హనుమంతుడొక్కడు బ్రతికుంటే చాలు మనమందరమూ బ్రతికినట్లే...
>> Friday, May 28, 2010
సంగ్రామంలో ఇంద్ర జిత్తు యుద్ధరంగం లో ప్రవేశించాడు. ఆతని దివ్యాస్త్ర సంపద గూర్చి తెలిసిన విభీషణుడు భయపడుతున్నాడు. ఘోరయుద్ధం ప్రారంభమైంది. విజృంభించిన రావణసుతుడు వివిధ అస్త్రాలతో విరుచుకపడ్డాడు శత్రుసేనలపై విరుచుకపడ్డాడు . అరవై ఏడు కోట్ల వానరులు మరణించినవారు,తీవ్రగాయాలపాలైనవారు ,ఎముకలువిరిగి కూలినవారు,మూర్చనొందినవారు భీభత్సంగా తయారైంది యుద్ధరంగం. సాక్షాత్తూ రాముడే లక్ష్మణునితో ఈరోజు వీనిని యుధ్ధంలో నిరోధించలేము అని చేతులెత్తివేసినాడు. ఈతని ప్రభావాన్ని అంచనా వేసిన విభీషణుడు ముందుగనే పక్కకుతప్పుకున్నాడు. ఎదిరించి నిలచినవారిలో హనుమంతుడొక్కడే స్మృతి కలిగి ఉన్నవాడు. విజయగర్వంతో ఇంద్రజిత్తు వెనుదిరిగిన తరువాత పరిస్థితి చక్కదిద్దటానికి విభీషణుడు ,హనుమంతుడు యుద్ధరంగమంతా కలియదిరుగుతున్నారు. ఒకచోట పూర్తిసృహలోకి రాలేక పడిఉన్న జాంబవంతుని చూశారు. విభీషణుడు ఆందోళనగా తాతా! ఎలా ఉన్నావు అని పలకరించాడు .ఆయన కనురెప్పలు ఎత్తలేక నాయనా గొంతును బట్టి నువ్వు విభీషణుడవని పోల్చుకుంటున్నాను అన్నాడు. ఆయన అవును తాతా నేను విభీషణుడనే నమస్కరిస్తున్నాను అన్నాడు
హనుమంతుడు క్షేమముగా ఉన్నాడుకదా అని అడిగాడు ఆ వృద్ధయోధుడు
ఆశ్చర్యపోయాడు విభీషణుడు. అదేమిటి తాతా ! నీవు శ్రీరాముని క్షేమాన్ని అడగలేదు ! లక్ష్మణుని గూర్చిగాని కనీసం వానర ప్రభువైన సుగ్రీవుని క్షేమమునుగూర్చి కూడా అడగలేదు ...కానీ హనుమంతుని గూర్చి ఇంత ఆందోళన చెందుతున్నావు. ఈ గాయాలతో మతిచలించ లేదు కదా ? అని ప్రశ్నించాడు .
నాయనా ! వాని శక్తి నీకు తెలియదు . హనుమంతుడు ఒక్కడు జీవించి ఉంటే చాలు మనందరమూ రక్షింపబడతాము. అతను మరణించి మనమందరమూ బ్రతికినా మరణించినవారి క్రిందే లెక్క ! అన్నాడు.
ఆమాటలు విన్న హనుమ వెంటనే ఆయన పాదాలు తాకి తాతా ! హనుమ నీకు నమస్కరిస్తున్నాడు అని , పలికాడు.
హనుమా ఈ కష్టకాలంలో ఇంకా ఆలస్యం చేయకు . ఉన్నపలంగా బయలుదేరి ఉత్తరదిక్కుగా వెళ్ళి క్రౌంచపర్వతం అవతల ఉన్న సంజీవనీ పరవతం మీద ఉన్న ఔషధులను తెమ్మంటాడు . ఆయన సూచనననుసరించి అతి వేగంగా వెళ్ళి హనుమ ఆ మూలికలను గుర్తించలేక పర్వతం తో సహా పెకలించుకుని వస్తాడు. వానరులను పునరుజ్జీవులను చేసి స్వస్థత పరుస్తాడు.
{ ఈ రోజు పీఠానికి వచ్చిన మన బ్లాగర్ చెనికల మనోహర్ [న్యూజింగ్స్]ఈ విషయమై చర్చజరిపి హనుమంతుని ప్రభావాన్ని గూర్చి మాట్లాడుతుంటే స్వామి మహిమ కదా అని వ్రాసి ఇక్కడుంచుతున్నాను , జై హనుమాన్ .]
3 వ్యాఖ్యలు:
బాగుంది మంచి విషయం తెలియ జెప్పారు ధన్య వాదములు.
కనురెప్పలు ఎత్తడానికి కూడా శక్తిలేని జాంబవంతుడు, ఇన్ని మాటలు మాట్లాడాడనటం ఆశ్చర్యంగా అనిపించింది. హనుమంతుడు, తను చిరంజీవులు అంటే చావులేని జాంబవంతుడికి తెలియకపోవడం కూడా వింతగా వుంది. ఇవి కవి వ్రాసిన అతిశయోక్తులు అయివుంటుందంటారా?
హనుమంతుడు, జాంబవంతుడు జన్మతః చిరంజివులా? లేక ఎవరైనా దేవతల వరాల వల్ల చిరంజీవులయ్యారా? రెండవదే సరైనది అనుకుంటే ఆ వరం వారికి రామరావణ సంగ్రామం తర్వాత వచ్చిందేమో?
Post a Comment