శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పవనసుత హనుమాన్‌ కీ జై!

>> Tuesday, March 20, 2012


రాజుల్ని జయిస్తే రాజ్యాలు లభిస్తాయి. నిన్ను నీవ్ఞ జయిస్తే సుఖశాంతులు ప్రాప్తిస్తాయి. ఈ సత్యాన్ని చాటి చెప్పడమేగాక, చేసి చూపిన మంగళ మహనీయమూర్తి హనుమంతుడు. రామాయణంలో రమణీయమూర్తి ఆంజనేయ స్వామి. కిష్కింధకాండములో ప్రథమంగా ఆయన దర్శనమవ్ఞతుంది. సంభ్రమః త్యజ్యతాం... 'భయాన్ని విడిచిపెట్టండి అనే అభయ వాక్యంతో హనుమంతుడు గోచరిస్తాడు. కనుకనే, భయాలలో, బాధలలో చిక్కుకుపోయిన వారందరూ, హనుమంతా! నీదే భారమంతా!
అని సమస్తాన్ని వాయుపుత్రుని పాదాల వద్ద సమర్పించి, రక్షణ లభించిందని హాయిగా గాలి పీల్చుకుంటారు. అశోకవనంలో సీతమ్మ కూడా ఆ పనే చేసింది. తన భారాన్ని మోయమని, బాధను తొలగించమని ఆంజనేయస్వామిని అర్థించింది.
త్వమస్మిన్‌ కార్యనిర్యోగే
ప్రమాణం హరిసత్తమ
హనుమన్‌ యత్న మాస్థాయ
దుఃఖక్షయ కరోభవ!
హనుమంతా! నీదే భారమంతా! ఈ కార్యాన్ని నిర్వహించే బాధ్యత నీదే. నీవే ఆలోచించాలి. నీ ప్రయత్నముతో నా దుఃఖాన్ని పోగొట్టు అన్నది సీతమ్మ. తధేతి- అలాగే అన్నాడు హనుమంతుడు. అలాగే చేశాడు. సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు.
మనమూ ఆంజనేయుని ఆశ్రయిద్దాం. అవగాహనతో భక్తిలో చరిద్దాం. ముక్తి ధామాన్ని అలంకరిద్దాం. ఆంజనేయుని ఆరాధించడమంటే ఆ దివ్యాత్మునిలోని అసమాన వైభవమును చక్కగా దర్శించి, దానిని మన బ్రతుకులతో ప్రదర్శించ డమని అర్థం.
హనుమంతుడు రామభక్తుడు. రామకార్యంలో అలుపెరగనివాడు. అభిరుచులను ఆతిథ్యాలను మరచినవాడు. భయమెరుగనివాడు.
సముద్రాన్ని దాటడానికి కూడా వెనుకాడని వాడు. అంతటి వాడైనా అహంకారం తెలియనివాడు.
వినయమును వదలనివాడు. నిర్వేదమును పొందనివాడు. ఇంద్రియ నిగ్రహముతో అకుంఠిత కార్యదీక్షతో జీవితమును సాగించి భక్తలోకానికి ఆదర్శమై భాసించాడు.
హనుమంతుడు వానరుడు. అయినా నరులకు, సురులకు కూడా పూజనీయుడయ్యాడు. ఆ మహితాత్ముని బాటలో మనమూ చరించి తరించె దము గాక! మహాజనో యేన గత స్స పన్థాః
మహాత్ములు పోయిన మార్గమే మార్గం. ఈ మహావాక్యాన్ని నిరంతరం మదిలో పదిల పరచుకొని, హనుమంతుని పవిత్రబాటలో సదా పయనించెదము గాక!
పవనసుత హనుమాన్‌ కీ జై!

---------------------స్వామి సుందర చైతన్యానంద

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP