యథాప్రజా ! తథారాజా !
>> Sunday, April 26, 2009
కొంచెం మార్చి చెప్పినట్లుగావున్నది కదా ! అవును పరిస్థితులు తల్లకిందులుగా నడుస్తున్నప్పుడు సిద్ధాంతాలు కూడా ఇలానే తల్లక్రిందులవుతుంటాయి మరి. గతములో పాలకుడెలాంటివాడో ప్రజలు కూడా అటువంటి ఆచరణ కలిగినవారుగా తయారవుతారని "యథారాజా !తథాప్రజా ! అని చెప్పేవారు. ఇప్పుడు ఆపాలకులను ఎన్నుకొనేది ప్రజలేకనుక వారి మనోభావాలననుసరించి పాలకులు ఉద్భవిస్తున్నారు.
పూర్వం ప్రజలు ధార్మిక చింతన కలవారై సత్య ధర్మ పరాయణత్వముకలిగి కలిగి యున్నప్పుడు ఋజువర్తనులు,త్యాగపురుషులు మహావీరులు పాలకులుగా వచ్చేవారు .అతని ఆచరణను అనుసరించి వారు కూడా చక్కని జీవితాన్ని సుఖ సంతో షాదులను పొంది.సృష్టి లోని సమస్త జీవరాశికి మితృలుగా సహజీవనము సాగించ ప్రయత్నించేవారు.
మరిప్పుడేమవుతున్నది? పాలకులంటే దోచుకునేవారుగా ,ఆక్రమణలు చేసుకునేవారిగా .స్వార్ధపరులుగా మారిపోతున్నారు. రాజకీయాలలావున్నాయి, ఎవడు వచ్చినా దోచుకోవటమే పని . స్వార్ధము పెరిగిపోయినది అని మనము విమర్శిస్తుంటాము ఎప్పుడూ. కాని అలాంటివారు పాలకులుగా రావటానికి కారణము మనము కాదా?అలోచించిచూస్తే మనమే ఈ అనర్ధానికి కారణము అని స్పష్టమవుతుంది.
ఒక్కసారి ఆలోచిద్దాము. మనలో స్వార్ధపరత పెరిగినప్పుడు మన బిడ్డలకోసమని అడ్డ దారులు తొక్కయినా సంపాదించాలని చూసి మన బిడ్దలకు కూడా అదే మార్గం చూపిస్తున్నాము. కనుక వాళ్ళు స్వార్ధపరత్వాన్ని వారసత్వం గా పొందుతున్నారు. గౌరవించాల్సిన గురువులను జోకర్లుగా చిత్రిస్తూ వచ్చే రచనలను చిత్రాలను నవ్వుతూ చూసి ఆదరిస్తున్నాము గనుక, మనపిల్లలు కూడా గురువులు పెద్దలంటే గౌరవభావము లేనివారిగా తయారయి మంచి వినే ఆసక్తి లేనితరంగా తయారవు తున్నారు. మనము సిగ్గుశరము విడచి పశుప్రాయమైన ,ధర్మ విరుద్దమైన కామాన్ని ప్రేరేపించే సాహిత్యాలను సినిమాలను ఆబగా చూస్తున్నాము కనుక ,అలాంటి ఆచరణ గల వ్యక్తులు తయారవుతున్నారు. రోజురోజుకు అకృత్యాలు పెరగటానికి కారణమిదికాదా. వరుసావాయలేని ఈ పశు ప్రవృత్తినికూడా ప్రోత్సహింఛే మేధావులు సిద్ధాంతాల రాద్ధాంతాలతో మనకు ఏరకమైన మేలును చేస్తున్నారో గాని ,నాయకులవుతున్న యువతకూడా ఇటువంటి కల్మష హృదయాలు గలవారిగా తయారవుతుంటె మనకు మంచి పరిపాలన కావాలంటే ఎలా వస్తుంది.
ఇక ఎన్నికలప్పుడు మనము ధర్మా ధర్మ విచక్షణలజోలికెల్లకుండా మనకులమా,పార్టీయా అని ఆలోచించటము జరుగుతున్నది. ఈసారి మరీ ఘోరము .సిగ్గూ శరము విడచి డబ్బు తీసుకుని ఓట్లు వేసినవాళ్ళే ఎక్కువ మా ప్రాంతములో.ఇందు లో ధనిక పేద బేధము లేదు.ఇక మందు విందులతో వేలాదిమంది దాదాపు ఇరవై రోజులు అభ్యర్ధుల డబ్బును వాడుకున్నారు. మరి ఇలా ఖర్చు పెట్టినవారు సంపాదించుకోకపోతే అడుక్కుతింటారు తరువాత కనుక తప్పనిసరిగా పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదించుకోవాలని చూడటములో తప్పులేదుకదా?
మనవాడైతే చాలు వాడు చేసే తప్పులను పట్టించుకోక సమర్ధించేమనము వానివలన జనానికి జరిగే హానికి కారకులము కామా? ఇక్కడ మనస్వార్ధపరత,ధర్మ విచక్షణలేని అభిమానము ఇలాంటీ్ నాయకులు తయారవ్వటానికి కారణముకాదా?
ఈమధ్య మా మాస్టర్ గారొకయన మాట్లాడుతూ " రాజకీయ నాయకులు ,అధికారులు దోచుకుంటున్నారండి ,వీళ్ళ ను నిలబెట్టి కాల్చేస్తే గాని దేశము బాగుపడదు " అని వాదనకు దిగాడు ఆవేశముగా.
నిజమే మాస్టర్ గారూ! బోడి ఐదువందలరూపాయలు ఇచ్చి టీచింగ్ మెటీరియల్ కొనమంటే దానిలో గూడా నాలువందలు కొని ఐదువందలకు ఓచర్లు రాపించేవాల్లు మనలోవున్నాము కదా! వందరూపాయలు నొక్కటానికి అవకాశమున్నపుడు మనము పాల్పడినప్పుడు, వేలు కోట్ల రూపాయల ను నొక్కెయ్యటానికి అవకాశమున్నది కనుక వాళ్ళు అందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మనకు కూడా అవకాశముంటే మనము శుద్దిగా వుంటామనే గ్యారంటీ ఏమన్నావున్నదా? ఐదురూపాయలకైనా పాల్పడే వాడు అవి నొక్కుతున్నాడు.కోట్లు కొట్టెయ్యగలిగినవాడు అవి నొక్కుతున్నాడు. ఇందులో స్థాయీ బేధమేగాని తేడాఏమీ లేదు.
మనమిప్పుడు రాజకీయనాయకులను మరెవరినో దూషించటము కాక ,మనలోనున్న స్వార్ధపరత్వము యెక్క అనర్ధము గమనించాలి. కోట్లుసంపాదించేవాడయినా ,కూలికెళ్ళేవాడయినా తినగలిగేది ఆనాలుగు ముద్దలే.ఇక్కడవుండేది నాలుగురోజులేననే సత్యాన్ని గ్రహించగలిగితేనే గాని ఈ సమస్యలు తీరవు. అంతదాకా ఒకరినొకరు తిట్టుకొని దూషించుకొన్నందువల్ల ప్రయోజనమేముంటుంది.
అందుకే వివేకానందులవారు ఒకసారి చెబుతారు.మనం సామ్యవాదము సామ్యవాదము అంటాము.అదే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతాము. కాని సామ్యవాదపరమైన ప్రభుత్వం వచ్చినదనుకుందాము పదిమందికి పంచమని ఒకరికి అప్పగించిన సంపదను అతను స్వార్ధపరుడయ్యాడనుకో పంచడుకదా? అవకాశమున్నంతవరకు దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రయత్నిస్తాడు.దానివలన సిద్ధాంతము అపజయము పాలవుతుంది. కనుక సంఘము మారితే మనకు మేలు జరుగుతుందనేది కాక .వ్యక్తిగా మనము మారితేగాని సమాజానికి మేలుజరుగుతుందనే సత్యాన్ని నమ్మి అలా బ్రతకడము మొదలు పెట్టాలి .
కాబట్టి మనధర్మ భూమిలో మనిషి ఎలా బ్రతకాలో సూచించిన ధర్మసిద్ధాంతాలను ఆచరణాత్మకంగా పాటించినప్పుడు మన ఆలోచనలకు అనుగుణముగా ధార్మికులైన పరిపాలకులే వస్తారు. యథాప్రజా తథారాజా ఈ కలియుగములో.కాదని రాధ్ధాంతాలతో కాలము గడిపినప్పుడు ఏమార్పూరాదు.ఇది ప్రకృతి బోధిస్తున్న సిద్ధాంతము. పిచ్చిమొక్క విత్తనాలు నాటితే పిచ్చిమొక్కలే వస్తాయి. మామిడి విత్తనాలు నాటితే మామిడి చెట్లే వస్తాయి ,వాదనలవలన వాటి లో మార్పురాదుకదా?
ధర్మో రక్షతి రక్షిత:
4 వ్యాఖ్యలు:
మీ టపాలో ప్రతివాక్యము నిజమే,అందరికీ తెలిసినదే, కానీ దీనికి పరిష్కారమే అర్థము కావటములేదు.ఎవరికి వారు మారాలి. కానీ ఇది మనమంచికోసమే అని తెలిసినా మారుతున్నామా? ముసుగేసుకొని పదిమందికి నీతులు చెప్తాము కానీ మనదగ్గరకి వచ్చేటప్పటికి మనపని మనముచేస్తున్నాము. ఏమిటో, దీనికి అంతము ఎక్కడో ,అర్థం కాకున్నది.
యధా ప్రజా తధా రాజా - అక్షర సత్యం. మీరన్న విషయమే నా పద్ధతిలో చెప్పానిక్కడ: ఇట్నుండి నరుక్కొద్దాం
పరిష్కారం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అసలు సమస్య కూడా మనలోనే ఉందని తెలుసుకోవటమే పరిష్కారం దిశలో మొదటడుగు.
నిజమే మార్పు అనేది మన నుంచి ప్రారంభమయితేనే కదా సమాజంలో మార్పును ఆశించాల్సింది.
రామిరెడ్డిగారూ
నీతులు చెప్పటమే అసలు సమస్య.ఆచరించటమే పరిష్కారం.
అబ్రకదబ్రగారూ
మీరు చెప్పినది నిజమే. పరిష్కారం "మనదగ్గరే" ఉన్నది బాగా ఆలోచించి చూస్తే.
Post a Comment