గురుదేవుల అనుగ్రహముతో కుష్ఠువ్యాధి తగ్గిన లీల
>> Thursday, May 18, 2023
*జగద్గురువులు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి ఆశీస్సులతో* ......
ఇది 1979 లో జరిగింది. జ్యేష్ఠ మహాసన్నిధానంవారి దర్శనం కోసం ఒక భక్తుడు వేచి ఉన్నాడు. భక్తుడు ఏదీ ప్రస్తావించక మునుపే, శ్రీ గురుచరణులు ఆ భక్తుని కొడుకు గురించి ఆరా తీసారు. అప్పుడు ఆ భక్తుడు...."తన కొడుకు పని చేసే ప్రదేశంలో నిరంతరం మైక్రోవేవ్ రేడియేషన్‌కు గురికావడం వల్ల, కుష్టు వ్యాధితో తన కొడుకు బాధపడుతున్నాడని" జగద్గురువులకు చెప్పాడు.
"ఆ రేడియేషన్ల వల్ల అలాంటి వ్యాధి వస్తుందా" అని పూజ్య గురువులు ఆ భక్తుడిని అడిగారు. అదేసమయంలో గురూజీ కి సమీపంలో నిలబడి ఉన్న ఒక ఇంజనీర్ ఈ రేడియేషన్ల వల్ల కలిగే అన్ని వ్యాధుల గురించి పూజ్య గురువులకు వివరించాడు. వెంటనే గురువుగారు ...ఒక్క క్షణం అర్ధ నిమిలిత నేత్రాలతో ధ్యానించి ...ఆ భక్తునితో
" ఆ ఆపద నివారణ కొరకు 'ఆంజనేయ పంచరత్నం' రోజుకు మూడుసార్లు చదవాలని" శ్రీ గురుచరణులు వెంటనే చెప్పారు. తరువాత, మహాసన్నిధానం వారు ఆ భక్తునికి శ్రీ ఆంజనేయ పంచరత్నం ప్రతిని ఇచ్చి ఆశీర్వదించారు.
జగద్గురువులు చెప్పినట్లు
ఆభక్తుని కుమారుడు ఒక సంవత్సరం పాటు రోజూ కనీసం మూడు సార్లు ఆ శ్లోకాన్ని అంతర్లీనంగా పఠనం చేస్తూ వచ్చాడు. అతను క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష (check-up) కూడా చేసుకుంటూ వచ్చాడు. పరీక్షలలో నెమ్మది నెమ్మదిగా వ్యాధి నయమవుతున్నదని పరీక్షా ఫలితాలు వెల్లడించాయి.
1982 లో, జగద్గురువుల వారు బొంబాయిలో విజయం చేసియున్నప్పుడు, ఈ భక్తుడు తన కుటుంబంతో కలిసి ఆచార్యుల దర్శనం కోసం వెళ్ళాడు. ఆ భక్తుడు జగద్గురువుల తో ఇతనే 'నా కొడుకు ...' అని చెప్పడం ప్రారంభించే లోపల, జ్యేష్ఠ మహాసన్నిధానం వారు ఆ భక్తునితో "అతనికి పూర్తిగా వ్యాధి నయం అయిపోయి ఉండాలే" అని అన్నారు.
వెంటనే ఆ భక్తుడు అతని కుమారుడు వారి కుటుంబం అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. మేము చెప్పక ముందే జగద్గురువులు ఎలా తెలుసుకున్నారు అని...?!
గురువులకు తెలియనిది ఏమీ లేదు. ఎంతటి వ్యాధి అయినా వారి ఆశీర్వాదముతో, కృపతో తొలగిపోతుంది. శ్రీ మహాసన్నిధానం ఆ కుటుంబానికి ప్రసాదం ఇచ్చి వారిని ఆశీర్వదించి పంపారు.
🕉️🙏🕉️🙏💐🪷
శ్రీ గురో పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ రక్షమామ్.🙏🕉️
0 వ్యాఖ్యలు:
Post a Comment