శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చెడుకర్మ ప్రబలంగా ఉన్నప్పుడు మనిషిని భగవంతుని ఆశ్రయించ నివ్వదని మరో మారు ఋజువయ్యింది .

>> Friday, June 4, 2010

ఇక్కడ రాముడు పాలెం తండాలో అంజయ్య నాయక్ అనే నా పాత శిష్యుడున్నాడు .వాడిప్పుడు బీఈడీ చేసి నాతో పాటు మామండలం లోనే టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చాలారోజులుగా వానిని హనుమద్దీక్షతీసుకోమని చెబుతున్నాను . ఈ మధ్య కాలం లో వాడు చెప్పే సూచనలను అనుసరించి ఎందుకో ఏదో కష్టం రాబోతున్నదనిపించి పాఠశాలల ముగింపుకు ముందు వాడు కనపడ్డప్పుడు ఈసంవత్సరం పరిస్థితులంతగా బాగాలేవుకనుక ఈసంవత్సరం దీక్ష తీసుకో సర్వత్రా రక్షణ అని చెప్పాను . నాకు మాల వేసుకోవాలని చాలా కోరికగా ఉంది సార్ . కాకపోతే ఇంటికాడ సరిగా కుదరదనిపిస్తుంది. నేను మాలవేసుకుంటే అందరిలాకాదు కరెక్ట్ గాచేయాలి ..........అని ఏదో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. చూడు అంజీ ! ఎవరుసరిగా చేయటం లేదని అనుకుంటున్నావు ? ఎవరైనా ప్రయత్నం మొదలెడితే కదా ఆ పని సక్రమంగ చేస్తున్నారా లేదా అని తెలిసేది. ముందు ముచ్చట్లాపి దీక్ష మొదలెట్టు . ఎప్పుడో చేయాలనే బద్దకం ఇలాంటి ముచ్చట్లు తెప్పిస్తుంది . అలా అలసత్వం మొదలైతే సంకల్పాలు మరుగునపడిపోతాయి అని హెచ్చరించాను . లేదుసార్ ఈసారి చూడాల్సిందే అంటూ వెళ్ళిపోయాడు. సరే వాడి చెడుకర్మ వానిని భగవంతుని వైపు నడవనివ్వటం లేదు అనుకుని మిన్నకున్నాను.

మొన్న ఉదయం వచ్చాడు . ఇప్పుడు హనుమత్ రక్షాయాగం లో దీక్షలో ఉన్న, వాళ్ళ చుట్టాలబ్బాయి శివాజీనాయక్
గురించి మాట్లాడాలని వచ్చాడు. సార్ ! పూర్ణాహుతి కి మావాడు ఏమి తెచ్చుకోవాలో వాళ్ల నాన్న అడిగిరమ్మని పంపాడు అన్నాడు . ఆలాగే మా చుట్టాలంతా వస్తారు అని మిగతా విషయాలు అవి ఇవి అడిగాడు . మరలా నేను మాలవేసుకోవాలంటే ......అంటూ పాత పాట పాడాడు. ఆసమయం లో మేమంతా ఉపాహారం స్వీకరిస్తున్నాము . సరే ప్రసాదం తీసుకుని వెళ్ళుస్వామీ ! అని చెప్పినా కాదు స్వామీ నాకోసం రోడ్డుమీద మనుషులు నిలబడి ఉన్నారు అంటూ హడావుడిగా వెళ్ళాడు . ఏమి తొందరైందిరా వీనికి అనుకున్నాను.

ఈ తండా వాసులంతా పరదాపట్టలు[పంట నూర్పిడులకు వాడేవి] తయారు చేసుకుని రాష్ట్రంలోను,కర్ణాటకలోనూ పలుప్రాంతాలలో అద్దెలకిస్తూ సీజన్లలో తిరుగుతుంటారు. ఆ సాయంత్రానికి తెలిసిన ఘోరమైన విషయం పరదాలు తీసుకుని వెళుతున్న అంజయ్యనాయక్ వాళ్ల అమ్మా నాన్న ఉన్న ఆటోను దేవరకొండ దగ్గర ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొని ప్రమాదం సంభవించింది అని తెలిసింది. వాళ్ల అమ్మా నాన్నలకు తీవ్రగాయాలయ్యాయట .క్షత గాత్రులను హైదరాబాదుకు తరలించారు అని. వెంటనే ఇక్కడనుండి జనం బయలుదేరి వెళ్లారు . విషయం తెలిసి నేను ఫోన్ చేసి ప్రయాణం లో ఉన్న అంజయ్యనాయక్ కు ధైర్యం చెప్పాను . వాడు ఏడుస్తూ మా అమ్మకు ప్రమాదంగా ఉందట సార్ . మా అమ్మకు ఏమీ జరగకూడదని ప్రార్ధించండి సార్ . మా అమ్మ క్షేమంగా ఉంటే నేను వెంటనే స్వామి దీక్ష తీసుకుంటాను సార్ .అని దు:ఖ పడుతున్నాడు . ఏమీ కాదు > స్వామిని ప్రార్ధించు ,ఆయన అండగా ఉండగా దు:ఖాలు రావు అని ఓదార్చాను . ఆరాత్రి వారి ఆదంపతులకు ఏ ప్రమాదం రాకూడదని చాలీసా పారాయణం చేశారు దీక్షాధారులంతా . ఉదయం ఫోన్ చేయగా మా నాన్నకు పరవాలేదు సార్ . అమ్మకు కాలు విరిగింది .మెదడులో రక్తం గడ్డకట్టి చిన్న చుక్క ఏర్పడింది .అది పెరగకపోతే ఇబ్బందిలేదు అంటున్నారు డాక్టర్లు . అని చెప్పాడు , ప్రమాదం తప్పినందుకు సంతోషించాము .

ఇక్కడ ఈ పిల్లవాని భావనకు నాకు నవ్వు వస్తుంది . మనం దీక్షనో ,పూజో ,యాగమో చేస్తే సంతోషిస్తాడు . అనుకుని చేయకపోతే కోపగిస్తాడనే అపోహ వీళ్ళ మనసులో గూడుకట్టుకుంది .వాస్తవానికి చెడు కర్మ ప్రబలంగా ఉన్నప్పుడు అది మనకు మానసికంగానో, భౌతికంగానో ఘాతాలు కలుగ జేస్తుంది. మనం చేసిన మంచికర్మల ఫలితాలు ఈసమయంలో అండగా ఉండి భగవంతునిని ఆశ్రయించమని ప్రేరేపిస్తుంది. ఏదో ఒక రూపేణా మనకు సందేశం అందుతుంది . కానీ చెడుకర్మ బలీయంగా పనిచేస్తే బుద్ధి సక్రమమైన నిర్ణయం చేయలేదు ,ప్రమాదం వచ్చి మీదపడ్డాకకాని మనకు విషయం అర్ధంకాదు. ..
అలాకాక మనం ప్రయత్నం చేత భగవంతుని ఆశ్రయిస్తే ఆయన రక్షణలో ఈ వచ్చే చెడుఫలితాలు దాటగలుగుతాము.

2 వ్యాఖ్యలు:

శ్రీవాసుకి June 5, 2010 at 5:28 AM  

బాగుంది. "చెడుకర్మ ప్రబలంగా ఉన్నప్పుడు మనిషిని భగవంతుని ఆశ్రయించ నివ్వదని మరో మారు ఋజువయ్యింది " మీరన్న ఈ మాట అక్షర సత్యం.

రాజేశ్వరి నేదునూరి June 7, 2010 at 4:50 PM  

బాగుంది మంచి విషయం చెప్పారు మనకు మంచి బుద్ధి పుట్టాలన్నా మన ఖర్మ తొలగాలి భగవంతునిపై మనసు మళ్ళాలి మన ప్రయత్నము వలననె మంచి బుద్ధి పుడుతుంది అందుకు కృషి చేయాలి .మంచైనా చెడు ఐనా మన ఖర్మ ని అనుసరించె ఉంటుంది " బుద్ధి ఖర్మాను సారిణి " అన్నారు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP