శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పాండురంగస్వామి ఆలయం

>> Sunday, August 7, 2022

🕉  మన గుడి : నెం 175

🔆 కృష్ణా జిల్లా : " చిలకలపూడి "

👉 శ్రీ పాండురంగస్వామి ఆలయం


🔆 పిలిస్తే పలికే దైవం.. చిలకలపూడి పాండురంగడు 🔆

💠 పాండురంగడు అన్న తక్షణం మన మదిలో మహారాష్ట్రలోని చంద్రభాగ నదీ తీరాన ఉన్న పండరీపురమే గుర్తుకు వస్తుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో కూడా పాండురంగడు స్వయంగా వెలిశాడు. అది కూడా ఒక భక్తుడి కోరిక మేరకు. ఇక ఆ భక్తుడు చనిపోయినప్పుడు అతని ఆత్మను తనలోకి ఐక్యం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు ప్రత్యక్షంగా చూశారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ అప్పటి వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ఇందుకు సంబంధించిన వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకొందాం.

💠 భక్తులను అనుగ్రహించి వారికోసం ప్రత్యక్షమైన దేవుళ్ళగురించి పురాణాల్లో చదివాముగానీ, కలియుగంలో భక్తునికోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలమా.  
చిలకలపూడిలోని కీర పండరీపురం చరిత్ర చదివాక నమ్మక తప్పదండీ.  

💠 చిలకలపూడి అనగానే చాలామంది మహిళామణులకు చిలకలపూడి బంగారం నగలు, అవేనండీ రోల్డుగోల్డు నగలు గుర్తుకొస్తాయి. అంతకన్నా ప్రియమైంది చిలకలపూడిలో మరొకటి వున్నది.  
అదే పాండురంగడు స్వయంగా సాక్షాత్కరించిన కీర పండరీపురము.

💠 కృష్ణాజిల్లా, మచిలీపట్నంనకు సుమారు 2 కి॥మీ దూరాన చిలకలపూడి అను చిరుపట్టణము కలదు.
ఇచ్చట “కీరపండరీపురం” అను పుణ్యస్థలంనందు శ్రీ పాండు రంగస్వామి ఆలయం కలదు.
ఈ క్షేత్రానికి కీర పండరీపురం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు.  పూర్వం ఇక్కడ దోస వ్రతం చేసేవారుట. అంటే దోస విత్తులు నాటి, అవి పెరిగి కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి, భగవంతునికి సమర్పించటం.  అందుకనే కీర పండరీపురం అనే పేరు వచ్చి వుండవచ్చునని కొందరి అభిప్రాయం. 
(ఉత్తర భారత దేశంలో కీరా అంటే దోసకాయలు)
ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన..వృత్తి రీత్యా స్వర్ణకారి అయిన భక్త నరసింహమే అంతకుముందు  కాకి బంగారంతో నగలు చెయ్యటంకూడా కనిపెట్టారని అంటారు.

💠 1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖ పట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులకు జన్మించారు టేకి నరసింహంగారు.  
ఈయనకి చిన్నతనంనుంచే దైవ భక్తి చాలా ఎక్కువ.  
శివుని అనుగ్రహం వల్ల జన్మించిన భక్తుడు నరశింహo... పాండురంగని సేవిస్తూ ఉండేవారు. 

💠 18వ ఏట మహారాష్ట్ర లోనే పండరిపురం వెళ్లి అక్కడ శ్రీ మహీపతి గుండామహారాజ్ అనే గురువు వద్ద శిష్యరికం చేసాడు.
నరసింహం భక్తికి ఆకర్షితుడైన శ్రీ మహీపతి గుండామహారాజ్ అతనికి పాండురంగోపాసన విధానన్ని తెలియజేయడమే కాకుండా ఒక తులసీమాలను, శ్రీ విఠల మహామంత్రాన్ని  ఉపదేశించి భక్త నరసింహం అనే పేరు పెట్టారు.

💠 అటుపై భక్త నరసింహం తన స్వగ్రామన్ని చేరుకొని నిత్యం పాండురంగ నామస్మరణ చేసేవాడు. 
చిలకలపూడి లో తుకారం మఠాన్ని స్థాపించి పాండురంగనికి భజనలు, అన్నసమారాధనలు చేస్తుండేవారు. ఒక రోజు పాండురంగస్వామి భక్త నరశింహంకు కలలో కనపడి గుడికట్టిస్తే స్వయంభువుగా అవతరిస్తారని చెప్పాడు. స్వామి ఆదేశాల మేరకు భక్త నరశింహం ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో గర్భగుడిని నిర్మించారు.

💠 స్వామివారు స్వయంభూవుగా ఉద్భవిస్తారన్న వార్త జిల్లా అంతటా వ్యాపించింది. వేలాదిమంది ప్రజలు ఆలయం చుట్టూ గుమిగూడారు. దీంతో బ్రిటీష్ అధికారులు గర్భాలయంకు సీలు వేశారు. భక్త నరశింహం విఠల నామం జపిస్తున్నాడు. స్వామివారు ఆవిర్భవించకుంటే స్వామివారిలో లీనమైపోతానని ప్రతిజ్ఞ పునాడు. వేలాదిమంది భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఆలయంలో పెద్ద శబ్దం వినపడింది. దీంతో అందరూ ఆత్రంగా ఆ దేవాలయం ద్వారాలు తెరిచి చూడగా ...

💠 కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన పాండురంగడు భక్తుల సమక్షంలో ఇక్కడ వెలిశారు.గర్భగుడిలో 3 అడుగుల ఎతైన పాండురంగడి విగ్రహం ఉంది.
ఈ విగ్రహం అచ్చు పండరీపురంలోని విగ్రహం వలే ఉంది. 

💠 ఇక అప్పటినుండి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు. ఈ స్వామివారికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టం. ఇంకా భజనలు అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ భక్తి భావంతో భజనలు చేస్తూ స్వామివారిని అర్చించి స్వామివారి అపార కృపకు పాత్రులవుతారు.

💠 ఆలయ ప్రాంగంలోని రావిచెట్టు కింద సిద్ధేశ్వరాస్వామి ఆలయం ఉంది. భక్తులు కోరిన కోర్కెలు అక్కడ సిద్ధిస్తాయని నమ్ముతారు. దీంతో అక్కడ ఉన్న పరమశివునికి సిద్దేశ్వరుడు అని పేరు వచ్చింది. 

💠 పాండురంగుడి పరమ భక్తుడైన నరసింహం 16.1.1974లో స్వర్గస్తులయ్యారు. 
ఆ సమయంలో ఆయన నుంచి ఒక కాంతి వెలువడి ఆలయంలో ఉన్న పాండురంగడిలో ఐక్యమయ్యింది. సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు. 
ఈ విషయాన్ని అప్పటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆ పత్రికల క్లిప్పింగ్స్ మనం ఇప్పటికీ ఆలయంలో చూడవచ్చు.


©️ Santosh Kumar

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP