శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సరిగ్గా సంవత్సరం క్రితం దేవభూములైన బదరీ,కేదారనాథ్ లలో నేను

>> Wednesday, June 4, 2014



శ్రీరామ
          పవిత్ర హిమాలయాలలో గంగమ్మ తల్లి

కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్నది ఎందుచేతనో వాయిదాపడుతుంది. నాజీవితంలో తప్పనిసరిగా చూడాలనుకున్న హిమాలయ ఋషిభూములను చూసే అవకాశం నిరుడు ఈరోజులలోకలిగింది. గతఏడాది మాతమ్ముడువాళ్లు టూర్లో భాగంగా బదరీ,కేదారనాథ్  యాత్రకు వెళుతూ  నాకు నాభార్యకుకూడా టికెట్ లు బుక్ చేశారు. .కానీ మాకు  వీలవలేదని టికెట్స్ కాన్సిల్ చేసుకున్నాం .
అయితే అనుకోకుండా విజయవాడ వెళ్ళి అప్పటికే ఢిల్లీవరకు  బుక్చెసిన టిక్కెట్ ఉందికనుక బృందావనం వరకు వెళ్ళివద్దామని రైలెక్కాను ఒక్కడినే.  ముందు బృందావనం దర్శించుకున్నాను .అమ్మ రాధమ్మ నామస్మరణతో  రాధే...రాధే   అంటూ పులకరించిపోతున్న పుణ్యభూమి అది. మాపరమగురువులు బృందావనంలో నిర్మించిన రాధామహాలక్ష్మీ ఆశ్రమం కు వెళ్లాను . మధురస్టేషన్ నుండి  బృందావనం వరకు వచ్చిన ఆటోవాడు అక్కడ మాట్ళాడినదానికంటే ఎక్కువచెప్పి వాదన వెసుకుంటాడు, పరమ అబద్దం ఆడతాడు. సరీ మొదట్లోనే తగిలావా నాయనా గొడవకు అనుకుని వాడ్ని వదలి ఆశ్రమంలో కెళ్ళి అక్కడ ఆశ్రమనిర్వహణచూస్తున్న అమ్మఅంజనీమాత కునమస్కరించి  నాప్రయాణసంకల్పం  వివరించాను. అక్కడకొలువై ఉన్న రాధారాణిని దర్శించుకుని  సాయంత్రం యమునాతీరం చేరుకున్నాను. అమ్మ యమునకు ఇస్తున్న హారతిదర్శించాను.  తరువాత ప్రసిధ్ధ రాధామాధవ దేవాలయానికి,ఆపై బాంకే బిహారీజీ మందిర్ కు వెళ్ళి దర్శనం  చేసుకున్నాను, బాంకే బిహారీజీదగ్గర జరుగుతున్న పూజావిధులను చూస్తే మనకేమో కొత్తగానూ,ఉంది అక్కడి భక్తులకు చాలా ఉత్సాహంగానూ అనిపిస్తున్నది. శాస్త్రీయతకంటే అక్కడ ప్రేమ భక్తికే  ప్రాధాన్యత. పూజ్యగురుదేవులు రాధికాప్రసాద మహరాజ్ వారు వ్రాసిన గ్రంథాలలో బాంకే బిహారీజీ చూపిన లీలలు చదివి వున్నందున ఆయననను మనసారా దర్శించుకున్నాను.

 రేపొద్దుటే బదరీనాథ్ వరకు వెళ్ళిరావాలని ఉన్నదమ్మా! అని అంజనీమాతను అడుగగా అమ్మ నవ్వి సరే అన్నారు. రాత్రికి అక్కడే ఉండి పొద్దుటే బయలుదేరాను. అమ్మ నాపై వాత్సల్యంతో  అన్నం వండించి పాక్ చెపిమ్చి ఇచ్చారు దారిలో తినటానికని.
ఇక మధురస్టేషన్ నుండి ః హరిద్వార్ వరకు వెళ్ళాలని మధుర స్టేషన్ కుచేరాను. ట్రైన్ కు చాలాసమయం ఉందని తెలియటంతో  కన్నయ్య నుదర్శించు కోవటానికి మందిరానికి వెళ్ళాను.  సాక్షాత్తూ పరమాత్మ ఆవిర్భంచిన దివ్యస్థలం . ఆజన్మస్థలం దర్శించి మోకరిల్లి పులకరించినది తనువు. పక్కనే బ్రహాండమైన మసీదుగోపురం జన్మస్థలిని ఆక్రమించి   ధర్మాన్ని ఆవరించిన కలిమాయలా, హిందువుల లో లోపించిన  ధార్మికనిష్టకు ప్రతీకలా కనిపిస్తూ మనసును పిండివేసింది. ఏమిటీ దౌర్భాగ్యం, మనకు. కోట్లాది హిందువుల జన్మభూమిలో     వీరివిశ్వాశాలను అపహాస్యం చేయటమే ధ్యేయంగా   అత్యంత పవిత్రస్థలాలైన, అయోధ్య,కాశీ,మధుర లలో ఆలయాలపై ఇలా అన్యమతస్థులు దాడిచేసి తమకట్టడాలను కడుతున్నా  నాటి  హిందువులునోరెళ్ళబెట్టుకుని చూస్తున్నారా ? అని ఆవేశం వచ్చినది. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?  అప్పుడు,ఇప్పుడూ హిందువుల రాజకీయ స్వార్ధాలవల్ల హైందవానికి అవమానాలే మిగులుతున్నాయి కదా ? అని మనసు ఎదురు ప్రశ్నించటం తో
మౌనం వహించాను.

ఇక మధ్యాహ్నం   హరిద్వార్  వెళ్ళే ట్రైన్ ఎక్కగానే దానిలో విజయనగరం నుండి వస్తున్న యాత్రికులబృందాలు అందులో శ్రీనివాసరావు గార్ల ధ్వయం పరిచయమయ్యారు. వారు మూడురోజులుగా ప్రయాణిస్తున్నారు దీనిలో .నాదగ్గరున్న అన్నాన్ని వారిద్దరికి కూడా పంచాను.  ఇక వారి తోపాటు వస్తున్న వారి జిల్లావాల్ల ప్రవర్తనతో నాకొచ్చిన కోపం ,స్పందన  ఇవన్నీ గతంలో వ్రాశాను. ఈలింక్ లో చూడండి. అప్పుడు వ్రాసిన పోస్ట్

హరిద్వార్ దిగేసరికి రాత్రి పదయింది. రిషీకేశ్ కు బస్సులు లేవు. అందుకని మేంముగ్గురం కలసి అక్కడే ఓ హోటల్ లో రూమ్ తీసుకుని ఆరాత్రి అక్కడుండి పొద్దుటే  రిషీకేశ్ చేరాం. అక్కడ మన ఆంధ్రాసత్రం చేరాము. చాలాప్రశాంతమైన సౌకర్యవంతమైన స్థలం అది. అక్కడ హాలులోనే విశ్రాంతి తీసుకున్నాం .ఆపక్కనే టిటీడి వారి ఆలయంలో ఉన్న శేఖర్ అనే పూజారి మితృడుగా మారాడు దర్శనానికి వెళ్ళినప్పుడు. ఆయన వద్ద యాత్రలో ఎదురయ్యే  పరిస్థితులగూర్చి వివరాలు సేకరించాను నేను తీసుకెళ్ళిన లగేజీలో కొంత మరొకబాగ్ లో సర్ది ఆయనదగ్గర ఉంచాను. కేదార్నాథ యాత్రలో కావలసిన దుస్తులు,బూట్లు  వస్తువులు కొనుగోలుచేశాం. మరుసటిరోజు . తరువాత విజయనగరం యాత్రికులు వేరే వాహనం మాట్ళాడుకుని చార్ ధామ్ యాత్రకు ప్లాన్ చేసుకోగా నేను ఒంటరిగానే గౌరీకుండ్ కు బయలుదేరాను. దారిపొడవునా లోయలలో కోడెతాచులా మెలికలుతిరుగుతూ దూకుతూ ప్రవహిస్తున్న గంగమ్మ. బస్సులో హిమాలయ సౌందర్యాలను చూస్తూ  స్వరరాగ గంగా ప్రవాహమే .......అనే ఏసుదాస్ గారి పాట పాడుకుంటూ ఉన్నాను. గౌరీకుండ్ వెళ్ళేసరికి    సాయంత్రమయింది

ఇక  అక్కడ ఉన్న వేడినీటి బుగ్గలలో స్నానం ముగించుకుని బస్సులో తోడయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన యాత్రికమితృని తో కలసి మందాకినీ నది ఒడ్డునే ఒక చిన్న రేకులషేడ్ [అదే కాటేజీ అనుకోవాలి] లో అద్దెకు దిగాము.
తెల్లవారు  జాముననే లేచి తయారయిపోయి  కొంతలగేజీ అక్కడే ఉంచి  నదక మొదలెట్టాను. కొంతదూరం నడ్చేసరికే ఆయాసం ఎగదన్నుకొస్తున్నది.  ఉద్యోగం వచ్చాక ఎక్కువకాలం నీడన కూర్చొని ఉండటం..అలాఘే హిందూపబ్లిక్ స్కూల్ పేరిట మెమి నిర్వహిస్తున్న పాఠశాల ను ముసివేయటం వలన వ్యాయామం తగ్గినది. అంతకుమునుపు సాయంత్రం వేళల్లో పిల్లలతో కలసి వాలీబాల్ లాంటీ ఆటలు ఆడేవాళ్లం.అదీ లేదిప్పుడు. పర్యవసానం ఇదిగో ఇలా అయింది. ఇహ నావల్లకాదనుకుని ఒక పక్కనచేరి బతిమాలుతున్న  గుర్రాలయజమానులలో ఒకడితో వేయిరూపాయలకు బేరం మాట్లాడుకున్నాను. వాడు ఒకగుర్రాన్ని ఒకపిల్లవాడిని ఇచ్చాడు ఆగుర్రం ఎక్కగానే అర్ధమైంది  ఇది మోయటం కాదుకదా పడిపోకుండా ఉండటమే గొప్ప అని. అంత బలహీనంగా ఉంది. ఈ గుఱం వద్దు అని దిగేసరికి వాడు వేరొక గుర్రాన్ని తెచ్చి అప్పగిమ్చాడు. ఇక  దారిపొడవునా గుర్రాలు,డోలీలు గోలగోల గాసాగుతున్నాయి. మనం ఇంత ఆపసోపాలు పడుతున్నా గుర్రాలవెంట నడుస్తున్న సహాయకులకు అలుపూసొలుపూ లేదు . ప్రకృతి బిడ్డలుకదా !. వెలుగు రేఖలు విచ్ఉకునే కొద్దీ హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తున్నది. అవిగో ఆకాశాన్ని తాకుతున్న శిఖరాలు వాటికి పచ్చని పట్టుచీరకట్టి తలపై వెండి కిరీటాలెట్టి ముస్తాబుచేశారా అన్నట్లున్నాయి.  ఆహా! జన్మ ధన్యం . దిక్కుమాలిన శరీరం నడవటానికి సహకరిస్తే ఇంకా ఆనందంగా చూస్తూ వెల్లొచ్చు.  ఒకవైపు వెళుతున్న గుఱాలమీద బాలెన్స్ గాకూర్చోలేక పడిపోతున్నవారున్నారు. ఇక కొందరిని బుట్టలలో కూర్చోబెట్టుకుని   దానిని వీపుకు తగిలించుకుని ఆశిఖరాలకెగబాకుతున్న షెర్ఫాలవంటి వారినిస్థానిక కూలీలను చూస్తే మాపుణ్యమంతా ఈ గుర్రాలకు,ఈ మోతగాళ్లకే చెందుతుంది అని అనిపించింది.

మధ్యలో రాంబాడా వద్ద ఆగి గుఱాలకు నీరు మేతా ఇచ్చారు. స్వామి దర్శనం దాకా ఏమీ తీసుకోదలచలేదు నేను.
సుమారు పదిగంటలకు  కేదారేశ్వరుని  శిఖరదర్శనమయ్యింది. హరహరమహాదేవ అనిస్మరిస్తూ గుర్రందిగి  నడక సాగిద్దమంటే ఊపిరి ఆడటం లేదు. కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. కాళ్ళీడ్చుకుంటూ  మందాకినీ  స్నాన్ ఘాట్ కు చేరుకుని  ఆతల్లికి నమస్కరించి స్నానం ఎలా చెయ్యాలా ? అని ఆలోచిస్తున్నాను. వేలు పెడితే కొరుక్కుపోయేంత చల్లని నీళ్ళు. పైనుండి మంచు కరిగి వస్తున్నాయి అందరూ కొద్దిగా నీళ్ళుతీసుకుని నెత్తిన చల్లుకుంటున్నారు. కొద్దిసేపు సందిగ్దం లో ఉన్నా ఏమైతే అదైందనుకుని ఉరవడిగా సాగుతున్న ఆప్రవాహం మొదటి మెట్టుపై పనుకుని బుడుంగున మునక వేశాను . అంతే!  వళ్ళు గడ్డకట్టుకుపోయింది  పైకి లేచి చూస్తే కాళ్ళుచేతులూ కొంకర్లుపోతున్నాయి. సూర్యునికభిముఖంగా నిలబడి కాళ్ళు చేతులూ కొద్దిసేపు రుద్దుకుని వేడిపుట్టాకగాని శరీరం స్వాధీనం లోకి రాలేదు.అలసట మటుమాయమయ్యింది . మందాకినీ జలాలో జీవశక్తి శరీరంలో చైతన్యాన్ని నింపింది. కాకుంటే అక్కడ నుండి నడక మాత్రం భారంగా ఉంది. ఇక లైన్ లోకి వెళ్ళి నిలుచుంటే ఒంటిగంటదాకా దర్శనం కాలేదు. అక్కడా డబ్బులుతీసుకుని జనాన్ని ముందు దర్శనం చేపించే పండాలు ,లైన్లలో దూరే మన తెలుగువాళ్ళు లైన్ లో ముమ్దు నిలుచున్నవారికి ఆలస్యంగా దర్శనం అయ్యేలా సహకరిస్తున్నారు.
లోపలకెళ్ళి స్వామికి నమస్కరించి తీసుకెళ్ళిన  నేతితో అభిషేకించుకుని  బయటకు వచ్చాను. అక్కడ క్షేత్రపాలక భైరవ మూర్తి ఉన్న కొండపైకి నడచే ఓపిక లేకపోయింది. అంతకుముందుమూడురోజులుగా అక్కడి రొట్టెలు  తినలేక,ముతకబియ్యం ఆచప్పిడి కూరలూ లోపలకు పోక  సరిగా నిద్రలేక నీరసం ఆవహించి ఉన్నది. హిమాలభూములుకనుక అంతగా గమనికలోకిరాలేదు. బయటకొచ్చాక  అక్కడదాతలు ప్రసాదంగా ఇస్తున్న సాంబారుకిచిడి లాంటిపదార్థం కొంతతీసుకుని నేను తీసుకెళ్ళిన బన్ కాస్త తిన్నాను.  మందాకినిలో మునగటం ఎంతతప్పో మెల్లిగా తెలిసిరాసాగింది. శరీరంలో వణుకు మొదలవుతున్నది. అక్కడ ఒక రెస్ట్ రూమ్ లో ఆరాత్రి ఉండాలని డబ్బుచెల్లించి వెళితే అక్కడ గోడలనుండికూడా నీరు చెమ్మదిగుతున్నది. బెడ్ దాదాపు తడిసిపోయి ఉంది ఒకగంట తంటాలుపడ్డా అక్కడ ఇక  ఉండలేకపోయాను. సరైన రక్షన దుస్తులు వసతి లేదు ఇకరాత్రికి ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని తోస్తున్నది. వెంటనే రూమ్ ఖాళీ చేసి మూడుగంటల నుండి నడకప్రారంభించాను . హఠాత్తుగా మేఘాలావరించి చిన్న తుంపర మొదలైంది. దారంతా పరచిన రాళ్ళు అరగిపోయి గుర్రపు లద్దెలతో చిత్తడి చిత్తడిగా మారి జారిపోతున్నది.  కొనుక్కున్న బూట్లు భారంగా మారాయి వాటినీ విప్పి చేతిలో పట్టుకుని దారివెంటకాకుండా అడ్దదారులలో కిందకుదిగుతూ చల్లగా ఐస్ లాతగులుతున్న నీటిప్రవాహాలు దాటుతూ సుమారు ఏడుమైళ్ళుదూరం రాంబాడా దాక వచ్చాను. ఇక అక్కడ కొచ్చేసరికి మోకాలు పట్టుకున్నది. అడుగుతీయటం గగనమైంది. చిన్నగా గుర్రాలాపినస్థలం దాకా వెళ్ళి  ఏడు వందలకు మాట్ళాడుకుని ఓ చిన్న గుర్రం ఎక్కాను. చీకట్లుపడుతున్నాయి. జాగ్రత్త కాలు దానికి ముందువైపు తగలనియ్యవద్దు అని వాహన యజమాని హెచ్చరిస్తున్నాడు. దారిఏటవాలుగా ఉంది. ముందుకు వాలిపోకుండా వెనక్కువాలికూర్చోవాలి.  జాగ్రత్తగా ఉండకపోతే అంతేసంగతులు.  మా ఆవిడను తీసుకురాకపోవటం ఎంత  మంచిపనో బాగా అర్థమైంది.
ఎఅవరూ భారీ విగ్రహం కల కుఱవాడు పైకెళ్ళెసరికి ఆక్శిజన్ అందక మరణించాడులాఉంది  శవాన్ని డోలీలో ఉంచి మోసుకువస్తున్నారు కూలీలు మనస్సు కలుక్కుమన్నది. అతని  భార్యాపిల్లలను తలచుకుని. త్వరత్వరగా
నడచినా చీకట్లుకమ్మేసరికి ఇంకా దారిలోనే ఉన్నాం/ గుర్రపుయజమానుల అరుపులు యాత్రికుల కేకలు ప్రయాణం సాగుతున్నది. నడుస్తున్న గుర్రాలన్నీ సకిలిస్తున్నాయి . నావాహనం మాత్రం ఎదో తేడాగా అరుస్తున్నది. ఆ అరుపు గాడిదలు ఓడ్రపెట్టినప్పుడు వచ్చే ధ్వనిలాఉంది. వాహన యజమానినడిగాను. బాబూ! ఇది గుఱం కాదే ? అని ఆయన ఎదో చెప్పాడు అర్ధం కాలేదు. నాకర్థమైంది, ఇది గుర్రం మాత్రం కాదు అని.
చీ చీ ఇంతబ్రతుకూ బ్రతికి గాడిదనెక్కిఊరేగుతున్నామా ? ఇంకా నయం ఫోటొ తీసుకోలేదు. ఓరి నీయమ్మకడుపుమాడా ! ఏదో గుర్రం  ఎక్కానంటే చెప్పుకోవటాకిని బాగుంటుంది గానీ గాడిదనెక్కానని తెలిస్తే పరువుపోతుంది ముఖ్యంగా పెండ్లాముందు,బామ్మర్ధులముందు.వాల్లందరికీ తెలిస్తే ఎంతపరువునష్టం. ఒక్కడినిరావటమే మంచిదయింది  ఎంతపనిచేశావురా గుర్రం అనిచెప్పి  అంటూ తెలుగులో నాకొచ్చిన తిట్లతో వానిని  దీవిస్తూ  నాపై నేనే జోకులేసుకుని నవ్వుకుంటూ చిన్నగా గౌరీకుండ్ చేరాను రాత్రి తొమ్మిదింటికి.  ఇక ఆగిన నా అశ్వం[అనుకుందాం] నిలబడలేక జారికూలబడింది నాడా కాల్లో ఇరుక్కుని నేనూ పడ్డాను . ఊరిముందరకొచ్చి బోర్లపడటం అంటే ఇదే రా అనుకుని చిన్నగా కాళ్ళీడ్చుకునివెళ్ళి అక్కడ ఒక హోటల్ లాంటిదానిలో దూరి రెండు మెతుకులు అన్నం తినబోతే వాంతి వచ్చేలా ఉంది. సరేనని క్రితం రాత్రి బసకొచ్చి చుస్తే ఆరేకులషేడ్లు కూడా ఖాళి లేవు. బయట చలి ,ఒంట్లో జ్వరం తీవ్రమవుతున్నాయి. ఆ రెస్ట్ హౌసత్రం యజమానినే బ్రతిమాలి పైన ఖాళిగాఉన్న ఒక రేకుల షేడ్ లో రాత్రికి తలదాచుకోవటానికి ఐదువందలిచ్చి వెళ్ళీ నిద్రపోదామంటే జ్వరం ఎక్కువై నిద్రరావటం లేదు. తలనొప్పి. అర్ధరాత్రి బయటకొచ్చి చూస్తే మన తెలుగువాళ్లెవరో ఉన్నారు. వాళ్లనడిగి ఒక టాబ్లెట్ తీసుకుని వేసుకుని పనుకున్నాను. ఉదయాన్నే లేచి మరలా వేడినీటికుండంలో స్నానం  చేసి రుద్రప్రయాగ్ బయలుదేరాను. అప్పటికి నాదగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. రుద్రప్రయాగ్ లో ఏటిఎమ్ వెతుక్కుని డబ్బు తీసుకుని బదరీనాథ్ వెళ్ళే బస్సెక్కాను. పాతాళంలో ఉన్నట్లుగా మెలికలు తిరుగుతూ వస్తున్న అలకనంద అందాలను చూస్తూ బదరీ సాయంత్రం ఐదనుకున్నది రాత్రి పదకొండు గంటలకు చేరాం బదరీ. బయట ఎవరూ ఉండవద్దు అని మైకులో హెచ్చరికలు చేస్తున్నారు. బస్సులో పరిచయమయిన అనంతపురం యాత్రికులతో కలసి చినజియ్యర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళీ తలదాచుకోవాలని అబ్యర్థించినా నిర్ధాక్షిణ్యంగా ఖాళిలేదు వెళ్ళ్మని వెళ్ళగొట్టారు నిర్వాహకులు. నాతోటి వాళ్లు వేరేచోటూ వెతుక్కుంటూపోగా చిన్నగా బస్టాండ్ కేవెళ్ళాలని నడుస్తున్నాను చలిలో వణుకుతూ. నాపై కనికరించాడేమో స్వామి.దారిలో పశ్చిమబెంగాలుకు  చెందిన ఒక సత్రం వద్ద బయటకు వచ్చి దారితెలియక తచ్చాడుతున్న ఒక వృద్దురాలిని చూపాడు. ఆవిడ తమవాళ్లు లోపల ఉన్నారని బయటకు వచ్చి దారితెలియటం లేదని చెప్పింది. ఆవిడవెంట నేనూ లోనికెళ్ళి  దారి చూసుకుంటూ మూడంతస్థుల ఆబిల్డింగ్ లోని కెళ్ళి అక్కడ వరండాలోనే పక్కపరుచుకుని పనుకున్న యాత్రికుల తోపాటు నేనూ విశ్రమించాను. ఆవిధంగా స్వామి కాపాడాడు నన్ను.
ఉదయాన్నే స్నానం జపం ముగించుకుని బదరీనాథుని దర్శనానికై బయలుదేరాను .అద్భుతమైన ఆథ్యాత్మికతరంగాలా హిమాలయాలలో.  లైన్లలో ముందున్న జనాన్ని మాయచేసి ముందుకెళ్ళి కలవటం మన తెలుగువారికి తెలిసినంతగా ఏ భాషవారికీ తెలియదనిపించింది మనవాళ్లను చూస్తుంటే . లోపలకెళ్ళి ఆదివ్యమంగళ మూర్తిని దర్శించుకుని  తరించాను. నా వస్త్రధారన చూసేమో ఎవరూ నన్ను తోసివేయలేదు బయటకు. ప్రశాంతంగా స్వామిదర్శనం చేసుకుని  బదరీ వృక్షరూపంలో కొలువైన అమ్మను దర్శించుకుని ఒకపక్కకొచ్చేసరికి అక్కడున్నారు మాగురువుగారు  ఆంజనేయస్వామి వారు, 
ఆరోజు హనుమజ్జయంతి, నాదగ్గర పూజకు ఏ పూజాద్రవ్యాలూ లేవు. ఆయనముందుకూర్చుని చాలాసేపు చాలీసాపారాయణం జపం  చేసుకున్నాను. బయటకు వచ్చి బ్రహ్మకపాలతీర్ధంలో మాపెద్దలకు తర్పణాలిచ్చాను అక్కడి మన తెలుగు పురోహితుని సహాయంతో.
ఇక అక్కడనుండి నడవాలంటే బాగానీరసంగా ఉంది. చిన్నగా రాత్రి బసచేసిన సత్రం వద్దకు చేరుకోగానే గులాబ్ బాబా సత్సంగం ఒంగోలు వాల్లు చేస్తున్న అన్నదాన కార్యక్రమం కనపడింది. వెళ్ళి మనవంటకాలతో తృప్తిగా భోంచేసి నాకు చేతనైనంత సమర్పించి తిరుగు ప్రయానమయ్యాను ఎవరో ఇకపద అని తరుముతున్నట్లుగా ఉంది మనసు. సరస్వతీ నది దర్శనానికి వెళ్ళే ఓపిక లేదు. తిరుగు ప్రయాణంలో బస్సులలో ఖాళీలేక ఒక జీపులో ఢిల్లీకి,హర్యానాకు చెందిన యాత్రికులువెళుతుంటే నేనూ కలసి బయలుదేరాను. మధ్యలో వాడు జ్యోతిర్మఠ్ వద్దకువచ్చి అక్కదనుండి మరొకజీపు ఎక్కించారు. రాత్రికి రుషీకేశ్ కు తీసుకెలతానని డ్రైవర్ చెప్పినా ఎంతవేగంగా వచ్చినా పదిగంటలకు కేవలం  కీర్తినగర్ వద్దకు మాత్రమే రాగలిగాము. నాకైతే పూర్తిగా ఓపిక నశించింది. వెనుకసీటులో పనుకుని నిద్రపోయాను. అక్కడ పోలీసులు చెక్ పోస్ట్ వద్ద ఆపివేశారు. అప్పటిదాకా డాంబికాలుపోతున్న మా జీపులోనిఢిల్లీ యాత్రికులు పోలీసులు ఈరాత్రికి వాహనాలు నిలిపివేయడంతో వారిప్రయత్నాలు ఫలించక బిక్కమొహం వేశారు.  అక్కడి సబ్ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ కు ఢిల్లీ లో హోమ్ శాఖలో పనిచేస్తున్న డిఎస్పీ మిత్రునిద్వారా ఫోన్ చేపించి వాహనాలు కదిలేలా చూశాను. రాత్రి రెండున్నరకు రుషీకేశ్ కు చేరాను  ,ఉదయాన్నే దయానందాఅశ్రమం వెనుక  గంగమ్మలో మునకలువేసి కూర్చుంటే ఎంతసేపటికీ ఆతల్లి ఒడిని వదలి ఇవతలకు రాబుధ్ధివేయలేదు.పగలుకొంత విశ్రాంతి తీసుకుని హరిద్వార్ చేరి ఢిల్లీ కి వెళ్ళటానికి ట్రైన్ దొరకక సాయంత్రం వరకు వేచిఉండాల్సి వచ్చింది.  రాత్రి ఎనిమిదిగంటలకు ఢిల్లీ  ట్రైన్ ఉన్నందున సాయంత్రం గంగాహారతికి హరిద్వార్ ఘాట్ లకు వెళ్ళివచ్చేసరికి ఆట్రైన్  వెళ్ళిపోయింది. కాశీ వెళ్ళే ట్రైన్ ఒకటి బయలుదేరుతున్నది టిక్కెట్ వద్ద క్యూలైన్ చాలా పొడవుగా ఉంది.  ఎలానూ వచ్చాం కనుక మరలా ప్రాప్తమున్నదో లెదో కాశీ విశ్వేశ్వరుని దర్శనం చెస్తే మంచిదికదా అని టిక్కెట్ కోసం ట్రైన్ వెళ్ళిపోతుందని ముందుకువెళ్ళటానికి ఎవరూ పోనివ్వలేదు. పరమాత్మ సంకల్పమా అన్నట్లు ఒక కానిస్టెబుల్ నాదగ్గర కొచ్చి .ఎక్కడికెళ్ళాలని అడిగి డబ్బుతీసుకుని ముమ్దుకెళ్ళి టిక్కెట్ తెచ్చి ఇచ్చాడు. సరే ! ట్రైన్ లోకెళ్ళి చూద్దునుకదా !క్రింద సీట్లు లేవు పైన ఆక్రమిమ్చుకుని పిల్లపాపలను కూర్చో బెట్టుకున్నారు లగేజీల బల్లలపై.  పిల్లలను క్రిందకు దించి కూర్చోబెట్టుకోమని  ఎంత అభ్యర్థించినా ఆహిందీవాళ్లకు  పట్టలేదు. మరలా ఇందాక కానిస్టెబులే స్వామి పంపాడా అన్నట్లు  ఆపెట్టెలోకి వచ్చి నన్నుచూసి ఇలా మెతకగా ఉంటేఎలాస్వామీ ! అని వారిని అదిలించి పైన ఖాళిచేపించినాకు ఇప్పించాడు. పరమేశ్వరుని దర్శనానికి బయలుదేరానని ఇలా ఏ ప్రమథగణములోని భక్తుడొ సహాయపడ్డాడని నమస్కరిమ్చుకున్నాను మనస్సులో.

ఇక మరుసాటిరోజు  సాయంత్రం నాలుగుగంటలకు వారణాసిలో అడుగుపెట్టేభాగ్యం కల్పిమ్చాడా తండ్రి శివయ్య.
వెంటనే దశాశ్వమేథ్ ఘాట్ కు వెళ్ళి అక్కద పడవలో అవతలివడ్డుకు వెళ్ళీ స్నానం చేసి పూజాద్రవ్యాలుతీసుకుని స్వామి దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ కాశీలో దర్శనంలో పాటించవలసిన క్రమం నేను పాటించలేకపోయాను.  నేరుగా స్వామిని దర్శించుకుని జ్ఞానవాపీమందిర్ నుఆక్రమిమ్చి కట్టిన మసీదునుచూసి కొద్దిసేపు మనదుస్థితికి వగస్తూ అనంతరం అన్నపూర్ణాదేవి దర్శనం.ఆపై విశాలాక్షిమాత పీఠాన్ని దర్శించుకుని అక్కడ లలితాపారాయణం చేసుకుని బయటకొచ్చాను. అక్కద పురోహితుల,వ్యాపారుల వేధింపులు చూసిఏవగింపుకలిగి   కాశీక్షేత్రాన్ని దర్శించానన్న తృప్తిని పూర్తిగా గుండెల్లో నింపుకోలేకపోయాను.
 రాత్రికి గంగాకావేరి ఎక్స్ ప్రెస్ కోసం రాత్రి పదకొండున్నరదాకా ఎందుకు వెయిట్ చేయాలనే అతి తెలివితో మొఘల్ సరాయ్ స్టేషన్ కు వెళ్ళి సంఘమిత్ర  ఎక్కాను. ఇక మొదలయ్యింది శిక్ష . రిజర్వేషన్ లేదు. ఐనా రిజ్ర్వేషన్ భోగీ ఎక్కాను మామూలు టిక్కెట్ తో. కాలు కదపటానికి సందులేదు. కదలాటానికి మెదలటానికి వీలులేకుండా నిలబడ్డచోటే జోగుతూ ,ఆకలి నీరసం, నరకం చూశాను. అదీ మరునాడు మధ్యాహ్నం దాకా. కనీసం బాత్ రూమ్కు వెళ్ళటానికి కూడా   జాగాలేదు. అంతలా కిటకిటలాడుతున్నారు నాలాంటీ జనం ఆ రైల్ నిండా . ఈలోపల టిసీ లు వచ్చి ఆభోగీ ఎక్కినందుకు ఏడువందలఏభైరూపాయల ఫైన్  వశూలుచేశారు. అన్నం లేదు నీళ్ళు లేవు.
మరునాడు మధ్యాహ్నానికి ఓపిక నశించింది . మధ్యప్రదేశ్ లో అనుకుంటా ఇటార్సీ అనే శ్టెషన్ లో దిగిపోయాను జనాన్ని నెట్టుకుంటూ బయటకొచ్చి.  రెండునిమిషాలు గుండెల నిండా గాలిపీల్చుకునేసరికి గంగా కావేరి  ఆ శ్టేషన్ కొచ్చింది. టిక్కెట్ కొనేసమయం లేదు. ఏమైతే అదైందనుకుని  ఎక్కాను. దానిలోనూ బాగా జనం ఉన్నారుకాని కొద్దిగా కదలాడవచ్చు అటూ ఇటూ. అందులో పూర్వమెప్పుడో మధ్యప్రదేశ్ లో స్థిరపడ్డ తెలుగు ఫ్యామిలీ ఉన్నారు. వారితీ మాట కలిపి చిన్నగా సీటుసంపాదించుకున్నాను. మరుసటి పొద్దుటే విజయవాడ లోదిగాను. ఆరోజు శుక్రవారం. విజయవాడ చేరకముందే మాపిల్లవాడు మాలకొండారెడ్డికి ఫోన్ చేయగా వాడు  బైక్ తీసుకునివచ్చి స్టెషన్ బయట సిద్ధంగా ఉన్నాడు. ముందు  కృష్ణ కు పోనివ్వమని చెప్పి  శరీరం అలుపుతీరేలా  స్నానం  చేసి నేరుగా కొండ మీదకెళ్ళాను అమ్మనుచూసేందుకు . దివ్యమైన రూపంతో అమ్మ కిలకిలా నవ్వుతున్నది,. ఏరా! అన్నీచూసొచ్చావా ? బాగా అయిందా? అని ఎగతాళిచేస్తున్నట్లు తోచింది. నీకు అమ్మను నాన్నను,తీర్ధాన్ని క్షేత్రాన్ని, ధ్యానాన్ని,ధ్యేయాన్ని  అన్నీ నేనే....అన్నీ నేనే ...  అని అభయహస్తం చూపి అనునయించినట్లనిపించి అమ్మకు సాష్టాంగపడ్డాను/  రాత్రికి ఇంటికొచ్చి మందిరంలో అమ్మను చూడగానే అమ్మ కొంగుచాటున దూరి భయం తీర్చుకున్న బాలకునిలా అయింది మనస్సు.

అమ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే....

అదిగదుగో గంగమ్మ అగాథాల లోయలలో


గౌరీకుండ్ లో

 
 బదరీనాథుని దర్శనానికి వెళుతూ


 రుషీకేశ్ లో గంగమ్మ ఒడిలో


 హరిద్వార్ గంగా హారతి దర్శిస్తూ
కాశీనగరదర్శనం చేస్తూ గంగమ్మ ఒడిలో పడవపై





నేను ఇంటికొచ్చిన పదిరోజులకే          కేదారనాథుని క్షేత్రంలో విలయం సంభవించినది,   అక్కడ జరుగుతున్న అపచారాలనుచూసి ఏదో ఒకనాడు ముంపు వస్తుంది మనకు అనుకున్నాను కానీ ఇలా భీకరదృశ్యం  చూస్తాననుకోలేదు. ఎవరో ఇకచాలు పద ఇంటికి అని తరిమినట్లు అనిపించటం, నేను చార్ధామ్ యాత్రలో సగమే పూర్తిచేసుకుని వెనుకకు వేగంగా తిరిగిరావటం అంతా  అమ్మదుర్గమ్మ ఆజ్ఞ ఏమో ననిపిస్తున్నది


అప్పటి నుండి వ్రాయాలని అనుకుంటూన్నా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ ఇప్పుడు వ్రాయగలుగుతున్నాను ఇది.

 

3 వ్యాఖ్యలు:

భాస్కర రామిరెడ్డి June 4, 2014 at 4:16 PM  

అదృష్ట వంతులండీ. అన్నీ చూసి వచ్చి ఆ జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకోగలిగారు. ఇంత విశిదంగా వ్రాసి మాకు కూడా యాత్రా విశేషాలను కళ్ళకు కట్టినట్లు చూపినందుకు ధన్యవాదాలు.

SD June 5, 2014 at 4:33 AM  

>>
ఏరా! అన్నీచూసొచ్చావా ? బాగా అయిందా?


Laughing here.

SD June 5, 2014 at 4:33 AM  

>>ఏరా! అన్నీచూసొచ్చావా ? బాగా అయిందా?
Ha ha ha ha

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP