శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అత్తి వరదుని మహిమ మనకెలా తెలుస్తుంది

>> Saturday, August 10, 2019

మొన్న ఆదివారం కంచికి వెళ్ళినప్పుడు స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉండగా,ప్రక్కనే ఉన్న ఒకతను చెప్పిన ఒక విషయం ఎంతో ఆశ్చర్యంగా , ఆనందంగా అనిపించింది. అది మీ అందరితో పంచుకుందామని ఇలా వ్రాస్తున్నాను ...

అత్తి వరదరాజ స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు భక్తులు , నా ప్రక్కనే ఇద్దరు వ్యక్తులు ఏదో విషయమై వాదించుకుంటున్నారు. అదేమిటో విందామని వారి వైపు చూస్తూ , వారి మాటలు గమనిస్తూ ఉన్నాను. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను దేవుడిపై నమ్మకం లేని వాడు, కేవలం స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనే ఉద్దేశంతో అక్కడకు వచ్చాడు. అన్ని గంటలు వేచి ఉండేసరికి విసుగ్గా అనిపించి, దేవుడ్ని దూషించడం మొదలుపెట్టాడు. ఇన్ని గంటలు వేచి ఉండి దర్శనం చేసుకోవడం వలన ప్రయోజనం ఏమిటి ? అంతా చాదస్తం , దేవుడు ఎక్కడ లేడు, ఇంత సేపు వేచి ఉండడం వలన అందరి సమయం వృధా అయిపోతోంది, అయినా దేవుడు మనల్ని కాపాడతాడు అని గుడ్డిగా నమ్మడం మనిషి యొక్క అవివేకం, అంటూ ఏవేవో అంటున్నాడు. తన ప్రక్కనే నిలబడ్డ పెద్దాయన ఒకరు ఇలా సమాధానం చెప్పాడు ...

నాయనా నీకు భగవంతుడిపై నమ్మకం లేనట్లుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావ్, ఆయన కాపాడతాడు అనే నమ్మకం ఉండబట్టే ఇన్ని లక్షల మంది ఇలా బారులుతీరి ఎంతో సమయం వేచి ఉండి దర్శనం చేసుకుంటున్నారు అన్నాడు.ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి సర్, అంతే కాదు యేవో కాకమ్మ కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తుంటారు కొంతమంది పెద్దవాళ్ళు,అవన్నీ కట్టు కధలని వీళ్ళకు తెలియక గుడ్డిగా నమ్ముతుంటారు అమాయక ప్రజలు అని పరోక్షంగా ఈ పెద్దాయనను కూడా ఉద్దేశించి అన్నట్లుగా అన్నాడు ...

నేను చెప్పింది నిజం అని నిరూపిస్తే అప్పుడైనా నమ్ముతావా భగవంతుడు కాపాడతాడని అన్నాడు ఆ పెద్దాయన. ఇప్పుడే నిరుపించండి నమ్ముతాను అన్నాడతను. ఎంతో ఆసక్తిగా అనిపించింది వాళ్ళిద్దరి సంభాషణ నాకు. ఎలా నిరూపిస్తాడు ఈయన అనుకున్నాను నేను. ఆ పెద్దాయన ఇలా అన్నాడు,ఇది దాదాపు 35 సంవత్సరాల క్రితం జరిగింది. మాది తిరుక్కోవిలూరు, మా ఊరి జమీందారు శివరాసన్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన భార్య మాణిక్యాంబ కూడా ఎంతో మంచిది. వారికి పిల్లలు లేరు. అయితే ఒకబ్బాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. శివ రాసన్ గారు చిన్న వయసులోనే కాలం చేసారు. మాణిక్యాంబ గారు ఎన్నో దాన ధర్మాలు చేస్తుండేవారు. వాళ్ళ అబ్బాయి కాస్త పెద్దవాడయ్యాక చెడుమార్గంలో పడి మాణిక్యాంబను తిడుతుండేవాడు,దాన ధర్మాల పేరుతో ఆస్తంతా పాడుచేసొందని కొట్టేవాడు. మేమంతా ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు ఆవిడను ఏదో ఒక ఊరికి తీసుకెళ్ళి అక్కడే వదిలేసి వచ్చేసాడు. మేమంతా ఆవిడ గురించి అడిగినప్పుడల్లా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పేవాడు. మాకు ఏంచేయాలో తెలియలేదు,డబ్బు పలుకుబడి ఉంది వాడికి కనుక ఊరుకున్నాము ...

ఒక పది సంవత్సరాలు గడిచాక నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకావిడను చూసాను, అచ్చం మాణిక్యాంబ గారిలానే అనిపించారు. కానీ ప్రక్కనే ఒకబ్బాయి, ఒకమ్మాయి , ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సందేహం తీర్చుకుందామని వెళ్ళి ఒకసారి పలకరించాను. మాణిక్యాంబ గారు అని పిలవగానే వెంటనే పలికారు ఆవిడ,నన్ను గుర్తుపట్టారు. ఎక్కడున్నారు , ఎలా ఉన్నారు , ఎవరు వీళ్ళు అని అడిగాను.

కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఆవిడకు , ఇలా చెప్పారు. దినకరన్ ( దత్తత తీసుకున్న అబ్బాయి ) గురించి మీకు తెలిసిందేగా వాడు నన్ను ఎంతో హింసించాడు, నన్ను ఒకరోజు తిరుమలకు తీసుకువచ్చి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. నా కర్మ ఇంతే అనుకుని అక్కడే రెండు రోజులు తిండి తిప్పలు లేకుండా ఉండిపోయాను. ఆ రోజు రాత్రి నా దగ్గరకు ఒక 18 ఏళ్ళ కుర్రాడు వచ్చి ఏదైనా ధర్మం చేయమని అడిగాడు. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు,కానీ వాడ్ని చూస్తే జాలేసింది. నా చేతి గాజులు వాడికిచ్చాను, అవి తీసుకుని వెళ్ళిపోయాడు.కానీ కాసేపటికే తిరిగి వచ్చి , నాకూ వాడికీ కావలసిన ఆహరం తెచ్చి తినమన్నాడు. వద్దని వారించినా వినలేదు, ఇద్దరం తిన్నాక,వాడి గురించి అడిగి కనుక్కున్నాను. వాడి తల్లిదండ్రులు చనిపోతే వాడు కూడా చనిపోవాలని తిరుమలకు వచ్చాడట. వాడికి ధైర్యం చాలలేదు చావడానికి, ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. బిక్షం అడుగుతూ బ్రతుకుతున్నాడు. నన్ను అడిగినప్పుడు నా గాజులు ఇచ్చాను. కానీ వాడు వాటిని అమ్మలేదు. మరెవరినో బిక్షం అడిగి ఆ వచ్చిన డబ్బుతో నాకూ వాడికీ కూడా తినడానికి ఏదో కొని తెచ్చి , నాకు పెట్టి , నా గాజులు తిరిగి ఇచ్చేసాడు ...

వాడి కధ విన్నాక జాలేసింది,వాడు ఎంతో బాధలో ఉన్నాడు అని అర్ధమయ్యింది. నా గురించి అడిగి తెలుసుకున్నాడు. వాడికి ధైర్యం చెప్పి మళ్ళీ గాజులు ఇచ్చి ఏదైనా పని చేసుకుని బ్రతుకు, ఇవి అమ్ముకుని కర్చు పెట్టుకో అని చెప్పాను. వాడు నన్ను కూడా తనతో రమ్మని బలవంత పెట్టాడు. ఇద్దరికీ ఎవరూ లేరు,అందుకే ఆ భగవంతుడు ఇలా కలిపాడేమో అనుకున్నాను. వాళ్ళది కోయంబత్తూరు, ఇద్దరం కలిసి కోయంబత్తూర్ వెళ్లాం. గాజులు కొదువ పెట్టి చిన్న హోటల్ పెట్టాడు. ఎంతో శ్రమించాడు , వ్యాపారం బాగా కలిసొచ్చింది. ఎంతో సంపాదించాడు. నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. పిల్లలు లేరని దత్తత తీసుకుంటే వాడు నన్ను వదిలించుకున్నాడు, ఏ సంబంధమూ లేనీ వీడు నన్ను తల్లిలా చూసుకుంటున్నాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో చూసారా, వాడు నన్ను తిరుమలలో వదిలేసాడు,వీడేమో చావడానికి తిరుమల వచ్చాడు అన్నది ...

వాడికి పెళ్లి చేసాను, కోడలు కూడా మంచి అమ్మాయి. పెళ్ళైన మూడు నెలలకే నాకు పక్షవాతం వచ్చి, మంచం పట్టాను. కోడలు నన్ను పసి పాపలా చూసుకుంది. పెళ్ళైన కొత్తల్లో ఏ అచ్చటా ముచ్చటా తీరకముందే, ఇలాంటి పనులు చేయడానికి సాధారణంగా ఇష్టపడరు కానీ వీళ్ళు నన్ను కేరళకు తీసుకెళ్ళి సంవత్సరం పాటు వైద్యం చేయించారు,పూర్తిగా కోలుకున్నాక తిరిగి తీసుకొచ్చారు. ఇద్దరు మనవళ్ళు కూడా ఉన్నారు. అందరం ఎంతో సంతోషంగా ఉన్నాము, దేవుడు ఎవరినీ వదిలేయడు, మనం నమ్మితే తప్పకుండా రక్షిస్తాడు అన్నది. నిజమే ఇంత కంటే నిదర్శనం ఏముంటుంది అనిపించింది నాకు. ఇప్పటికీ ఆవిడ కుటుంబం మాతో సన్నిహితంగా ఉంది అన్నాడు ఆ పెద్దాయన. వాళ్ళ తోనే నేను ఇక్కడకు వచ్చాను, ఆవిడకు మోకాళ్ళ నొప్పులు,నడవడానికి ఇబ్బందిగా ఉంది కనుక వీల్ చైర్ లో ఆవిడను దర్శనానికి తీసుకెళ్ళారు. నాతో వస్తే నీవే అడిగి కనుక్కోవచ్చు,ఇలా ఇక్కడకు ఎందరు నమ్మకంతో వచ్చి దర్శించుకుంటున్నారో వారందరినీ తప్పకుండా భగవంతుడు కాపాడతాడు అన్నాడు ఆ పెద్దాయన.

ఇదంతా విన్నా కూడా ఆ నాస్తికుడి మనస్సు పెద్దగా ప్రభావితం కాలేదు, కానీ ఇది నేను తెలుసుకోవడానికే ఆ పెద్దాయన చేత చెప్పించాడేమో ఆ భగవంతుడు అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడప్పుడూ నేను అనుకున్నవి జరగనప్పుడు, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. నాకే కాదు చాలా మందికి కష్టాలు వచ్చినప్పుడు భగవంతునిపై నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుంది. కానీ మనకు నమ్మకం ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు.తననే నమ్ముకున్న ప్రహ్లాదుని కాపాడేందుకు ఎన్నో ఆపదల నుండి రక్షించి , స్థంబాన్ని చీల్చుకుని అవతరించిన ఆ కారుణ్య మూర్తి , మొసలికి చిక్కి సర్వస్య శరణాగతి చేసిన గజేంద్రుడిని కాపాడిన ఆపద్భాందవుడు , నిండు కొలువులో ద్రౌపతీ దేవిని ఘోర అవమానం నుండి రక్షించిన దయామయుడు ఎవరిని మాత్రం రక్షించడు అనుకున్నాను మనసులో...

 ఆ పెద్దాయన చెప్పిన విషయం ఎంతో ఆనందాన్ని కలిగించింది. 40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే స్వామి వారిని మళ్ళీ ఈ జీవితంలో ఇంకోసారి చూస్తానో లేదో తెలియదు , కానీ జీవితంలో మరువలేని అనుభూతిని కలిగించాడు ఆ అత్తి వరదరాజ స్వామి.

మీరు కూడా తెలుసుకుంటారు , ఈ విషయం మీలో కూడా ఎవరికో భగవంతుని సందేశం అయ్యుండచ్చని ఇలా పోస్ట్ చేస్తున్నాను,అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ... 🙏🙏🙏

ఓం నమో భగవతే వరదరాజాయ                   fromwhatsap

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP