హనుమత్ రక్షాయాగానికి స్వామి అనుమతి వున్నదా? అనుమానాలు తీరిపోయాయి.
>> Sunday, March 22, 2009
హనుమత్ రక్షాయాగానికి స్వామి అనుమతి వున్నదా? అనుమానాలు తీరిపోయాయి.
జగన్మాత హరిహరసమేతముగా అధివసించివున్న "శ్రీవేంకటేశ్వరజగన్మాత పీఠము"నందు కార్యక్రమాలు ప్రారంభమునుంచి ఒక విచిత్రపద్దతి లో జరుగుతున్నాయి.అది అమ్మ అనుగ్రహమని మానమ్మకము. ఏదైనా కార్యక్రమము చేపట్టాలనుకున్నప్పుడు,దాని పూర్తి వివరాలేకాదు,ఆకార్యక్రమానికయ్యే ఖర్చు,దాని సమీకరణ ఎలా ?అని చూసుకుని ప్రకటించి ప్రారం భిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చిత్రంగా కార్యక్రమము మనస్సులో కి రావటము,దానిని ప్రకటించి మాపని మేము చేసుకుంటూ వెళ్ళటము జరుగుతున్నది.ఎందుకంటె ఇది భగవత్ సంకల్పమని మేము పూర్ణముగా విశ్వసిస్తుంటాము కనుక .అది మాచిత్తభ్రాంతి కాదు సత్యమని నిరూపిస్తూ గొలుసు కట్టుగా ఎవరో నిర్ణయించినట్లు కార్యక్రమాలు వరుసగా అద్భుతమైన రీతిలో ఎక్కడా కొరతలేకుండా సాగిపోతూవుంటాయి. చేతిలో పైసా లేకుండా చివరకు ప్రతిష్ఠముందు వారం రోజులవరకు అమ్మవారి మూర్తి ఎక్కడున్నదో కూడా తెలియకుండా నే చిత్రాచి చిత్రం గా దాదాపు నాలుగు లక్షలపైగా ఖర్చుతో సాగిన ప్రతిష్ఠాకలాప వివరాలను మీకు ఇంతకుముందే మనవిచేసాను గతములో. అక్కడనుండి అదేపద్దతిలోజరుగుతున్న ఒక్కొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అలా జరిగి పోతున్నాయి. కనుక ఈ కార్యక్రమాలకు ఖచ్చితముగా భగవదనుగ్రహము, అనుమతి వున్నాయని పరిపూర్ణముగా విశ్వసిస్తున్నాము.పీఠమును స్థాపించిన మాతాతగారువెంకయ్యగారు,మాపరమగురువులు రాధా సఖి ,శ్రీ రాధికాప్రసాద్ మహరాజ్ గారు బోధించేవారు .ఒరే మనం అమ్మదగ్గర బెగ్గర్లుగా వుండకూడదు.బిడ్దలుగా వుండాలి.బిడ్దలుగా వుంటే బిడ్దకుఎప్పుడు ఏమికావాలో చూసుకోవటము తల్లి బాధ్యత అవుతుంది.అలాబ్రతకటం నేర్చుకో,అప్పుడు నీకేమి అవసరమో అవే తరలి వస్తాయి నిజంగా భగవదనుగ్రహంవుంటే అని బోధించేవారు.అందుకే వారంతటవారు ఏదన్నా మేము కూడా ఈసేవలో పాలు పంచుకోమా అని అడిగినదాకా ఎవరినీ ఏదీ అడగకుండా సాగుతున్నాము భగవత్ సేవలో ఇప్పటివరకు.
ఇక ఇప్పుడు రానున్న సంవత్సరములో భక్తులను ప్రమాదాలనుండి కాపాడటము,వారి జాతక దోషాదులను పరిహరించి సర్వత్రా జయాన్ని కలిగించగల హనుమత్ రక్షాయాగాన్ని స్వామి వారు కలిగించిన సంకల్పానుసారముప్రకటించి ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఆశ్రయించిన వారికి వజ్రకవచమై కాపాడే హనుమంతుని కృప, సులభసాధనమైన భక్తి మార్గం లో సాధకులకు కలిగేలాచేయటము లక్ష్యము. విధి విధానాలను నిర్ణయించేందుకై పెద్దలను సంప్రదించటానికి వెళ్ళి నప్పుడు దీని ఖర్చు ఎంతవుతుంది? ఎంతమందికి అందజేయగలవు ఈ కార్యక్రమాన్ని? ఎలా సమీకరించగలవు వస్తు సామాగ్రిని?ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన కార్యకర్తలవ్యవస్థ నీకున్నదా? అని వారు ఎంతో అభిమానముతోను మధ్యలో ఇబ్బందిపడతానేమోనని అడిగారు. వారికి నేనొకటే విన్నవించుకున్నాను. స్వామీ! ఈకార్యాన్ని స్వామివారే సంకల్పించి నాకు ఈసేవను అప్పగించారు.దీనిని ఎంతమందికి చేర్చాలో ,ఎలా చేర్చాలో ! ఆయన ఇష్టము. ఖర్చంటారా ,పంచామృతాలు లేనిరోజున నీళ్లతోనే అభిషేకము జరుపుతాను, జపం చేయటానికి పవిత్రహృదయులైన మూడువందలమంది పిల్లలు నాదగ్గర చదువుతున్నారు సిద్దంగావున్నారు వాల్లు.వచ్చిపోయేవాళ్ళకు పరమాన్నం పెట్టలేకపోయినా నాకున్నది పెట్టి పంపగలను. ఇక కార్యకర్తలంటారా స్వామి వారి పరివారమ్ లోకమంతావున్నది వాల్లే వచ్చి చేరతారు.ఎలాజరుగుతుంది అని ఆలోచించటమ్ నాపనికాదు. ఎట్లా చేపించాలో ఆయన ఇష్టము. దానిగురించి ఆలోచించటము లేదు విధివిధానాలలో లోపము రాకుండా నిర్ణయించమని కోరాను. వారంతా ఆశీర్వదించి భక్తిమార్గములో హనుమంతుడు ప్రసన్నుడయ్యేవిధముగా కార్యక్రమాన్ని నిర్ణయించారు.
స్వామి అనుమతి లభించినది. ఇక మాఇంట్లో అలవాటే గనుక కార్యక్రమానికి సిద్దమయ్యరు. ముఖ్యంగా మా అమ్మ్గగారికి పూజా పునస్కారాలకంటె వచ్చినవారికి వండిపెట్టటము ,కడుపునిండా ఆప్యాయంగా వడ్డించటము ఇష్టము.కాబట్టి ఎంత కష్టమైనా పొయ్యిలదగ్గరనిలబడి వంటపనులు చూస్తుంది కనుక ఆవిడ అనుమతి లభించింది.ఇక నా తమ్ముల్లిద్దరు ఏకార్యక్రమానికైనా సిద్దంగావుంటారు ఇబ్బంది లేదు. ఈకార్యక్రమము గూర్చి పైసా ఖర్చు లేకుండా లోకానికందించగల వేదిక ఈ బ్లాగు లోకము.ఎంతోమంది సహృదయులు,భక్తజనులఅందుబాటులోనున్న ఇక్కడనుండే ఈకార్యక్రమాన్ని చేరవేసే ప్రయత్నమునకు శ్రీకారము చుట్టాము. హనుమత్ బంధుకోటి అనూహ్యంగా స్పందిస్తున్నది.
అమెరికానుంచి తోలేటి పవనకుమార్,భాస్కరరామరాజు గార్లు ప్రచారకార్యక్రమాన్ని భుజాలమీదవేసుకుని ఒక లింక్ ఏర్పరచి దానిని బ్లాగర్లు తమబ్లాగులో వుంచేవిధముగా తయారుచేశారు. ఆర్కుట్ లో ఒక కమ్యూనిటీ ని ఏర్పరచారు.చింతా గారు జ్యోతి . లాంటి పెద్దలు సుజాత విజయమోహన్ ,లాంటి భక్తులైనచాలామంది తెలుగుబ్లాగర్లు [అందరిపేర్లు వ్రాయనందుకు మన్నించండి] తమతమ బ్లాగులలో ఈయాగవివరాలను వుంచి ప్రచారము సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి తిలక్ గారు ఈయాగ వివరాలు మరింతమందికి చేరుద్దాము నేను కరపత్రాలను ప్రచురిస్తాను అని ముందుకు వచ్చారు. నెల్లూరునుండి విశ్వనాధము గారు హనుమాన్ చాలీసా కార్డులను ప్రచురిస్తానని అడిగారు, విజయవాడనుండి శ్రీకాంత్ గారు హనుమంతుని గూర్చి ప్రవచనాలను సేకరించి పంపుతూ తాను ఈకార్యక్రమానికి అనుసంధింపబడ్డారు. మొన్న హైదరాబాద్ లో అనుకోకుండా దూరదర్శన్ కార్యక్రమము కోసము వచ్చిన హనుమత్ భక్తురాలు సుజాత గారు కలసి స్వామివారి కిష్టమయిన తమలపాకుల కొరకు ఖర్చుచేయమని నేనడగకుండానే డబ్బుతీసి ఇచ్చారు,అవీ హనుమంతుని కిష్టమయిన సంఖ్యకావటము చిత్రము.శ్రీధర్ దంపతులు అఖండదీపారాధనకు నూనెను మేముసమర్పిస్తామని చెప్పారు. నిన్న అనుకోకుండా గుంటూరు సి.ఏ. ఓ. దుర్గాప్రసాద్ దంపతులు అమ్మవారి దర్శనానికి వచ్చి ఈకార్యక్రమానికి మాసేవలుకూడా తీసుకోమని కోరారు. వెలుగొండ ప్రాజక్ట్ స్పెషల్ కలెక్టర్ పెంచలరెడ్డిగారు ఈకార్యక్రమములో భాగంగా గ్రామ రక్షణకోసము నిర్వహించే సామూహిక హనుమదాభిషేకాలను తమ స్వగ్రామములో నిర్వహిద్దామని కోరారు. నరసరావు పేట నుండి సత్యన్నారయణ రెడ్దిగారు ,మచిలీపట్టణమ్నుండి కారాశ్రీనివాస్ గారిలాంటి భక్తులు ఈకార్యక్రమానికి పరివారమయ్యేందుకు సిద్దపడుతున్నారు.ఇలా రోజూ హనుమద్ భక్తులు కార్యక్రమములో భాగమయిపోతున్నారు.ఈరోజు అమెరికానుండి కుమార్ గారు అలాగే చెరుకూరి దుర్గాప్రసాద గారూ ఈ యాగానికి ఆర్ధికంగా సహాయపడేందుకు వారంతటవారే ముందుకు వస్తున్నారు.వారందరికీ ఈకార్యక్రమానికి ఏమేమి కావాలో వాటిలో ఏసేవ తమకిష్టమో ఆసేవను వారితరపున ఇక్కడ నిర్వహిస్తామని చెప్పాము.ఎందరో భక్తులు తాము ఈయాగములో సూచించినవిధముగా సాధనలో పాల్పంచుకునేందుకు సంసిద్దతను తెలుపుతూ మెయిల్ , ఫోన్ లలో తెలియజేస్తున్నారు. కొన్ని భక్తసమాజాలు సామూహికముగ జరిపేందుకు తయారవుతున్నారు.
ఇప్పుడు ఖచ్చితముగా ఇదినాభ్రాంతికాదు.ముమ్మాటికీ స్వామివారి అనుమతి వున్నది అని నమ్మకము స్థిరపడుతున్నది. ఆయన కార్యక్రమాన్ని ఆయనే నిర్ణయించుకుని.ఆయన పరివారాని ఆయనే కదిలించుకుని ఆయన కిష్టముగా కార్యక్రమాన్ని ఆయనే నడుపుకుంటూ ,భక్తజనుల పాదధూళితో సమానము కాని నన్ను కూడా ఒక పరికరంగా ఉపయోగించుకుంటున్న ఆభక్తజనరక్షకునికి సాష్టాంగప్రణామాలు అర్పిస్తూ మీతో పాటు ఈసేవలో .......................................
భక్తజనదాసుడు
దుర్గేశ్వర
0 వ్యాఖ్యలు:
Post a Comment