శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అనుగ్రహం-ఆరాధన

>> Thursday, August 30, 2012

అనుగ్రహం-ఆరాధన


మానవ చరిత్రలో అసాధారణమైన వ్యక్తులు ఎందరో అవతరించారు. వారు నింగిలో మెరిసే నక్షత్రాల కన్నా ఎక్కువ వెలుగులను విరజిమ్మారు. కొందరు ఇలా అద్భుతమైన సామర్థ్యంంతో వెలుగులు ప్రసరిస్తుండగా, మరెందరో కోట్లాది మంది, లక్ష్యం లేకుండా పుట్టి, పెరిగి ఏ వెలుగూ లేకుండా ఎందుకు గతిస్తున్నారు? నేను ఇక్కడ వారి జీవితాలను మరొకరితో పోల్చడం లేదు. అలాగే 'ఇది నిరుపయోగం', అది 'ప్రయోజనకరం' అని కూడా చెప్పదలచుకోలేదు. నాకు కనీసం అటువంటి ఆలోచన కూడా లేదు.

కొందరిలో ఎందుకు ఇలా అసాధారణమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి? మరి కొందరు జీవన యాత్రలో నిత్యం ప్రతి చిన్న విషయానికి ఎందుకు పోరాడవలసి వస్తోంది? అన్నది ప్రశ్న. దానికి అందరూ ఇచ్చే సమాధానం వారికేదో 'అనుగ్రహం' ఉన్నది అని. అలా ఎవ్వరూ ఎవ్వరికీ ఏ ప్రత్యేకమైన అనుగ్రహమూ ఇవ్వలేదు. అది మీరే సంపాదించుకోవాలి. దానిని మీరు ఆనందంతో సంపాదించుకోవచ్చు లేదా భావోద్వేగంతో సంపాదించుకోవచ్చు.

అనుగ్రహం అంటే ఏమిటి?
అనుగ్రహం సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అనేక రకాలైన సాధనల ద్వారా ఎవ్వరైనా అది పొందవచ్చు. వాటిలో అతి తేలికైనది, సాధారణమైనది, కాని ఆత్మ విధ్వంసానికి కూడా దారి తీసేది-భక్తి. అసలు ఈ అనుగ్రహం అంటే ఏమిటి? మిమ్మల్ని మీరు ఒక యంత్రంతో పోల్చుకుంటే మీకు ఒక శరీరం, మెదడు, అన్నీ ఉన్నాయి. ఈ అనుగ్రహం అన్నది - కందెన(లూబ్రికేషన్) మాత్రమే. అటువంటి కందెన లేకపోతే మీ యంత్రం ఎక్కడ పడితే అక్కడ బిగిసిపోతుంది. మొండికేస్తుంది.

భూమిపై అటువంటి కందెన లేక బాధపడేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తెలివైన వారే, సమర్థులే కాని జీవితంలో ప్రతి దశలోను ఈ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల నిలబడిపోతున్నారు, ముందుకు కదలలేకపోతున్నారు. కొందరిలో అనుగ్రహం పూర్తిగా ఆవహించి ఉంటుంది. మరి కొందరిలో ఆ జాడలు కూడా కనిపించవు. అటువంటివారి జీవితం నిత్య పోరాటమే. ఈ విధమైన అనుగ్రహం అందుకోవడానికి, అందువల్ల జీవితాన్ని సార్థకంగా నడపడానికి భక్తి మార్గమే సులువైనది.

అయితే మన మనసు ఒక టక్కరి. అది దేనికీ, ఎవరికీ విధేయతతో ఉండదు. మీరు ఎప్పుడూ భక్తిపాటలు, స్తోత్రాలు పాడుకుంటూ ఉండవచ్చు. కాని ఈ భక్తి వల్ల 'నాకు దేవుడు ఏం చేస్తాడు?' అని మీరు లెక్కలు వేస్తుంటారు. ఇలా లెక్కలు వేసుకునే మనసు భక్తి మార్గంలో నిలబడలేదు. ఇలా ఆ మార్గంలో ఉండేందుకు ప్రయత్నించడం కూడా వృథా శ్రమ. అది జీవితాన్ని వ్యర్థం చేయడమే అవుతుంది. నేను ఎన్నో భక్తి పాటలు, సంగీతం వింటూ ఉంటాను. ఇది కూడా ఇలాంటి గారడీయే. అందులో కూడా భక్తి సున్నా.

భక్తి అంటే ఏమిటి?
భక్తుడు అంటే మరొకరికి భక్తుడు అని కాదు. భక్తి అనేది ఒక గుణం, ఒక లక్షణం. ఏకాగ్రతతో, ఒక విషయంపై ఏకోన్ముఖం అయి ఉండడమే భక్తి. ఎప్పుడూ ఒక దానిపైనే నిశ్చలంగా దృష్టి కేంద్రీకరించి ఉండడమే భక్తి. అలా ఒక వ్యక్తి ఉండగలిగినప్పుడు, అతని ఆలోచనలు, భావాలు అన్నీ ఒకే లక్ష్యంపై ఉంటాయి. అలాంటి వ్యక్తికి అనుగ్రహం లభిస్తుంది, అతను అనుగ్రహం అందుకోవడానికి అన్ని విధాలా అర్హుడు.

మీరు దేనికి బద్ధులై ఉన్నారు, ఎవరికి భక్తులై ఉన్నారు అన్నది కాదు ప్రశ్న. 'నేను కూడా భక్తుడిని అవుదామనుకుంటున్నాను అయితే, దేవుడు అసలు ఉన్నాడా లేడా అని నాకు అనుమానం...'ఇటువంటి సందేహాల కొందరి మనసులో ఉంటాయి. మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే, దేవుడు అసలు లేడు, కాని భక్తుడు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. భక్తికి ఉన్న ఒక అద్భుత శక్తి ఏమిటంటే-అది దేవుడిని సృష్టించగలదు.

దేవుడు అనేవాడు లేకున్నా భక్తి తీవ్రతతో ఆ దైవాన్ని పుట్టించవచ్చు. ఆలోచనలకే పరిమితమైన సాధారణ మనసుకి అసలు భక్తి భావన అంటే కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే భక్తులు అని చెలామణి అవుతున్న వారు తమ ప్రవర్తనతో తమను పరమ మూర్ఖులుగా నిరూపించుకుంటున్నారు. వార తమ కుటిల ప్రవర్తనను ఇప్పుడు భక్తిగా చెలామణి చేస్తున్నారు. అలాగే భయంతో ఉండడం కూడా ఈనాడు భక్తిగా చెలామణి అవుతోంది.

ఎవరిది నిజమైన భక్తి?
అసలైన భక్తిలోని ఆనందం తెలిస్తే, అసలు భక్తి తెలివి తక్కువ వారికి కాదు, తెలివైన వారికి మాత్రమే అని గమనించాలి. ఎందుకంటే, భక్తి లేకుండా, జీవితానికి గంభీరత, సమగ్రత ఉండదు. మీ ఆలోచనల అంతరాలలో నుంచి పరిశీలిస్తే, భక్తిలేని జీవితానికి అసలు విలువ లేదని స్పష్టమవుతుంది. ఈ ప్రపంచంలో మీరు గాని, మరి ఎవరైనా గాని, తమ తెలివితేటలతో తమ జీవితం విశ్లేషించుకుంటే, అది ఏమాత్రం విలువైనది కాదు అని తెలుస్తుంది.

భక్తి భావం ఉన్నప్పుడే, జీవితంలో గాంభీర్యత చోటుచేసుకుంటుంది, అప్పుడే దానికి విలువ ఉంటుంది. భక్తి అంటే ఆలయాలకు వెళ్లడం, 'రామ' 'రామ' అంటూ భజనలు చేయడం కాదు. ఏకాగ్రతతో తాను చేపట్టిన పనిని తదేక దీక్షతో ఎవరు చేస్తుంటారో అతడే సహజ భక్తుడు అని గుర్తించాలి. అటువంటి వాడు భక్తుడు కావడానికి ఏ దేవతామూర్తి అవసరం లేదు. అయినా అతడు పరిపూర్ణ భక్తుడే. ఆయన కోసం దేవుడు సాక్షాత్కరిస్తాడు. దేవుడు ఉండడం వలన భక్తి అని కాదు. భక్తి ఉండడం వల్లనే దేవుడు ఉన్నాడు.

భక్తి పరమార్థం
భక్తిని ఒక భావనగా అనుకోవడం ఒకటి. జీవితంలో అన్నిటి కన్నా ఎక్కువ శక్తివంతమైనది భక్తి అని గుర్తించడం మరొకటి. భక్తిని ఒక హృదయస్పందనగా భావించడం వల్ల మీ జీవితం కొంత మేరకు తియ్యగా అనిపించవచ్చను. అయితే భక్తి ప్రయోజనం కేవలం జీవితాన్ని తియ్యగా మార్చడానికి కాదు. ఒక రకంగా ఇప్పుడు మీరు ఉన్న తీరును సమూలంగా మార్చివేయడమే భక్తి పరమార్థం. కొంచెం పురోగతి సాధించడం భక్తి ఉద్దేశం కాదు. భక్తి అంటే ఐక్యమై పోవడం. భక్తి అన్న పదానికి మాలార్థాన్ని గమనిస్తే 'ఐక్యం' అని గుర్తించాలి. అలా ఐక్యం కావాలనుకునే వారే నిజమైన భక్తుడు కాగలరు.
- సద్గురు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP