శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మంగళా దేవి కరుణ

>> Thursday, August 12, 2021

🌼🌿కర్ణాటక లోని కన్నూరు గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తుండేది. ఆ కుటుంబ పెద్ద శివరామకృష్ణ హెగ్డే, ఆయన భార్య మీనాక్షి. వారికి పెళ్లై 15 సంవత్సరాలు దాటినా సంతానం కలుగలేదు. ఎన్నో వ్రతాలు , నోములుచేసారు నోచారు, ఎన్నో తీర్ధయాత్రలు చేసి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు కానీ సంతానం కలుగపోయేసరికి ఎంతో నిరాశకు గురయ్యారు. కానీ వారెప్పుడూ దైవాన్ని దుషించలేదు. వారి ప్రారబ్ధం అలా ఉన్నదనుకుని సర్దిచెప్పుకునేవారు. ఒకరోజు శివరామకృష్ణ ఏదో అత్యవసరమైన పని మీద పొరుగూరు వెళ్ళలని చెప్పాడు. అది శ్రావణ మాసం, వర్షాకాలం అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది.పైగా రేపు మంగళ వారము,మంగళ గౌరీ పూజ ఉన్నది,మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పింది మీనాక్షి. అలానే అని చెప్పి, దేవునిపై భారం వేసి, భార్యను జాగ్రత్తగా ఉండమని చెప్పి తను బయల్దేరాడు.

తను వెళ్ళిన కాసేపటికే ఆకాశం మేఘావృతమై భోరున వర్షం కురవడం మొదలయ్యింది. చిమ్మ చీకటి ఆవరించింది. బయట ఒకటే కుండపోత. వారిది పెంకుటిల్లు, ఇంట్లోకి వర్షం చినుకులు కారడం మొదలయ్యింది. మీనాక్షికి ఎంతో భయం వేసి భగవంతుడిని ప్రార్ధించ సాగింది. అంతలోనే తలుపు తడుతున్న శబ్దము వినిపించింది. ఆ సమయంలో ఎవరయ్యుంటారు,ఒకవేళ తన భర్త తిరిగి వచ్చాడేమో అనుకుని వెళ్ళి తలుపు తీసి చూసింది. మొదటగా సుగంధ పరిమళాల గుబాళింపు, సాంబ్రాణి ధూపం వేసినట్లు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది. నిదానంగా ఆ పొగ తరిగిపోయి ఎదురుగా చేతిలో ఒక దీపం పట్టుకుని ఒక పండు ముత్తైదువ నిలబడి ఉంది. తెల్లటి జుట్టుతో,ఎర్రని చీర కట్టుకుని, పెద్ద రూపాయి బిళ్ళంత ఎర్రని బొట్టు నుదిటిన పెట్టుకుని, కనకాంబరం పూలు పెట్టుకుని, ముఖమంతా పసుపు రాసిన ఛాయతో కళగా ఉంది.

ఎవరమ్మా నువ్వు అని అడిగింది మీనాక్షి, " నేను మీకు దూరపు బంధువును అవుతాను, మీ ఆయనకు నేను బాగా తెలుసు, మాది మంగళూరు అని సమాధానం చెప్పింది ఆ పెద్దావిడ. లోపలకి రామ్మా అంటు పిలిచింది మీనాక్షి, ఆ పెద్దావిడ లోపలికి వచ్చింది. పైకప్పు నుండి వర్షపు చినుకులు పడుతుడడం వలన ఇల్లంతా తడిగా ఉంది. అక్కడే కూర్చున్నారు ఇద్దరు, నేను మిమ్మల్ని ఎరుగను, మావారు కూడా ఎప్పుడ్డూ వాళ్ళ బంధువులను గిరించి నాతో చెప్పలేదు, మీరు ఏ విధంగా మాకు బంధువులు అవుతారో చెప్పమ్మా అని అడిగింది మీనాక్షి. నీ భర్త నీతో చెప్పి ఉండకపోవచ్చు కానీ వాడు నన్ను రోజూ తలచుకుంటాడు. నీక్కూడా నేనెవరో తెలుస్తుందిలే అనింది. అంతలోనే పెద్ద పిడుగు దగ్గరలోనే పడిన పెద్ద చప్పుడయ్యింది.

కంగారు పడకు నేనున్నాను కదా అనింది ఆ పెద్దావిడ. మీనాక్షి కాస్త ధైర్యం తెచ్చుకున్నది, పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నన్ను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే మొదటిసారి అన్నది. అందుకేగా నేనొచ్చాను అన్నది ఆవిడ. వినడానికి వింతగా అనిపిస్తున్నాయి ఆవిడ మాటలు,చేష్టలు. బాగా పొద్దుపోయింది, ఇక నిద్రపో రేపు గౌరీ పూజ చేసుకోవలిగా అనింది ఆ పెద్దావిడ. అవునవును బోలెడంత పనుంది,కానీ నిద్ర పట్టడం లేదమ్మా, భయంగా ఉంది అని చెప్పింది మీనాక్షి. భయపడకు నా వొళ్ళో తలపెట్టుకుని పడుకో,నేనెలాగూ మెలకువగానే ఉంటాను, నీకే భయము అక్కర్లేదు అని చెప్పింది ఆవిడ. అలా పడుకుని నిద్రలోకి జారిపోయింది మీనాక్షి, తెల్లారుతూనే మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పెద్దావిడ వొళ్లోనే పడుకుని ఉంది అని తెలిసింది. అయ్యో ఎంత పని చేసాను , రాత్రంతా నీ వొళ్లోనే పడుకున్దిపోయాను, నిన్నూ నిద్రపోనివ్వలేదే అంటుండగానే, నేను నిద్రపోతే ఎలా ? సరే వెళ్ళి నీ పనులు చేసుకో పూజకు వేళవుతోంది అని చెప్పింది ఆవిడ.

మీనాక్షి చకచకా పనులన్నీ పూర్తి చేసి పూజ ప్రారంభించేముందు ఆవిడ వంక చూసింది. నీవు తయారయ్యావు నన్ను తయారుచేయవా అని అడిగింది ఆ పెద్దావిడ. ఈరోజు మంగళవారము, ఈవిడలోనే ఆ మంగళ గౌరీ దేవి ఉండచ్చు కదా అనుకుని, నలుగు పెట్టి స్నానం చేయించింది. ఆవిడ కట్టుకోవడానికి తనకోసం కొనుక్కున కొన్న కొత్త చీరను ఇచ్చింది మీనాక్షి. కొత్త చీరను కట్టుకుని మీనక్షితో పాటూ పూజ చేయడానికి కూర్చుంది ఆ పెద్దావిడ. పుజంతా పూర్తయ్యాక వాయనం పుచ్చుకుని భోంచేసి తాంబూలం తీసుకుని బయల్దేరింది ఆ పెద్దావిడ.

కాసేపటికి శివరామకృష్ణ వచ్చి ఆలస్యం అయ్యింది, రాత్రంతా కంగారు పడ్డావా, పూజ చేసావా అని హడావిడిగా అడిగాడు. మీరు నిదానంగా కుర్చుని చెప్పేది వినండి. నిన్న సాయంత్రం మీ బంధువులోకరు పెద్దావిడ మంగళూరు నుండి వచ్చింది. రాత్రంతా ఇక్కడే ఉంది, పొద్దున్న పూజ చేసుకుని,వాయన తాంబూలాలు తీసుకుని వెళ్ళింది అని చెప్పింది. మా బంధువులు ఎవరూ మంగళూరులో లేరే, ఎవరయ్యుంటారు అని ఆలోచిస్తుండగా అప్పుడు మదిలో మెదిలింది, మన ఇంటికి వచ్చింది మరెవరో కాదు ఆ మంగళా దేవే, మా పూర్వీకులు మంగళా దేవి భక్తులు. ఆవిడే వచ్చింది అని చెప్పగానే మీనాక్షి ఒళ్ళు గగురుపోడిచింది, ఆనందబాష్పాలు రాలాయి. ఇద్దరూ ఎంతో సంతోషించారు. మనము మంగళూరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నారు.

మంగళూరు వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకోగానే అక్కడ అమ్మవారికి మీనాక్షి పెట్టిన చీరే కట్టి ఉంది. ఇద్దరూ ఎంతో ఆశ్చర్యపోయి, అమ్మవారు చూపిన అసామాన్య ప్రేమకు ఆనందబాష్పాలు రాల్చారు. ఆ రాత్రి వారు ఆలయం ఆవరణ లోనే నిద్ర చేసారు. వారిద్దరికీ ఒకే స్వప్నం వచ్చింది అందులో ఆ పెద్దావిడ కనిపించి తానే మంగళా దేవి అని చెప్పి, వారికి త్వరలోనే ఒక పుత్రిక జన్మిస్తుంది అని చెప్పి, మీకు ప్రసాదంగా ఈ అరటి పండు తీసుకోండి అని చెప్పి అంతర్ధానం అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి వారి ప్రక్కనే ఒక అరటి పండు ఉంది, అది ప్రసాదంగా స్వీకరించారు ఇద్దరూ, మరల అమ్మవారి దర్శనానికి వెళ్ళగా, ఆ ఆలయ అర్చకుడు మీనాక్షి చీరను ఇచ్చి, అమ్మవారు స్వప్నంలో కనిపించి ఈ చీర మీకు ఇవ్వమని చెప్పింది అని చెప్పాడు. వారి ఆనందానికి అవధులు లేవు. అమ్మవారి అనుగ్రాహన వారికి ఒక శుభ దినాన సుపుత్రిక జన్మించింది. ఆ పుత్రికకు
" సర్వ మంగళ " అని పెట్టారు. ఈ లీలను కన్నడ దేశంలోని మంగళూరు ప్రాంతంలో శ్రావణ మాసంలో చెప్పుకుంటారట. ఇటువంటి అనుగ్రహ లీలలు నమ్మి కొలిచే భక్తుల జీవితాలలో లెక్క పెట్టలేనన్ని కలవు. మనకు అమ్మ అనుగ్రహం ఉంటే వాటిలో కొన్నైనా తెలుసుకునే భాగ్యం కలుగుతుంది, వాటిని నమ్మి అంతటి భక్తి శ్రద్ధ నమ్మకం కలిగి ఉంటే మన జీవితాలలోనూ ఇటువంటివి అనేకము జరుగుతూనే ఉంటాయి.

నమ్మి కొలిస్తే అమ్మ పలుకకుండా ఉంటుందా ...

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే

🌼🌿అందరికీ ఆ మంగళ దేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ.....
                         
🌼🌿ఓం శ్రీ మంగళా దేవ్యే నమః🌼🌿🙏

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP