అంటుంటారు .
కొండగురునాథ స్వామి తిరునాళ్లలో మా పిల్లలు బృందావన భజన కళా రూపాన్ని ప్రదర్శిస్తుంటే లక్ష్లరూపాయల తో కట్టిన ప్రభల లను వదలి వేలాదిగా జనం ఇటు చూడటానికి పరుగులెత్తారు . మాకార్యక్రమం ఒంటిగంట దాకా జరిగితే అంతవరకూ ప్రభలమీద కార్యక్రమాలు జనం లేక నిలిపివేశారు . తాచుబాముల్లా కదులుతున్న వారి లయ విన్యాసాలకు మైమరిచిపోయింది జన సందోహం . ఇప్పటికీ పెళ్లయిన ఆడపిల్లలు వాళ్ల భర్తల్తో కలసి వచ్చినప్పుడు టీచర్ గారూ ! మీరు మీ పిల్లలకు చాలా చక్కగా అన్నీ సవరించుకోవటం నేర్పారండి ,అని అంటుంటే మావిడ కళ్లతోనే ప్రశ్నిస్తుంది ఎలావుంది ? నా పెంపకం అని , నన్ను చూస్తూ. టీచర్ గారి చేతిలో పెరిగితే ఆడపిల్లలకు అత్తగారింట్లో ఇబ్బందే లేదు అనే పేరు మా అవిడ కొచ్చిన పెద్దడిగ్రీ . అందరికీ ఒకరిద్దరు పిల్లలైతే మాకు మూడువందలమంది పిల్లలు అని చెప్పుకునేవాల్లం .
ఎక్కడ పూజ జరగాలన్నా సిద్దం .ఏపోటి పరీక్షకలకైనా సిద్ధం .పరీక్షాఫలితాలెప్పుడు వచ్చినా మాపిల్లలకు పండగే . ఆపదలో ఉన్న వారెవరికోసమైనా చాలీసా నో మరో పారాయణమో పమో చేయాలంటే బాలవటువులై కండువాలు కట్టుకుని రెడి అవుతారు. నాకు కాళ్ళూ చేతులూ తామై ఎన్ని యాగాలు, పూజలు, పూజలు జరిపారో ! ఇకనేను ఈ భగవత్ సేవలు చేయగలనా ? కోడిపిల్లల్లా చూట్టూమూగి ఉండే పిల్లలు లేకుండా ఈ ఒంటరితనాన్ని భరించగలమా ?
అయినా కాలం కఠినపరీక్షకు తట్టుకోలేక పాఠశాల మూసివేశాం . అటొచ్చి సార్ ..ఇటొచ్చి మేడం అంటూ తిరిగే పిల్లలు కనపడక పిచ్చెక్కుతోంది . లోయర్ క్లాసులవాళ్లయితే మరీ . మిగతా అందరు టీచర్లున్నావాళ్లదగ్గరకెళ్లరు సార్ >> వాడు గిచ్చాడనో ! టీచార్ ...వీడు చెట్టు విరగ్గొట్టాడు.... మరే ....వాడే... జామకాయ కోశాడు అంటూ బుల్లిబుల్లి అడుగులేస్తూ వచ్చి చెప్పే ఒకటవతరగతి పిల్లలు ఏరీ వీల్లంతా ????? ఈ పిల్లమధ్యలో మా ఇద్దరు పిల్లలెప్పుడు పెరిగి పెద్దయ్యారో గమనించినట్లే లేదు .
చదువును ... అన్నాన్ని అమ్ముకోవటం పాపంగా పరిగణించిన ఈ పుణ్యభూమిలో నేనుకూడా కలి ప్రభావం వలన ఆపాపంలో పాలు పంచుకున్నాను కొద్దో గొప్పో . నాడు బ్రతుకుతెరువుకోసం ప్రారంభించిన పాఠశాలలో స్వల్పఫీజులతోనే నిర్వహణ జరిగింది . పదవతరగతి ప్రారంభించాక స్టాఫ్, నిర్వహణ ఖర్చులు పెరిగి పోయాయి . పట్టణ ప్రాంతాలకంటే చాలా తక్కువగానే ఫీజులు తీసుకున్నాము . ఉద్యోగం వచ్చాక పాఠశాలమీద వచ్చే దానిలో ఎక్కువభాగం గుడి నిర్మాణానికి వసతుల కల్పనకు ఖర్చుచేశాము . ఇవ్వలేనివాల్లుంటే అడిగిందిలేదు. వెనుకబడిన కుటుంబాలలో పిల్లలకు ఎవరూ ఫీజుకట్టగలస్థోమత లేకుంటే [రహస్యంగా ]ఫ్రీగానే చదువుకొమ్మని చెబుతాము. అటు చదువు సాగిస్తూనే ,ఇటు భగవత్ సేవాకార్యక్రమంలో పాల్గొనే మా పిల్లలలో ఎక్కువమంది ఎక్కడకెళ్ళినా పలానా స్కూల్ పిల్లలా,,,,..వెరీగుడ్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది కాలేజీల వాల్లు ప్రలోభపెట్టినా నేనెప్పుడు పలానాకాలేజీలో చేరు అని చెప్పను .అలాంటి వ్యాపారాలు మా సార్ చేయడు అని మాపిల్లలు వెళ్ళిన చోట చెబుతుంటారు.
ఇప్పుడిక విద్యారంగంలో రాబందుల ప్రవేశం ఎక్కువయింది .వాటి రెక్కలు మా వినుకొండ లాంటిచిన్నపట్టణాలమీదకుకూడా విస్తరిస్తున్నాయి. కోట్ల పెట్టుబడి పెట్టి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి . జీతాలు ఎక్కువిచ్చి టీచర్లనందరినీ లాక్కుంటున్నారు.ఊర్లకు బస్సులు నడుపుతున్నారు. చిన్నపాఠశాలలు కూడా కాపీసెంటర్లకు తరలించి పిల్లలను పర్రీక్షలు రాపించైనా తమ మనుగడ కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.వ్యవస్తంతా గందరగోళంగా ఉంది చక్కగా కుటీరాలు వేసుకుని పాఠశాలలు నడిపే మాకు కష్టాలు మొదలయ్యాయి .ఈ రాబందులు ప్రభుత్వం వెనుకనుండి వ్యూహం అమలుచేస్తున్నారు చిన్న పాఠశాలలన్నింటినీ తొక్కెయ్యాలని...అన్ని పాఠశాలలకు గుర్తింపు కావాలన్నారు . సరే అని మా స్తోమతకు మించి లక్షరూపాయలదాకా ఫీజులవీ ఖర్చుపెట్టాము. ఇంకా అనుమతులు వాటికి లక్షరూపాయలదాకా అయ్యేలా ఉంది . ఇప్పుడు బిల్డింగులు కావాలంటున్నారు . పూరిపాకలు ఉండకూడదంటున్నారు ,అక్కడ రక్షణ కు ఎటువంటీ ఇబ్బంది లేకపోయినా కూడా.
ఇవిగాక బస్సులు . ఇక డబ్బు కాస్త ఎక్కువవుతున్నకొద్దీ జనంలో మార్పులొస్తున్నాయి . ఇంగ్లీష్ మీడియం పిచ్చి ముదిరిపోయింది . పాతవిలువలపట్ల కొత్తతరానికి ఆసక్తి తగ్గుతున్నది .
ఇప్పుడు లక్షలరూపాయలు వెచ్చించి ఆ అప్పు తీరడానికి పక్కా వ్యాపారంగా నేను విద్యాసంస్థను నడపలేను. అవతల ఎక్కువ జీతాలొస్తుంటే ఎంతకాలమని మీదగ్గర తక్కువకు చేయగలం అని నమ్మకమైన ,చక్కని వ్యక్తిత్వంగల నా సిబ్బంది అడిగితే వారిని ఎలా ఒప్పించగలను ? వారి అవసరాలు వారికుంటాయి కదా ?
సమర్ధతలేని సిబ్బందితో కాలం గడిపి పిల్లల భవిష్యత్ కు అన్యాయం చేయలేను . ఎక్కువగా నదగ్గర ఎస్సీ,ఎస్టీ ,మిగతా పేదరైతుల పిల్లలుంటారు . వీళ్లందరినీ పీడించి వసూల్లు చేయటం నావల్లకాదు. ఇంకా రెండు సంవత్సరాల ఫీజులివ్వాల్సినవాల్లు కూడా ఉన్నారు. ఏవో ఇబ్బందులవల్ల వాల్లు కట్టలేక పోతున్నారు. ఇలాఉంటున్న నా పరిస్థితి, వ్యవసాయం జూదంగా మారిన రైతుల పరిస్థితి ఆలోచించి మనసు చిక్కబట్టుకుని గుండెల్లో దు:ఖాన్ని అదిమిపెట్టుకుని మొన్న ప్రకటించాము పాఠశాల మూసివేస్తున్నాము అని.
ఎనాటికైనా ఇక్కడే పూర్వ గురుకుల పాఠశాలల వలె ఉచితంగా నివాసం ,ఆధునిక విద్యావిధానం తో మేళవించి పూర్వ విలువలను కాపాడుకుంటూ , హైందవతేజో యశస్సులను ప్రజ్వరిల్లజేయగల విద్యార్థులను తయారు చేయాలనుకున్న నా కోరిక కార్యరూపం దాల్చకముందే ఇలా ముగుస్తుందనుకోలేదు ..
పిల్లల తోడులేక .. ఒంటరిగా ఆలోచనలు తట్టుకోలేక గుండెలో బాధ దించుకోవటానికై ఇలా కీబోర్డుపై వేల్లు కదిలిస్తున్నాను .
40 వ్యాఖ్యలు:
అయ్యో. ఎందుకలా జరిగింది. ఇది ఒక విషమ పరీక్ష . ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడు ఏ ఆలోచన చేసాడో మరి..
ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనె యుండగ ....తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు
దుర్గేశ్వర గారు,
బాధపడకండి అని నేను చెప్పను.ఎందుకంటే మీ బాధను నా గుండెల్లో ఫీలవుతున్నాను.మీకిది ఒక జీవిత పాఠం అనుకోండి.ఎటువంటి ఆత్మీయబంధాలైనా ఒకనాటికి విడిపోక తప్పదు.మనిషి ఎప్పటికైనా ఒంటరివాడే.ఇది చేదు నిజం.మౌన ధ్యానాన్ని తీవ్రతరం చేయండి.మీ బాధ మబ్బులా విడిపోతుంది.
దుర్గేశ్వర గారూ...
పిల్లలతో మీకున్న అనుబంధం చాల గొప్పది.
మీరు రాసింది చదివిన తరువాత నా మనసంతా కకావికలం అయింది.
కళ్ళు చెమరుస్తున్నాయి. తప్పక మీ కోరిక తీరుతుంది. కొన్నాళ్ళు మీకు భగవంతుడు రెస్ట్ ఇవ్వదలుచుకొన్నాడనుకోండి. కొన్నాళ్ళకు మార్గం అదే కనిపిస్తుంది
నేటి కార్పొరేట్ విద్య ధాటికి ప్రభుత్వ పాఠశాలలే మూతపడిపోతున్నాయి. ఇలా జరగడానికి కారణం తల్లిదండ్రులలో నెలకొంటున్న అభద్రతా భావం. దానిని సొమ్ము చేసుకునే రాజకీయ, వ్యాపార వర్గాల ధాటికి తట్టుకొని నిలవడం కష్టం. మీకొచ్చిన కష్టం నుండి త్వరగా కోలుకొని మీ ఆశ నెరవేరాలని ఆశిస్తున్నా...
Very sad to read. Can't we do anything?
జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ తప్పకుండా మీరు స్కూలును తెఱవగలుగుతారు. ఇదొక చిన్న విరామం మాత్రమే. ధైర్యంగా ఉండండి.
దుర్గేశ్వర గారు, ఏమైంది? పిల్లలు తగ్గిపోయారా లేక పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు వలస వెళ్ళారా? అయినా పట్టుమని దగ్గర దగ్గర పది గ్రామాలు లేని చోటకూడా మీరు పాఠశాలను ఇన్ని సంవత్సరాలు నడిపినందుకు మీ కృషి, దీక్షకు అభినందనలు. ఇక్కడ పిల్లలు కొరవడితే వినుకొండలో మీ ప్రయత్నాన్ని మొదలెట్టగలరేమో ఆలోచించండి.
దుర్గేశ్వర గారికి నమస్కారము!
మీరు వ్రాసినది చదివిన తరువాత చాల బాధ వేసింది. కలి వేళ్ళూనుకు పోయిన ప్రస్తుత కాలములో దైవము కూడా వేచి వుండవలసినదే. అంతా దైవ లీలగా చూచినచో బాధ లేక భాధ్యత మిగులుతుంది. పైన పెద్దలు చెప్పినట్లు బహుశా మీకు కొంతకాలము విశ్రాంతి కొరకు దైవమే ఇలా ఏర్పాటు చేశాడు అనుకొని మీరు చేసే మిగతా దైవ కార్యక్రమములను కొనసాగించండి. తప్పక శాంతి దొరకుతుంది.
ధన్యవాదములతో
మంగేష్
మంచిని పెంచే ప్రయత్నాలకి ఇలాంటి విఘ్నాలు .. కలిప్రభావమే. మీరు నమ్మిన స్వామి మోసం చేయడు. దిస్ టూ విల్ పాస్
దుర్గేశ్వర్ గారూ ! బాధ పడకండి చదువుతున్నంత సేపు ఏంజరిగిందొ అన్న బాధ భయం వేసింది ఫర్వా లేదు. ధైర్యం గా ఉండండి మీరు చేసిన పూజలు యజ్ఞాలు మిమ్మల్ని తప్పక రక్షిస్తాయి మీ కోరిక త్వరలొనె తీరుతుంది మళ్ళీ మీ పిల్లలు స్కూలు అన్ని తొందరలోనె చక్క బడతాయి కొన్ని దుష్ట శక్తులు అప్పుడప్పుడు ఇలా వేదిస్తు ఉంటాయి. అప్పుడె మన ధైర్యం గా ఎదుర్కోవాలి మాకు బాధ గానె ఉంది మా అందరికోసం మీరు పూజలు చేసారు మీ కోసం మేము దైవాన్ని వేడుకొంటాము. కాలమె చక్క బెడుతుంది. ధైర్యం గా ఉండండి.
విద్యారంగంలో రాబందుల ప్రవేశం ఎక్కువయింది అని మీరే అన్నారు.మీ చూట్టూమూగి ఉండే కోడి పిల్లలను అవి వదలవు.శర్మగారు చెప్పినట్లు ఎటువంటి ఆత్మీయబంధాలైనా ఒకనాటికి విడిపోక తప్పదు.మనిషి ఎప్పటికైనా ఒంటరివాడే.కాకపోతే విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి.
"కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును.
ఈ లోకమందు సోమరులై ఉండకూడదు.
పవిత్రమైన ఆశయాలు మరువకూడదు.
జయమ్ము నిశ్చయమ్మురా.భయమ్ము లేదురా.జంకుగొంకులేక ముందు సాగిపొమ్మురా"
అనే పాట మనసులో ఉంచుకోండి.
దుర్గేశ్వర గారు,
మీరు ఇప్పుడు ఒక్కసారి గా ఇలా టపా రాసి చెప్పె దానికన్నా ముందర ఒకసారి ప్రస్తుత పరిస్థి వివరించి ఉంటె బాగుండెది. దానితో పాటుగా మీ స్కూల్ నడపటానికి ఎంత ఖర్చు ఇలాంటి వివరాలు రాసి ఉంటె కనీసం ఎవరికైన చేతనైనంత సహాయం చేయగలిగి ఉండేవారేమో!
vijaya ganapathi cheyyandi tappaka siddistundi etuvantidi aina
గురు-శిష్య సంబంధం వర్నిమ్పనలవికానిది మాస్టారు.మనమంతా కలసి పూనుకున్నా ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న భరోసా కనిపించడంలేదు ,అయినా మన ప్రయత్నం మనం మొదలుపెట్టాల్సిన్దే.ఈ విషయాన్ని నాతోటి మిత్రులతో చర్చించిన పిమ్మట మీతో మాట్లాడతాను.
ఇన్నాళ్ళ అనుబంధం ఇలా ఒక్కసారిగా తెగిపోవడం చాలా బాధాకరంగా ఉంది.మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలను,ఎలా ఓదార్చాలి మిమ్మల్ని?
"నహి కళ్యాణ కృత్కశ్చిత్! దుర్గతిం తాత గచ్చతి!"
"కళ్యాణ కరమైన (మంగళప్రదమైన) పనులు చేసే వాడు ఎన్నడూ దుర్గతి పొందడు".
మీకు చెప్పేంతటి వయసు, అనుభవం నాకు లేదండీ దుర్గేశ్వర్ గారూ!. స్వామి వివేకానందులు చెప్పినట్లు గొప్పపనులు గొప్ప త్యాగాల ద్వారానే సాధించబడుతాయి. ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.
మీకు గల భక్తే, మీరు చేసే పరోపకారమే మీ పాఠశాలను తిరిగి నిలబెడుతుంది. మీరు భగవంతుడి చేయి పట్టుకొని లేరు, అతడే మీ చేయి పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ కష్టం కూడా దూదిపింజ వలే ఎగిరిపోతుంది.
నేను వచ్చిన ప్రతిసారీ అన్నయ్యా అన్నయ్యా అంటూ నా చుట్టూ తిరిగిన తమ్ముళ్ళు చెల్లాయిలు ఇక ఉండరంటే నమ్మలేకుండా ఉన్నాను. చాలా బాధగా ఉంది.
నేను వచ్చిన ప్రతిసారీ అన్నయ్యా అన్నయ్యా అంటూ నా చుట్టూ తిరిగిన తమ్ముళ్ళు చెల్లాయిలు ఇక ఉండరంటే నమ్మలేకుండా ఉన్నాను. చాలా బాధగా ఉంది.
అనుకున్నవనీ జరగవు కొన్ని
అనుకోలేదనీ ఆగవు అన్నీ
జరిగేవన్నీ మంచికనీ...అనుకోవడమే మనిషి పని...
ప్చ్...ఇలా పాత పాట గుర్తు చేయడం మినహా కొత్త మాట యేం చెప్పగలను...ఈ పరిస్థితిలో!
దుర్గేశ్వర గారూ,
బాధగా ఉందండీ. ఇక్కడ సిటీల్లో పిచ్చుక గూళ్ళలో క్లాసులు నడిపినా దిక్కు లేదు. తల్లిదండ్రుల్లో ఇంగ్లిషు పిచ్చి ముదిరి వెర్రి తలలు వేసింది. మనం ఏటికి ఎదురీదాల్సిందే.
ఫీజులు పెట్టి పక్కా వ్యాపారాత్మకంగా నడిపి అందులో సగం పేదాసాదకు అవకాశం ఇవ్వండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంతకు మించి చేసేది లేదు. మీకు సాధ్యం అయ్యే పక్షంలో! ఇంత మంచి జరుగుతున్నపుడు మనమూ రాజీ పడటంలో తప్పు లేదని నా అభిప్రాయం.
దీనివల్ల విలువలతో కూడిన విద్యను మీరు ఈ 100% పిల్లలకు ఇవ్వవచ్చు. ఆలోచించండి. మీ పాఠశాల గుడ్ విల్ కు ఎవరో ఒకరు సేవా భావం ఉన్న పెట్టుబడిదారున్ని కలపగలిగితే తిరిగి పాఠశాల మొదలుపెట్టవచ్చేమో. కానీ బడి మూతపడనీయకుండా చివరి వరకూ ప్రయత్నం చేయండి.
మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాము.
జీవితంలో ప్రతి విషయమూ వలయం కావలసిందేనండి. చెడ్డ రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండండి.
అక్కగారూ .ధైర్యమే మిగిలింది.
vj శర్మగారూ రాముడున్నాడన్నదే కదా మనధైర్యం
శర్మగారూ ! బృందావనం ఫోన్ చేస్తే అంజనీ మాత దగ్గరనుంచి , మీ వద్దనుంచీ వచ్చినసంకేతాలు మనసును గట్టిపరచాయి గనుకనే ఈ కఠిననిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కాకుంటే ఒక్కసారిగా తట్టుకోలేక పోతున్నాము .
నరేష్ పట్నాయక్ గారూ ధన్యవాదములు
మైత్రేయిగారూ మీ అభిమానానికి కృతజ్ఞతలు
కెక్యూబ్ వర్మగారూ ,గీతాచార్యగార్లకు కృతజ్ఞతలు.
పెద్దలు నరసింహగారికి నమస్కారములు . మీవంటి పెద్దల దీవెనలు వృధాకావని నానమ్మకం
రామి రెడ్డిగారూ ! ఒకప్పుడు ఇక్కడకు వచ్చి రాళ్ళభూమిని సుక్షేత్రంగా మార్చిన శ్రమజీవుల స్థానంలో విచ్చలవిడితనానికి ,ఆధునిక వెర్రి వ్యామోహాలకు ఆకర్షితులైన తరం పెత్తనానికొస్తున్నది. గాంధీనగర్ నుంచి కూడా ఈ వరుసలోనే పిల్లలవలస మొదలైంది పట్టణాలకు . కొందరు ప్రకాశం జిల్ల్లా కాపీసెంటర్లకు పిల్లలను తరలిస్తున్నా ఎలాగైతేనేం మార్కులెక్కు వస్తున్నాయికదా అని అడుగుతున్న మీ ఊరి వాల్ల అమాయకత్వానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియటం లేదు. ఇప్పుడు డబ్బు కూడా బాగా చేరుతుంది కనుక స్థోమతకు మించి ఖర్చుపెట్టి పిల్లలను పట్తణాలకు పంపుతున్నారు ఉన్నవాళ్ళు . మీ నానగారు అంటుండేవారు మావాల్లకు వెనుకాముందు చూసుకునే అలవాటుందండి పోలో మని పరిగెత్తటమే పని అని.
ఇక నేను వినుకొండ లో స్కూల్ పెట్టి విద్యావ్యాపారం చెయ్యాలనే కోరికలేదండి .అదీగాక ఆ టౌన్ వాతావరనం నాకు నచ్చదు . వినుకొండలో మా అత్తగారింటికి వెళ్ళినా రాత్రికల్లా తిరిగి వస్తుంటాము . పీఠం వద్దమాత్రమే లక్ష్యానికనుగుణంగా పనిచేయగలుగుతాము .
మంగేశ్ గారికి, సత్యసాయి గారికి కృతజ్ఞతలు.
అమ్మా రాజేశ్వరి గారు ,ప్రస్తుతం దుష్టశక్తులు మన సంస్కృతిని ధ్వంసం చేయటానికే విద్యారంగాన్ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవటానికి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి.
రహంతుల్లాగారూ ఈ రాబందులు పేదవానికి విద్యనందనీయవు రాబోయే రోజులలో ధన్యవాదములు మీ స్పందనకు.
శ్రీకర్ గారూ ,విద్యారంగాన్ని కమ్ముకుంటున్న కారుమేఘాల మెరుపులే ఇవి .ఇంకా భీకర గర్జనలు పిడుగుపాటులు చూడవలసి వస్తుంది . వ్యక్తిగతంగా నేను ఒక్కన్ని పోరాడలేకనే చేతులెత్తాల్సి వచ్చింది
విశ్వనాథ్ గారూ ధన్యవాదములు
astrojoyed గారూ మీ అభిమానానికి కృతజ్ఞతలు .
విజయమోహన్ గారూ మీవంటి ఆత్మీయుల ఓదార్పు నాకు ఉపశమనం . కానీ ఆతల్లి సరస్వతీ దేవి కంటినీరు తుడవాలనే కోరిక జాతిలో నెలకొనే దెన్నడో . !
సురేష్ , లక్ష్మీ నారాయణ గార్లకు ధన్యవాదములు.
ధరణీరాయ్ గారు వాస్తవమే మీరు చెప్పింది ,కానీ నామనస్సు కుదుటపడాలంటే మరో పదిరోజులు పడుతుందేమో
జీవని గారూ
మీరు చెప్పినది వాస్తవమేనండి . కానీ ఆథ్యాత్మిక పంథాలో దీనిని నడపాలంటే అలా కుదరదు .ముళ్ళదారైనా నేరుగా నడవాల్సిందే .లేదా ఆగిపోవాలి రెండే మార్గాలు అలా నడవటానికి అవకాశం కనపడనందునే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది .ధన్యవాదములు
ఎప్పుడూ మీ బ్లాగులో కామెంటు రాద్దామంటే,ఏం రాయాలో అర్థం అయ్యేది కాదు..నాకు అంత అర్హత లేదనిపించేది.....కాని మీ ఈ టపా చదివి కన్నీళ్ళు చిప్పిల్లాయి..రాయకుండా ఉండలేకపోతున్నా....మీలాటి పెద్దలకి సలహాలు,ఓదార్పు మాటలు చెప్పే వయసు,అనుభవం రెండూ నాకు లేవు....కానీ మీ గురుకులం వివరాలు చెప్తుంటే,(ముఖ్యంగా,మీ టీచర్ గారు,పంచమాతల్లో ఒకరి పాత్రని నిండుగా పోషించటం చూస్తుంటే)నాకు పిల్లలుంటే మీదగ్గరే చదివిద్దామనిపిస్తోంది...మీరు బడి మూసేసినా కూడా...ఈ వెధవ ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఉన్న బళ్ళు ఎందుకండీ.....మన సంప్రదాయం గుర్తింపిచ్చె విద్యాలయం మీది....కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళా మీ జ్ఞానయజ్ఞం కొనసాగించాలని నా కోరిక....
దుర్గేశ్వరా... మనసును పిండేసిన భావం కలిగింది... అర్ధాంతరంగా స్కూలు మూసివేయబడటం...
మీకు చెప్పేంతటి వాణ్ణి కాకపోయినా స్పందించకుండా ఉండలేకపోతున్నా. జరిగిన సంఘటన ఒక పరిక్ష అనే భావిస్తున్నాను కానీ ఇది శాశ్వతం/ సమాప్తం అని అనుకోవటం లేదు.
ధర్మం ఒంటిపాదమ్మీద నిలబడి ఉన్నా, కలిపురుషుడు తన ప్రభావం చూపుతున్నా, పురాణపురుషుడి లీల అపారం. వాటి ప్రభావం పడకుండా 300 మంది విద్యార్ధులకు మీద్వార సంస్కారవంతమైన విద్యని (చదువుని కాదు గమనైంచగలరు) అందింపజేశాడు అంతే, అదేమీ చీన్న విషయం కాదు. ఇప్పుడిలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్నకి సమాధానం రామాయణ భాగవతాల్లోనే లేదు. జరుగుతున్నదాని సాక్షీభూతంగా గమనిస్తూ కర్తవ్యాన్ని ఆచరించటం తప్ప.
కారణాలు అనేకం కనిపించవచ్చు వృత్తి అనో, వ్యాపారం అనో, ప్రభుత్వం అనో.... కానీ సత్యం మాత్రం వీతన్నిటికీ అతీతంగా ఉంటుంది అది, స్వయః ప్రకటితం గా వస్తుంది. అప్పటిదాకా జరిగిన దానికై చింతించటం, గత జ్ఞాపకాలతో సతమతమయ్యేకన్నా మీ స్ఫూర్తిని ఇప్పుడే విధం గా ముందుకు తీసుకెళ్ళగలరో ఆలోచించండి. ఉడతాభక్తీ మేము చేయగలిగినది ఏమున్నా తెలియజేయండి. తప్పక చేస్తాము... ఇంతకన్నా నేనేమీ చెప్పలేను.
దుర్గేశ్వరగారూ, మీరు వ్రాసినది చదువుతుంటే చాలా బాధ కలిగింది. ప్రభుత్వం చెసే అనేక గుడ్డిపనులలో ఇదొకటి. ఏది మంచి ఏది చెడు చూసుకోకుండా అన్ని చిన్న స్కూళ్ళను ఒకేగాటను కట్టి వాటి మనుగడ అసంభవం చేసి చేతులు దులుపుకున్నారు. వ్యక్తిత్వ వికాసానికి బదులుగా మార్కులే ఎక్కువైపోయినాయి. ప్రజలు కూడ ఒక మూకలాగ గొర్రెదాటు వ్యక్తిత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. వ్యాపార ప్రధానమైన ఈ స్కూళ్ళ వల్ల వచ్చే దుష్ఫలితాలు రాబొయ్యే రోజులలో సమాజం మొత్తం మీద పడుతుంది.
మనం చెయ్యగలిగింది కుదిరినంతకాలం చేశాం. కుదరనప్పుడు మానుకున్నాం అనుకుని స్వాంతన పొందటం మినహా చెయ్యగలిగింది ఏమీలేదు.
మీ ప్రయత్నం మీరు కొనసాగించండి. తగిన దారి దొరక్కపోదు ఏదైనా సహాయం కావాలంటే సంకోచించకుండా అడగండి :)
The heart`s purest & earnest
desire is always fulfills.
I am sure will re-open the school
again.
దుర్గేశ్వర్ గారు... మీ ఆవేదన అర్దం అయింది. కానీ ఇప్పటి వ్యాపార ప్రపంచంలో విద్య కూడా వ్యాపార వస్తువయిపోయింది. మార్కెట్‌లో ఒక వస్తువుని పెట్టి అమ్మినట్టు, విద్యకి కూడా "బ్రాండ్ వాల్యూ" తీసుకువచ్చేసారు. తల్లి దరండ్రులు కూడా వెనకా ముందూ ఆలోచించకుండా, కనీసం చదువు చెపుతున్నారో లేదో ఆలోచించకుండా, అటువంటి స్కూళ్ళకే పిల్లల్ని పంపుతున్నారు. మనం ఎంత కష్టపడినా ఫలితం లేదు. భగవంతుని పై భారం వేసి, ఏమి జరుగుతుందో చూడ్డం తప్ప చేయగలిగింది ఏముంది?
బాధగానే ఉంటుంది. గుండెను కూడదీసుకోండి. త్వరలోనే మీ బడి మళ్ళీ మొదలుపెడతారు.
దుర్గేశ్వర గారు: స్వానుభవం రీత్యా మీ ఆవేదన మాకు బాగా అర్ధమయ్యిందండి. పిల్లలతో అనుబంధం తెగిపోవటం చాలా బాధాకరం. మూడేళ్ళు నిండినా మేమింకా మర్చిపోలేదు. అలాంటిది మీకు ఏమని ఓదార్పు చెప్పగలం? జీవని గారు చెప్పింది కొంత పరిష్కారమార్గంగా కన్పిస్తుంది. ఆలోచించండి.
లెక్కలు సాచిన రాబందు లా కార్పొరేట్ విద్య పట్టణాలను దిగమింగి చివరికి పల్లెలవైపు ఎగిరి వచ్చిందన్నమాట. మీ చిన్నారి విద్యార్థులను సైతం ముక్కున కరచిపట్టుకుపోవడానికి, మీ పాఠశాల మూతపడటానికి కారణమైందన్నమాట!
బాధ పడకండి అని నేనూ చెప్పలేకపోతున్నాను. పిల్లలతో అనుబంధం తెంచుకోవడం ఎంతో కష్టం~!
పైన శ్రీకర్ గారు చెప్పిన మాట కూడా సమజసంగా ఉంది. ఒకేసారి అంతా ముగిసాక టపా రాయడం కంటే ముందే ఇలా జరుగుతోంది అని పంచుకుని ఉంటే ఎవరైనా ఏదైనా చేయడానికి ఆస్కారం ఉండేదేమో కదండీ!
ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి ధైర్యం రావడం లేదు. కానీ తప్పదు.
జీవని గారు చెప్పినట్లు ఏమీ చేయలేమా? ఆలోచించండి!
ఆర్యా! దుర్గేశ్వరరావుగారూ!
మీ జ్ఞాన సౌధానికి పునాది మీ పాఠశాల.
పునాది కొన్నాళ్ళే నిర్మాణ సమయంలో మాత్రమే కనిపిస్తుంది. ఆ తరువాత సౌధ నిర్మాణంలో అది కనిపించకుండా మరుగున పడుతుంది.
అలాగే మీ జ్ఞాన సౌధం పునాది దశను అధిగమించి; సౌధాకృతి సంతరించు కోవడానికి ఆ పరమాత్మ ఈ ఏర్పటు అనివార్యమై చేసి ఉంటాడు. మీ ధ్యాసమొత్తం తనే సోతం చేసుకో దలిచి ఇలా చేసుంటాడు.
అజ్ఞానాంధులు పడవలసిన హేయమై బాధను మీవంటి జ్ఞానులు పొందడం మా బోంట్లకు బాధాకరం.
ఐనా రానురాను కలి ప్రభావం పెరిగే రోజులే కాని తరిగే రోజులుదాకా మనమింకా చేరలేదు కదా!
ఆ జగన్మాత పాద పీఠమైన మీకు ఆనందామృత ప్రాప్తి తప్ప దుఃఖానిలం సమీపింపడానికైనా వీలు లేదు.
మాయలోనుండి బైట పడండి.
సత్య జ్యోతిని చూడండి. అనంత ఆనందమయుడైన ఆ పరమాత్మ విశాల నేత్రాలలోనే మీరు కోరుకొనే చిన్నారి బాలల చిఱునవ్వుల దొంతరలు మీకు కనిపించి ఆనంద సాగరంలో ఓలలాడిస్తాయి.
విచారం అజ్ఞానవర్ధిని.సంతోషం జ్ఞాన వర్ధిని.
కొంచెం నామాటలలో సత్యముందేమో ఆలోచించి; ఉందనుకుంటే నన్ను మన్నించి దుఃఖానికి దూరులై దైవానికి దగ్గరై ఆనందమయ జీవనం సాగింప మనవి.
ఈ నా మాటలలో సత్యం లేదనుకుంటే నన్ను మన్నించండి.
కౌటిల్య,శ్రీపతిగ రూ,శివగారూ, శీనివాస్ గారూ,రామనరసింహ గారూ,జగదీష్ గారూ ,అజ్ఞాతగారూ,అమ్మఒడిగారూ ,సుజాతగారూ ,రామకృష్ణారావుగారూ
మీ అభిమానానికి కృతజ్ఞున్ని మీ సహకారం ఎప్పుడు అవసరమవుతుందో ఆ జగన్మాత సంకల్పం .చూద్దాం
అయ్యో ఎంత పని జరిగింది? నేను ఊర్లో లేక పోవడం వలన ఈ రోజే చూశాను. భగవంతుడు మీకేదో తెలుపదలచాడు. ఇటువంటప్పుడు అన్వేషణే మన ప్రథమ కర్తవ్యం.
అసలు స్కూలు తెరువాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఉన్న మార్గాలేంటి? దానిలో ఔత్సాహికులు పాలుపంచుకునే ఏర్పాటు చేయగలరా? మొదలైన విషయాలు తెలుపగలరు.
ఇంకనూ మీరు ఉత్తమ విద్యను అందించుటకు కొన్ని ఫీజులు వసూలు చేయటం ( మీకు స్కూలు నడుపుటకు మిగతా మార్గాల ద్వారా డబ్బు సమకూరేదాకా ) సబబేనేమో.
శ్రీ దుర్గేశ్వర్ గారు,
ఇప్పటికైనా మించిపోయింది లేదు, నిజంగా మీ వానర సైన్యంని వీడలేక పోయినట్టైతే, తప్పకుండ ఆ హనుమాన్ ఏదో వొక దారి చూపించగలడు! అ నమ్మకం మాకుంది! మీ వైపు నుండి ప్రయత్నా లోపం లేకుండా ప్రయత్మించండి! అ రామదూత మిమ్మల్ని పరీక్షిస్తున్నాదేమో! ఆలోచించండి! మీ అనుభవం, మీ విజ్ఞత ముందు మీము చాల చిన్న వాళ్ళమైనా, స్పందించకుండా వుండలేకపోతున్నాము! ఆ రామదూత మళ్లీ మిమ్మల్ని మునుపటిలాగా తన వానర సైన్యం తో మీ సేవలన్డుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాము.
ప్రమీల
హైదరాబాద్.
Durgeswara garu,
It is very painful to see such a bad news.We should obey the decision of GOD,even if it is painful to us.But the service rendered/extended by you to the poor and innocent children will never go waste.TIME IS THE BEST JUDGE.Let us wait for GOOD.My suggestion is to run the school by getting donations from people who come forward voluntarily,by creating a corpus fund.I am confident that atleast 100 people can respond voluntarily for this proposal.WITH THE BLESSINGS OF LORD VINAYAKA,MY FAMILY MEMBERS ARE HAPPY TO CONTRIBUTE RS.20,000/-,FOR THE CORPUS FUND,within a month after hearing from you,about your decision/plan.I sincerely hope for GOOD thing to occur shortly with the blessings of ALMIGHTY.
Please let us know if you want to restart it. May be, if we can pool in some like-minded people we will be able to do something together
Post a Comment