శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వారి ధ్యేయం.. ‘విచ్ఛిన్న భారత్!’ - ప్రొ. ముదిగొండ శివప్రసాద్*

>> Sunday, July 15, 2018

ప్రొ. ముదిగొండ శివప్రసాద్ గారి వ్యాసాన్ని యథాతథంగా క్రింద ఇస్తున్నాను:

*వారి ధ్యేయం.. ‘విచ్ఛిన్న భారత్!’ - ప్రొ. ముదిగొండ శివప్రసాద్*

‘కింగ్’ అంటే రాజు.. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ అంటే రారాజు.. అంటే జీసస్ క్రైస్టు. ‘బ్రేకింగ్’ అంటే విచ్ఛిన్నం. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ను ఆయుధంగా వాడుకొని ఇండియాను విచ్ఛిన్నం చేయాలన్న (బ్రేకింగ్ ఇండియా) కుట్ర మొదలైంది. ఢిల్లీలోని ఆర్చిబిషప్ ఈనెల 21న ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించాలని విజ్ఞప్తిచేశారు. ఆమధ్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అహమ్మదాబాద్ బిషప్ భారత జాతీయ శక్తులను ఓడించండని పిలుపునిచ్చారు.

ఇలా ఎందుకు జరిగింది? భారత్‌లో రామరాజ్యం కాకుండా రోము రాజ్యం తీసుకొని రావాలని వాటికన్ పోప్ ఆదేశించారా?

ఇటీవల నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో ‘శిలువకు, త్రిశూలానికి మధ్య జరుగుతున్న యుద్ధం’ అని క్రైస్తవులు ప్రచారం చేశారు. భారత్‌ను దాదాపు 300 ఏళ్లు ఈస్టిండియా కంపెనీ, బ్రిటీషు వారు పరిపాలించారు. భారత రాజకీయాలను వాటికన్ చర్చి ప్రత్యక్షంగా శాసించటం మొదలుపెట్టింది.

ఏసుప్రభువుకరుణామయుడు అనే విషయంలో ఎవరికీ అభిప్రాయభేదాలు లేవు. కాని ఇవ్వాళ క్రూసేడర్లు ఎవాంజలిజం పేరుతో రోము సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ క్రైస్తవ సామ్రాజ్యవాదానికి ఏసుప్రభువు కేవలం ముసుగు మాత్రమే. ముందుగా ఒక పాఠశాల పెట్టడం ఆ తర్వాత ఒక ఆస్పత్రి, పిమ్మట చర్చి నిర్మించడం మన పల్లెల్లో చాలాకాలంగా జరుగుతున్నదే. పాలపొడి వంటివి క్రైస్తవ అనాథ శరణాలయాలకు పంపటం, కుట్టుమిషన్లు ఇతర గృహోపకరణాలు ఉచితంగా ఇవ్వటం ఆపైన మతం మార్పిడులు మొదలుపెట్టడం- ఇది దాదాపు నూరు సంవత్సరాలుగా పాశ్చాత్య ప్రపంచం చేస్తున్నది.

బిషప్ కాల్ట్‌వెల్ తమిళనాడులో పర్యటించి ఆర్యులు, ద్రవిడులు వేరనే ఒక భాషా సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

నిజానికి భారతదేశానికి పంచద్రావిడులు పంచగౌడులు అనాదిగా ఉన్నారు. ద్రవిడులు భారతదేశంలో అంతర్భాగమే. రాజకీయ లబ్ధికోసం శ్రీలంకలోని సింహళీయులు ఆర్యులని, అక్కడి ద్రవిడులు అనార్యులనే సిద్ధాంతం ప్రతిపాదించారు. ఇది వేలుపిళ్లై ప్రభాకరన్ నాయకత్వంలో ‘స్వతంత్ర తమిళ ఈలం’ పేరుతో యుద్ధానికి దారితీసింది.

క్రైస్తవ వాటికన్ వర్గాలు ఇండియాను మాతం పేరుతో విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉన్నాయి. దీనిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోలేకపోయింది. అందుకు కారణం- ముస్లిం, క్రైస్తవ మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకులుగా చేసుకుని రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవడం.

మతాంతీకరణ ఏ మేరకు జరిగిందంటే- ఒంగోలుకు చేరువలో ఉన్న కరవది అనే చిన్న గ్రామంలో పదివేల జనాభా కూడా లేదు. కాని అక్కడ పది చర్చీలు ఎలా వచ్చాయి? వీరికి ఇన్ని నిధులు ఏయే దేశాల నుండి వస్తున్నాయి? హైదరాబాద్ వంటి నగరాల్లో క్రైస్తవ మిషనరీలు విద్యాసంస్థల పేరిట ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకున్నాయి.

‘మతం ఓ మత్తుమందు’ అనే కమ్యూనిస్టులు ఈ క్రైస్తవీకరణాన్ని ఏనాడూ అడ్డుకోలేదు. కేరళ వంటి రాష్ట్రాల్లో క్రైస్తవ రాజకీయ పక్షాల మద్దతుతో కొన్ని రాజకీయ పార్టీలు వాటి అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీ వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అప్పుడామె ఇండియాలో క్రైస్తవులను హిందువులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారట! రచయిత్రి అరుంధతీ రాయ్ వంటి వారు అమెరికాకు వెళ్లిన సందర్భంలో- భారత్‌లోని క్రైస్తవులు బాధలకు గురవుతున్నారని అన్నారు.

నిజానికి ఫిరోజ్ గాంధీ పార్సీ మతస్థుడు. ఆయన భార్య ఇందిరా గాంధీ, కుమారుడు రాజీవ్ గాంధీ పార్సీ మతస్థులే. అయితే- సోనియా, రాహుల్ వాటికన్ ప్రేరణతో క్రైస్తవ మత దీక్షను స్వీకరించినట్లు ఆధారాలున్నాయి. అంటే ఎప్పటికీ ఇండియా వాటికన్‌కు వలస రాజ్యంగా ఉండాలనే ప్రయత్నం రాజకీయంగా కొనసాగిందని అర్థం.

మన దేశంలో ముందుగా దళిత వర్గాల్లో క్రైస్తవీకరణం భారీ స్థాయిలో జరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని అగ్రవర్ణాల్లోకి కూడా క్రైస్తవ మత బోధకులు చొచ్చుకొనిపోయారు. భారత్‌లో హిందూ మతం అంతరించిందని కంచె ఐలయ్య పుస్తకం రాశారంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అవగతమవుతుంది. రాజకీయ లబ్ధి కోసం కర్నాటకలో ‘లింగాయత్’లకు మైనార్టీ హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. హిందువులను విభజించేందుకు ఇలాంటి ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. హిందువులే అయినప్పటికీ వివిధ కులాల వారు రాజకీయ ఆధిపత్యం కోసం, రాయితీల కోసం కలహించుకుంటున్నారు.

మన దేశంలో హిందువులు బలహీనమైనప్పుడల్లా విదేశీయులు ఆక్రమించుకున్నారు.

పరమ పవిత్రమైన అనంతపద్మనాభ స్వామి ఆలయ నిధులు కమ్యూనిస్టులు స్వాధీనం చేసుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానం సంపదంతా ఏపీ ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోయింది. తిరుమల స్వామివారి ఆభరణాలు విదేశాలకు తరలిపోయినట్లు వస్తున్న ఆరోపణలు నిజమేనా?

కేరళలో కమ్యూనిస్టు పాలకులు హిందువుల పండగలను అవహేళన చేస్తున్నారు. క్రైస్తవుల పండగలను ఘనంగా జరపాలని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితులు మత ఘర్షణలకు దారితీస్తున్నాయి. కేరళలో క్రైస్తవీకరణ విస్తృతంగా జరిగిపోయిందని ప్ర ఖ్యాత రచయిత రాజీవ్ మల్హోత్రా రాసిన ‘బ్రేకింగ్ ఇండియా’ పుస్తకంలో సవివరంగా పేర్కొన్నారు.

సాంస్కృతికంగా హిందుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలూ జరిగాయి. ఉదాహరణకు తమిళనాడులో జరిగిన ఒక సదస్సులో హిందూ సాధువు తిరువళ్లువర్ జీసస్ క్రైస్ట్ బోధలను వింటున్న చిత్రం ప్రదర్శింపబడింది. శ్రీకృష్ణుడు జీసస్ భక్తుడని కూడా ప్రచారం చేశారు. కృష్ణ భక్తి క్రీస్తు భక్తి నుండి పుట్టిందని వ్యాఖ్యానాలు చేశారు.

మయన్మార్ నుండి మన దేశంలోకి వలస వచ్చిన రోహింగ్యాలు హిందువులను చంపుతుంటే- రెండు కోట్ల మంది రోహింగ్యాలకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఏచూరి సీతారాం, మమతాబెనర్జీ వంటి సెక్యులరిస్టులు వాదిస్తున్నారు. భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలో బొట్టుపెట్టుకున్న భారత స్త్రీలపై శ్వేత జాతీయులు దాడి జరిపారు. పలు దేవాలయాల్లో విధ్వంసం జరిగింది.

అమెరికా ఆర్థిక వికాసానికి భారతీయులు విశేష సేవలు చేస్తున్నా- వారిని అక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తారు. అమెరికాలో పూర్వం రెడ్ ఇండియా అనే జాతివారు ఉండేవారు. బ్రిటన్ నుండి వలసవచ్చిన వారు స్థానిక జాతులను నిర్మూలించి అమెరికాను ఆక్రమించుకొన్నారు.

మెక్సికోలోను ఇదే జరిగింది. అక్కడ వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి ఉండేది. దానిని 16వ శతాబ్దంలో స్పానిష్ ఆర్మెడా ఆక్రమించుకుంది. స్థానిక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఎనె్నన్నో చర్చిలు వెలిశాయి.

రాజమండ్రి పేరు చెప్పగానే వేద పండితుల ప్రాంతం అని మనకు గుర్తుకు వస్తుంది. అయితే- ఈరోజు అక్కడ వేదం నేర్పే పాఠశాలలు అరుదు. ఒకప్పుడు 0.5 శాతం ఉన్న క్రైస్తవ జనాభా ఇప్పుడు 12 శాతం దాటింది. గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పెదమక్కెన, అత్తలూరు ప్రాంతాలల్లో క్రైస్తవీకరణం పూర్తిగా జరిగిపోయింది. ఇక్కడ వారు గురుమండలం- ఆలయం- బాల ఏసు ఉత్సవాలు వంటి పదజాలం వాడుతున్నారు. హిందువుల ఆలయాల్లో పూజలు ధూపదీప నైవేద్యాలు వంటివి అన్య మతస్థులు చేస్తున్నారు. వారిని అయ్యవార్లు అని కూడా పిలుస్తున్నారు. ఈ పరిణామం ఎలా జరిగింది?

కళ్లముందు గ్రామాలకు గ్రామాలు హిందూ ధర్మం నుండి దూరమవుతుంటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలు ఓట్లవేటలో నిమగ్నమయ్యారు. ‘హిందూ మతోన్మాదం నశించాలి’ అంటూ వామపక్ష నేతలు నినాదలిస్తున్నారు. 1947లో మత ప్రాతిపదిక మీద భారత్ ముక్కలైన సందర్భంలో- ‘మీకు ప్రత్యేక దేశం లేదా ప్రత్యేక రిజర్వేషన్లు కావాలా?’ అని పార్సీలను కోరినప్పుడు ‘ప్రపంచంలో భారత్‌లో మాత్రమే మాకు హిందూ సమాజం పరిపూర్ణ రక్షణ కల్పించింది. మాకు వేరే అస్తిత్వం అక్కరలేదు’ అని చెప్పారు. అయినప్పటికీ హిందూ సమాజం క్రైస్తవం, కమ్యూనిజం, ఇస్లాంల నుండి నిరంతరం దాడులను ఎదుర్కొంటున్నది.

కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తాము ముస్లిం సమాజం కోసమే పరిపాలిస్తున్నట్టు భావిస్తున్నారు. కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో హిందూ సంస్థల నేతలను, కార్యకర్తలను హత్య చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఒక్క హిందూ సమాజం మీద మాత్రమే ఈ దారుణం ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇందుకు చాలా చారిత్రక కారణాలున్నాయి.

*‘సమాజంలో అకృత్యాలు పెరిగినప్పుడు తాను అవతరిస్తాన’ని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను హిందువులు బలంగా నమ్మారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని హిందువులు ఎవరికివారు స్వంత పనులలో నిమగ్నమయ్యారు!*

*భారత జాతి పతనానికి ఈ ‘అవతార విశ్వాసం’ ప్రధాన కారణం*.

మారుమూల గ్రామాల్లో సైతం క్రైస్తవీకరణం యథేచ్ఛగా జరిగిపోతున్నది. ‘హిందూయిజం చాలా గొప్ప మతం. దానిని అదే కాపాడుకోవాలి..

*అన్యమతాల నుండి హిందువులను రక్షించేందుకు మనమెంత? మనశక్తి ఎంత? భగవంతుడే హిందూత్వాన్ని కాపాడాలి’- అన్నది జాతీయవాది, ప్రఖ్యాత సంపాదకుడు ‘దేశోద్ధారక’ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి అభిప్రాయం, ఇది కేవలం ఆయనది మాత్రమే కాదు .. కోట్లాది హిందువుల ఆలోచనా సరళి కూడా అదే*.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP