శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అసలే పిల్ల కోతులు ..... ఆపై ఆంజనేయస్వామి దీక్ష

>> Wednesday, June 2, 2010



బాల్యానాం శతమర్కట: అన్నారు పెద్దలు . ఒక్కో పిల్లకుంక వందకోతులు సమానం అని. అందువల్లే పిల్లలెక్కడుంటే అక్కడ సందడి . చైతన్యం వెల్లువెత్తే ఈ వయస్సులో ప్రతిదాన్నీ పరిశీలించాలని ,ప్రతి విషయం తెలుసుకోవాలనే ఉత్సాహం పెల్లుబికుతుంది వారిలో. సృష్టించడమెలా అని ఆలోచిస్తారు, ఆలోపల ఉన్నదాని రూపాన్ని మార్చాలనుకునే ఆలోచనలవల్ల అన్నింటినీ ధ్వంసం చేస్తుంటారు . వాళ్లను అదుపులో పెట్టాలంటే తలప్రాణం తోకలోకొస్తుంది మనకు.
ఇక హనుమంతుని దీక్షలో విపరీతమైన మనోవేగం ,ఉత్సాహం మనసులో ఉరకలు వేస్తుంటాయి . మరి ఆయన పవనసుతుడుకదా! .ఆయన ఉపాసకులకు కూడా ఇదేస్థితి అనుభవమవుతుంది . ఇప్పుడు మన పీఠం లో హనుమత్ రక్షాయాగం సందర్భంగా పదిహేనుమంది పిల్లకోతులు[బ్రహ్మచారులు] దీక్ష తీసుకున్నాయి .అందులో నాలుగు ఆడపిల్లకోతులు కూడా . మామూలుగానే వాల్లను గోలచేయకుండా ఆపటం కష్టం. అలాంటిది ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి మాల వేసుకున్నారు. అరవటానికుండదు ,రెండు దెబ్బలు వే్యటానికుండదు . ఈవిషయం వాల్లకు బాగ తెలుసు తెలుసు . ఇక చూసుకోండి నా తంటాలు .

ఉదయం నాలుగుగంటలకే లేస్తారు .లేచిన తరువాత పీఠం ఆవరణ వంతులవారీగా శుభ్రం చేసేవారు , పూజాసామాగ్రి శుభ్రం చేయటం , పూలుకోయటం , పరివార దేవతా మూర్తులకందరకు అభిషేకం చేసి అలంకరణలు చేసేవారు ఎవరి పని వాల్లు టకటకా చేస్తారు. ఆ తరువాత మేము అర్చనలు చేసుకుంటూ హనుమంతులవారి దగ్గరకొచ్చి ఆయనకు ప్రత్యేకంగా అభిషేకం అరచన చేస్తుంటే బిగ్గరగా గొంతెత్తి స్వామిని స్తుతిస్తుంటారు. ఆతరువాత అందరూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షనలు పదకొండుసార్లు హనుమాన్ చాలీసా పారాయణం సాగిస్తారు.ఈ సమయంలో చాలా ఏకాగ్రతగా బుద్ధిగా ఉంటారు .
ఆతరువాత యజ్ఞశాలకొచ్చి కూర్చున్న తరువాతనుంచి ఉంటుంది నాపని . చక్కగా యాగం సాగుతుంటే వెనుకవాడు ముందు వాడిని గిల్లుతాడు . వాడు గొడవ , మధ్యలో మాట్లాడకూడదన్నారుగాని గిచ్చుకోవచ్చు కదా అని వీడు వాడిని గిచ్చుతాడు . మధ్యలో ఇంకొకడు పెద్దరికం వహించి సర్దుబాటు చేస్తాడు.
ఇలా లాభం లేదని చెప్పి నేను పారాయణం చేసుకునేప్పుడ్డు,జపం చేసుకునేప్పుడు గొడవ చేయకుండా ఉంటారని ,స్వాములూ ! మీరు ధ్యానం చేయాలి అని చెప్పి కూర్చోబెడతాను . ,కానీ లోకాన్నంతా తిరిగిచూడాలనుకునే ఆకళ్ళు మూతలపెట్టిఉంచగలరా ? ఒకడు మెల్లగా ఒక కన్నెత్తి చూస్తాడు . మాస్టర్ గారు స్వామి చూడటం లేదు అని నిశ్చయించు కున్నాక అక్కడున్న ఏ పుల్లముక్కో తీసుకుని ముందువాడి ని గుచ్చుతాడు వాడు కెవ్వున కేకబెట్టి సార్ స్వామీ ! ఈస్వామి నన్ను గిచ్చుతున్నాడు అని ఫిర్యాదు . లేదా నేను మాట్లాడననుకుంటే వాళ్లటీచర్ దగ్గరకు పరిగెత్తు కెళ్ళి చెబుతారు. ఇలా కాదని దూరదూరంగా కూర్చో బెట్టినా మెల్లగా ఒక కన్నుతెరచి చూసి ఏదో దగ్గరలే ఉన్న ఒక మట్టి పెడ్ద ,రాయి నో అవతలివాని కి విసురుతాడింకొకడు.
ఇలా కాదు గాని నూట ఎనిమిది సార్లు చాలీసా సంకీర్తనగా చేయమన్నామనుకోండి పరిగెత్తు కెళ్ళి తాళాలు డోలక్ తెచ్చుకుని ఉత్సాహంగా భజన చేస్తారు . వాళ్లకిష్టమైన రీతులలో స్వామికి ఇష్టమయ్యేలాగా పాడుతారు . [రెండు డోలక్ లను చెడగొట్టారు] .
ఇక మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని పంపితే చెట్లు పట్టుని వేలాడి కొమ్మలిరగ్గొడతాడొకడు . సార్ స్వామీ ! అంటూ పరిగెత్తు కొచ్చి కంప్లైంట్ ఇంకొకడు. స్వాములూ ! బాగా ఎండగా ఉంది ఎవరూ ఎండలో తిరగొద్దు చెట్లక్రింద పనుకోండి అని చెప్పి మధ్యాహ్నం కొద్దిగా కన్ను మూస్తాము . అదిగమనించి బ్యాట్ లు బయటకు తీస్తారు. వాళ్ల ఫోర్లు,సిక్స్ ల అరుపులతో మెలుకువ వస్తుంది. ప్రచండ భానుడి తాకిడికూడా వాల్ల ఉత్సాహాన్ని ఆపలేదు.
వరుసలలో కూర్చో బెట్టి వడ్డన జరుపుతున్నా కుదురుగా కూర్చోనివ్వడు వాళ్లలో ఉన్న స్వామి . మీకు చెప్పకపోవటమేమిగాని్ స్వామి పూజ చేసేప్పుడు ఎంత ఏకాగ్రతో ...... అల్లరిచేయటం లోనూ అదే ఏకాగ్రతనుకోండి పిల్లస్వాములలో .!

ఇలా పిల్లస్వాములచేత దీక్షచేపించటం .నాకు స్వామి పెట్టిన పరిక్షేననుకోండి !. కోపం రాకూడదు .వచ్చినా వాల్లను ఏమీ అనకూడదు . మధ్యలో ఏప్రమాదం తెచ్చుసుకుంటారో అని సంకోచం మనసును పీకుతుంటుంది . ఆ ! అయినా స్వామే ! వారిలో తాండవిస్తుంటే మన జాగ్రత్తలేమిటి అనే అలోచనే సంతోషం. ఇంకా ఐదు రోజులే మిగిలి ఉంది దీక్షలో .అయినా వారికి స్వామి పట్ల కలిగిన అచంచల విశ్వాసం , ప్రేమ ,భక్తి ,శ్రద్ధ లలో నూరో వంతైనా నాకున్నాయా ? అని మాత్రం నాపైనాకనుమానం కలుగుతున్నది.
జై హనుమాన్ .

3 వ్యాఖ్యలు:

Bapiraju Nandury June 2, 2010 at 8:43 AM  

మీ దీక్ష దిగ్విజయంగా కొనసాగాలని ఆ పవనసుతుడనే ప్రార్ధిస్తున్నాం.

Anonymous June 2, 2010 at 8:44 AM  

మీ దీక్ష దిగ్విజయంగా కొనసాగాలని ఆ పవనసుతుడనే ప్రార్ధిస్తున్నాం.

రాజేశ్వరి నేదునూరి June 2, 2010 at 1:02 PM  

మీరు పిల్ల స్వాముల మధ్యనున్నారు అంతకంటె అదృష్టం మరేముంది ?వాళ్ళూ బాల హనుమంతులు మీ దీక్ష దిగ్విజయం గా కొనసాగు తుంది. ఆనందంగా స్వామిని సేవించండి అదే బోలెడు పుణ్యం

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP