శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగవన్మయం కాని విద్యకు పరిపూర్ణత ఎలా వస్తుంది ?

>> Thursday, May 6, 2010


లోకంలో ప్రతికళనూ భగవదంకితం చేసినప్పుడే దానికి పరిపూర్ణ సార్ధకత లభిస్తుందనేది మన పూర్వీకులు నిరూపించిన సత్యం.
సురలోకంలో మహా గాయకులని పేరొందిన నారద,తుంబుర మహర్షు లిరువురకు ఒకసారి గానవిద్యలో ఎవరు గొప్ప అనే పోటీ ఏర్పడింది. నేను గొప్ప అంటే నేనుగొప్ప అనే వాదనమొదలైంది.
తమతమ గానప్రావీణ్యం పట్ల ఇద్దరికీ అచంచలమైన నమ్మకం .సంగీతసముద్రం లో లోతులు అంచులు చూసిన గానకళాకోవిదులాయె ! మరి. వాదన తీవ్రమై ఎవరుగొప్పో తేల్చుకోవాలన్న పట్టుదల పెరిగింది . సరే మరి ఈవిషయం లో న్యాయ నిర్ణేత ఎవరు అని ఆలోచించి దేవతలనందరినీ న్యాయనిర్ణేతలుగా ఉండమని కోరినా అందరూ తమకా సామర్ధ్యం లేదని తప్పుకున్నారు . చివరకు లీలానాటక సూత్రధారి పరమాత్మ శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరింది తగాదా .
ఆయన ,నాయనలారా మీ ఇరువురి పోటీలో న్యాయనిర్ణయం చేయగలవాడు ఒక్కడే వున్నాడు . అతడు హనుమంతుడు .గంధమాధన పర్వతం పై ఉన్నాడు వెళ్లి అతనిముందు మీరు మీ సందేహాలకి సమాధానం పొందవచ్చు అని సూచించాడు.
ఇద్దరు వెంటనే గంధమాధన పర్వతం చేరుకున్నారు . అక్కడకు వెళ్ళేసరికి ప్రకృతి పులకించిపోతున్నది .,హనుమంతుడు చేస్తున్న రామనామ గానానికి .హృదయమంతా రామమయమై ,గానంతో ప్రకృతిలో అణువణూవునూ రామనామరస జగత్తులో ఓలలాడిస్తున్న హనుమంతుని గానానికి మహర్షులిరువురూ మైమరచి బాహ్యస్మృతి కోల్పోయి తన్మయులైపోయారు. ఆయన గానం ఉచ్ఛ స్థితికి చేరుకునే సరికి అక్కడున్న రాళ్లు కరిగి ప్రవహించటం మొదలెట్టాయి. హఠాత్తుగా గానమాపిన హనుమంతుడు నారద తుంబురులచేతులలోని వీణలను లాక్కుని ఆ ప్రవాహం లోకి విసిరాడు . అంతే గానమాపగనే ప్రకృతి లో జడపదార్ధలన్నీ తమ స్వగుణం లోకి మారాయి వీరిరువురి వీణలు ఘనీభవించిన ఆరాళ్ల మధ్యలోనే ఉండిపోయాయి .
అప్పుడు స్వామీ ! మీరొస్తున్న కార్యక్రమ సందేశం ప్రభువు ఆజ్ఞానుసారం నాకర్ధమైంది . ఇప్పుడు ఆ ఘనీభవించిన రాళ్లను మీ గానంతో కరిగించి ఎవరు ఆ వీణలను తీయగలరో వారే గొప్ప అని ప్రకటించాడు .
వీరివురూ తమ తమ విద్యాప్రదర్శనచేసి ముల్లోకాలు ఆశ్చర్యచకితులయ్యేలా చేయగలిగారు . కానీ రాళ్ళను కరిగించలేకపోయారు. వాస్తవానికి వారిరువులు మహా భక్తులే . కాని భక్తుడు తనకున్న విద్యను భగవదర్పితం చేసినప్పుడు వినయం వివేకం పెరుగుతాయి . కానీ వ్యక్తిగతమైన అహంకారమనే ,తమస్సు మనస్సును అవరించుకుంటే ,భగవత్ కృపారసం వారిపై ప్రసరించుట ఆగిపోతుంది . అదే ఇక్కడ సంభవించింది . భగవదర్పితమైన తమ గానవిద్య పట్లచేసిన అపచారం తెలుసుకున్న మహర్షులిరువురు తమ తప్పిదం గ్రహించి హనుమంతుని శరణువేడారు .తమ వీణలను తమకిప్పించమని .
మరలా రామనామ గానంతో శిలలను కరిగించిన హనుమంతులవారు వారి వీణలను వారికి తీసి ఇచ్చారట.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP