శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మనసున రాముడున్నంతకాలం మానవత్వం మిగిలిఉంటుంది .

>> Tuesday, March 23, 2010






రాముడు సుగుణాభిరాముడు . స్వయం గా భగవంతుడైనా ఈ అవతారంలో తన భగవత్తత్వాన్ని పక్కనుంచి సంపూర్ణమనవుని లక్షణాలను ఆచరణాత్మంగా చూపించి మనిషిలో మానవత్వం మిగిలి ఉండాలంటే మనుషులెలా నడుచుకోవాలో చూపించాడు . మనుషులు మనిషితత్వాన్ని మిగుల్చుకోవాలంటే ఆయనను అనుసరించాల్సిందే . ఆయనను భగవంతునిగా గుర్తించలేని గుడ్డితనం మన మనసులను కమ్మేసినా మనిషిగా ఎలానడుచుకోవాలో ఆయనచరితద్వారా తెలుసుకోగల అవకాశం ఉంది.

రాకుమారుడుగా పుట్టి క్షత్రియోచితమైన బాధ్యతలను నెరవేరచటానికి పసితనంలోనే బయలుదేరటం ,గురువును అనుసరించటం ,ఋషులను గౌరవించటం ద్వారా మన పిల్లలు ఎదిగేవయస్సులో నేర్చుకోవాల్సిన లక్షణాలివి .
ఇక ఆయన జీవితంలో కెళ్ళీనకొద్దీ రత్ననిధులవంటి శుభగుణాలు లభ్యమై జాతి ఆ అపురూపసంపదను అందిపుచ్చుకుంటూ సాగుతున్నది యుగాలుగా .

పొద్దుటే సకలసామ్రాజ్యవైభోగ సంపదలు తనకు సంక్రమించనున్నాయి. ఆసమయంలో బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడుపుతున్నాడు . విధి నిర్ణయం వేరుగాఉంది. అర్ధరాత్రికి పరిస్థితులు మారిపోయాయి . పట్టాభిషేకం చేస్తామన్న వారే పట్టుబట్టలు త్యజించి అడవులకేగమని ఆజ్ఞఇచ్చినట్లు తెలుసుకుని కూడా ఆయనమోములో ఏమాత్రం మార్పులేదు అదే ఉల్లాసం . పామరునిలాగా , నాకిస్తామన్న ఆస్తి వేరొకరికిస్తావా ? అని తండ్రితో తగాదకు దిగలేదు. ఆవేశపడ్డ తమ్మునికూడా శాంతపరచి "ఈశరీరం తండ్రివలన సృష్టించబడినది కనుక దీనిపై సంపూర్ణహక్కులు తండ్రికున్నవని వివరించి పితృవాక్యపరిపాలనకై అడవులకేగాడాయన.
ఇక తనకు సంబంధలేకపోయినా ఈ విషయంలో అన్నకు జరిగిన అన్యాయానికి అవేశపడటమేకాదు ,అన్నకులేని సుఖం తనకక్కరలేదని ఆయనవెంట నదచిన లక్ష్మణుడు ,సవతికొడుకు అనిచూడక అన్నదమ్ములమధ్య ఉండాల్సిన ప్రేమ బంధాన్ని బలపరుస్తూ వెళ్లమని ఆజ్ఞాపించిన సుమిత్ర , అందుకు అంగీకారం తెలిపిన ఊర్మిళాదేవిల త్యాగం మానవాళికి ఆదర్శం .
తనహితుడు భక్తుడైన గుహుని తన కౌగిలితో పులకరింపజేసి గౌరవించిన రాముని దీనజనబాంధవత్వం చెప్పనలవికానిది .
ఇక ఇద్దరుభాగస్తులు అడవికెళ్ళారు. తల్లి ఏ ఆటంకం లేకుండా రాజ్యసంపద తెచ్చి చేతిలో పెట్టింది . కానీ భరతుడు తన తల్లి చేసినపని అసహ్యించుకుని ,నా అన్నకులేని సంపదలు నాకక్కరలేదని పరుగున పోయి రామపాదాలపైవాలి అయోధ్యకు రమ్మని ప్రార్ధించాడు . ఆహా ! ఏమిత్యాగమూర్తులువారు. ఎలాపొగడగలం ? చిన్నచిన్న భాగాలకోసం కత్తులు దూసుకుని ముఖాలుకూడా చూసుకోని ఆసురీభావాలుగల అన్నదమ్ములు ఈపండుగనాడైనా రామకథలో ఈ సన్నివేశాన్ని గుర్తుతెచ్చుకున్నా మరలా కలుస్తారు. అందుకే లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు , "భార్య ఏదేశం లోనైనా దొరుకుతుంది ,తోడబుట్టినవాడు మరలా లభిస్తాడా" అని విలపిస్తాడు శ్రీరామచంద్రుడు. ఇవినేర్పగలిగారు గనుకనే మనలో ఇంకా అన్నదమ్ములమధ్య అనురాగాలు మిగిలున్నాయి.

అడవికి బయలుదేరేప్పుడు భార్యను నావెంటరా ? అని ఆజ్ఞాపించలేదు .నువ్వు ఈకష్టాలు పడలేవు ఇక్కడో లేక మీపుట్టింటిలోనో ఉండమంటే ఆతల్లే " నేనెలా కనపడుతున్నాను ? భర్తకు సంపదలున్నప్పుడు వెంటనుండి ,కష్టసమయంలో వదలివెల్లటానికి " అని ఆగ్రహంతో అడిగి నాభర్త ఎక్కడుంటే అదే నాకు పరమసుఖమైనప్రాంతమని చెప్పి ఆచరించి నేటికీ కోట్లాదిమంది భారతస్త్రీలకు ఆదర్శప్రాయమై వెలుగొదుతున్నది ఆమహాసాధ్వి. భర్త ఎక్కడున్నాడో తెలియదు . భయానికి ,ఆశలకు ,పరపురుషుని సంపదకు ఆశపడక కేవలం గడ్డిపోచను అడ్డుపెట్టి అంతశక్తివంతుని నిరోధించి పాతివ్రత్య శక్తిని చాటి తరతరాలకు మార్గదర్శకత్వం వహిస్తున్నది నేటికీ అంతర్గతంగా.
తనభార్య దూరమైతే నిజమైన ప్రేమగల భర్త ఎలావిలపిస్తాడో చెట్టునూ ,పుట్టనూ పట్టుకుని దు:ఖితుడవుతున్న రాముని చూస్తే తెలుస్తుంది.

మిత్రత్వాన్ని నెరపిన సుగ్రీవునికోసం బలవంతుడైన వాలిని చంపాడు. నన్నడిగితే ఆ రావణున్ని తెచ్చి నీ కాల్లముందు పడవేసేవాన్ని కదా ? ఇలా చేసావేమి ? అని చావుబ్రతుకులమధ్యలో ప్రశ్నించిన వాలికి ,ధర్మమేమిటో తెలియజెప్పాడు రాముడు. అంతేగాని తన లక్ష్యం కోసం అధర్మానికి పాల్పడలేదు.
తనశక్తిని అజ్ఞాతంగా ప్రసరింపజేసి హనుమంతుని అనుగ్రహించి భగవత్తత్వమేమిటో చూపాడు.
శరణువేడిన విభీషనునికి అభయమిచ్చి .రావణుడనావచ్చివేడితే అతనికికూడా రక్షిస్తానని ప్రకటించిన దయాహృదయుడు ,క్షమాగుణానికి నిలువెత్తు నిదర్శనం స్వామి.

యుద్దంలో గెలిచాక " అన్నా ! అయోధ్యకంటే ఈ లంకావైభోగం చాలాగొప్పది ఇక్కడే ఉందామా ? "అని సూచించిన తమ్ముని తో జననీ జన్మ భూమిశ్చ.........................అని మాతృభూమి గొప్పతనాన్ని వివరించిన దేశభక్తులకు ఆదర్శమయ్యాడు. లోకం ది నరం లేని నాలుక కనుక తనలో దు:ఖాన్ని దాచుకుని తనభార్య శక్తి పట్లగల సంపూర్ణవిశ్వాసంతో "ఆతల్లి గతం లో లక్శ్మణుని అనుమానించి వేదన కలిగించిన పాపం పోయేలా" మాటలాడి అగ్నిపరీక్షకు గురిచేశాడు.

రాజు ఏమైనా చేయొచ్చు అనే అహంకారం కూడదు ,పరిపాలకులు జనాభీష్టం కోసం తన సుఖాలను ,కూడా త్యాగం చేయాలని ,జనంమాటే ప్రభుత్వం బాట అని చూపిస్తూ . కట్టుకున్న భార్యను సైతం కారడవులకు పంపాడు .అదీ పాలకునికుండవలసిన లక్షణం/ అంతనిబద్దతగా బ్రతకగలిగేవాళ్ళు పాలకులైతే రామరాజ్యమే . నిత్యకల్యాణం పచ్చతోరణమే జనజీవితాన .

[రామాయణం ఇరువది నాలుగు వేల శ్లోకాలతో విస్తరిల్లినదని గాయత్రీ మంత్ర శక్తి సంకేతమని చెబుతారు. అలాచూస్తే మూలమైన వాల్మీకిరామాయణం లో రామ చరితలో ఎక్కడా మచ్చలేదు. అయితే ప్రక్షిప్తాల ను చొప్పించి అవాల్మీకమైన కథలను జొప్పించి వాటిద్వారా రాముని చరితపై బురదచల్లాలనుకున్నవాల్ల ప్రయత్నాలన్నీ ఆకాశం మీద ఉమ్మువేసినచందంగా తయారవుతున్నాయి.]

రాముని దేవునిగా పూజిచతానికి అభ్యంతరమైనా పరవాలేదు కానీ ఆయన చరితలోని ఈ సుగుణాలను అందుకునే లక్షణాలను కోల్పోతే మనిషిలో మానవత్వం మిగలదు . ఇప్పటికే రాముని దివ్యగుణాలంటే భయపడే ఆసురీ శక్తులవిజృంభణతో కొత్తతరాలు ఈ సుగుణాలకు దూరమవుతున్నాయి. దానితోపాటు పెరుగుతున్న అనర్ధాలను మన తరం లోనే కల్లారా చూస్తున్నాము . ఇప్పటి కైనా మేల్కొని రామకథను మనబిడ్డలకు బోధిద్దాము వాల్లు మనుషులుగా ఎదగటానికి ,మానవత్వం మిగలటానికి

అదే మనం జరుపుకుంటున్న శ్రీరామనవమి ఉత్సవానికి నివేదించే పుష్పాంజలి .



5 వ్యాఖ్యలు:

Unknown March 23, 2010 at 11:11 AM  

శ్రీరామనవమి సందర్భంగా మీకు నా హృదయ పుష్పాంజలి!

చిలమకూరు విజయమోహన్ March 23, 2010 at 2:33 PM  

శ్రీరామనవమి శుభాకాంక్షలు.

రేణూ కుమార్ March 23, 2010 at 10:39 PM  

దుర్గేశ్వర్ గారికి నమస్సులు, మీకు కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

- రేణూ కుమార్

కోడీహళ్ళి మురళీ మోహన్ March 24, 2010 at 3:20 AM  

శ్రీరామనవమి శుభాకాంక్షలు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ March 24, 2010 at 9:48 AM  

జై శ్రీరాం. భగవద్భక్తులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP