శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

>> Sunday, May 5, 2013

33. కులము, శాఖ, ఛాత్రుడు, చరణము

మనం సాధారణంగా వాని కులగోత్రాలను విచారించాలి అని అంటూ ఉంటాము. ఒక ఋషి వంశము నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఋషి గోత్రమునకు చెందిన వారవుతారు. ఇట్లు ఒక గోత్రము నందు పుట్టి పరస్పర సంబంధములున్న వారు కులము. ఇట్టి కులముల నుంచే పూర్వము విద్యాశాలలు ఏర్పడినవి. ఆ రోజులలో వాటిని గురుకులములని కాక, ఋషికులములని వ్యవహరించేవారు. గురుకులమని చెప్పినప్పుడు గురుశిష్యుల మధ్య రక్తసంబంధము లేదు. పురాతన విద్యాశాలలో గురుశిష్యుల మధ్య బాంధవ్యం ఉండేది. సాధారణంగా తండ్రియే గురువుగా ఉండేవాడు. ఋషికులములలో తమ పితరులలోని ఋషికి సంవేద్యమైన విద్యను ప్రచారం చేసేవారు.

తరువాత కాలములో ఋషికులములు పరస్పర మంత్రములను, విద్యలను ఒకరికొకరు మార్చుకొనేవారు. ఇట్లు అనేక ఋషులు అనుగ్రహించిన మంత్ర సముదాయములను ఏకసంఘముగా అధ్యయనము చేయడం వలన శాఖలు ఏర్పడినవి. చారిత్రకముగా ఋషికులముల తర్వాత విద్యాశాలలు వచ్చినవి. వానికి గురుకులములతో సంబంధముండేది. ఈ విద్యాశాలలు ఒక శాఖకు ఏర్పడినవి. విద్యను అధ్యయన, అధ్యాపనలు చేసేవి. అందువల్ల విద్యార్ధులు పరస్పరము రక్తసంబంధాలకు అతీతమైన శాఖాసంబంధము కలవారైనారు. తర్వాత గురుకులములు విస్తరించి ఒక వేదమునకు సంబంధించిన శాఖలే కాక, అన్ని వేదములూ వేదాంగములూ చెప్పడం ప్రారంభించినవి.


పాణిని వ్యాకరణం శిష్యుణ్ణి ఛాత్రుడని చెబుతున్నది. ఛత్రమంటే గొడుగు. ఎండావానల నుండి గొడుగు ఎట్లా కాపాడుతుందో గురువు ఛాత్రుణ్ణి దుస్సాంగత్యము నుండి కాపాడి రక్షిస్తున్నాడు. ఈ ఛాత్రపదం గురువు గొప్పదనాన్ని, అతనికి శిష్యునియందు ఉండే ప్రేమను తెలుపుతుంది. చదువులు ఒక్క జ్ఞానం కోసమే కాదు, శీలరక్షణకు కూడా.


పాణినిలో చరణమనే పదాన్ని చేస్తాం. చరణమంటే పాదం. పరమపదమంటే మహోన్నత స్థానం. పదము దేహరక్షణా, జీవరక్షణా చేస్తున్నది. ఈ అర్ధంలోనే గురుకులాన్ని చరణమన్నారు.


అధ్యాపకుడు వేదాలను వల్లె వేసి శిష్యులకు ఘనాంతం బోధిస్తే శ్రోత్రియుడౌతాడు. వేదమంత్రము తెలుసుకొనుటతోబాటు వాని అర్ధము, విశిష్టత గూర్చి ప్రవచనము చేయగలిగిన వాడు ప్రవక్త. ఒకే గురుకులంలో చదువుకొనేవారు సతీర్థులూ, సబ్రహ్మచారులూ. ఉత్తరభారతంలో గురుభాయీలు అన్న పదప్రయోగం ఉన్నది.

34. గురుదక్షిణ

విద్యాభ్యాసానంతరము శిష్యుడు గురువుకి ఇవ్వవలసిన గురుదక్షిణ గూర్చి మనువు చెప్తున్నాడు. గురుదక్షిణ శిష్యుని తాహతుకు తగ్గట్లు ఇవ్వవలెను. గోవులు, భూమి, స్వర్ణము, వస్త్రములు, ధాన్యము, కూరగాయలు, ఛత్రములు, పాదుకలు ఇవి ఏవైననూ సరే జీవనోపాధికోసం ఆర్జించు అధ్యాపకుడు శ్రాద్ధక్రియలకు అనర్హుడు. అతని శిష్యుడూ అనర్హుడే. జీవనోపాయాన్ని ఉద్దేశించి వేతనము గ్రహించి బోధన చేసేవాడిని ఉపాధ్యాయుడని మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది.

విద్యావ్యాప్తితో రక్తసంబంధమున్న కులములు అంతటితో ఆగక పెద్ద గురుకులములుగా మారినవి. ఈ గురుకులములు వేదవేదాంగములను అర్హులైన వారికి బోధించేఇ. క్షత్రియులు, వైశ్యులు ఈ గురుకులములకు విద్యార్థులై వచ్చేవారు.

కాలక్రమేణ విద్య అనే పదం ఒక ఆధ్యాత్మిక విద్యకేగాక ఇతర విద్యలకూ (అనగా నేటి కళలు, శాస్త్రవిజ్ఞానము) సూచకమై వానినీ గురుకులములలో బోధించసాగిరి. ఛాందోగ్యోపనిషత్తులో అట్టి కళలు, విజ్ఞానమునకు సుదీర్ఘమైన సూచిక ఒవ్వబడినది. ఆ సూచిక నిజముగా విస్మయజనకంగా ఉంటుంది. కొన్ని వేల ఏండ్ల క్రితం వానిని గురుకులములలో నేర్పేవారు.

అట్టి విద్యలలో కుశలుడైనప్పటికీ, నారదడు అభ్యాసము లేని కారణమున ఆత్మజ్ఞానము లేకపోయెనే అని విషాదగ్రస్థుడయ్యాడు. నారదుడు తాను నేర్చిన విద్యలను సనత్కుమారునికి ఈ విధంగా చెబుతున్నాడు. అవి నాలుగు వేదములు, ఇతిహాసము, పురాణములు. వీనిని నారదుడు పంచమవేదమని చెబుతున్నాడు. నారదుడు మహామేధావి. అందుకే ఆయన ఎన్నో విద్యలను నేర్వగలిగినాడు. అంత నేర్చినా ఆత్మానంద స్థితిని చేరుకోలేకపోయానని తెలుసుకొనే వివేక వినయములు కలిగినవాడు నారదుడు. అందుకే ఆత్మ విద్యోపదేశము కొఱకై సనత్కుమారుని ఆశ్రయించారు నారదుడు. విద్య యొక్క ప్రయోజనం ఈశ్వరతత్త్వము ఎరుగుటయే అని దీనిని బట్టి తెలుస్తోంది.

ఇట్లు విద్యలధికమైనందున గురుకులములు వ్యాపించి ఉపాధ్యాయుల సహాయంతో వివిధ కళలను విద్యార్ధులకు బోధించేవారు. ఇట్టి గురుకులవాసములను ఆదర్శముగా ఉంచుకొనియే రవీంద్రనాథఠాగూర్ తన శాంతినికేతనాన్ని స్థాపించారు.

నారదుడికి ఏర్పడిన కొరత ఆనాటి విద్యార్ధులకందరికీ ఏర్పడి ఉండదు. ఆనాటి విద్య ఈశ్వర సంబంధమూ, ఆత్మ సంబంధమై ఉన్ననూ ఒక సామాన్య విద్యార్ధిని విద్యాభ్యాసకాలమున ఏకధాటిలో అతనికి ఆగమ్యమైన జ్ఞానమార్గమునకు ఆ కాలపు ఆచార్యులు బలవంతపరిచి ఉండరు. విద్యార్ధులకు బ్రహ్మ విద్య చెప్పబడినప్పటికీ వెంటనే వారికి అనుభవము కలుగవలెనన్న నిర్బంధము లేకుండెడిది. విద్యాభ్యాసము పూర్తి అయిన వెంటనే పెళ్ళి చేసుకుని సంతాన ప్రాప్తి, వైదిక కర్మానుష్టానములచే చిత్తపరిపాకమును పొంది సన్యాసము పుచ్చుకొని ఆత్మ విచారము చేయవలెననుటయే వేదవిహిత మార్గము.

---------------------------------------------------------------------------------------------

 

35. ధర్మము బ్రహ్మము

ఈ లోకములో నియమ జీవనమునకు ఏర్పడినది ధర్మము. బ్రహ్మం పారలౌకికము. ధర్మ మార్గములో ధార్మిక కర్మల మూలముగా ఒక సామాన్య జీవుడు బ్రహ్మ విచారం చేయగలడు. ధర్మమేమిటి అని విచారించి తెలుసుకొని, అనుష్టించుటకే పూర్వమీమాంస పరమైన కర్మమార్గ శాస్త్రమూ, బ్రహ్మమును గూర్చి విచారించి తెలుసుకొని అనుభవించుటకు ఉత్తరమీమాంసపరమైన వేదాంతమూ ఉన్నవి. ఆ కాలపు విద్యాస్థానములలో వేదాంతము ఎక్కువగా చెప్పినా, విద్యార్ధులకు ఏదో ఒకదానిలో అభిరుచి
కలిగించడం తప్ప, వారు వెంటనే వేదాంత లక్ష్యమునకు పాటుపడతారని కాదు. విద్యార్ధి గృహస్థుడు కాగానే ధర్మశాస్త్రానుసారం గార్హస్థ్య జీవనం గడిపేవాడు. ఇట్లా గృహజీవనం గడుపుతూ పక్వమయ్యేసరికి, అతడు ఆత్మశాస్త్రాన్ని అభ్యసించేవాడు. నారదుడు అసామాన్యుడు, అందుచేతనే ఆయన విద్య పూర్తి కాగానే, బ్రహ్మాన్వేషణ చేస్తూ సనత్కుమారుని ఆశ్రయించారు. ఆయన గృహస్థ జీవనం అవలంబించలేదు.

ఆనాటి విద్యావిధానం ప్రకారం సామాన్య జీవుడు ధార్మిక మార్గములో కర్మ చేస్తూ చిత్తశుద్ధి కలిగిన పిదప ఆత్మాన్వేషణా తత్పరుడయ్యేవాడు.


32. వైదికమే అన్ని విద్యలూ
ఒక ముఖ్య విషయం చెప్పాలి. పూర్వకాలంలో అన్ని విద్యలూ వైదిక విద్యలే. కళగానీ, విజ్ఞానంగానీ అన్నీ వేద సంబంధమైనవి. ఒక్కొక్కటి పదునాలుగు వేదవిద్యలకు సంబంధించినవి. వాని ప్రయోజనం వైదిక మార్గపరమైన జీవనమే. కొందరు వేదవిభాగములన్నిటినీ అంగీకరించక పూర్వమీమాంసా తత్పరులుగానే ఉండేవారు. వేదములను పూర్తిగా నిషేధించిన చార్వాకులూ ఆ కాలంలో ఉన్నారు. మరికొందరు వేదములను నిషేధించనూలేదు, ఒప్పుకోనూలేదు. వారు సాంఖ్యము, యోగము పాటించేవారు. వీనినీ వేదములతో పాటు నేర్పేవారు. తర్వాత వచ్చినది బౌద్ధము. అది అవైదికము. వేదప్రమాణమును బుద్ధుడు ఒప్పుకోలేదు. బౌద్ధులు విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఆ విద్యాస్థానాలలో కూడా పదునాలుగు వేదవిద్యలను నేర్పేవారు.


(సశేషం ......)


సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP