భగినీ హస్తభోజనం*
>> Wednesday, November 11, 2026
*భగినీ హస్తభోజనం* ➖➖➖ కార్తిక శుద్ధ విదియ రోజు రెండు విలక్షణ పర్వదినాలు జరుపుకుంటారు. అవి … 1. యమ ద్వితీయ.(భగినీ హస్తభోజనం) 2. చిత్రగుప్తు జయంతి. *యమ ద్వితీయ(భగినీ హస్తభోజనం):*``` అన్నాచెల్లెళ్ల పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ, ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం... అదే భగిని హస్త భోజనం. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. దీనినే ‘భగినీ హస్త భోజనం’ అంటారు. ఈ పండగను భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకొంటారు. దీపావళి అయిన రెండో రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి, ఇష్తమైన పిండి వంటలతో భోజనం పెట్టి తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. ``` *భగిని హస్త భోజనం వెనుక కథ:*``` సూర్య భగవానుని కుమారుడు యముడు. ఆయన సోదరి యమి/ యమున. కార్తిక శుద్ధ విదియ పర్వదినాన యముడు యమున ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి, నుదట తిలకం దిద్ది సాదరంగా లోనికి ఆహ్వానిస్తుంది. యమునికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వండి అన్నకి ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. దీనికెంతో సంతోషించిన యుముడు ఆమెను వరం కోరుకోమనగా, ఏటా ఇదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది. అలాగే అంటూ యముడు వరమిస్తాడు. ఆ పర్వదినాన సోదరి చేతి వంట తిన్న వారికి అపమృత్యు భయం ఉండదని అభయమిస్తాడు. ఈ విధంగా దీపావళి తరవాత వచ్చే రెండో రోజును భగిని హస్తభోజనం పర్వదినంగా జరుపుకొంటారు. ``` *కార్తిక శుద్ధ విదియ పర్వదినాన జరుపుకునే మరొక పండుగ ‘చిత్రగుప్తు జయంతి’*``` సృష్టిలోని 84 లక్షల జీవరాశుల చావు పుట్టుకలను నిర్దేశించే గ్రంథం ‘చిత్రగుప్తుని చిట్టా’ అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుస్తకంలో ఆయా జీవరాశుల జనన, మరణాల సమయం కూడా ఉంటుందని పౌరాణిక కథనం. అసలు ఎవరీ చిత్రగుప్తుడు..? ఎక్కడివారీయన..? చిత్రగుప్తుడి జననం, వంశం, విధి నిర్వహణ గురించి పలు పురాణాలు చెబుతున్నాయి. సృష్టి ఆదిలో ఆయువు తీరిన జీవులన్నీ పరలోకం చేరాయి. పాపపుణ్య విచారణలో యముడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. బ్రహ్మకు తన బాధను మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ ఆలోచిస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోవడంతో 11 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఆయన శరీరం నుంచి నడుముకు ఒక కత్తి కట్టుకుని, కలం, కాగితాల కట్టను చేతుల్లో పెట్టుకుని ఒక దివ్యపురుషుడు ఉద్భవించాడు. బ్రహ్మ అతన్ని యమలోకంలో పద్దుల నిర్వహకుడిగా నియమించాడు. అతనే చిత్రగుప్తుడు. కార్తీక శుద్ధ విదియ పర్వదినాన చిత్రగుప్త పూజను జరపాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో వ్యాపారులు చిత్రగుప్త పూజను నిర్వహిస్తుంటారు. ఈ రోజున తమ ఆదాయ, వ్యయాల రికార్డులను చిత్రగుప్తుని పటం ముందు ఉంచి ప్రార్థిస్తారు. బీహార్లో జరిపే ఛత్ పూజ కూడా చిత్రగుప్తుడికి సంబంధించిందే. ఎర్రటి వస్త్రంపై కలం, సిరాబుడ్డి, కత్తి, ఖాతా పుస్తకాలను ఉంచి పూజిస్తారు. చిత్రగుప్త పూజలో పసుపు, తేనె, ఆవాలు, అల్లం, బెల్లం, చక్కెర, గంధం, సిందూరం సమర్పిస్తారు. కేతువు అనుగ్రహం కోసం ‘ఓం శ్రీ చిత్రగుప్తే నమః’ అనే మంత్రాన్ని జపిస్తారు. జీవుల సంస్కారాన్ని అనుసరించి వారి పాపపుణ్యాలను లిఖించాలని, చిత్రగుప్తుని బ్రహ్మ ఆదేశించినట్లు బృహత్ బ్రహ్మ ఖండంలో ఉంది. యజ్ఞయాగాదుల్లో హవిస్సులు చిత్రగుప్తునికి చెందుతాయని పద్మపురాణం పేర్కొంటోంది. న్యాయ దేవతగా కూడా ఆయనను అభివర్ణించారు. యమ సంహితలో అత్యంత బాధ్యతాయుత విధుల్లో యమునికి సహాయం చేస్తుంటాడని ఉంది. జీవుల పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి చర్యనూ నిగూఢంగా పరిశీలించి లిఖిస్తుంటాడు. శారీరక పాపాలతో పాటు మానసిక దోషాలను కూడా సంగ్రహించగలిగే అతీంద్రియ జ్ఞానం ఇతనికి ఉంది. చిత్రగుప్తుడు లెక్కతేల్చిన అనంతరం యమధర్మరాజు ఆ ఆత్మకు తగిన శరీరాన్ని నిర్ణయించి పునర్జన్మను ప్రసాదిస్తాడు. ఈ యాంత్రిక యుగంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి, పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. అందరూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే! అనుబంధాలను గుర్తుచేసుకోవడమే కాక, రేపటి తరాలవారికి వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరమూ ఎంతో ఉంది``` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷 `

0 వ్యాఖ్యలు:
Post a Comment