శ్రీరామ చంద్రుని ధర్మ బాణం
>> Friday, March 19, 2010
ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా దుర్మార్గులను శిక్షించి "మన "వంటి సన్మార్గులను రక్షిస్తానని వాగ్దానం చేసినందువల్ల భగవంతుడికి మరలా మరలా అవతరించక తప్పటం లేదు. దేశమంతటా రామాలయాలలో రామాయణ కథాగానాలతో మనహృదయాలు కృతజ్ఞతతో పరవళ్లు తొక్కుతాయి. కానీ రాముడు ,ఆయన కథ ద్వారా వాల్మీకి మహర్షి మనకు ధర్మాన్ని తెలపాలని .మనంధర్మమార్గాన నడచి తరించాలని ఆశించారు. .అలాచేసిననాడే మనం జరుపుకునే శ్రీరామనవమి ఆ ధర్మవిగ్రహుడికి ,మహర్షికి సంతోషాన్నిస్తుంది.
లోకహితం కోసం తపస్సు ,యజ్ఞము ,శిష్యశిక్షణా చేసే ఋషులను పోషించటమ్ రాజధర్మము .కానీ పుత్రవ్యామోహం తో యాగరక్షణకోసం విశ్వామితృనివెంట రామున్ని పంపటానికి దశరథుడు ఇష్టపడలేదు. తన బిడ్దను బ్రహ్మర్షి విశ్వామితృడు రక్షించగలడన్న విశ్వాసాన్ని కూడా మమకారం కప్పివేసింది .చివరకు వశిష్ఠులవారి ఆజ్ఞకు తలొగ్గిమాత్రమే రాముణ్ణి పంపాడు . బ్రహ్మవేత్తలైన గురువుల ఆదేశానికి తలొగ్గటమే మన కర్తవ్యమని రాముడు గమనించాడు.
ఈ చివరి వాక్యం మినహా మిగిలిన వాక్యాలన్నీ మనకు అనుభవమే. నిత్యము రాముణ్ణో సాయిరామున్నో " నీవే తల్లివిదండ్రివి ,నాసర్వస్వమూ " అని స్తుతిస్తుంటాము. మన ఇంద్రియాలను, బుద్ధులను, తను, మన,ధనాలను స్వజనాన్ని ఆయన సేవకర్పించే శ్లోకం చదువుతాము. అంతేకాదు రాముడు రాజభవనాన్ని త్యజించి యాగరక్షణకోసం అడవికి వెళ్లాడని .దశరథుడతన్ని కేవలం గుర్వాదేశం మేరకు మత్రమే పంపాడని ,ప్రహ్లాదుడు తనవారందరినీ కాదనుకుని శ్రీహరినే అర్చించాడని చదివి ఆనంద భాష్పాలు కారుస్తాము.
కానీ ఆచరణలోకొచ్చేసరికో ???????????
తనబిడ్డ శ్రీహరిసేవ చేయడాన్నిష్టపడని హిరణ్యకశిపుని చీదరించుకుంటూగూడా .మనమూ మనబిడ్డలు రోజులో వ్యర్ధంగా గడిపే సమయాన్నికూడా స్వామిసేవకు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండము. ఫ్యాన్ గాలిమేస్తూ సోఫాలో కూర్చుని హాయిగా సధ్గ్రంథాలు చదివి మనమూ వారిలా మాహత్ములవాలనీ ,అవుతామనీ ఆశిస్తాము. ఇహపర సుఖాలను "ఆయన" మనకు ప్రసాదించలేదని ఒక్కో సారి సతాయిస్తాము. ఎక్కడో మతకలహాలో ,గాలివానలో వస్తే అక్కడి మనవారికి "ఆయన" బంట్రోతై కాపలా కాయాలి. మనం గాని మనవారుగాని స్వామి సేవలో సహకరించవలసివస్తే "వాళ్లంతా ఉన్నారుగదా ! మనం వెళ్లకపోతేనేమి " అనుకుంటాము .
సాయి తన గురువును 12 సంవత్సరాలు సేవించారు. 12 సం..లు వేపాకుతిని భూగృహం లో తపస్సుచేసారు. 60 సం...లు షిరిడిలో ఉదయం అరునుండి రాత్రి పదిగంటలవరకు వచ్చేవారినందరినీ ఆదరిస్తూ కూర్చున్నారు. రాత్రిసమయాలలో నిద్రకూడా ఎరుగక భక్తులనుగాచారు. .మనమో మహా సమాధి తరువాత గూడా ఒక్క క్షణమైనా ఆయనకు విశ్రాంతి నివ్వము. మనబ్బాయికి జ్వరంగా ఉందని ఉత్తరం వచ్చింది. ,ఆఫీసులో మనకు వత్తిడి వచ్చింది, లేక ప్రమోషన్ రాలేదు. ,మనబ్బాయి మన మాట వినటం లేదు. ఇక సాయికి కంటిమీద కునులేకుండా గోరుచుట్టలా నలిపేస్తాము. ఔను మరి మనం రోజూ అగరొత్తి పెట్టటం లా ? అప్పుడప్పుడూ టెంకాయ కొట్టటం లా ? రాముడుగాని ,సాయిగాని _ వారు ఆజన్మసిద్ధమైన సహనం తో మనను సహిస్తున్నారు. కనుక కొలుస్తాము.
కనీసం మనకూ మనవారికీ పనికిరాని విరామ సమయాన్నైనా ఆయన సేవచేయడమో లేక చేసేవారితో సహకరించడమో నేరిస్తే రామ ; సాయి అవతార కార్యము రామనవమి ఎంతైనా సార్ధకమైనట్లే . రామ బాణానికి బలమున్నట్లే .
[ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు ..... సాయిబాబా మాసపత్రికనుండి }
1 వ్యాఖ్యలు:
కన్నీళ్ళ పర్యంతమైయ్యానండి చదవగానే. చాలా చక్కగా వ్రాసారు భరద్వాజ గారు. ఇలా మాకు అందించినందుకు ధన్యవాదములు.
Post a Comment