ఏది మంచి.. ఏది చెడు?
>> Friday, March 22, 2013
ఏది మంచి.. ఏది చెడు?
గత జన్మలు ఉన్నాయనుకుంటే పూర్వజన్మ పాపం మరుజన్మలో జతకడుతుందా? అసలు దేవుడు ఉన్నాడని నమ్మాలా? నమ్మితే అన్నీ ఆయనపైనే వదిలేసినపుడు మరణానికి భయపడడం ఎందుకు? దైవసాన్నిధ్యానికి వెళుతున్నందుకు ఆనందించవచ్చు కదా! అసలు ఏది మంచి, ఏది చెడు...ఒకరికి మంచి అయినది మరొకరికి చెడుగా మారవచ్చునేమో! ఇలాంటి ఎన్నో ధర్మసందేహాలకు సద్గురు ఇచ్చిన భాష్యం...
ప్రశ్న: పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా? మంచివాళ్లకి చెడు ఎందుకు జరుగుతుంది? సద్గురు: చెడంటూ ఎవరికీ జరగదు. ఎన్నో జరుగుతుంటాయి. నచ్చని వాటిని మీరు చెడు అనుకుంటారు. చూడండి...ఈ రోజు పెళ్లనుకుందాం. మీరు వీధిలో ఊరేగింపుగా వెళదామనుకున్నారు. కానీ ఈ రోజు పెద్ద వాన పడింది. అంతా తడిసి ముద్దయ్యారు. అది మీకు చెడు. కానీ ఇంకొకరు ఈ వర్షం కోసం ప్రార్ధిస్తున్నారు. అతనికి వర్షం పడుతోందని చాలా ఆనందం. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అన్నది కేవలం మీ ఇష్టాయిష్టాల మీదే ఆధారపడుతుంది, అవునా? కాబట్టి మనం జీవితాన్ని మంచీ చెడులని వేర్వేరుగా చూడొద్దు.
ఎందుకంటే మీరంతా దేవుణ్ణి నమ్ముతున్నారు, అవునా? మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయనే అన్నీ సృష్టించాడని నమ్ముతున్నప్పుడు ఇక మంచీ చెడూ ఎక్కడ? ఇదంతా మీకు అవసరమేనేమో? అందుకే ఆయన ఇలా చేస్తున్నాడేమో అనుకోవాలి. కాదంటే మీ దేవునిపై మీ నమ్మకం అసలైనది కాదని అర్థం. అవునా? మీరు దేవుణ్ణి నమ్మితే, అతను చేసేవన్నీ సరైనవై ఉండాలి. అవునా? లేదంటే అసలు దేవుణ్ణే తొలగించాలి! తాను చేసేది అతనికే తెలియకుంటే, అతనిని ఆ ఉద్యోగం నుంచి తప్పించాలి. అతను అంతా తెలిసే చేస్తుంటే మనం ఇక ఫిర్యాదు చేయకూడదు.
మరణం మహదానందమా?
ఇదంతా దేవుడు తెలిసే చేస్తున్నాడంటే అతను మీకేమి చేసినా మీకు సంతోషమే కలగాలి, అవునా? ఈ రోజు అతను మీతో "ఇక ఈ జన్మ చాలు, తిరిగి వచ్చెయ్యి'' అంటే మీరు మహదానందపడాలి. ఎందుకంటే మీరు మీ సృష్టికర్త దగ్గరకు వెళుతున్నారు, కానీ వాస్తవం అలా లేదు. మీరు ఇంకో రెండు రోజులు మాత్రమే జీవిస్తారని మీ డాక్టర్ చెబితే మీరు చాలా దుఃఖపడతారు. "ఇది భగవదేచ్ఛ! ఎంత అద్భుతం నేను ఆయన చెంతకే తిరిగి వెళుతున్నాను'' అని మీరు భావించి ఆనందంగా వెళ్లగలరా? లేదు. మీరంతా వంచనలో కూరుకుపోయారు. మీ మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మీతో మీరు వందశాతం నిజాయితీగా ఉండడం. ప్రపంచంలోని అందరితో మీరు నిజాయితీగా లేకపోవచ్చు. కానీ కనీసం మీతో మీరు పూర్తిగా నిష్కపటంగా ఉండాలి. ఇది మీ బాధ్యత, అవునా?
పూర్వజన్మలు ఉన్నాయా?
మీరిప్పుడు 'పూర్వజన్మ' కర్మలూ, వాసనలూ అంటూ ఏదో అన్నారు. ఇంకో జన్మ ఉందని మీరెలా భావించారు? ఎవరో మీకు చెప్పారు. అవునా? ఎవరో చెప్పేది మీరెందుకు నమ్ముతున్నారు? అసలు ఆ వ్యక్తికి తెలుసని మీకెలా తెలుసు? పూర్వజన్మల గురించి నేను మాట్లాడితే అది నాకు వాస్తవం కావచ్చు. నా వరకూ అది వంద శాతం సత్యం కావచ్చు. కానీ మీకు సంబంధించినవరకూ అది ఒక కల్పిత కథ మాత్రమే, అవునా? మీ అనుభవంలోనికి రానిది నమ్మడమంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లే కదా! అలాగని నమ్మకుండా ఉండాలని కాదు. ఎందుకంటే అపనమ్మకం కూడా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడమే. కొందరు ఒకదాన్ని నమ్ముతారు. కొందరు దాన్ని నమ్మరు. ఇద్దరూ ఏదో విషయాన్ని నమ్ముతున్నట్లే కదా. ఒక వ్యక్తి ఇది నిజమని నమ్ముతున్నాడు. ఇంకో అతను ఇది అబద్ధం అని నమ్ముతున్నాడు. ఇద్దరూ తమకి తెలియని విషయంపై ఏదో ఒక అభిప్రాయాన్ని నమ్ముతున్నారు.
సంకల్పం ఉంటే...
"నాకు తెలీదు'' అని మీరు గ్రహిస్తే, మీలోని ఈ వివేకం మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచదు, తెలుసుకోవాలన్న తపన రగులుతుంది. ఈ పన మీలో జ్వలించినప్పుడు మీరెవరో, ఎక్కడ నుంచి వచ్చారో, అసలు మీరేమిటో అనే అంశాలు తెలుసుకోవాలనిపిస్తుంది. అయితే తానెవరో తెలుసుకొని ఆ ఆనందాన్ని అనుభూతి చెందడానికే ఎంత కాలం పడుతుంది అన్నదే ప్రశ్న. పన్నెండేళ్లు యోగా చెయ్యాలా? మీలో సంకల్పం ఉంటే కేవలం ఒక్క క్షణమే చాలు. అవునా? కానీ మీలో సంకల్పం లేదు. ఎందుకంటే మీరు నమ్మకాలతో నిండి ఉన్నారు. మీకు తెలియని ఎన్నో విషయాలని మీరు నమ్ముతున్నారు. కాబట్టి మనం గత జన్మల గురించి, రాబోయే జన్మల గురించి మాట్లాడుకోవద్దు. కేవలం ఈ జన్మ గురించే మాట్లాడుతకుందాం. ఎందుకంటే మీకు తెలిసింది ఇదే. మిగిలినదంతా ఒక కల్పిత కథ. కాదంటారా? - సద్గురు[from andhrajyothy.com]
0 వ్యాఖ్యలు:
Post a Comment