శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం లో ఆర్తురాలిని ఆదుకున్న హనుమ మహిమ

>> Sunday, June 16, 2024

  హనుమత్ రక్షాయాగంలో  పాల్గొన్నవారి జీవితంలో జరుగుతున్న  శుభాలను తెలుసుకునే కొద్దీ  హనుమంతుని పట్ల భక్తి ప్రపత్తులు ఉంటే జరిగే మహిమలను చూసి ఆశ్చర్యం కలుగుతున్నది. .గొప్ప సాధనలు లేకున్నా కేవలం స్వామి ఉన్నాడు అని నమ్మి ఆశ్రయిస్తే  సర్వత్రా రక్షకుడై కాపాడుతుంటాడు అనే పెద్దల మాటకు నిలువెత్తు నిదర్శనం గా  కనపడుతున్నాయి. . ఈ సంవత్సరం  పదహారవ ఆవృతిగా  ఉగాది రోజు మొదలై   ఈ నెల రెండవతేదీ  పూర్ణాహుతితో యాగం ముగిసినది. అందులో పాల్గొంటున్న వారి జీవితాలలో జరిగిన శుభాలు ఇప్పుడిప్పుడే తెలియజేస్తూ ఉన్నారు. అందులో  ఒక దీనురాలి జీవితాన్ని ఉద్ధరించిన స్వామి లీల ఇది. 


  హనుమత్ రక్షాయాగం ప్రారంభానికి ముందు  అందుబాటులో ఉన్న ఊర్లకు  రామనామ లేఖనం ,హనుమాన్ చాలీసా పారాయణం, ప్రదక్షిణాలు ఎలాచేయాలి ,సాధన ఎలా కొనసాగించాలో వివరిస్తూ  ప్రతులను పంపుతాము. అలాగే ఆన్లైన్లోనూ వివరాలు బ్లాగుద్వారా ఇతరమాధ్యమాల ద్వారా  పంపుతుంటాము.   ఈసంవత్సరం కూడా అలానే పంపిణి చేసాము. 
ప్రకాశం జిల్లా  కురిచేడు మడలం పొట్లపాడు గ్రామంలో  గొప్ప రామాలయం ఉంది .అక్కడ ప్రసాదాచార్యులు గారు అర్చకులు .అంతే కాక ఆయన కురిచేడు హైస్కూలు లో ఉపాధ్యాయులు కూడాను.  ఆయన నాకు మిత్రుడు.  ఈ ప్రతుల ను ఆయనకు కూడా అందజేసి  అందరికి వివరించి పంచమని చెప్పాను . 
ఆయన శ్రీరామనవమి రోజున వాళ్ళ ఆలయంలో జరిగిన ఉత్సవంలో  ఈ యాగం గూర్చి వివరించి  అందరిని చాలీసా పారాయణం దానికి అశక్తులైతే  స్వామికి చెప్పుకుని రామనామ లేఖనం ప్రదక్షిణాలైనా  చేయమని గ్రామస్తులకు వివరించారు . అందరితో పాటు గ్రామంలో ఒక మహిళ స్వామి నేనుకూడా తీసుకోవచ్చా  నాకైతే చాలీసా చదవటం అవీ రావు . నాపరిస్థితి దుర్భరంగా ఉంది  అని అడిగారు. . 
తల్లీ ! స్వామికి భక్తి ప్రధానం . నీ కష్టాలన్నీ తీరుతాయి .ఆయనకు అత్యంత ప్రీతికరమైన శ్రీరామ అనే మూడక్షరాల నేర్చుకుని వ్రాయి. అని చెప్పారు. అత్యంత భక్తి తో ఆ అమ్మాయి ఈ సాధన కొనసాగిస్తుంది. అప్పుడు మొదలయింది ఆవిడ జీవితంలో పేరుకున్న  చెడుకర్మల నిర్మూలన . శుభఘడియల ఆగమనం.    
ఈ అమ్మాయికి వేరే గ్రామంలో వ్యక్తితో వివాహమైనది  . ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు సంతానం.  కానీ భర్త వ్యసనాలకు బానిస. రోజూ తాగటం తిరగటం. కుటుంబాన్ని పట్టించుకోడు. రెక్కలకష్టంతో పిల్లలను పోషించుకుంటున్నా నిత్య నరకం . ఎన్నివిధాలుగా బ్రతిమాలినా బామాలినా  ఆతను  మారలేదు. పలుసార్లు గొడవపడి పుట్టింటికి వఛ్చినా 
ఏమి మార్పులేదు.  .సంవత్సరాలు గడిచేకొద్దీ పిల్లల భవిష్యత్తు దిగులయింది. .  ఇక లాభం లేదని అతనినుండి విడివడి  పుట్టింటికి వఛ్చినది పిల్లలను తీసుకుని. పుట్టింటికి భారం కాకూడదనుకుని తానే  రెక్కలుముక్కలు చేసుకుని  సంపాదించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నది.ఆమె తల్లిదండ్రులు కూడా తమబిడ్డ జీవితం ఇలా అయ్యినదే అని కుమిలిపోతున్నారు.  తన దుఃఖాన్ని భరిస్తూనే పిల్లలకోసం శ్రమిస్తున్నది.  భగవంతుడు కరుణించక పోతాడా.. నా జీవితంలో మంచి రోజులు రాకపోతాయా అని ఎదురుచూస్తూ గడుపుతున్నది. 
ఈ సమయంలో   హనుమద్ర క్షాయాగం   రూపేణా  స్వామి కరుణ ఆమెపై ప్రసరించటం మొదలయింది. 
ఈవిడ సాధన మొదలుపెట్టిన ఇరవై రోజులకు  భర్త  వచ్చాడు . నాకు నాభార్యాబిడ్డలు కావాలి .అని కూర్చున్నాడు. ఎందుకు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు .. ఇంకా బాధపెట్టడానికా అని   బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ  వానిపై గయ్యిమని లేచారు. 
పొరపాటయింది  నాకు నాకుటుంబం లేని లోటు అర్ధమయినది. నా భార్యాబిడ్డలను పంపమని  వాళ్ళను బతిమిలాడుకున్నాడు. 
నిన్నెంతవరకు నమ్మాలి ? అని అత్తమామలు నిరాకరించినా   ఏలోటూ రాకుండా పోషించుకుంటాను. నాభార్య కంట నీరు రానివ్వనని పలు ప్రమాణాలు చేసి  చివరకు వాళ్ళందరినీ ఒప్పించి  తన భార్యాబిడ్డలను తీసుకుని స్వగ్రామం వెళ్ళాడు. అక్కడనుండి  సకుటుంబంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్సించుకుని తలనీలాలు సమర్పించుకుని వచ్చారు . ఆ అమ్మాయి అత్యంత సంతోషంతో ప్రసాదాచార్యుల వారి వద్దకు వచ్చి కన్నీటితో స్వామి మహిమను పొగిడి తానువ్రాసిన రామ నామ లేఖన ప్రతులను యజ్ఞవేదికకు చేర్చవలసినదిగా అభ్యర్ధించి ఆయనకు అందజేసినదట. 
ఆయన ఈ విషయాన్ని నాకు ఫోనుచేసి  వివరించారు. 
స్వామి కి ప్రణామాలర్పిస్తూ  .......  జైశ్రీరామ్ 




0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP