అనురాగ సుగంధం దాంపత్య బంధం
>> Saturday, March 23, 2013
సృష్టిలో అత్యంత మధురమైన బంధం భార్యాభర్తల అనుబంధం. ధరిత్రిలో నవచరిత్రను లిఖించేలా వీరి మమతానుబంధం కొనసాగుతూ ఉంటుంది. ప్రత్యేకించి భారతావని తన ఘనమైన సంస్కృతిలో దాంపత్య బంధానికి సమగ్రమైన నిర్వచనం చెప్పింది. భార్యాభర్తలు ఒడంబడికలు, ఒప్పందాలకు బద్ధులై జీవితం గడిపేవారు కారని, అనుబంధానికి, అరమరికలు లేని అవగాహనకు మేలిమి నిదర్శనాలని సోదాహరణంగా చూపిన, ఎలుగెత్తి చాటిన విశిష్ట సంస్కృతి మన దేశాన వేదకాలం నుంచీ ఉంది.
'నాతిచరామి' అన్న వాగ్దానానికి తన మనస్సాక్షినే సాక్షిగా భర్త నిలిపితే, తన సర్వమూ, సర్వస్వమూ పతిదేవుడే అని తలపోస్తుంది సతీమణి. తమ వైవాహిక బంధం ఎన్నాళ్లు నిలుస్తుందో అని ఆ విషయాన్ని ఒక బరువుగా విదేశీ విష సంస్కృతిలో భావిస్తే, భార్యాభర్తలు చిరకాలం కలిసి ఉండటమే నిజమైన పరువు అని భావించే సుధామయ జీవనశైలి భారతీయులకే సొంతం. వైవాహిక బంధంతో ఒక్కటయ్యాక నువ్వు నేను అన్న భావం భార్యాభర్తల్లో ఉంటే అది దాంపత్యమే కాదంటుంది సనాతన భారతీయం.
పరస్పర ప్రేమానుబంధం
భర్తకు భార్య చరణదాసి అయితే, భార్యకు భర్త అనురాగ సేవకుడు. మేలిమి క్షీరంలా భర్త క్షేమం కోసం, అతని శ్రేయస్సు కోసం భార్య నిరంతరమూ తపిస్తుంది. అతని సన్నిధిలోనే తనకు సకలమూ అని తలపోస్తుంది. భర్త కూడా తన అనురాగ దేవత అయిన భార్యను ఎలా ఆనందపెట్టాలి, ఏ విధంగా తమ జీవితాన్ని నిత్యమూ నవ్యమైన రీతిలో ఎలా గడపాలి అన్న విషయంలో నిరంతరమూ పరితపిస్తూ ఉంటాడు. ఉద్యోగబాధ్యతలు కావచ్చు, వ్యాపార నిర్వహణ కావచ్చు. ఎంత దూరాన ఉన్నా, అతని యోచన, ఆలోచన తన అర్ధాంగి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. తాను మైళ్ల దూరంలో ఉంటే కనీసం భోజనమన్నా చేసిందో లేదో అని ఆందోళన పడుతూనే ఉంటాడు.
దాదాపు పాతికేళ్లు వచ్చేవరకు ఒకరికొకరు తెలియకపోయినా దాంపత్య బంధంతో ఒక్కటయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కటిగా ఉండటమే సృష్టిలోని చిత్రమైన బంధం. విచిత్రమైన అందం. ప్రకృతి, పురుషుడు వేరువేరు కాదు. ఇద్దరూ కలిస్తేనే ఈ చరామయ జగత్తు. అదే విధంగా దాంపత్య బంధంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న ప్రశ్నే లేదు. ఇద్దరూ సమపాళ్లలో సంసారరథాన్ని లాగే చక్రాలే. ఆ చక్రాలకున్న ఇరుసే వీరి అనుబంధంలోని ఔన్నత్యం. అవగాహనలోని పరిణతిని చాటే తత్వం. మనం అధిదేవతలుగా నిత్యమూ కొలిచే దైవాలనే ఉదాహరణలుగా తీసుకుంటే దాంపత్య బంధంలో వారి అరమరికలు లేని మహిమాన్విత తత్వం వెల్లడవుతుంది. శివపార్వతులొక్కటిగా దర్శనమిచ్చే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిబింబాలు. ఇక, విష్ణుమూర్తి తన హృదయసీమ మీదే తన అర్ధాంగి మహాలక్ష్మిని కొలువుంచుకుని పరవశిస్తూ ఉంటాడు.
సర్దుకుపోతేనే సుఖసాగరం
భార్యాభర్తల బంధం కలకాలం నిలిచి ఉండాలంటే ఒకరిమీద ఒకరికి అవగాహన, గౌరవం ఉండాలి. నా మాటే నెగ్గాలి అన్న పంతాలు, పట్టింపులు ఉండకూడదు. భర్త ఏదన్నా విషయం చెబితే వెంటనే నచ్చకపోయినా, అందులోని భావాన్ని భార్య గ్రహించాలి. అలాగే, భార్య ఏదన్నా విషయం చెబితే, తనకు హితవుగా లేకపోయినా, అందులోని ఆంతర్యాన్ని గ్రహించి భర్త సర్దుకుపోవాలి. అన్ని విషయాల్లోనూ ఇద్దరికీ ఒకే విధమైన అభిప్రాయాలు ఉండాలన్న నిబంధనేమీ లేదు. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా! అదే విధంగా మన ఇంట్లో జరిగే విషయాలు కావచ్చు, బంధువర్గానికీ, మిత్రబృందానికీ సంబంధించిన విషయాలు కావచ్చు.
భాగస్వాముల్లో ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉండాలనేదే లేదు. అటువంటి సమయాల్లోనే కాస్త పట్టూ, విడుపు ధోరణి అవలంబిస్తే ఈ విశాలమైన వసుధలో ఉన్న సుధ అంతా వారిరువురిదే! ఆలూమగల మధ్య అప్పుడప్పుడు పొడసూపే భేదాభిప్రాయాలు అద్దం మీద ఆవగింజలాంటివి. అంటే ఎక్కువకాలం ఆ తేడా వాళ్ల మధ్య నిలవదనేది భావం. అలాగే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే నేటి రోజుల్లో ఆర్థికపరమైన విషయాల్లో మరింత పరిణతి అవసరం. నీ డబ్బు, నా డబ్బు అని అస్తమానం బేరీజు వేసుకుంటే ఇద్దరికీ మిగిలేది అశాంతి, కరువయ్యేది అమూల్యమైన మనఃశాంతి!
ఇద్దరూ సమానులే
అదే విధంగా, పండగలకీ, శుభకార్యాలకీ వెళ్లేటప్పుడు సాధారణంగా పొడసూపుతూ ఉంటాయి ఆలుమగల మధ్య అకారణ భేదాలు. ఒకరికి విలువైనదిగా, వెళ్లక తప్పనిదిగా అనిపించే కార్యం మరొకరికి అనవసరమైనదిగా అనిపించవచ్చు. అంతమాత్రాన, జీవిత భాగస్వామిపై ఆ భావాన్ని రుద్దడం సమంజసం కాదు. తాను రావడం కుదరదనేది మృదువుగా చెప్పి, అవతలివాళ్లు నొచ్చుకోకుండా ఆ శుభకార్యానికి పంపించాలి. విజ్ఞత, తెలివితేటలు భార్యభర్తల్లో ఏ ఒక్కరికో సొంతం కాదు. ఒక్కొక్కసారి భర్త సరియైన నిర్ణయం తీసుకోవచ్చు. మరొకసారి భార్య తీసుకునే నిర్ణయమే ప్రయోజనకారి కావచ్చు.
అందుకే జీవితాన్ని కలిసి పంచుకునే భాగస్వాములు కలివిడిగా ఉండాలిగానీ విడివిడిగా ఉండటం సబబు కాదు. దంపతుల్లో ఏ ఒక్కరూ తమ భాగస్వామిలోని లోపాలను ఎవ్వరి ముందూ ప్రకటించకూడదు. చివరికి సొంత అన్నదమ్ములైనా, అప్పచెల్లెళ్లయినా మూడో వ్యక్తులే కాబట్టి, వారి ముందూ వ్యతిరేకంగా ఏమీ అనకూడదు. అది రెండోవారి హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. తమ భాగస్వామిలోని సుగుణాలను మాత్రం వీలున్నంతగా నలుగురి ముందూ ప్రస్తావించాలి. అది హితకరం, సంసారసౌధానికి బలాన్ని పెంచే మూలధనం. అది ఎదుటివారి హృదయసీమకు మలయసమీరంలా సోకుతుంది. సంసారంలో ఆనందం అర్ణవమవుతుంది.అరమరికలు లేని భార్యాభర్తల బంధం ఈ ధరిత్రికి మనోహరమైన అందం! అది అద్వితీయమైన అనుబంధం! భువనమనే కమనీయ వనంలో ఎన్నటికీ వసివాడని సుమ సుగంధం!
వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు
0 వ్యాఖ్యలు:
Post a Comment