శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అవధూత మహాయోగిని మాల పిచ్చమ్మ {అమ్మ}

>> Saturday, July 19, 2008

" దేవుణ్ణిఎవరు చూపిస్తారురా? అసలు వేరేవాడెవరు చూపించగలరు.? దేవుణ్ణి చూడాలనుకునే కాంక్షలోపలినుండి యేరల్లే పొంగిపొరలి లోపలినుండి తన్నుకురావాలి. వీడికి ఎవరు చూపించారురా ? వీడు రాత్రా పగలా అని తెలియకుండా,శ్మశానాలలో చెట్టుతొర్రలలో ,రక్కసి కంపలలో కూర్చునియేడ్చాడు. ఆకలయితే దోసిల్లతో బూడిద నోట్లో పోసుకుని కాలవలో నీళ్ళుతాగి ఆకలి తీర్చుకుని దేవుని కోసం రావి ఆకులా అల్లాడి పోయాడు. అప్పుడుకాని దర్శనం కాలేదు వీడికి," అంటూ రూపం లోవున్న దివ్యమంగళ మూర్తి ,తనను ఆర్తితో భగవంతుని చేసే మార్గం చూపమని అడిగే పండిత ప్రకాండులకు ,దేవుని పట్టుకునే రహస్యమును వివరించేది. ఆమహాత్మురాలే
అవధూత పిచ్చమ్మ.
ఆమె తన గురించి చెప్పేటప్పుడు "వీడు" అనీ "రాముడు" అనీ చెబుతుంది. అమ్మకు అక్షరజ్ఞానం లేదు అయినా అక్షరుని చూసేందుకు సాహిత్య సాంమ్రాట్టులు సహితం అక్షయానందము కోసం ఆతల్లి పాదాలముందుమోకరిల్లేవారు.
అమ్మ మాలకులములో జన్మించింది . అగ్రకులజు లనుకున్న బ్రాహ్మణులు సహితం జ్ఞానభిక్ష కోసం ఆమె నాశ్రయించే వారు. ఆ పాదపద్మాలనర్చించేవారు.
గుడివాడతాలూకా కురుముద్దాలి గ్రామ వాసులయిన వడ్డె ముత్తాయి,వీరమ్మలకు 1870లో జన్మించారు అమ్మ. చిన్నతనమునుంచి కట్టెలా బిగుసుకుపోవడం ,ఎవరో గొంతు పట్టుకున్నట్లు మాట్లాడలేక పోవడం జరిగేది . తల్లిదండ్రులు గాలిచేష్టలని భూతవైద్యం చేయించినా ఆమెలో మార్పు కనపడలేదు. " అమ్మా నాలో ఏదో నాదాలు వినపడుతున్నాయి శంఖువు వే ణువు ఊదినట్లుగా నాదాలు వినబడుతున్నాయి . అవి వినపడగానే నన్ను నేను మరచి పోతున్నాను. అనేది. పిచ్చమ్మకు తనలో తనంత వయస్సుగల అమ్మాయి బంగారపు బొమ్మలా వున్న అమ్మాయి కనిపిస్తుండేది. ఎవరీ అందాల బాల అని తల్లిని అడుగుతుండేది.
పిచ్చమ్మని గుడివాడ తాలూకా తుమ్మలపల్లి గ్రామ పల్లెలో నీలంవారి అబ్బాయి కిచ్చి చేశారు. కాపురానికి వెళ్ళిన తరువాత కూడా ఈమెలో ఈలక్షణాలు కనపడుతుండటం తో మూర్చలదాన్ని మోసం చేసి మాకు కట్టబెట్టారు అని అత్తగారి తరపునవారు పరిహాసం చేసే వాళ్ళు. పిచ్చమ్మకు కూతురు కలిగింది. భాగ్యమ్మ అని పేరుపెట్టారు. కానీ అనతి కాలం లోనే భర్త పరలోక గతుడయ్యాడు. పునర్వివాహానికి ఆమె సుతారమూ ఒప్పుకోలేదు.
భాగ్యాన్ని పిచ్చమ్మ అల్లారు ముద్దుగా పెంచుకునేది. తాను భూస్వాముల పొలాలలో పనిచేసేది.నాలుక కోసినా అబద్దం ఆడియెరుగదు. కండపుష్టి ,ధర్మ పుష్టి గల పిచ్చమ్మ ఇద్దరి మనుషుల పని ఒక్కతే చేసేది. తాను ముఠా మేస్త్రి. తానేకాదు తన ముఠా అంతా ధర్మంగా తీసుకున్న కూలికి తగినట్లుగా ఒళ్ళు దాచుకోకుండా శ్రమించాల్సిందే.
ఊళ్ళో వున్న అన్నకొడుకుకు భాగ్యాన్నిచ్చి పెళ్ళీ చేసింది. కానీ మూణ్ణాళ్ళ ముచ్చటగా అతడు కాస్తా రాలి పోయాడు. పిచ్చమ్మ కూతురుని దగ్గర పెట్టుకుని ఎలాగో కాలం ఈడుస్తుంది.కూతురుకు
మారు మనువు చేయడానికి తాను పూర్తిగా వ్యతిరేకం. కానీ పిచ్చమ్మ అక్క కపిలేస్వర పురమ్నుండి వచ్చి పట్టుబట్టి భాగ్యానికి మారుమనువు చేయాల్సినదేనని తనవెంట కపిలేస్వర పురం తీసుకెళ్ళి మూడుముళ్ళూ వేయించినది. పిచ్చమ్మ అళ్ళున్ని చాలా ప్రేమగా చూసుకునేది. వచ్చినప్పుడల్ల ,రాచమర్యాదలు చేసి రూకలిచ్చి పంపేది. . కానీ అదేమి దురదృస్టమో గాని అతను భాగ్యాన్ని నానా బాధలూ పెట్టేవాడు. సూటిపోటుమాటలతో చిత్రహింసలకు గురిచేసేవాడు. అత్తవారింట్లో బాధలు పడలేక భాగ్యం నూతిలో పడి ఆత్మహత్య చేసుకున్నది. పిచ్చమ్మ కాసంగతి తెలిసి కపిలేస్వరపురమ్లో ఆ నూతివద్దకు పోయి,వలవ లా ఏడూస్తూ కురుముద్దాలి వచ్చేసింది. అంతటితో పిచ్చమ్మ జీవితం పూర్తిగా మారిపోయింది. రాత్రి, పగలు భాగ్యంభాగ్యం అని ఒకటే శోకం .సూర్యచంద్రులే ఆమెను చూడలేక పోతున్నారు.
ఒక గోసాయి ఆవూరు వచ్చాడు. "నిరుడు ఇదే రోజుల్లో ఈవూరు వచ్చాను. ఆ గుడెసెలో నుండి ఏడుపు విన్నాను. ఇప్పుడూ వినిపిస్తోంది ఏమిటికారణం అని గ్రామస్తుల నడిగాడు. వారు పిచ్చమ్మ గాధ చెప్పారు. ఆ గోసాయి పిచ్చమ్మ గుడెసెలోకి వెళ్ళాడు. అరగంట తరవాత బయటకువచ్చి తనదారిన తాను వెళ్ళాడు. పిచ్చమ్మలో మార్పువచ్చింది ఇంకాపెద్దగా ఏడవటం మొదలయినది కాకుంటే ఇప్పుడు ఏడుపు భగవంతునికోసం సాగుతోంది.
ఇల్లు వదలి వేసింది. సకల జీవులకు లయస్థానమయిన రుద్రభూమి ఆమెనివాసం .మృత్యురహస్యాన్ని శోకంతో శోధిస్తున్నది. ఆమెకు మంత్రం లేదు,తంత్రం లేదు. ఏడుపు వట్టిఏడుపు ఏడుపు.
ఎవరన్న
తెచ్చిపెడితే అహారం తింటుంది. ఒక్కొక్కసారి ఆకో అలమో ,కాలవలో వండ్రో,శ్మశానమ్లో బూడిదో కడుపులో వేసుకునేది.
అమ్మ ఏమి చెబితే అది జరిగేది. 1925 లో అమ్మకు ఆశ్రమం కట్టారు. రోజు విడిచిరోజు అమ్మ సమాధిలోకి వెళ్ళేది. ధనం ముట్టుకోదు. అమ్మ ఐశ్వర్యాన్ని "రోత" అనిపిలిచేది. పొర పాటున వెండి బంగారాన్ని ముట్టుకుంటే వళ్ళంతా కాల్చినట్టుందని అల్లాడిపోయేది. మామూలుగా అమ్మ నగ్నంగా అర్ధ నగ్నంగా వుండేది. కామసంకల్పము కలవారు వస్తున్నట్లయితే "వాడి కంట్లో దోషముందిగానీ నాకున దుప్పటికప్పండిరా అనేది.
ఒకసారి సనాతన విప్రులొకరు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మాల కులమునకు చెందినదనే దృష్టితో దూరంగా వుండి మాట్లాడుతున్నాడు. అమ్మ వేదాంత మూలతత్వాన్ని ఇలా వివరించింది. " వడికిన పోగులు మెడలో వేసుకుని గొప్ప కులమని భ్రమ పడుతున్నావు . వడకని పోగులు నీలో వున్నాయి. వెతికి చూసుకో దొరుకుతాయి " అని జ్ఞాన బోధ చేసినది.
అమ్మ ఆథ్యాత్మ బోధ చాలా చక్కగా విడమరచి చెప్పేది". గోంగూర , తోటకూర అనుకున్నార్రా? చేటలో వడ్లుపోసికొనటానికి" .
" వేదాంతం అనపగుగ్గిళ్ళు కావు. ఇనుపగుగ్గిళ్ళు "
ఆత్మయుద్ధం చేయాలి రా .. నా... నీ ....లు లేకుండా పోవాలి. అప్పుడు కనపడతాడు దేవుడు.
" ఎద్దల్లే తిని మొద్దల్లే పనుకుంటే దేవుడు కనపడడు. "
ఇలా ఆథ్యాత్మిక మార్గమెంత కష్టమైనదో సాధకులకు తెలిపేది.
అమ్మ పనుకుంటే ఆమె మీదుగా పాములు పాకి వెళ్ళి పోతుండేవి. అను కోకుండా అమ్మ భారత దేశ యాత్ర చేసింది. వల్లభ నేని అన్నపూర్ణమ్మ, పిన్నమనేని నాగయ్య వంటి భక్తులు అమ్మవెంట వెల్లారు. " యాత్రలకని వెళ్ళాంగానీ ,క్షేత్రాలలో దేవునికంటే ,నాలోని దేవుడే కమ్మగా వున్నాడు" అన్నది అమ్మ . అమ్మ స్థూల దేహానికి ఏమాత్రం ప్రాముఖ్యత నిచ్చేవారు కారు. "ఇందులో గాలి పోతే ఏమున్నదిరా? అనేది. చివరిరోజులలో కర్రపట్టుకుని నడుస్తూ ఈ కట్టెకు,ఈకట్టె సాయం అనేది.
గాంధీగారి హత్య జరిగినదని బాధపడుతున్న శిష్యులతో "పూర్వ జన్మ లో గోవును చంపిన పాపం నాయనా .ఈజన్మలో అది ఇలా పగ సాధించింది అని వివరించిందట.
పండితులనుండి, పామరుల దాకా ఆమెనుమంది ఆశ్రయించారు. శ్రీ వున్నవ లక్ష్మీనారాయణ్పంతులు, శ్రీ వేలూరి శివరామ శాస్త్రి ,గుడిపాటి వెంకటా చలం ,త్రిపురనేని గోపీచంద్ మున్నగువారు భక్తితో దర్శించి తమ రచనలలో ఆమెను ప్రస్తుతించారు. అమ్మ 1951 నవంబర్15న సిద్ధి పొందారు. .... ..... జయ గురుదత్త.

7 వ్యాఖ్యలు:

Sujata M July 19, 2008 at 8:23 AM  

మా అమ్మమ్మ గారింట్లో ఈ అమ్మ ఫోటో ఒకటి పెద్దది ఉండేది. నాకు ఆ ఫోటో లో అర్ధనగ్న స్త్రీ మూర్తి విచిత్రంగా అనిపించేది. అమ్మమ్మ ను అడిగితే, 'మా గురువమ్మ ఆవిడ : అమ్మవారే ' అనేది. అమమ్మ తరవాత, ఆ ఫోటో ఎక్కడో ట్రంకు పెట్టెల్లో దాగిపోయింది. ఈ అమ్మ సంగతి మీ బ్లాగ్ లో తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అమ్మ ఫోటోకీ, శారదా మాత కూ ఏదో సంబంధం ఉంది అనుకునే దాన్ని- ఒక్కోసారి. వాళ్ళు బంధువులేమో అనుకున్నాను చిన్నప్పుడు ! పెద్దయ్యాకా, ఆ బంధుత్వం తెలిసింది.

Naga July 19, 2008 at 10:01 PM  

దండాలు, నెనర్లు.

durgeswara July 20, 2008 at 8:29 AM  

meeku ammanu gurtu chEsE adrustam dakkinamdu aa gurumoortiki satakOTi vamdanaalu. naagaraajuku dhanyavaadamulu

Anonymous November 13, 2009 at 12:49 PM  

naakuavadhootha pihamma gari photo kavali. mee daggara vunte vsgk1983@gmail.com ki mail cheyandi pease.

Anonymous November 13, 2009 at 12:50 PM  

naaku avadhootha pichamma gari photo kavali. mee daggara vunte "vsgk1983@gmil.com" ki mail cheyandi please.

subrahmanyam Gorthi June 2, 2012 at 2:43 PM  

అమ్మ జీవితంలోని సంఘటనలను తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా బాగున్నాయి. అమ్మ జీవితము / బోధలు గూర్చి ఏదైనా పుస్తకము ప్రచురింపబడియుంటే దయతో వాటి వివరములను తెలియ జేయగలరు. అలానే మీవద్ద అమ్మ ఫొటో గనుక ఉంటే, స్కాన్ చేసి నెట్లో గనుక అఫ్‌లోడ్ చెయ్యగలిగితే నాలాంటివారికి అమ్మ ఫొటో చూసే అదృష్టం కలుగుతుండి. నలుగురికీ ఉపయోగపడే మంచి విషయాలను ఓపికగా మీ బ్లాగులో పొందుపరుస్తున్నందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు.

subrahmanyam Gorthi June 2, 2012 at 2:43 PM  
This comment has been removed by the author.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP