పంచాంగకర్తలకొక మనవి ........శాస్త్రాన్ని జనంలో పలుచనచెయ్యొద్దు .[500వ పొస్ట్]
>> Thursday, March 18, 2010
భారతీయ ఖగోళ గణిత విజ్ఞానానికి అద్భుత ఉదాహరణ పంచాంగం . ఈనాడున్న గొప్ప గొప్ప యంత్రాల సహాయం లేకుండానే నాటి భారతీయ శాస్త్రవేత్తలు విశ్వరహస్యాలను వివరంగా చెప్పగలిగి జగద్గురువు ఈదేశమని గుర్తింపువచ్చేలా చేశారు. ఎందరో తపోధనులు తమ జీవితాలను ఈ విజ్ఞానరహస్యాలను కనుగొనేందుకే వెచ్చించారు . నాటి వారి త్యాగం వలన ప్రపంచం లో ఎవరికీ అందనంత శాస్త్రవిజ్ఞానం మనకందినది. దానిని లోకకళ్యాణానికి ఉపయోగించాలనే ధ్యేయంతో ఖగోళంలో జరిగిగే గ్రహాల చలనాలు భూమ్మీద ఏఏ ఫలితాలను కలగజేస్తాయో , మానవుల మనసు మీద వీని ప్రభావమేమిటో తమ జీవితపర్యంత పరిశీలించి ,పరిశోధించి లోకానికందించారు. ఇదో గొప్ప శాస్త్రంగా ప్రజలు సప్రామాణిక ఉదాహరణలతో పోల్చుకుని చూసి అమోదించి ,తమజీవితాలలో పెద్దలసూచనలను ఆచరిస్తున్నారు .ఈశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు పంచాంగాల రూపంలో జనసామాన్యానికి అందుబాటులో ఉంచుతూ తరతరాలుగా జాతికి సేవచేస్తున్న మహానుభావులు పంచాంగ కర్తలు. వీల్ల సూచన కోట్లాది జనుల నమ్మకాలను ప్రభావితం చేస్తుంది .ప్రపంచ మంతా కాలగమనంలో జరిగేమార్పులను సంఘటనలను భారతీయులు ముందుగానే ఇంతచక్కగా ఎలా వివరిచగలుగుతున్నారా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఈ శాస్త్రరహస్యాలను అధ్యయనం చేస్తున్న కాలమిది. ఇంతటి గురుతర బాధ్యత తలకెత్తుకున్న నేటి పంచాంగకర్తలలోను అపార మేధావులు ,అత్యంత నియమనిష్టలతో శాస్త్రాధ్యయనం చేసేవారున్నారు. ఇంతమంది పెద్దలు ఉండి నేడు పంచాంగం అంటే జనంలో గౌరవభావం పలుచనయ్యేవిధంగా వాతావరణం ఏర్పడటానికి కారణమేమిటో ఒక్కసారి ఆలోచించాలి.
కలి ప్రభావం అన్నింటినీ కలుషితం చేస్తున్నట్లుగానే ఇక్కడా వీరిమీదకూడా ప్రసరిస్తున్నట్లు అనిపిస్తున్నది. శాస్త్రకారుడు వాస్తవాన్ని మాత్రమే తెలిపే అధికారం కలిగి ఉన్నాడు. దైవానికి , విజ్ఞానద్రష్టలగు పూర్వ ఋషులకు మాత్రమే అభిమాని అయ్యుండాలి . శాస్త్ర విషయాలను శోధించి వివరించేప్పుడు మీ మనసులమీద ఏ అభిమానాలు లౌక్యాలు ప్రభావం చూపినా మీరు ఋషి రుణం తీర్చుకోవటమేమోగాని వారిపట్ల దోషం చేసినవారవుతారు.
మీ మీ వ్యక్తిగత అభిమానాలు ,ఎవరికైనా శుభవార్తలే చెప్పి సంతోషపెట్టాలనే లౌక్యం మీకు మేలుచేసి , నట్లు లోకానికి మేలుచేయదు. మిమ్మల్ని గౌరవించేది కేవలం శాస్త్రవిజ్ఞానం పట్లగల గౌరవంతోమాత్రమే . మీరు అభిమానాలకు లోనై పందిని నందిగా వర్ణించే కవితాగానాలు చేపడితే ,అది కాలగమనం లో వాస్తవరూపమేమిటో తెలిసాక ముందు మన శాస్త్రాలమీద ,ఆవెనుకనే మీమీద అందరూ నమ్మకం పోగొట్టుకుంటారు . మీరు అభిమానించే నాయకులతో సహా . ఎప్పుడు శాస్త్రాలలో ప్రామాణికత లోపిస్తుందో అది జనానికి దూరమైపోతుంది . తద్వారా ఆపాపం మీకే చుట్టుకుంటుంది . గత పది సంవత్సరాలుగా చూస్తున్నాము పంచాంగరచన చేసే శాస్త్రవేత్తలు పెరుగుతున్నారు . కానీ వారి అంచనాలు జనంలో గందరగోళం సృష్టించే అంశాలను కూడా ఎక్కువగానే చూస్తున్నాము. పండగల ను నిర్ణయించటం వద్దనుండి ఫలితాల దాకా . ఎందువలన జరుగుతున్నదిది ? శాస్త్రనిర్ణయాలలో సందేహాలొచ్చినప్పుడు .అదీ కోట్లాది ప్రజలమనో భావాలతో ముడిపడి ఉన్నప్పుడు మీరు కలసికూర్చుని సత్యశోధనకు పూనుకోరా ? ఇక్కడ ఎవరు ఏమి చెప్పారు ? అని చూడరు. పంచాంగం ఏమి చెబుతున్నది అనిమాత్రమే చూస్తారు సామాన్యజనం . అలాంటప్పుడు పాండిత్యస్పర్ధ లోకానికి మేలుచేస్తుందా ? కీడుచేస్తుందా ?అని ఆలోచించటం లేదా మీరు ?
సరైన పరిజ్ఞానం లేకుండానే పలనా పార్టీ గెలుస్తుందనిమీ వ్యక్తిగత అభిమానలతో బల్లగుద్దివాదిస్తూ ,కనిపిస్తారు టివీలలో కొందరు.అది మిమ్మల్ని ఒకవంక ఎగతాళిచేస్తూ నే దాన్ని మరింతగా బహిరంగపరచేందుకు కుర్చీలలో కూర్చోబెట్టి ప్రసారం చేసే టీవీ ప్రోగ్రామ్ముల్లో ఒకటని తెలిసీ పాల్గొంటుంటిరి. మరొకవంక పంచాంగ శ్రవణం లోనూ ఒక్కో పంచాంగానిది ఒక్కోమాట , సిద్ధాంతి కొక లెక్క అని మీ అభిమాన రాజకీయులచే మిమ్మల్నే విమర్శించే అవకాశం మీరే ఇస్తుంటిరి . ఏందుకీ అవమానం శాస్త్రానికి ? బిడ్డలు పెద్దవాళ్లై పదిమందిచే తల్లిదండ్రులను పొగిడేలా చేయాలి . కానీ తల్లివంటి శాస్త్రాన్నే అవహేళనపరచే స్థితి తీసుకువస్తున్న పెద్దలు మీ కేమని చెప్పగలము . అయ్యా ! మీపై మాకు విశ్వాసమున్నది .అంటే మీరు మాకు వ్యక్తిగతంగా పరిచయమై కాదు. మీరు ఆశ్రయించి వున్న శాస్త్రజ్ఞానం ఆధారంగా . దయచేసి మీరు ఆలోచించి శాస్త్రం విలువ తగ్గకుండా చూస్తారనే ఆశ మాకు ఉంది. ఇది మీపట్ల చులకనతో వ్రాయటం లేదు . పండితులైన మీరు సమదర్శులు . సామాన్యుల తరపున మేము తెలియజేస్తున్న విన్నపాన్ని ఆవేదనను అర్ధం చేసుకోవాలని మహోన్నత భారతీయ విజ్ఞానపరంపరకు వారసులుగామీరు జాతి కరదీపికలుగా మిగలాలని నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాము .
7 వ్యాఖ్యలు:
సరి అయిన మాట చెప్పారు. [ కలి ప్రభావం కావొచ్చు...] శాస్త్రం అంటే విభేదించే వారికి ... తటస్తులకి శాస్త్రం మీద అప నమ్మకం పెరగటం కి వీరే కారణం...
ముందుగా 500కు వందనం.పంచాంగకర్తలు కూడా ఆయా పార్టీల కార్యకర్తలయిపోయారు.ఇలాంటి వాళ్ళ వల్ల శాస్త్రమే అవహేళనకు గురవుతోంది.
ఇది అక్షరాలా నిజం.
అయ్యా,
ఈ పిడపర్తి.ఆర్గ్ అనే వాలంటరీ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా మీరు చెప్పినట్లు పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయము తెచ్చుటకు చాలా కృషి చేస్తున్నది. ఎన్నో సభలు, సెమినార్లు నిర్వహించింది. మొన్న జనవరి లో రాజమండ్రి లో పెద్ద జ్యోతిష్కుల సభ పెట్టి వారినందరినీ ఒక వేదిక మీదకి తెచ్చింది. వారందరూ ప్రజలు ఇబ్బంది పడే ఇటువంటి చిన్న చిన్నసమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని, సెమినార్లు పెట్టుకుని ఏకాభిప్రాయాని కొస్తామనీ అభిప్రాయం వెలిబుచ్చారు.
పిడపర్తి.ఆర్గ్
మన సంస్కృతీ సంప్రదాయములు రోమరోమమునా నేటికీ మనను అంటిపెట్టుకుని ఉన్నాయి. కానీ వేగముగా మారుతున్న జీవనశైలి మనను వాటినుండీ రోజరోజుకూ దూరము చేస్తోందన్న భావన కూడా మనలో పెరుగుతోంది. రోజుకు 24 గంటలు చాలని పరిస్థితి నేడు చాలా మందికి ఉన్నది.
ఆ విధముగా నిరుత్సాహపడేవారికి ఒక వినూత్నపద్ధతిలో తిథి నక్షత్రాదులను అందించడానికి పిడపర్తి పూర్ణయ్య విజ్ఞాన ట్రష్టు ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. ఆ దిశగా మొదటి అడుగే ఆన్ లైన్ లో విశ్వపంచాంగము.
ఈ విశ్వపంచాంగములో తిథి, నక్షత్ర, యోగ, సూర్యోదయ, దుర్ముహూర్తములు పొందు పరచబడినవి. మిగిలిన పంచాంగ భాగములను కూడా చేర్చు ప్రయత్నము శరవేగముతో నడచుచున్నది. ఈ భాగములో ప్రంపంచములోని ఏ ప్రాంతమునకు కావలెనన్న ఆ ప్రాంతమునకు తిథ్యాదులు చూసుకునే విధముగా ఏర్పాటు చేయ బడినది. అనగ ప్రతీ ప్రదేశముయొక్క స్థానిక కాలానుగుణముగా మనము ఇందు తిథ్యాదులను చూసుకోవచ్చును.
మనము ఒక ప్రాంతమునకు చేసిన పంచాంగమును వేరొక ప్రాంతములో వాడటానికి కొన్ని మార్పులు మరియు చేర్పులు చేసుకోవలసి ఉంటుంది. ఇది వివరముగా చెప్పిననూ అందరివలనా సాధ్యము కాదు. సమయాభావముచేత కొందరు, వేరు కారణములవలన మరికొందరు ఈ మార్పులను చేసుకోలేక పోతున్నారు. మార్పు చేసుకొనకపోతే ఆ సమయములో లేని తిథ్యాదులను వాడు ప్రమాదమున్నది.
అవిశ్రాంతముగా పనిచేయువారికి కూడా నేడు ఇంటర్నెట్ చాలా చేరువయినది. కావున ఏ ప్రాంతము వారైనా ఆ ప్రాంతముయొక్క పంచాంగమును చూచుకునే విధముగా ఈ పంచాంగము తయారుచేయబడినది. ఈ ప్రయత్నము ఇంటర్నెట్ లో పరిపూర్ణ ప్రతి ప్రదేశ పంచాంగమును ప్రవేశపెట్టు దిశలో మొదటి అడుగు కాగలదని భావిస్తున్నాము.
2006 డిశంబరులో విక్రమహాలులో(రాజమండ్రి) నిర్వహించిన జ్యోతిషకార్యశాలయందు ఈ పంచాంగప్రారంభమునకు సంబంధించి ప్రకటన చేసి యున్నాము. దీనిని మరింత ఉపయోగకరముగా తీర్చి దిద్దుటకు అవసరమయిన సలహాలను అందజేయవలసినదిగా కోరుకొనుచున్నాము.
పిడపర్తివారికి ఖగోళ వేత్తలుగా ప్రతిష్ఠనిచ్చిన తెలుగువారి మరియు అటువంటి పేరు తెచ్చిన మా పూర్వీకుల ఋణమును తీర్చుకొనే ప్రయత్నములో భాగముగా ఈ చిన్న ప్రయత్నము చేయుచున్నాము. మరియు ఖగోళవిజ్ఞానమునకు మరల మన ప్రాంతములో పూర్వవైభవమును తెచ్చుటకు, దానిని ఆధునిక విజ్ఞానముతో అనుసంధానించుట ద్వారా అందరికీ ఉపయోగపడేలా తీర్చి దిద్దడానికి కటి బద్ధులమై ఉన్నామని తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానములు ఎప్పటివలే కొనసాగగలవని ఆశిస్తూ...
మీ పిడపర్తి పూర్ణయ్య విజ్ఞాన ట్రష్టు
అమ్మా
శ్రీ లలితగారూ ! చాలామమ్చి విషయం తెలియజేశారు. ధన్యవాదములు . ఎవరో ఒకరు నడుముకట్టుకుని ఈ అనర్ధాలకు అడ్డుకట్టవెయ్యవలసి ఉన్నది. ఈదిశగా పిడపర్తివారి వంటి పెద్దలు మొదటి అడుగువేయటం ముదావహం. ఇంకా వేగవంతం కావాలి ఈప్రక్రియ . ఈ మా ఆవేదనను మీకు వీలైనంత మంది పంచాంగకర్తలకు నివేదిమ్చగలరని కోరుతున్నాము. అలాగే మీరు చెప్పిన లింక్ ను ఇవ్వండి అందరికీ అందుబాటులోకొస్తుంది.
మరొకపరి ధన్యవాదములు
మీ అభిప్రాయాలు సరైనవే. అనవసర విషయాల మీద ఆసక్తితో వీరు శాస్త్రాన్ని పలుచన చేస్తున్నారు. మా పంచాగం గొప్పదంటే మా పంచాగం గొప్పదన్న వాదులాట. ప్రత్యేక పండుగ సమయాలలో అది జరుపుకొనే విషయంలో కీచులాట. మూలశాస్త్రం ఒక్కటే అయినప్పుడు తిథి భేదాలు, ముహుర్త భేదాలు ఎందుకు వస్తాయో అర్థం కాదు.
పిడపర్తి పూర్ణయ్య విజ్ఞాన ట్రష్టు వారి సైటు
http://www.pidaparti.org/
విశ్వ పంచాంగము
http://vishwapanchang.info/PanchangHome.aspx
Post a Comment