శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మెతుకే బతుకు!

>> Monday, December 10, 2012


కృతయుగం అస్థిగతం. త్రేతాయుగం మాంసగతం. ద్వాపరయుగం రక్తగతం. కలియుగం అన్నగతం. ఇదంతా యుగలక్షణం. పరిణామక్రమాన్ని గమనించినపుడు, కలియుగమే పుణ్యకాలంగా అనిపిస్తుంది. ఉన్నదంతా పరమాత్మేనన్న భావంతో కృతయుగ మానవుడు, తాను ఉన్నంతకాలం తన మూలంతో తనను తాను అనుసంధానం చేసుకుని తపస్సు, ధ్యానం, యోగం వంటి స్వీయసాధనా బలిమితో పూర్ణాయుర్ధాయంతో జీవించాడు. త్రేతాయుగంలో సాధకుడు, యజ్ఞయాగాదుల ద్వారా పరమాత్మను చేరుకోగల సాధనా మార్గాన్ని ఆశ్రయించాడు. మాంసగతమైన ఆహారాన్ని ఆలంబన చేసుకున్నాడు. ద్వాపరలో భీమ ప్రతిజ్ఞ వంటి సందర్భాలు, రక్తగత విషయాన్ని స్పష్టం చేస్తుంటయ్. కలియుగంలోనూ పైవిధాలున్నా, నాగరకత ప్రభావంతో జీవుడు అన్నగతుడైనాడు. ఈ నేపథ్యంలో, అమ్మ నోటి నుండి వెలువడే మొదటి మాట, "భోజనం చేసి రా!''

పంచకోశాలు
డొక్క నిండనివాడు వేదాంతం వినడు. నైతిక సిద్ధాంతాలు వాడికి అవసరం లేదు. ఆకలి తీర్చుకోవటం, ప్రాణం నిలబెట్టుకోవటం, ఆపైనే మిగిలినవన్నీ! మానవుడికున్నవి పంచ కోశాలు. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అనందమయ కోశాలు. దేహం నిలబడాలంటే అన్నం కావాలి. ఆ మెతుకులు దయతో, ప్రేమతో, కరుణతో, అన్నింటినీ మించి వాత్సల్యంతో దొరికితే పదార్థ శుద్ధి కలిగి, పరమార్థ చింతన వైపు నడిపిస్తయ్. ఏ భావంతో అన్నం తయారైతే, ఆ భావమే ప్రాణం పోసుకుంటుంది.

దైహిక, ప్రాణశక్తులు సమన్వయంగా ఏర్పడినపుడు ఏర్పడేవే అన్నమయ, ప్రాణమయ కోశాలు. నడిచే దేహం, నడవటానికి కావలసిన శక్తీ కూడినపుడు, అంటే యుక్తాహారం, యుక్త విహారం జమిలి అయినపుడు, మరొక ప్రశాంత, పరితృప్త, ప్రసన్న కోశం ఏర్పడుతుంది. అదే మనోమయ కోశం. అనేక ఆలోచనల సమాహారమే మనసు. దానికి రూపం లేదు. అతి శక్తివంతమైన భావనాభూమిక అది. దాని పునాది, మూలం అన్నమయ కోశంలోనే ఉంది. మమతా ప్రసాదంగా లభించిన అన్నం నుండీ మమతే మనసుగా రూపుదాల్చి మనోహర పరిమళాన్ని అలదుకుని, మనసు దయాపూరితమౌతుంది. అది తీర్చుకునే ఆలోచనలన్నీ సంస్కార శోభితంగా, ప్రేమమయంగా ఉంటయ్.

బలమైన మనసు, కరుణాకరమైన మనసు నుండీ అటువంటి ఆలోచనలే కలిగి, సాధకుణ్ణి సాధువును చేస్తయ్. సమాజంతో సహజీవనం, మానవీయమైన తలపులు, సహనం, శాంతి, నిబ్బరం సాధించుకున్న మనసే బద్ధత్వం నుండీ బుద్ధత్వం వైపు నడిపిస్తుంది. బంధనకీ, మోక్షానికీ మనసే కారణం కనుక మోక్షగామియైన సాధకుడు, ముందుగా అన్నమయ కోశాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అందువల్లనే అమ్మ ముందుగా అన్నంపెట్టి, ప్రాణం నిలబెట్టి, మనసును అరికట్టే ప్రయత్నం చేసింది. పైకి ఎంతో తేలికగా కనిపిస్తున్నా, ఆ వాత్సల్యం వెనుక ఒక గంభీరమైన అధ్యాత్మ బోధ ఉన్నది. కలిగిన వారంతా నలిగిన వారిని ఆదుకోవాలి. ఆకలిగొన్న మానవుడు, అన్నం దొరకక మరణించే జీవులు ఉంటే, అది నాగరక సమాజం కాదు. సంస్కారానికి నోచుకోని జాతి ఎక్కువ కాలం మనలేదు.

ఎట్టి మెతుకో, అట్టి భావం;
ఎట్టి భావమో, అట్టి భాష;
ఎట్టి భాషో, అట్టి జాతి!
వాత్సల్యాలయం

దేహం, ప్రాణం, మనసు ఒక అద్భుతమైన త్రిపుటి. మాధవ సమానుడైన మానవుడు నిరంతరమూ అప్రమత్తుడై ఉండవలసిన స్థితులు. ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులకూ మూలం ఇవే. సర్వజన శ్రేయస్సు శుభేచ్ఛగా, సమాజహితమైన నిస్కామ కర్మలన్నీ క్రియాశక్తిగా వివేకము-విచక్షణ జ్ఞానశక్తిగా అనుభవంలోకి రావాలంటే 'అన్నం' మూలం. దేహమున్న, ప్రాణమున్న ప్రతి జీవీ అన్నగతమే. అందుకే అమ్మ మాటాడినా, సూచించినా ముందు అన్నం తినమనే. అందరిల్లు అందరికీ సహపంక్తిని సిద్ధం చేసింది. ఆకలికి కులం, మతం, భేదం కావు. అరమరికలు లేని, బంధనలులేని, వివక్షలేని వాత్యల్యాలయం ఒక అపురూప విజ్ఞానమయ కోశం మారటం వెనుక ఉన్న కారణమిదే.

అకర్తృత్వా స్థితి
శాస్త్రాల మీద అధికారం, విషయాల మీద పట్టు, విశ్లేషణల మీద పూర్ణావగాహన, అనుష్ఠాన వేదాంతం, విజ్ఞానమయ కోశంలో ఇమిడిన బలాలు. ఆ కారణంగానే విజ్ఞానవేత్తలు, మహాకవులు, పండితులు, పావనయుక్తజీవులు, వేదాంత, తత్వ బోధకులు, సంకీర్తనాచార్యులు, ఒకరేమిటి, పాశ్చాత్యులతో సహా జిల్లెళ్ళమూడికి ఆనాడే చేరటం, విజ్ఞానమయ భూమికగా మారటం. ఇన్ని కలిగిన తర్వాత ఉన్నదంతా ఆనందమయమే. పంచకోశ స్థితులను ఉపనిషత్తులు వీక్షిస్తే, వర్ణవర్గ భేదం లేకుండా అమ్మవాటిని అతిసులువుగా ఆవిష్కరించింది.

"అమ్మా! నీ యాభైవ పుట్టినరోజు, ఏం చెయ్యమంటావ్?'' అని అడిగినపుడు, "చేయటానికేముంటుంది. ఒక లక్షమంది కలిసి భోజనం చేయటం చూడాలని ఉంది'' అన్నది.

పట్టుమని పదిళ్లు లేని జిల్లెళ్ళమూడిలో పందిళ్ళలో ఒక లక్షా ఇరవై ఎనిమిది వేల మంది భోజనం చేయటం మహిమా? అనుగ్రహమా? అమ్మ ప్రేమా?

"నేను పెట్టేదేముంది? ఎవరన్నం వాళ్లు తిన్నారు'' అన్న అమ్మది అకర్తృత్వా స్థితి. బువ్వపెట్టిన అవ్వలందరూ అమ్మలు కారు. ఆ పెట్టటం ఒక సహజ మాతృ లక్షణం కావాలి.అది నేర్పటమే మాతృబోధ! అందువల్లనే ఆమె మాతృశ్రీ!!

- వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
andhrajyothy.com 

1 వ్యాఖ్యలు:

డా. రాంభట్ల వేంకటరాయ శర్మ January 12, 2018 at 4:27 PM  

చాలా బాగా వివరించారు...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP