శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జంతువైనా జన్మసార్థకత చేసుకున్న జీవి గురువాయూర్ కేశవన్

>> Sunday, March 13, 2022

*ఏకదాశి ఉపవాసం ఆచరించే ఏనుగు*

*గురువాయూర్ కేశవన్*

దక్షిణ భారతదేశపు ప్రాచీన హిందూ దేవాలయాలలో ‌ఆలయ సేవల‌లో గజరాజ వాహనసేవ గొప్పదిగా చెప్పవచ్చు. ఎన్నో దక్షిణాది దేవాలయాలలో ఇప్పటికి ఏనుగులను ఆలయాల్లో కైంకర్యాలకి వినియోగించటం అనాదిగా ఒక ఆచారంగా వస్తోంది!
ముఖ్యముగా దక్షిణాదిన కేరళలోని ప్రాచీన ఆలయాల్లో గజరాజులపై భగవంతుని మూర్తులను ఊరేగిస్తారు! ఇలా ఆలయ కైంకర్యాల్లో పేరు మోసిన ఏనుగుల్లో గురువాయూర్ క్షేత్రంలో వెలసిన శ్రీకృష్ణునికి డెబ్భై సంవత్సరాలకు పైగా ఉత్సవాలలో వాహన కైంకర్యాలు నిర్వర్తించిన "కేశవన్" అనే ఏనుగు ఏనుగులకే రాజుగా "గజరాజు"గా పేరొందింది!
అన్ని ఏనుగులకెల్ల భిన్నమైన ఈ ఏనుగు ప్రత్యేకత ఏమిటంటే, కేశవన్ ఎవ్వరు చెప్పకపోయినా ఏకాదశి పర్వదినాన్ని గుర్తుపెట్టుకుని, ప్రతి ఏకాదశికి పూర్తి ఉపవాసం ఉంటుంది! తనపై గురువాయూర్ కృష్ణుని ఉత్సవమూర్తిని మొయ్యడానికి తనకు తానే స్వయంగా వంగి కూర్చుని తన భక్తి శ్రద్ధలను చాటే ఈ ఏనుగు గొప్పతనం చూద్దాం!

*గురువాయూర్ ఆలయానికి కేశవన్ రాక*

పూర్వం గురువాయూర్ ని పరిపాలించే నిలంబూర్ రాజు తన రాజ్యంపై తరచూ శత్రురాజులు దండెత్తి రావటంతో భగవంతుడైన గురువాయూర్ కృష్ణుని ప్రార్థించగా శత్రు దండయాత్రలు క్రమంగా తగ్గిపోయాయట! దానికి కృతజ్ఞతగా 1922లో నిలంబూర్ రాజు వంశీయులు గురువాయూర్ ఆస్థానానికి పది ఏనుగులను దానమిచ్చారట! వాటిలో పదేళ్ల వయస్సు గల కేశవన్ అనే ఏనుగుపిల్ల కూడా ఒకటి!

*కేశవన్ కి కృష్ణుని వెన్న నైవేద్యం:*

మిగిలిన ఏనుగుల కంటే భిన్నంగా కేశవన్ అనే ఏనుగు ఉత్తమమైన గజ సాముద్రిక లక్షణాలున్న మేలు జాతి గున్న ఏనుగుపిల్ల! చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నా కేశవన్ విపరీతమైన అల్లరి చేష్టలతో ఎంతకీ మావటివాని మాటలు వినేది కాదు! ఇది ఎంతో కాలం ఇలాగే గడిస్తే ఏనుగుని నియంత్రించటం కష్టమని తెలిసి అప్పటికి ఆలయంలో ప్రధాన గజమైన పద్మనాభన్ అనే ఏనుగు వద్ద కేశవన్ ని పెట్టారట! అంతే కాక, కృష్ణుడికి రోజూ నైవేద్యం పెట్టిన వెన్నని కేశవన్ కి తినిపించేవారట! భగవంతుని భుక్త శేష ప్రాశన ప్రభావమో లేక పెద్ద ఏనుగు వద్ద భయభక్తులతో ఉండాలనో కానీ కేశవన్ కి  అల్లరి చేష్టలు క్రమంగా తగ్గిపోవటమే కాక, భగవంతునిపై భక్తి కూడా పెరగనారంభించిందిట! ఆలయ ఉత్సవాలకు భగవంతుని విగ్రహాలని  మోసే ప్రధాన ఏనుగైన పద్మనాభన్ తోనే ఉంటూ భయభక్తులు, స్వయం నియంత్రణ, మావటివాడు చెప్పినవి పాటించటం వంటివి నేర్చుకుందట కేశవన్! ఇలా క్రమంగా తానూ ఆలయ ఉత్సవాలలో భాగమై, మిగిలిన ఏనుగుల కంటే భిన్నముగా  అత్యంత భక్తి, శ్రద్ధలతో నియంత్రణతో సద్బుద్ధితో మెలిగేదట కేశవన్! కొన్నాళ్ళకి పెద్ద ఎనుగైన పద్మనాభన్ పరమపదించగా, కేశవన్ ఆస్థాన గజంగా నియమింపబడింది! అప్పటి నుంచి కేశవన్ లో మరింత పరిణతి, మార్పు వచ్చింది! రోజూ ఉదయమే స్నానం ఆచరించి మావటివాడు లేకుండా  తానే స్వయంగా గురువాయూర్ ఆస్థానానికి వెళ్లి ఆలయానికి ప్రదక్షిణలు చేసి ధ్వజం వద్ద మోకరిల్లి ఘింకరిస్తూ నమస్కరించేది! ఆలయంలోకి ప్రవేశించాక మౌనంగా నడిచేది, మలమూత్ర విసర్జన కూడా ఆలయ ప్రాంగణంలో చేసేది కాదట కేశవన్! ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తనకు తానే వహించేదిట! ఆలయ ఉత్సవాల సమయంలో తక్కువగా తినేదిట! తన జీవితాంతం ఏకాదశి నాడు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా పూర్తి ఉపవాసం ఉండేదిట! ఎన్ని పంచాంగాలు చదివినా నెలలో ఏకాదశులు ఎప్పుడు వస్తాయో సరిగ్గా గుర్తుండని మానవుల కంటే ఒక ఏనుగు ఏకాదశి ఎప్పుడు వస్తుందో సరిగ్గా గుర్తుపెట్టుకుని ఉపవాసం ఉండటం నిజంగా దైవ లీల, భగవంతునికి ఆ ఏనుగుపై ఉన్న దివ్యానుగ్రహానికి తార్కాణంగా చెప్పవచ్చు!

*భగవంతుని నేనే మోస్తాను!*

గురువాయూర్ ఆస్థానంలో ప్రతీ ఏడాదీ కుంభ మాసంలో (ఫిబ్రవరి, మార్చి) ఏనుగుల పరుగు పందేలు జరుగుతాయి! ఆ పందెంలో వేగంగా, నియంత్రణతో పెరిగెత్తి, గమ్యానికి ముందు చేరుకున్న ఏనుగుని గురువాయూర్ ఆస్థానం అధికారులు, అర్చకులు సత్కరించి ఆ ఏడాది గురువాయూర్ కృష్ణుని ఉత్సవమూర్తులను మోసే అధికారాన్ని ఇస్తారు! అయితే శ్రీకృష్ణునికి కేశవన్ మీద ఉన్న ప్రేమ ప్రభావమో ఏమో ఆ పందెంలో ఎన్ని ఏనుగులు పాల్గొన్నా ప్రతీ సంవత్సరం కేశవన్ కే మొదటి బహుమతి వచ్చేది! అలా ప్రతీ సంవత్సరం ఉత్సవమూర్తులను ఊరేగింపు చేసే భాగ్యం కేశవన్ కే దక్కేది! అయితే ఒకటి రెండుసార్లు మాత్రం కేశవన్ ఆ పరుగు పందెంలో ఓడిపోవటంతో మరొక ఏనుగుకి ఉత్సవమూర్తులు మోసే అవకాశం లభించింది! అప్పుడు, భగవంతుణ్ణి తనపై ఊరేగింపు చేయరనే దిగులు కేశవన్ కి బలంగానే నాటుకుంది! ఆ బాధ తట్టుకోలేక గుడిలో జరుగుతున్న ఉత్సవంలో దేవుడి విగ్రహాలని మరొక ఏనుగుపైకి ఎక్కించే సమయంలో భయంకరంగా ఘింకరిస్తూ గొలుసులు తెంచుకుని ఆస్థానంలోకి పరుగెత్తుకుని వచ్చేసి ఎవ్వరినీ ఏమీ చేయకుండా మౌనంగా దేవుడి ముందు వంగి తనపై ఎక్కించమని వీపు చూపించిందిట కేశవన్! ఇది పలుమార్లు జరగటంతో గురువాయూర్ ఆస్థాన పండితులు ధర్మ సంకటంలో పడి, మూగ జీవమైనా ఏనుగు కేశవన్ ప్రవర్తనకి ఆశ్చర్యపడి  "దైవ ప్రశ్న" అనే భగవంతుని ప్రశ్న అడిగి సమాధానం తెలుసుకునే ప్రక్రియ ఏర్పాటు చేశారట!
*కేశవుడే నన్ను మొయ్యాలి!*

కేరళ ప్రాచీన జ్యోతిషంలో ప్రశ్నకాండకి పెట్టింది పేరు! ముఖ్యంగా తిరువనంతపురం, గురువాయూర్ వంటి ప్రాచీన క్షేత్రాలలో ధర్మసంకటములు, మానవ మాత్రులు పూరించలేని సమస్యలు ఎదురైనపుడు జ్యోతిషం ప్రకారం ప్రశ్నకాండని నిర్వహించి భగవంతుని ఆజ్ఞని నిర్ణయిస్తారు! దీనిని దైవప్రశ్నమ్ అంటారు! దీనికి తగిన మంచి రోజుని, శుభ ముహుర్తముని ముందుగానే నిర్ణయించి ఇద్దరు ఆస్థాన జ్యోతిష పండితులని ఆహ్వానిస్తారు! ప్రశ్నకాండలో భాగంగా నలుచదరంగా 12 గడులు గీసి ఒక అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఒక బంగారు నాణేన్ని ఆ గడుల్లో పెట్టమని చెబుతారు! అలా వారు నాణెం వేసిన గడిని బట్టి సంఖ్యాశాస్త్రం ఉపయోగించి తగిన లెక్కలు వేసి మనం వేసిన ప్రశ్నకి భగవంతుడు ఇచ్చే సమాధానాన్ని నిర్ణయిస్తారు! ఇక గురువాయూర్ క్షేత్రంలో మిగిలిన ఏనుగులని ఉత్సవమూర్తులని ఎత్తనివ్వకుండా చేసిన కేశవన్ విషయంలో ఇదే దైవ ప్రశ్నని ఆస్థాన పండితులు నిర్వహించగా ఆశ్చర్యంగా, "జీవితాంతం కేశవుడే నన్ను మొయ్యాలి!", అన్న భగవంతుని వాక్కు వెలువడింది! అప్పటి నుంచి తన జీవితాంతం కేశవుడే గురువాయూర్ కృష్ణుడికి ఆస్థాన గజరాజుగా ఉత్సవ వాహకుడిగా తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు! 

*కుష్టురోగిని రక్షించి!*

ఒకనాడు కేశవన్ ని మావటివాడు పక్క ఊరికి తీసుకెళ్లాడు! అక్కడే చాలా సేపు కాలయాపన చేసాడు మావటివాడు! ఇటు ఆస్థానంలో స్వామి కైంకర్యానికి సమయం అయిపోతోందని గ్రహించిన కేశవన్ పలుమార్లు హెచ్చరించినా మావటివాడు పట్టించుకోలేదు! ఇక ఆగలేక కేశవన్ గొలుసులు తెంచుకుని రోడ్ల వెంబడి పరిగెత్తుతూ గురువాయూర్ వైపు వెళ్ళసాగింది! మావటివాడు లేకుండా వీధుల్లో పరుగెత్తుతున్న ఏనుగుని చూసి జనాలు బెంబేలెత్తిపోయి చల్లా చెదురుగా పారిపోయారు! ఇంతలో ఒక కుష్టురోగి ఆ జన సందోహంలో ఎటూ నడవలేక మిగిలిన జనాలు తనని తోసేసి కింద పడేస్తే లేవలేక రోడ్డు మీదనే పడిపోయాడు! అటువైపు పరుగెత్తుకొస్తున్న కేశవన్ ని చూసి జనాలు భయంతో ఆ కుష్టురోగిని ఎంత హెచ్చరించినా లేవలేని స్థితిలో ఉన్న కుష్టురోగి ఇక తాను చేసేది ఏమీ లేక ఏనుగు కాళ్ళ కింద పడి నీలిగిపోతానని నిశ్చయించుకుని అలాగే కూర్చున్నాడు! ఇంతలో అతని వద్దకి వచ్చిన కేశవన్ ఆశ్చర్యంగా అందరూ చూస్తుండగా ఆ కుష్టురోగిని తొక్కలేదు సరి కదా అతని వద్ద ఆగి, అతణ్ణి జాగ్రత్తగా తన తొండంతో పైకెత్తి రోడ్డు పక్కన కూర్చుబెట్టి తన పాటికి తాను పరిగెత్తుతూ వెళ్ళిపోయింది! ఎంత జంతువైనా భగవద్కైంకర్యంలో తలమునకలైన కేశవన్ కి ఇంగిత జ్ఞానం మెండుగా ఉందని అనడానికి ఇదో ఉదాహరణ!

*భగవంతుడే ముందు, మనుషులంతా వెనుక!*

మనుషుల చేత సాకబడే ఏనుగుల్లో స్వాభావికంగా మావటివాడి మాట వినే తత్వమే తప్ప స్వతంత్రంగా ప్రవర్తించే గుణం ఉండదు! కానీ గజరాజైన కేశవన్ ప్రవర్తన మాత్రం  దానికి భిన్నంగా మనుష్యులలో తారతమ్యాలు కనిపెట్టి వారి వారి గుణాలని బట్టి ప్రవర్తించేదిట! ముఖ్యంగా ఉత్సవ సమయాల్లో కృష్ణుని విగ్రహంతో ఎక్కే అర్చకుని తన శిరస్సు, తొండం వంచి సగౌరవంగా ముందు నుంచి ఎక్కించుకునేది! మిగిలిన వారెవరైనా వెనకాల నుంచి కూర్చుని ఎక్కించుకునేది! దేవుడి విగ్రహం చేతిలో లేకపోతే ఎంతటివారైనా సరే ముందు నుంచి ఎక్కడానికి ఒప్పుకునేది కాదు! భగవంతునికే తాను దాసుడనని, మనిషికి కాదని తన ప్రవర్తనతో గట్టిగా ఉద్ఘాటించేది కేశవన్! అలాగే వేరే ఊరు వెళ్ళినప్పుడు మావటివాడికి గౌరవం ఇచ్చి అతడు చెప్పినట్టు నడుచుకునే కేశవన్ గురువాయూర్ లో మాత్రం తాను స్వతంత్రంగా ఉండేది! అయితే ఈ స్వతంత్రతలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత ఉండేది!

*ఏకాదశిరోజు పరమపదం!*

జనాల యొక్క అదృష్టం ఎంతో వారి మరణ సమయంలో ప్రస్ఫుటమవుతుంది అంటారు! అది గజరాజైన కేశవన్ విషయంలో కూడా నిజమయ్యింది! గురువాయూర్ కృష్ణుని కైంకర్యంతో తన జన్మ సార్థకం చేసుకున్న కేశవన్ 70వ వయస్సులోకి ప్రవేశించగానే క్రమంగా శరీరంలో బలం సన్నగిల్లనారంభించింది! 1973లో అప్పటికి యాభై సంవత్సరాలుగా ఉత్సవ దిగ్గజంగా సేవలు అందించిన కేశవన్ ని గురువాయూర్ ఆలయం వారు గొప్పగా సన్మానించి ఆలయ మర్యాదలతో, మిగిలిన ఏనుగులతో కవాతు నిర్వహించి కేశవన్ కి "గజరాజు" అనే బిరుదునిచ్చి గొప్పగా సత్కరించారు! ప్రతీ సంవత్సరంలో డిసెంబర్ నెలలో వృశ్చిక మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశికి "గురువాయూర్ ఏకాదశి"గా, "భూలోక వైకుంఠ ఏకాదశి"గా ప్రసిద్ధి. ఈ ఏకాదశికి నెల రోజుల ముందు నుంచి గురువాయూర్ కృష్ణుని సన్నిధిలో వేల కొలది దీపాలు వెలిగించి ఉత్సవాలు చేస్తారు. వృశ్చిక మాసపు శుక్ల అష్టమి నుంచి ఏకాదశి వరకు ఉత్సవాలు, ఊరేగింపులు కృష్ణ పరమాత్మకు విశేషంగా నిర్వహిస్తారు! అలాగే ఆ ఏకాదశి నాటి రాత్రి జాగరణతో ఆలయం   భక్తులు అంతా చేరి వేల కొలది దీపాలు వెలిగించి స్వామికి నీరాజనాలు సమర్పిస్తారు! ఈ ఉత్సవాలలోనే కేశవన్ ఆస్థాన దిగ్గజంగా ప్రతీ ఏడూ స్వామిని భక్తి శ్రద్ధలతో తనపై మోస్తూ ఉరేగింపుకి తీసుకెళ్లేది! కానీ వయసు పైబడ్డాక నిదానంగా కేశవన్ కి ఉత్సాహం, బలం సన్నగిల్లాయి! 1976వ సంవత్సరంలో వచ్చిన గురువాయూర్ ఏకాదశి ఉత్సవాలలో కేశవన్ బాగా
నీరసించిపోయింది! రెండు రోజుల ముందు అష్టమినాటి ఉత్సవంలో కాళ్ళు తడబడి తూలిన కేశవన్ వీపుపై నుంచి విగ్రహాలని జాగ్రత్తగా దించి మరో ఏనుగుపైకెక్కించారు నిర్వాహకులు! తరువాతి రోజు నవమి, దశమి నాటి ఉత్సవానికి కేశవన్ కి ఓపిక రాలేదు! ఏకాదశి నాడూ, తన జంతు జన్మకి చిట్టచివరి రోజూ రానే వచ్చింది! ఏకాదశి రోజు ఎప్పటిలాగే ఉపవాసమున్న కేశవన్ అంత నీరసంలోనూ ఉదయం వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకుని తన తుది ఘడియలు సమీపిస్తున్నాయని గుర్తించి వడివడిగా అడుగులేసుకుంటూ గజశాల వద్దకి తిరిగి వచ్చి నేలపై కూలబడింది! బహుశ ఆలయంలో మరణిస్తే ఆలయం అపవిత్రమవుతుందని అనుకుందో ఏమో! శరీరంలో సత్తువ పూర్తిగా కరిగిపోయిన కేశవన్ తన దంతాల సాయంతో శిరస్సుని అతి కష్టం మీద పైకెత్తి కృష్ణుని సన్నిధి ఉన్న దిక్కువైపు తల తిప్పి తొండం పైకెత్తి "కృష్ణా!" అంటూ పెద్ద ఘింకారం చేసింది! అదే కేశవన్ తుది శ్వాస! భగవన్నామ స్మరణలో తుది ఘింకారంతో, తన ప్రాణవాయువుతో సహా తన జీవాత్మను కూడా బయటకి లాగి శ్రీకృష్ణుని పాదాల చెంత సమర్పించింది! పరమపద సామ్రాజ్యాన్ని అలంకరించింది!

*కేశవన్ స్మారక విగ్రహం!*

అన్ని ఏనుగులలోకెల్లా విలక్షణమైన, విభిన్నమైన గజరాజు కేశవన్ సేవలని గురువాయూర్ దేవస్థానం గుర్తించి కేశవన్ స్మారక విగ్రహం చేయించి గజశాల ప్రాంగణంలో ప్రతిష్టించారు! ప్రతీ సంవత్సరం గురువాయూర్ ఏకాదశి నాడు విధివత్తుగా ఆలయ మర్యాదలు, కృష్ణునికి ధరింపచేసి శేషవస్త్రం, పూలమాల, ప్రసాదం నైవేద్యంతో ఆలయ మర్యాదలతో అధికారులు వచ్చి కేశవన్ విగ్రహానికి నివాళులర్పిస్తారు! తరువాత ఆస్థాన ఏనుగులు కవాతు చేసి "గజరాజు" కేశవన్ కి గౌరవ వందనం సమర్పిస్తాయి! ఈ సంప్రదాయం ఇప్పటికీ మనం గురువాయూర్ వెళ్తే చూడవచ్చు.

అంతర్జాలం నుండి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP