పాహి ! దత్త ప్రభో ! పాహి దత్త ప్రభో ! [నిన్న నాజీవితాన కురిసిన దత్తకృపావర్షం]
>> Monday, April 5, 2010
దత్తలీలలు అనూహ్యంగా ఉంటాయి .ఆయన కరుణ ఎవరిమీద ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవరూ ఊహించలేరు. పరీక్షా నిష్ఠుడైన స్వామి ఒక్కోసారి అత్యంత కఠినంగా పరీక్షిస్తాడట . మరొకసారేమో అడగకుండనే ఆయన అనుగ్రహం ముంచెత్తుతుందట. నిన్న నాపై స్వామి కురిపించిన అనుగ్రహం నాసుకృతం అనేకంటే దీనులను, హీనులను కూడా అపార దయతో బ్రొచే దత్తప్రభువు కృపకు ఉదాహరణ అనేది నిజం .
నిన్న మా పెద్దబ్బాయి ఫీజు విషయం మాట్లాడి చెల్లించి రావాలని ఆదివారం తాడేపల్లి గూడెం వెళ్లాను . అక్కడకెళ్లాక మధ్యాహ్నం నేనొచ్చిన సంగతి ఆఊర్లోగల మన బ్లాగర్ జగదీష్ రెడ్డిగారికి తెలియజేశాను. ఎప్పటినుంచో ఆయన ఒకసారి రమ్మని అడుగుతున్నారు. ముందు కాలేజీ కివెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పగా ఆయన వారి బంధువును ఒకరిని పంపి కాలేజీదగ్గర దించి వచ్చారు. అక్కడకెళ్లాక ముక్కామల లో ఉన్న ప్రముఖ హనుమదుపాసకులు హనుమత్తత్వ ప్రచారకులు వెంకట్రామయ్య గారికి ఫోచేశాను నేను ఇక్కడకొచ్చానని. ఆయన సంతోషించి ఎలాగూ ఇక్కడకొచ్చారు కనుక తణుకు వరకు రండి. నేను అక్కడకొస్తాను ఒకసారి మిమ్మల్ని కలసి మాట్లాడాలని ఉంది దగ్గరే ఇక్కడకు అని అడిగారు. ఆవిషయం జగదీశ్ రెడ్డిగారికి చెప్పి ,ముందు తణుకు వెళ్లి వారితో మాట్లాడి మీ ఇంటి కొస్తాను అని చెప్పాను. తణుకు వెళ్ళేసరికే వారు నాకోసం వచ్చి ఎదురు చూస్తున్నారు .వారి ఆప్యాయతకు ,అభిమానానికి కృతజ్ఞతలు . వారు ఆపట్టణం లో ఉన్న వారిశిష్యుల ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కొంచెం సేపు
సత్సంగం ,హనుమత్పూజ అయ్యాక ఆప్రాంతం లోకూడా ఈసంవత్సరం "హనుమత్ రక్షాయాగం" జరపుటగూర్చి చర్చించాము. ఆసమయం లో ఆయన మాస్టర్ గారూ ! మీకు మా అబ్బాయి దత్తాత్రేయులవారి చిత్రమునొకటి ఇవ్వమని,ఒకసారి పిఠాపురం లోని శ్రీపాదవల్లభుల దర్శనం చేయించమని చెప్పాడండి . మీరు ఉంటే వెళ్ళివద్దాము రేపు అన్నారు . నేను ఈరాత్రికే తాడేపల్లిగూడెంలో వారితో మాట్లాడి తిరుగుప్రయాణం అవ్వాలండి ,పదవతరగతి పిల్లల చివరి పరీక్ష ఉంది .అని చెప్పాను . ఈమధ్యలో దత్తస్వామి ప్రసక్తి రావటం ఆయన అనుగ్రహమే.
నాకు ఇదే మొదటిసారిఈ ప్రాంతం రావటం కనుక కొత్త. అనుకోకుండా స్వామీ ఇక్కడకు "చివటం" ఎంతదూరమండి ? అని అడిగాను . చివటం ఇక్కడేనండి మూడుకిలోమీటర్లే అన్నారు. అక్కడ మహాసమాధి చెందిన అవధూత, దిగంబర యోగిని "చివటం అమ్మ" గారి దర్శనం చేయాలనే ప్రగాఢకోరికతో ఎవరైనా కాస్త బండిమీద వదిలిపెట్టిరమ్మనగలరా ? అని అడిగాను ,వేంకట్రామయ్య గారి శిష్యులు [పేరు గుర్తు రావటం ] నేనొస్తా పదండి అని బయలుదేరారు. అక్కడ ఆథ్యాత్మిక వాతావరణం లో సంస్కారవంతులై ఉన్న ఆసాధనామండలి సభ్యుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాను. వారందరి అభిమానానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరొకసారి.
పదినిముషాలలో అమ్మ మహాసమాధి మందిరానికి చేరుకున్నాము. అమ్మ మహాసమాధిపై ఉంచిన మూర్తి నేత్రాలనుంచి ప్రసరిస్తున్న దయ ప్రేమ ,తీక్షణత మనసులోపొరల్లోకి దూసుకుని పోతున్నాయి. తన్మయత్వం కలుగుతున్నది , మనసు ఎక్కడ నిరామయమవుతుందో ఎక్కడ మనస్సుకు అపారమైన శాంతి కలుగుతున్న అనుభూతి లభిస్తాయో ,అది సద్గురు స్థానమని పెద్దల సూచన ప్రత్యక్షంగా కనపడుతున్నదచట . అమ్మ కు ప్రదక్షిణాదులు చేసుకుని [అయ్యో ! మరచిపోయాను ఇప్పుడుగుర్తుకొస్తున్నది. సద్గురువుల సన్నిధికి ఉట్టిచేతులతో పోరాదు ,బుద్దిహీనతవల్ల కలిగిన ఈబిడ్ద తప్పును .కరుణారాశి అమ్మ క్షమించుగాక] అక్కడ సుదీంద్రబాబుగారి స్థానమునకు నమస్కరించుకుని అలాగే అక్కడకు విచ్చేసిన కొండమోడు ఆశ్రమాధిపతులైన స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వచ్చేశాను.
తాడేపల్లి గూడెంలో నాకోసం ఎదురుచూస్తున్న జగదీష్ రెడ్డిగారింటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించాను .వారికుటుంబసభ్యుల సంస్కారం ఎంతో ఉన్నతమైనది. అనుకోకుండా జగదీష్ రెడ్డిగారి నోట మరొకసారి స్వామి ప్రసక్తి వచ్చింది. ఇప్పటివరకు గుప్తంగా ఉంచబడ్డ శ్రీపాదశ్రీ వల్లభుల సంపూర్ణ చరిత్రను ఒకమహాభక్తుడు లక్షలరూపాయల వ్యయంతో ముద్రిస్తున్నారు ప్రింటింగ్ పూర్తయినది మా ప్రెస్ లోనే. మొదటిప్రతిని మీకివ్వాలని అనుకుంటున్నానండి అని తెచ్చి ఇచ్చారాయన.
నిజంగా దత్తప్రభువు దయకు వర్ణించడానికి మాటలు రావటం లేదు.ఇలా ఆయన స్మరణ కూడా సరిగాచేయటం చేతగాని నాలాంటి నికృష్ట జీవులపైనే కరుణకురిపించి ,దర్శనమిప్పించి తన చరిత్రను ప్రసాదంగా ఇప్పించిన స్వామి , ఇక నిత్యం ఆయనను ఉపాసించి ధ్యానించు యోగులను , భక్తులను ఎంతగా అనుగ్రహిస్తాడో కదా !
. అన్నట్లు చెప్పడం మరచాను ,. నేను ఈపోస్ట్ కాక చివరగా, శ్రీగురుచరిత్రనుండి అసంకల్పితంగా వ్రాసిన పోస్ట్ "దత్తానుగ్రహ సాధన". ఇలా వ్రాయడం ,వరుసగా స్వామి అనుగ్రహం అనుభవం లోకి రావడం , యాదృచ్చికమేనా ? గమనించుకోలేని నామంద బుద్దికి తన అనుగ్రహం ఎలా ఉంటుందో రుచి చూపించుటకు దత్తస్వామి జరిపిన లీలా ? ఏమో . అర్ధం కాని మూర్ఖత్వం నాది. అపార కరుణావృష్టి దత్తప్రభువుది. అందుకే అన్నారు స్వామి "స్మర్తృగామి"[అంటే స్మరణమాత్రం చేత సంతుష్టుడు] అని.
స్వామి అనుగ్రహ ప్రసాదంగా నాకు లభించిన శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ దివ్యచరితామృతమ్.ఇది
దత్తాం భజే .గురు దత్తాంభజే
3 వ్యాఖ్యలు:
మీలాగే అనుకోకుండా నేను కూడా ఒక సరి చివటం వెళ్లాను, చాల ప్రశాంతంగ వుంటుంది.. చివటం అమ్మ గారు వచ్చిన వాళ్ళని ఏదో ఒకటి తినకుండా వెల్లనివ్వరు.. ఈ సరి ఇండియా వచినప్పుడు వెళ్లి రావాలి.. ప్రతి గురు పౌర్ణమి కి అన్న దానం జరుగుతున్దనుకుంట.. నేను 5 సంవసరాల క్రితం వెళ్లాను..
పిఠాపురం దర్శనం తర్వాత మీ వివరణ నిజం గా దత్తమహిమే మాకు...శివ కుమార్.
ఎవరెవరు ఎంతెంతెంతగా నన్ననుసరిస్తారో అట్టి వారినంతంతగానూ నేనూ అనుసరిస్తాను సుమా! అని మీకు రుజువు చూపాడా శ్రీ గురుదత్త.
దత్తానుగ్రహ పులకిత గాత్రుడా! నమో నమః.
Post a Comment