శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఒక మంచి వ్యాసం

>> Wednesday, March 31, 2010

వినోదం- వ్యసనం
- ఎర్రాప్రగడ రామకృష్ణ
జూదానికి పిలుపు రాగానే ధర్మరాజు ప్రయాణమయ్యాడు. అక్కడ ఉన్న ధేమ్యుడు కలగజేసుకుని 'ఆట ఆటలా ఉండాలిగాని, అరిష్టాల దాక పోరాదు' అని హెచ్చరించాడు. 'అబ్బే, ఇది సుకృత్‌ ద్యూతమే' అంటూ వెళ్ళాడు ధర్మజుడు. మొదలుకావడం వినోదంగానే మొదలైంది. క్రమంగా వ్యసనరూపం దాల్చింది.

నూతన సభ ప్రారంభం అన్నారు- వెళ్ళాం. కాసేపు కాలక్షేపానికి పాచికలు అన్నారు- ఆడాం. పందెం లేకపోతే మజా లేదన్నారు- కాశాం. ఆరోజు హస్తవాసి బాగోలేదు, కొంత పోగొట్టుకున్నాం, ఇంటికి వచ్చాం... అన్నట్లుంటే- అది వినోదమే అయ్యేది. ఒళ్ళు మరచిపోయి పందాలు ఒడ్డే స్థితి వచ్చిందంటే- అది వ్యసనమే! ధర్మరాజు విషయంలో జూదం కచ్చితంగా వ్యసనమేనని భారతం చెబుతోంది.

ఏ పెద్ద పండుగ రోజునో అయినవాళ్ళంతా చేరినప్పుడు కాలక్షేపానికి పేకాడుకుంటే- అది క్రీడా వినోదం. రోజూ క్లబ్బుల్లో కూర్చుని చేతులు కాల్చుకుంటే- అది ద్యూతవ్యసనం. తోక బిళ్ళలు అంటించిన ప్రామిసరీనోట్లతో సహా పెట్టుబడిదారుడొకడు సిద్ధంగా కాచుకుని ఉంటే- మొదట జేబులోది, ఆపైన ఒంటిమీదది కరిగిపోయి, నోటి మాట కూడా దాటిపోయి నోటుమాటకు తెగించి సంతకాలకు సిద్ధపడిపోవడం... ఓడిన కొద్దీ రెచ్చిపోవడం... పెద్దపేకాట వ్యసనం.

నిరంతరం ధారావాహికల్లో మునిగిపోయి, వీధి తలుపులు వేసి ఉన్నాయో లేదో చూసుకోకుండా ఎవడేనా ఇంట్లో దూరినా తెలియని స్థితిలో ఉంటారు కొందరు. కథానాయిక కష్టాలకు కరిగిపోతూ, చీరకొంగు చేతివేళ్ళకు చుట్టబెట్టుకుంటూ, కథలో లీనమై కళ్లు ఒత్తుకుంటూ రక్తపోటు తెచ్చుకోవడం- ధేమ్యుడు చెప్పినట్లు ఇంటికీ ఒంటికీ కూడా అరిష్టం.

మృగయావినోదం ప్రభువులకు ముచ్చట. క్రూరమృగాలను వధించడం, వాటి బారినుంచి ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభువుల బాధ్యత. కనుక, వేట వారికి ధర్మమే. అంతేకాదు, శాకాహారంతో సరిపెట్టుకోవలసిన అగత్యం వారికి లేదు. పరివారం కోసం కూడా. మృగాలను వేటాడవచ్చు. ఈమాట అగస్త్య మహర్షి స్వయంగా చెప్పాడు. 'క్రూరమృగాల వధ మా కర్తవ్యం. మృగయా వినోదం మాకు వేడుక. ఇందులో దోషం ఏమీ లేదు' అని వాదించాడు పాండురాజు. అందుకనే కిందముడు అనే మునిశాపానికి గురయ్యాడు. వినోదానికీ వ్యసనానికీ గల తేడాను చెప్పిన ఈ కథ భారతంలోది.

వేటకు పోతూ పాండురాజు తన భార్యలిద్దరినీ వెంటపెట్టుకుని మరీ వెళ్ళాడు. వారు చూస్తుండగా తన మగటిమిని, పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించే క్రమంలో పాండురాజు కర్తవ్యం, క్షత్రియ ధర్మం రెండూ వ్యసనంగా పరిణమించాయి. లేళ్ళ రూపంలో రతిక్రీడ సాగిస్తున్న కిందముడనే మునిని, ఆయన భార్యను పాండురాజు వధించాడు. 'నువ్వు చేసింది తప్పుకదా!' అని నిలదీశాడు కిందముడు. రాణులను వెంటబెట్టుకుని వేటకు రావడం ఒక తప్పు. భార్యలు చూస్తుండగా రెచ్చిపోయిన గజేంద్రుడిలా, పాండురాజు వేటను ధర్మంగా కాక- పరాక్రమ ప్రదర్శనగా భావించడం రెండో తప్పు. రతిక్రీడలో ఉన్న మృగాలను హింసించడం మరో తప్పు. 'తప్పయింది' అని ఒప్పేసుకుంటే పోయేదానికి- అగస్త్యుడి మాటలు ఉటంకిస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునేలా వాదించడం అన్నింటికన్నా పెద్దతప్పు. ఆడవాళ్ళు చూస్తున్నారని రతికి పాల్పడిన గజేంద్రుడు మొసలినోట చిక్కినట్లు- పాండురాజు కిందముడి శాపానికి గురయ్యాడు. 'మైథున క్రియలో ఉన్న మా పట్ల అతిగా ప్రవర్తించావు కనుక మైథునమే నీకు మరణం అవుతుంది' అని కిందముడు శపించాడు.

వినోదం సంతోషాన్నిస్తుంది. వ్యసనం, అరిష్టాన్ని తెస్తుంది. అతిగా పరిణమించిన వినోదమే వ్యసనంగా మారుతుంది. అదీ ఈ కథలో సందేశం!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP