రమణుని రమణీయ రాసలీల
>> Friday, April 5, 2013
రమణుని రమణీయ రాసలీల
శ్రీకృష్ణావతారం సమగ్రమైన భగవానుని వైచిత్రికీ, సంపూర్ణమైన ఆయన అవతార ప్రశస్తికీ దశావతారాలలో అగ్రగణ్యమై నిలిచింది. స్వామిని సేవించే భక్తజనుల నిష్కామభక్తికీ, జీవాత్మ పరమాత్మల అమలిన శృంగార అనురక్తికీ, విజ్ఞాన బోధను మానవాళికి అందించాలన్న సర్వాంతర్యామి ఆసక్తికీ నిలువెత్తు మహత్తుగా శ్రీకృష్ణుని అవతారం జగన్మోహనమై విరాజిల్లింది.
నిరతమూ కృష్ణ నామస్మరణ చేస్తూ ఆయన భక్తికి దాసులైన భక్తులందరో.. స్వామి మాహాత్మ్యాన్ని తలుస్తూ అందులోనే తాదాత్మ్యాన్ని పొందిన సిద్ధ సాధకులెందరో.. కృష్ణ భగవానుడు మనుజకోటికి అందించిన మహోన్నత విజ్ఞాన కోశం భగవద్గీత.. గీతలో లేని జీవరహస్యం లేదు. గీతలో చెప్పబడని తాత్విక మర్మమూ ఎక్కడా కానరాదు. భగవద్గీతను చదివి, అందులోని కొన్ని అంశాలపైనా ఆకళింపు చేసుకుంటే కావలసినంత ఆత్మస్థయిర్యం, జీవిత నౌకను ముందుకు నడుపుకునే ధైర్యం వస్తాయంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.
స్నిగ్ధ సింగారం..కృష్ణ లీల
ఇక నల్లనయ్య అంటే గుర్తుకు వచ్చేది బాలకృష్ణునిగా గోపాలబాలురతో కలిసి చేసిన చిలిపి అల్లరి చేష్టలు, చిల్లర వెన్న దొంగతనాలు. గోకులంలోని వనితలందరూ తమ ఇంట కృష్ణుడు చేసిన హద్దులు మీరిన అల్లరిని యశోదకు చెబుతుంటే, ముద్దుల మోముతో ఆ కృష్ణుడు అమాయకంగా ఆ అల్లరి తానేమీ చేయలేదని బుకాయించటం తలుచుకుంటేనే స్నిగ్ధ సింగారంగానూ, ముగ్ధ మనోహరంగానూ ఉండటమే గాక, తనువు పులకరిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, నల్లనయ్య పిల్లన గ్రోవినూదుతూ, గోపకాంతలతో నెరపిన రాసలీల సుమనోహరం. బృందావన విహారుని రాసలీలపై సాధారణ జీవులందరికీ వచ్చే సందేహమే పరీక్షిన్మహారాజుకూ వచ్చింది.
తనకు భాగవతాన్ని మనోహరంగా వినిపించిన శుకమహర్షితో సంభాషిస్తూ , "గురువర్యా! శ్రీకృష్ణుడు ధరణిపై ధర్మసంస్థాపనార్థం అవతరించాడు కదా! శిష్ట రక్షణ, దుష్ట శిక్షణే ధ్యేయమైన మహోన్నత అవతారం ఆయనది. మరి ప్రపంచంలో నీతిపరులు కలవరపడే విధంగా గోపికలతో పరమ పురుషుడు రాసలీల ఎందుకు జరిపాడు?'' అని కుతూహలంతో ప్రశ్నించాడు. దానికి చిరునవ్వుతో శుకుడు, "నాయనా! మానవులు అల్పమైన ఆలోచనలు కలిగినవారు.
వారికి బాహ్య ప్రపంచంలో కనిపించేది కామకేళి. కానీ శ్రీకృష్ణునితో గోపికలు జరిపిన రాసకేళి యోగమాయ వల్ల జరిగినది. శ్రీకృష్ణుడు మహోన్నత అవతార ధారియై దేహమ్మీద జీవులకున్న అభిమానాన్ని తొలగించే ప్రక్రియలోనే గోపికలకు జ్ఞానబోధ చేశాడు. శ్రీకృష్ణుని లీలలు పతితులైన బద్ధజీవుల యెడల ఆయనకు గల ప్రత్యేకమైన కృపకు దర్పణం పడతాయి. గోపికల శ్రేయస్సు కోసమే కృష్ణ పరమాత్మ ఆ విధంగా చేయటం జరిగిందని గ్రహించాలి. ఆ మురహరుడు తన అనురాగ మహిమతో బద్ధజీవులైన గోపకాంతలను సిద్ధజీవులుగా అనుగ్రహించాడు'' అని చెప్పగానే పరీక్షిత్తుకు జ్ఞానోదయమయింది.
రాసలీలావిలాసం
కృష్ణుడే తమ జీవన సర్వస్వమని తలపోసే గోపికలు పూర్వజన్మలో తపోనిధులైన ఋషులు. వారందరినీ ఒకేసారి భౌతిక స్థితి నుంచి విముక్తి చేయడానికే మనోహరమైన రాసలీలను ప్రదర్శించి దేవాధిదేవుడు వారందరినీ అనుగ్రహించాడు. గోకులంలో మధురానుభూతికి లోనై అవ్యక్తమైన ఆనందంతో, అలౌకిక భావనతో చరించి తరించిన గోపికలందరూ శ్రీకృష్ణుని ఆహ్లాదశక్తి యొక్క సవిస్తరమైన విస్తరణ మాత్రమే. గోపాలుని ప్రియసఖియైన రాధ భగవంతుని యొక్క అనన్యమైన అంతరంగ శక్తి. రాసలీల భౌతిక ప్రపంచంలో ఇంద్రియతృప్తి కోసం ప్రజలు చేసే నాట్యం లాంటిది కాదు.
పరమాత్మ జీవాత్మపై చూపే అత్యుత్తమ అనురాగానికి వ్రజగోపికలు మనోజ్ఞమైన చిహ్నమై భాసించారు. మోహనరూపుని సమ్మోహనమైన వేణుగానం వినగానే అన్నీ మరచి, సర్వమూ వదులుకొని ఆయన ప్రేమ కోసం పరుగులు తీసిన మధురభక్తి ప్రపూరితులు గోపికలు. నిజమైన అర్థాన్నీ, అంతరార్థాన్నీ లౌకిక జీవుల్ని గ్రహంపనీయక అనవసరమైనవాటిని అవసరమైనవిగా చూపించడం లౌకిక చిత్తం యొక్క విచిత్ర వృత్తి. బాహ్యంలో మాత్రమే చరించే మనస్సు అజ్ఞానం వల్ల లీలామానుష వేషధారిగా అవతరించిన భగవంతుని లీలలను సైతం వక్రీకరిస్తుంది.
కమనీయ భక్తికి నిదర్శనం
ఆధ్యాత్మిక పరిణతితోనే దేవదేవుని రాసలీలను పరిశీలించాలి. గోపికలతో శ్రీకృష్ణుని రాసలీల బాహ్య చక్షువులకు గోచరించని భావాతీత భావన. కుండలమణిమయ భూషణుడైన కువలయ దళ వర్ణాంగుని అమేయ మాయా వలయంలో చిక్కుకున్న సాధారణ మానవ మానసానికి అందని కమనీయ భక్తి రాసలీల. సాధారణ యువతీ యువకుల కలయికకు, కృష్ణునితో గోపికామణుల నృత్యహేలకు ఇనుముకూ, బంగారానికీ ఉన్న వ్యత్యాసం ఉంది. ఇనుము, బంగారం లోహాలే అయినా, వాటి విశిష్ట ధర్మాలు వేరు. రాసలీల బంగారమయితే, భౌతిక వాంఛల కోసం చేసే స్త్రీపురుషుల స్నేహం ఇనుముతో పోల్చదగినది. షాడ్గుణ్య పరిపూర్ణుడైన కృష్ణపరమాత్మకు ఈ భూతలంపై తీర్చుకోవలసిన వాంఛలేమీ లేవు. ఆయన విషయ వాంఛలకు అతీతుడు. సర్వభావాతీత స్వభావుడు.
రాసలీలా కలాపం గోపకాంతలకు అనిర్వచనీయమైన ఆత్మానందాన్ని చేకూర్చిన పరమాత్మ ప్రేరితమైన అలౌకిక తత్వం. గోకులంలో కృష్ణునిగా మానవరూపం ధరించిన పరమాత్మ లీలలను అర్థం చేసుకునే భక్తి మహాత్ములకు, తాపసులకు మాత్రమే ఉంటుంది. జ్ఞానులకు, పరిపూర్ణ మానసా స్థిరులైనవారికి మాత్రమే అవగతమయ్యే మహిత లీల భగవానుని రాసలీల. అది సర్వమయునిచే కల్పించబడిన మధురస రసమయ హేల. అది బాహ్యేంద్రియాలకు గోచరం కాని పురుషోత్తముని సుందర సుధార్ణవ లీల!
వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు
1 వ్యాఖ్యలు:
బాగా చెప్పారు
Post a Comment