అపార ఐశ్వర్యమున్నా, కోరినతిండి కడుపునిండా తినలేకపోవుటకు కారణమేమిటి?
>> Saturday, April 10, 2010
సత్పురుషులకు భోజనం పెట్టుటవలన సాధకునకు ఆయుర్ధాయం లభించును. అనగా సాధకునకు మరికొన్నిసంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతే కాకుండా వారు సంతుష్టులయినప్పుడు శాంతి,పుష్టి,తుష్టి, ఐశ్వర్యము మొదలయిన వాటికి సంబంధించిన భోగ,యోగస్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును .,కాలాంతరములో అవ్యక్తమునందలి బీజములు వ్యక్తిస్థితిలో అంకురములై ,మహా వృక్షములై విరాజిల్లుచున్నవి. ద్రౌపది మాతనుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించి న శ్రీకృష్ణపరమాత్మ దుర్వాస మహర్షికిని అతని పదివేలమంది శిష్యులకును కడుపునిండా భోజనము అనుగ్రహించాడు.
ఒకసారి శ్రీకృష్ణులవారు సుధాముడు దర్భలకోసం అడవికి పోయిరి .అలసిపోయిన కారణమున సుధాముని ఒడిలో తల ఉంచి స్వామి నిదురించాడు.శ్రీకృష్ణునకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమమునుంచి తెచ్చుకున్న అటుకులను తినుచుండెను . కపట నిద్ర నటిస్తున్న స్వామి ,సుధామా! ఆకలగుచున్నది ,ఇంటివద్ద నుంచి వచ్చునప్పుడు గురుపత్ని ఏమైనా తినుటకు ఇచ్చినదా ? అని అడిగాడు. లేదు ! అని సుధాముడు బదులిచ్చాడు. నువ్వేదో నములుతున్నట్లున్నదే అన్నాడు ఆలీలామానుష విగ్రహుడు. నేను విష్ణుసహస్రనామములను చదువుచున్నాను అని సుధాముడు కప్పిపుచ్చుకున్నాడు. అవునా ! వచ్చునప్పుడు మనకు తినుటకని గురుపత్ని అటుకులను నీకు ఇచ్చిపంపినట్లు ,అవి నీవొక్కనివే భుజిస్తున్నట్లు కలవచ్చినదే ? అన్నాడు జగన్నాటక సూత్రధారి.
"శ్రీ కృష్ణా ! అలసియుంటివిగదా ! అందులోనూ పగటి నిద్ర .ఈవేళలో వచ్చు కలలకు ఫలితములుండవని శాస్త్రములు చెబుతున్నవి " అని సుధాముడునమ్మ బలికాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకునెను.
కాలాంతరమున కుచేలుడు [సుధాముడు] పరమ నిర్భాగ్యుడయ్యెను. తనవెతలు బాపుమని ఎన్నియో మారులు విష్ణుసహస్రనామములను పఠించెను .ఆఖరికి శ్రీకృష్ణులవారికి దయగలిగినది. కుచేలునినుండి అటుకులు స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యమును ప్రసాదించెను. తాను అలసిపోయినప్పుడు ఒడిలో తల ఉంచి నిదురపోయేందుకు అవకాశమిచ్చిన కుచేలునికి హంసతూలికా తల్పం మీద పరుండబెట్టి పాదసేవను చేశాడా భక్తవల్లభుడు. కర్మసూత్రమెంత నిగూఢముగా పనిచేస్తుందో ప్రభువు ఈలీలలో చూపాడు.
అందుకే ఇప్పుడు అపార ఐశ్వర్యం కలిగి కూడా కోరినది తినుటకు అవకాశం లేని వారు[వివిధవ్యాధులు,కారణాలు] పూర్వజన్మలో విశేషమయిన పుణ్యకార్యములుచెసినా, అన్నదానం చేసి ఉండనందున ఈజన్మలో తృప్తిగా భుజించే అవకాశం చిక్కటం లేదని పెద్దలంటారు. ఎవరికైనా దానములు చేసినప్పుడు ఏసంపదను ఎంత ఇచ్చినా చాలు అనరు.
ఒక్క అన్నదానంలోనే తృప్తిగా భుజించి ఇంకచాలు అంటారు. గ్రహీతకు సంపూర్ణతృప్తి కలిగినదాకా దాతలుచేయగలిగిన దానం ఇదొక్కటే .
1 వ్యాఖ్యలు:
తన కున్నది ఇంకొకళ్ళ తో పంచుకో లేక పోతే ప్రక్రుతి ప్రసాదించేది మీరు చెప్పినదే. అందులో ఉత్కృష్ట మైనది ఇంకొకళ్ళ ప్రకృతి సహజమయిన ఆకలి తీర్చటం. అది చెయ్య లేక పోతే ఎంత కలిమి ఉన్నా అర్ధాకలి తో బ్రతకతమే. అందుకనే మన ఆచారాలలో సంతర్పణలు పెట్టారు. తెలిసినా తెలియక పోయినా మనచే అన్న దానం చేయించటానికి.
రామకృష్ణ
Post a Comment