శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరితం 2

>> Wednesday, May 9, 2012

శ్రీధరుని వివాహంతో విద్యావతితోపాటు త్రైలింగధరుడు కూడా చాలా సంతోషించాడు.
వయస్సు పెరిగిన కొద్దీ త్రైలింగధరుని మనస్సులో ధార్మిక చింతన మరింత పెరుగుతూ వచ్చింది.
అతని మనస్సులో ఏవో అమూల్యమైన భావనలు మొలకెత్తసాగినాయి. ఆహార విహారములు, అధ్యయన - శయనాది కార్యకలాపాలపైన ఏ మాత్రమూ అభిరుచి లేనివాడై అతడు మెలగసాగాడు. అతని మనస్సు అనేక రకాలుగా వ్యాకులత చెందటంవలన తల్లి విద్యావతి అతనికి ఎన్నో రకములైన ఉపదేశాలు చేసింది. దానితో త్రైలింగధరునికి స్వర్గం దొరికినంత సంతోషం కలుగుతూ ఉండేది. తల్లి ఉపదేశము ఆయనలో అమృతత్వాన్ని నింపినట్లుండేది.
తల్లి ఉపదేశాన్ని పొందినప్పుడు త్రైలింగధరుడు అనిర్వచనీయమైన ఆనందసాగరంలో తేలియాడినట్లు ఉప్పొంగిపోయేవాడు. అతనిలోని వ్యాకులత్వమనే మేఘజాలం పటాపంచలై, విద్యుత్ కాంతి ప్రకాశించినట్లు అనిపించేది. తల్లి ఉపదేశాలను గ్రహించి ముందుకు సాగినకొద్దీ అతనిలో ఆనందం అధికమయ్యేది. దానికితోడు అతని మానసిక ప్రవృత్తిలో కూడా ఎంతో పరిణామం కనిపించసాగింది. ఆ విధంగా కొంతకాలానికి అతని హృదయం భగవత్ప్రేమలో నాట్యమాడసాగింది. భగవత్ప్రేమామృత పానమత్తుడైన అతని హృదయంలో భగవద్భక్తి ప్రస్ఫుటం కాసాగింది.
త్రైలింగధరుడు పారలౌకిక ఆనందంతో ఉప్పొంగిపోతున్న ఆ రోజులలో దుఃఖపు నీలినీడలను కూడా చూడవలసి వచ్చింది. నృసింహధరుడు జ్వరపీడితుడయినాడు. సాధ్యమైనంత వైద్య సహాయం అందించినా జ్వరము తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూ పోయింది. ఆయనకు సేవలందించటంలో ఎలాటి అజాగ్రత్త జరుగకపోయినా, ఆశించిన ఫలితం మాత్రం లభించలేదు. బాధ మొదలైన ఐదవ రోజునే నృసింహధరుడు భార్యాపుత్రాది ఐహిక పాశములను త్రెంచుకొని, ఈ మాయా ప్రపంచాన్ని విడిచి అనంతధామం చేరుకొన్నాడు. అప్పటికి త్రైలింగధరుని వయస్సు నలువది సంవత్సరాలు. నృసింహధరుని మృతిపట్ల నగరంలోని ఆబాలగోపాలము శోకసంతృప్త హృదయులయినారు. సామాన్య జనులుకూడా ఎంతో విచారపడ్డారు. ఇక పతి సేవాపరాయణురాలైన విద్యావతికి పంచప్రాణములు లేచిపోయినట్లయింది. అప్పటినంచీ ఆమె భగవంతుని చింతన తప్ప మిగిలిన పనులు వేటిలోనూ లీనమయ్యేది కాదు.
తండ్రి మరణానంతరము త్రైలింగధరుడు కూడా తల్లితోపాటు భగవచ్చింతనలోనే లీనమవుతూ ఉండేవాడు. ఆ విధంగా 12 సంవత్సరాలు గడిచినాక దేవతామూర్తియైన విద్యావతి కూడా స్వర్గస్థురాలైంది. తల్లికూడా మరణించిన తరువాత త్రైలింగధరునికి ప్రపంచమంతా శూన్యంగా కన్పించసాగింది. భూమంతా తన కళ్లముందు తిరుగుతూ ఉన్నట్లయి, ప్రపంచం విషతుల్యంగా అనిపించసాగింది. అతని ప్రాణము మనస్సు మాయాజగత్తును వదలి, ఆకాశవిహారం చేయసాగినవి. ఏ ప్రదేశంలో తల్లి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిందో, ఆ ప్రదేశం అతనికి ఎంతో పవిత్రంగా భాసింపసాగింది. ఆనాటి నుండి త్రైలింగధరుడు తన తండ్రి నృసింహధరుని సంపాదనకంతటికీ వారసుడైనప్పటికీ, సంసారిక బంధాలను తెంచుకొని, చితాభస్మాన్ని ధరించి శ్మశానంలోనే నివసింపసాగాడు.
త్రైలింగధరుని మానసిక స్థితిని చూచిన ఆతని సవతి తల్లి కొడుకు శ్రీ్ధరుడు, త్రైలింగధరుని ఇంటికి రమ్మని ఎంతగానో బ్రతిమిలాడాడు. కాని ఫలితం లేకపోయింది. శోకతప్త హృదయుడైన శ్రీ్ధరుడు ఒక రోజున ఆత్మీయులను, బంధువులను తోడ్కొని త్రైలింగధరుని వద్దకు వెళ్లి, తండ్రిగారి ధనసంపత్తిని తీసుకోమని బ్రతిమిలాడాడు. కాని భగవత్ప్రేమ అనే ప్రఫుల్లకమల మధుపానమునకు అలవాటుపడిన త్రైలింగధరుని మనోమధుకరము అందుకు అంగీకరించలేదు.
- ఇంకాఉంది


అతని మనస్సు భగవద్ధ్యాన సుధాసింధువులోనే నిత్యమూ నిమగ్నమయ్యేది. భగవన్నామాంకురమునే తన హృదయక్షేత్రంలో నాటుకొని, దాని ప్రేమామృత ఫలాస్వాదనతోనే, ప్రఫుల్ల మనస్కుడవుతూ ఉండేవాడు. భగవద్భాండారములోని అమూల్య రత్నాలకు అధిపతి కావలసిన అతడు సంసారములోని సామాన్య రత్నజాలముతో సంతృప్తిపడతాడా? నశ్వరమైన పార్థివ పదార్థాలయెడ అతని మనస్సు ఆకర్షింపబడుతుందా? ఈ బాహ్య జగత్తును పరిత్యజించి, అంతరంగ జగత్తులోకి ప్రవేశించటానికి అభిలషించే త్రైలింగధరుని సంసార ప్రలోభాలు ఆకర్షించలేకపోయాయి. అతను తన కుటుంబ సభ్యులను అనునయించి, ఆత్మీయులను ప్రార్థించి, సగౌరవంగా ఇంటికి పంపించాడు. తరువాత తన తమ్ముడిని దగ్గరకుపిలిచి - ‘‘సోదరా! శ్రీ్ధరా! నీవు అనవసరంగా దుఃఖపడుతున్నావు. ఆ దుఃఖాన్ని వదిలిపెట్టి మన తండ్రిగారు సంపాదించిన ధన ధాన్య సంపత్తిని నీవే అనుభవించు. నాకు అవి అవసరం లేదు. నేను ఇక ఇంటికి తిరిగిరాను. ఈ పాపపంకిల ప్రపంచంలో నేను ఉండను. ఈ మాయా సంసారము కంటకప్రాయమైనది. ఈ క్షణభంగురమైన శరీరముతో నేను అనిత్యమైన ఈ సంసార సాగరంలో మునిగిపోవటానికి ఇష్టపడను. ఆద్యంతరహితమైనది, అనశ్వరమైనది అయిన సుఖమును పొందటమే నా ధ్యేయము. దేనివలన అశాంతి కలుగుతున్నదో దానినే పొందటానికి మనము అనునిత్యమూ ఆరాటపడుతున్నాము. అందుకు నా మనస్సు అంగీకరించదు. కనుక ఇప్పుడు ఇంటికి తిరిగి రమ్మని ప్రార్థించటం మానుకో’’ అని ప్రబోధించాడు.

తీర్థయాత్రలు
త్రైలింగధరుని ఇంటికి తీసుకొనిపోవటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అతని మనస్సులో పరివర్తన రాకపోవటంతో శోకసంతృప్త హృదయంతో శ్రీ్ధరుడు ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత త్రైలింగధరుడు ఉండినచోటనే అతని కొఱకు ఒక నివాస గృహం ఏర్పాటుచేయించాడు. ప్రతినిత్యమూ అక్కడికి ఆహారం పంపే ఏర్పాటు కూడా చేశాడు. అప్పటినుండి త్రైలింగధరుడు తన తల్లి చేసిన ఉపదేశానుసారం యోగసాధనలో నిమగ్నమైపోయేవాడు. ఆ విధంగా 20 సంవత్సరాలు గడిచాక, ఒక మహాపురుషుని ఎవరినైనా కలవవలెననే కోరిక ఆయన మనస్సులో కలిగింది.
ఆ ప్రాంతానికి పశ్చిమ దిశలో ఉన్న పాటియాలా రాజ్యంలో వాస్తూరు అనే గ్రామం ఉన్నది. అక్కడ భాగీరథ స్వామి అనే పేరుగల ఒక సుప్రసిద్ధ యోగి ఉండేవాడు. వంగ సంవత్సరము 1086లో ఆ భాగీరథ స్వామి హఠాత్తుగా త్రైలింగధరుని ఆశ్రమానికి వచ్చాడు. వారిద్దరూ పరస్పరం సంభాషించుకొని అత్యంత ప్రసన్నులయ్యారు. భాగీరథస్వామి కొంతకాలం అక్కడే ఉండిపోయాడు. ఆ తరువాత త్రైలింగధరుని వెంట పెట్టుకొని భాగీరథస్వామి పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ చాలా రోజులు ఉన్నారు. అక్కడనే త్రైలింగధరుడు వంగ సంవత్సరము 1092లో భాగీరథస్వామి నుండి దీక్షాస్వీకారం చేశాడు. దీక్షాస్వీకారం తరువాత ఆయన పేరు ‘గణపతిస్వామి’గా మారింది. 1102వ సంవత్సరంలో భాగీరథస్వామి ఆ పుష్కర క్షేత్రంలోనే తన పార్థివ శరీరాన్ని విడిచిపెట్టారు. మహాత్మా బాగీరథస్వామి పరలోకగతుడైన తరువాత గణపతిస్వామి (త్రైలింగధరుడు) తీర్థయాత్రలు చెయ్యటానికి పుష్కరతీర్థాన్ని విడిచిపెట్టి బయల్దేరాడు.
కొన్ని రోజులు వివిధ పుణ్యక్షేత్ర సందర్శన చేసిన గణపతి స్వామి సేతుబంధ రామేశ్వరం చేరారు. కార్తీక శుక్ల పంచమి నాడు రామేశ్వరంలో పెద్దయెత్తున ఉత్సవం జరుగుతున్నది. ఆ సమయంలో అక్కడికి ఎందరెందరో మహానుభావులు, సాధువులు వచ్చి చేరతారు. తీర్థయాత్రలు చేస్తూ ఆ సమయంలో అక్కడికి వచ్చి చేరిన గణపతిస్వామి తన ఊరి యాత్రికులను కలిశారు. వారు కూడా చాలా రోజుల తరువాత ఆయనను చూసినందుకు ఎంతో సంతోషించారు.


తిరిగి ఆయనను తమ ఊరు తీసుకొనిపోవటానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం కాగా, తమ ప్రయత్నాలనుంచి విరమించుకొని, తమ తమ పనులలో నిమగ్నులైపోయారు.
ఉత్సవంలో రెండో రోజున ఒక సంఘటన జరిగింది. ఉత్సవానికి వచ్చిన ఒక వృద్ధుడు శీతోష్ణములకు తట్టుకోలేక క్రిందపడి మరణించాడు. ఆ బ్రాహ్మణుని బంధువులు పెద్దగా విలపించసాగారు. వారి ఆక్రందనలతో ఆ ప్రదేశమంతా సంచలనం కలిగింది. రెండు గంటల తరువాత ఆ సంచలనం సద్దుమణిగి, బంధువులంతా ఆ వృద్ధునికి దహన సంస్కారాలు చేయటానికి ఉద్యుక్తులయ్యారు. ఆ సమయంలో గణపతిస్వామి అక్కడికి వచ్చి, వారిని ఆపి తన కమండలంలోని నీటిని నాలుగైదుసార్లు ఆ చనిపోయిన వ్యక్తిమీద చల్లారు. క్రమక్రమంగా ఆ వృద్ధునికి స్పృహ రావటం మొదలయింది. అది గమనించిన గణపతిస్వామి, అతనికి పాలు తాగించమని బంధువులకు స్నేహితులకు సలహా ఇచ్చి వెళ్లిపోయారు. ఈ విచిత్ర సంఘటనను చూసినవారంతా ఆయన ఎంతో మహానుభావుడని చెప్పుకోసాగారు.
ఆ తరువాత వంగసంవత్సరం 1106లో గణపతిస్వామి దక్షిణ దేశాన్ని వదలి, సుదామ పూరి, ప్రయాగ, ద్వారకలు దర్శించారు. అక్కడ ఆయనకు చాలామంది బీద బ్రాహ్మణులు కన్పించారు. వారిలో కొందరు సేతుబంధ రామేశ్వరంలో గణపతిస్వామి ప్రదర్శించిన అలౌకిక మహిమలను కళ్లారా చూసినవారు. స్వామి అక్కడికి చేరగానే వారాయనను గుర్తించి, అత్యంత భక్తిప్రపత్తులతో ఆయనకు సేవలు చేశారు. వారి సేవానిరతికి సంతుష్టుడైన గణపతి స్వామి ‘‘మీ సేవలకు నేనేమి చెయ్యాలి’’ అని అడిగారు. ఆ బీద బ్రాహ్మణులు కొందరు తమకు ధనం కావాలని, మరికొందరు తమ వంశాభివృద్ధి కావాలని కోరుకున్నారు. అప్పుడు స్వామివారు ‘‘మీ కోరికలు త్వరలోనే నెరవేరుతా’’యని అనుగ్రహించారు. గణపతిస్వామి అనుగ్రహంవలన వారు ఒక సంవత్సరంలోనే చాలా ధనవంతులయ్యారు. మరికొందరు పుత్రవంతులయ్యారు. అనతికాలంలోనే ఈ విషయం అందరికీ తెలిసి, ఎందరెందరో తమ కోర్కెలను తీర్చుకోవటానికి గణపతిస్వామి వద్దకు రాసాగారు. ఆవిధంగా గణపతిస్వామివారిని సేవించే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి అయింది. దానితో స్వామివారి పారమార్థిక చింతనకు విఘ్నం కలగటం ప్రారంభమైంది. అందువలన గణపతిస్వామి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరొక చోటుకు వెళ్లటానికి నిశ్చయించుకొన్నారు.
వంగ సంవత్సరం 1108లో గణపతి స్వామి ద్వారకను వదలి, నేపాల్ చేరి అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో యోగాభ్యాసం చేయసాగారు. ఆయనలోని అత్యంత ఆశ్చర్యకరమైన శక్తులు, అసాధారణమైన మహిమలు త్వరలోనే జనసామాన్యంలో వ్యాపించాయి.
ఒక రోజు నేపాల్ మహారాజు తన సైన్యంతో అరణ్యానికి వేటకు వెళ్ళాడు. కొంతసేపయిన తరువాత రాజుగారికి సైన్యాధిపతి ఒక పెద్దపులిపైకి తుపాకిని పేల్చాడు. తుపాకీ గుండు ఆ పులికి తగలకపోవటంతో అది తప్పించుకొని, పెద్దగా గాండ్రిస్తూ పరుగెత్తసాగింది. అది చూసి రాజభటులు గుఱ్ఱాలమీద ఆ పులిని వెంబడించారు.
ఆ పెద్దపులి పరుగెత్తి పరుగెత్తి ధ్యానమగ్నుడైన గణపతిస్వామి ఉన్నచోటికి చేరుకుని, ఆర్తనాదం చేస్తూ స్వామివారి పాదముల వద్ద పిల్లిలాగా పడుకొన్నది. ఆ పులి చేసిన ఆర్తనాదాలకు స్వామి వారి ధ్యానస్థితి సడలిపోయింది. కన్నులు తెరవగానే వారి దృష్టి పులిమీద పడింది. ఆ పులి పరిస్థితిని అర్థం చేసుకొన్న స్వామి, ఆ పులి శరీరాన్ని ఆప్యాయంగా నిమిరారు. ఇంతలో పులిని వెంటాడుతూ వచ్చిన రాజభటులు కూడా అక్కడికి చేరుకొన్నారు.
ఆ అద్భుత దృశ్యాన్ని చూసి వారు నిశే్చష్టులై నిలిచిపోయారు. స్వామి వారు కరుణామయములైన చూపులతో ఆ భటులను తన వద్దకు రమ్మని సంజ్ఞ చేశారు.


వారు ఎంతో భక్తిప్రపత్తులతోను, భయభ్రాంతులతోను స్వామివారి చెంతకు చేరి నమస్కరించారు. స్వామివారు చిరునవ్వుతో ఇలా అన్నారు. ‘‘మీరంతా ఇంత ఆశ్చర్యాన్ని పొందటానికి, భయభ్రాంతులు కావటానికి కారణమేమిటి? మీరు మీ హింసాప్రవృత్తిని విడిచిపెడితే క్రూరజంతువులు కూడా మిమ్మల్ని హింసించవు. అవి కూడా తమ హింసా ప్రవృత్తిని విడిచిపెడతాయి. ఈ పెద్దపులి ఇంత ప్రశాంతంగా పడి ఉండటమే అందుకు ప్రత్యక్ష ప్రమాణము. ఇంతవరకూ మీరు దాని ప్రాణములు తియ్యాలనుకొన్నారు. కాని ఇప్పుడు ఈ పులి సునాయాసంగా మీ ప్రాణాలను తియ్యగలదు. అందువల్లనే దీనిని చూసి మీరు భయపడుతున్నారు. ఎవరికీ ఇంకొకరి ప్రాణాలు తీయటానికి అధికారం లేదు. ఒకవేళ అలాంటి అధికారం కనుక మీకు ఉంటే, దాని ప్రాణం మీరు ఎప్పుడో తీసి ఉండేవారు. ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు సమానులే. కనుక ఒకరిని మరొకరు హింసించటం మంచిది కాదు. ఇక మీకు భయం లేదు. మీరు నిర్భయంగా, నిశ్చింతగా వెళ్లి మీ అనుచర వర్గాన్ని చేరవచ్చు. నేటినించీ హింసాప్రవృత్తిని మానటానికి ప్రయత్నించండి’’ అని ప్రబోధించారు. స్వామివారి మాటలు విన్న ఆ రాజభటులు స్వాస్థ్యచిత్తులయ్యారు. ఎన్నడూ కనీ వినీ ఎరుగని దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసినవారు అవాక్కయ్యారు. స్వామివారి పాదధూళిని కన్నులకు అద్దుకొని, వారి అనుమతితో అక్కడినుంచి వెళ్లిపోయారు. కొంతసేపటికి ఆ పెద్దపులి కూడా వెళ్లిపోయింది.
స్వామివారి అనుజ్ఞను పొందిన రాజభటులు, ఆ సన్నివేశానే్న పదే పదే తలుచుకొంటూ తమ ఊరికి వెళ్లి, జరిగినదంతా రాజుగారికి విన్నవించుకొన్నారు. ఈ అద్భుత సంఘటనలు విన్న సభాసదులు ఆశ్చర్యపడ్డారు.
నేపాలు మహారాజు పరమ ధార్మికుడు. స్వామివారి ఈ అసాధారణ క్షమతను, అలౌకిక శక్తిని విని, వారిని దర్శించాలని నిర్ణయించుకొన్నాడు. ఆ తరువాత ససైన్యంగా బయల్దేరి స్వామివారిని దర్శించి, అమూల్య రత్నరాశులను తీసుకొని వెళ్లి స్వామివారి పాద పద్మములకడ సమర్పించాడు. స్వామివారు కన్నులు తెరిచి చూశారు. ఎదురుగా ఉన్న రాజును, రాజభటులను చూసి చిరునవ్వునవ్వారు. రాజు ఇచ్చిన రత్నరాశులను ముట్టనైనా ముట్టలేదు. ఈ రత్నభాండారమైన వసుంధరనే తృణీకరించిన ఆ మహామహుని నశ్వరమైన పార్థివ ద్రవ్యాలు ఆకర్షిస్తాయా? స్వామివారు రాజును సన్మానించి, వివిధరకాల ఉపదేశములను చేసి పంపించారు.
ఇలాంటి ఆశ్చర్యకరమైన కార్యకలాపాలు త్వరలోనే సర్వత్రా వ్యాపించినాయి. ఎందరెందరో మహానుభావులు స్వామివారిని దర్శింపసాగారు. అందువలన స్వామివారి పారిమార్థిక కార్యక్రమాలకు మరొకసారి విఘ్నం కలిగింది.
అందువలన స్వామివారు వంగీయ సంవత్సరం 1114లో నేపాల్ రాజ్యం వదిలి, టిబెట్ చేరకొన్నారు. అక్కడ కొన్ని రోజులుండి, 1117లో మానస సరోవరం చేరుకొన్నారు. అక్కడ చాలాకాలం యోగసాధన చేశారు.
మానస సరోవరంలో ఉన్న రోజులో ఒకనాడు ఒక వితంతు స్ర్తి 7 సంవత్సరాల మృతబాలుని భుజాన వేసుకొని, పెద్దపెట్టున ఏడుస్తూ, అంతిమ సంస్కారం చెయ్యటానికి శ్మశానం వైపు నడవసాగింది. ఆమెకు ఏకైక ఆధారమైన ఆ ఒక్క పిల్లవాడుకూడా, అంతకుముందు రోజు రాత్రి పాము కాటుకు గురియై మృత్యువాత పడ్డాడు. ఆ పిల్లవాని బాల్యావస్థలోనే తండ్రి మరణించాడు. ఆ పుత్రుడు తప్ప ఈ ప్రపంచంలో ఆమెకు ఎవ్వరూ లేకపోవటంవలన, ఆ పిల్లవాడిమీదనే తన ఆశలన్నీ పెట్టుకొని జీవిస్తూ ఉండేది. ఉన్న ఒక్క ఆధారమూ పోయేసరికి, ఆమె దుఃఖం భరింపరానిది అయింది.
ఆ కష్టంలో గ్రామవాసులంతా ఆమెకు తోడుగా నిలిచారు. చాలామంది శ్మశానంవరకూ ఆమెకు తోడుగా వెళ్లారు. ఆ పిల్లవానికి అంతిమ సంస్కారం చేయటానికి సన్నద్ధులైన తరుణంలో గణపతిస్వామి అక్కడికి చేరుకొన్నారు.



స్వామిని చూడగానే ఆమె మనస్సులో ఏదో ఆశ హఠాత్తుగా అంకురించింది. స్వామీజీని చూడగానే ఆయన తన పుత్రునికి ప్రాణదానం చేయగలడని అంతరాత్మ చెప్పినట్లయింది. అనిర్వచనీయమైన ఒక అనుభూతిని పొంది, కొన్ని క్షణాలపాటు భయంకరమైన తన పుత్రశోకాన్ని కూడా మర్చిపోయింది. కొంతసేపటికి తేరుకొని, చనిపోయిన కుమారుని స్వామీజీ పాదాల దగ్గర ఉంచి, ప్రాణదానం చెయ్యమని ప్రార్థించింది. ఆమె పరిస్థితిని గ్రహించిన కరుణామయుడైన స్వామీజీ ఆ పిల్లవాని భౌతికకాయాన్ని చేతితో స్పృశించారు.
స్వామీజీ చెయ్యి తాకగానే ఆ శరీరంలో చైతన్యం ఉట్టిపడింది. దానిని చూసి ఆ స్ర్తి ఆనంద పులకాంకితయై స్వామివారి చరణములపైన వ్రాలి నమస్కరించింది. అక్కడ ఉన్నవారంతా నిశే్చష్టులయ్యారు. స్వామివారు వారందరినీ అనుగ్రహించి ఆ పిల్లవానిని ఇంటికి తీసుకు వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చారు. వారంతా చూస్తూ ఉండగానే మరుక్షణంలో స్వామీజీ అదృశ్యమయ్యారు. ఆ తరువాత మరెప్పుడూ గణపతి స్వామి మానస సరోవరంలో కనిపించలేదు.
ఆ తరువాత గణపతిస్వామి 1133వ సంవత్సరంలో నర్మదానదీ తీరాన ఉన్న మార్కండేయాశ్రమానికి వచ్చి నివసింపసాగారు. అక్కడ ఎందరో మహాత్ములతో కలిసి సంభాషించే అవకాశం ఆయనకు లభించింది. అది ఆయనకు చాలా సంతోషాన్ని కలిగించింది. వారుకూడా గణపతిస్వామిని కలిసినందుకు సంతుష్టులైనారు.
ఆ ఆశ్రమంలో ఖాకీబాబా అనే ఒక మహానుభావుడు చాలారోజులుగా నివసిస్తూ ఉండేవారు. ఆయన ప్రతిరోజూ నర్మదా నదీ తీరానికి వెళ్ళి యోగాభ్యాసం చేసేవారు. ఒకరోజున ఆయన నది ఒడ్డుకు వెళ్లి చూసేసరికి, ఆ నదిలోని నీళ్లన్నీ పాలలాగా కనబడసాగినాయి. గణపతిస్వామి ఆ పాలను దోసిలితో తీసుకొని త్రాగటానికి సిద్ధంగా ఉన్నారు.
అది చూసిన ఖాకీబాబా హఠాత్తుగా నిశే్చష్టుడయ్యారు. ఆ పాలను తాను గూడా త్రాగటానికి దోసిలిలో పట్టగానే ఆ నదిలోని పాలన్నీ నీరయ్యాయి. ఆ అద్భుత సంఘటన చూసి ఖాకీబాబా నిశే్చష్టుడై నిలబడిపోయారు. ఆ తరువాత తన ఆశ్రమానికి తిరిగి వచ్చిన ఖాకీబాబా, తాను చూసిన ఆ యధార్థ సంఘటనను ఆ ఆశ్రమంలోనే ఉంటూ ఉన్న మహాత్ములకు వర్ణించి చెప్పారు. అది విన్న ఆ ఆశ్రమవాసులంతా ఆశ్చర్యచకితులై పూర్వంకన్నా ఎక్కువ భక్తిశ్రద్ధలతో గణపతిస్వామిని గౌరవించసాగారు.
ఆ సంఘటన తరువాత గణపతిస్వామివారు మార్కండేయాశ్రమాన్ని వదిలి 1140లో ప్రయాగ చేరుకొన్నారు. అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో యోగసాధన చేయసాగారు. ఒకరోజున గణపతి స్వామి ప్రయాగఘాట్‌లో కూర్చొని ఉండగా, ఒక నావ కొంతమంది యాత్రికులను తీసుకొని అక్కడికి వస్తూ ఉండింది. ఆ నావ ప్రవాహ మధ్యభాగంలో ఉండగా ఆకాశమంతా మేఘావృతమై, తుఫానుగాలులు వీచసాగాయి. పెద్దవాన మొదలైంది.
ఒడ్డున ఉన్న జనమంతా ప్రాణభీతితో పారిపోసాగారు. గణపతిస్వామి మాత్రం ఆ వానలో అక్కడ అట్లాగే కూర్చొని ఉన్నారు. పారిపోతున్న వారిలో రామతారక భట్టాచార్య అనే ఒక బ్రాహ్మణుడు స్వామివారిని గుర్తించి, వారి వద్దకు వెళ్లి వర్షంలో కూర్చొని అనవసరంగా కష్టమును కొనితెచ్చుకోవద్దని కాకపోతే తన వెంట రమ్మని ప్రార్థించాడు. అది విని గణపతిస్వామి చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు. ‘‘బాబూ! నీవు నా కొరకు ఎందుకు బాధపడతావు. నేను కష్టాన్ని అనుభవించటంలేదు.
అదిగోచూడు- ఆ వస్తున్న నావ కొద్దిసేసట్లో మునిగిపోతున్నది. దానిలో యాత్రికులను రక్షించవలసియున్నది’ అని అంటూ ఉండగానే ఆ నావ నీటిలో మునిగిపోయింది.
చూస్తూ చూస్తూ ఉండగానే గణపతిస్వామి కూడా అదృశ్యులయ్యారు. అదిచూస్తూ ఉన్న ఆ బ్రాహ్మణుడు నిశే్చష్టుడయ్యాడు.

అక్కడే ఉండి ఏం జరుగుతుందో అని ఆతృతతో చూస్తూ ఉండగా, మరుక్షణంలో ఆ నావ ఒడ్డుకు చేరుకొన్నది. ఆ నావలోనుండి యాత్రికులతోపాటు గణపతిస్వామి కూడా దిగారు. అదిచూసి బ్రాహ్మణుడు మరింత ఆశ్చర్యపడినాడు. అతని నోటినుంచి మాటలు కూడా రాలేదు. తమతోపాటు నావలోనుంచి దిగిన ఆ అపరిచిత దిగంబర వ్యక్తిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు.
తమనావ ఏ విధంగా ఒడ్డుకు చేరిందో వారికి తెలియనే తెలియదు. అందరూ ఎవరి ఇళ్ళకువారు వెళ్లిపోయారు. రామతారక భట్టాచార్యుడు మాత్రం అదంతా అర్థం చేసుకొని స్వామీజీ పాదాల మీద వ్రాలిపోయాడు. స్వామీజీ పాదభూళిని స్వీకరించి, నొసటిమీద ధరించి, ఏదో అడగబోయాడు. అంతలోనే స్వామీజీ ఆయన మనస్సలోని మాటను గ్రహించి ఇలా చెప్పసాగాడు. ‘‘బాబూ! ఇప్పటి సంఘటనను చూసి నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? నిజంగా నీవు ఆశ్చర్యపడనవసరంలేదు. ఇటువంటి శక్తి నీలో కూడా ఉన్నది. అది అందరిలోనూ ఉంటుంది. కాని, మనుష్యులంతా అనిత్యమైన ఈ సంసారిక సుఖంలో మునిగిపోయి, ఎవ్వరూ తమ అత్యున్నత స్థితిని గురించి ఆలోచించటంలేదు.
భగవంతుడు మానవ శరీరాన్ని సృష్టించి, స్వయంగా దానిలోనే కాపురమున్నాడు. అందువలన ప్రతి మనిషిలోనూ ఈశ్వరీయ శక్తి ఉన్నది. అనిత్యమైన ప్రపంచం కొరకు మానవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, అందులో నూరవవంతు భగవంతుని కొరకు ప్రయత్నిస్తే ఆయన మనకు తప్పక లభిస్తాడు. అలాటివారికి ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏమీ ఉండదు. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమీ లేదు. నీవు అనవసరంగా వర్షంలో తడిసి కష్టపడుతున్నావు’’ అని చెప్పి స్వామీజీ అదృశ్యులయ్యారు.
వంగ సంవత్సరం 1144 మాఘమాసంలో గణపతిస్వామి ప్రయాగను వదలిపెట్టి కాశీ పట్టణం చేరి, అక్కడి ఆసీఘాట్‌లో ఉన్న తులసీదాసు తోటలో నివసింపసాగారు. అక్కడాయన అప్పుడప్పుడు లోలార్కకుండమునకు వెళ్లి వస్తూ ఉండేవారు. ఒక రోజున అక్కడ ఆయనకు అజ్మీర్ వాసియైన బ్రహ్మసింహుడనే పేరుగల చెమిటివాడు కుష్టురోగంతో బాధపడుతూ కనిపించాడు. స్వామీజీ ఆయనను స్పృశించగానే ఆ వ్యక్తి మేల్కొని వారిని స్తుతింపసాగాడు. స్వామి సంతుష్టులై అతనికి ఒక బిల్వపత్రాన్ని ఇచ్చి, లోలార్కకుండంలో స్నానం చేసి, ఆ బిల్వపత్రాన్ని ధరించి, ఆ పీడనుంచి విముక్తడవు కమ్మని ఆదేశించారు. స్వామివారు చెప్పినట్లు చేసి, కొద్దిదినాలలోనే అతడు చెమిటితనము- కుష్ఠురోగములనుండి విముక్తుడై కాంతిమంతుడైనాడు. అప్పటినుంచీ అతడు స్వామీజీకి సేవకునిలా సేవలు చేయసాగాడు.
దాని తరువాత స్వామివారు తులసీదాసు తోటను వదిలి, వేదవ్యాసాశ్రమంలో ఉండసాగారు. సీతానాథ బందోపాధ్యాయ అనే ఒక బ్రాహ్మణుడు రాజయక్ష్మంతో చాలా రోజులుగా బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని వైద్యాలు చేయించినా ఆ రోగం తగ్గలేదు. అతడు హతాశుడై, ఒక రోజున స్నానం చెయ్యటానికి గంగానదికి వెళ్లాడు. అక్కడ అతనికి దగ్గు రావటం ప్రారంభమైంది. ఒకవైపున అలసట, మరొకవైపున రోగముతోను బాధపడుతూ ఆ గంగానది ఒడ్డున పడి ఏడవసాగాడు.
కొంచెం సేపటికి రోగం అధికమై అచేతనుడైపోయాడు. హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని చూసినవారు చలించిపోయి, అతనికి సేవ చేయటం ప్రారంభించారు. కాని ఎంతసేపటికీ ఆయనలో కదలిక రాకపోవవటంవలన ఆయనమీద ఆశలు వదిలివేశారు.
అదే సమయంలో గణపతిస్వామి గంగాస్నానానికి అక్కడికి వచ్చారు. స్వామి వారందరినీ ప్రక్కకు పొమ్మని ఆదేశించి, ఆ బ్రాహ్మణుని వక్షస్థలాన్ని ముట్టుకొని, అతని చేతులు పట్టుకొని కూర్చోబెట్టారు. బ్రాహ్మణుడు పునర్జీవితుడైనట్లు లేచి కూర్చున్నాడు.

- ఇంకాఉంది


1 వ్యాఖ్యలు:

సురేష్ బాబు May 9, 2012 at 5:56 AM  

మొట్టమొదట నేను త్రైలింగస్వామి గురించి రామకృష్ణపరమహంస జీవితచరిత్రలో చూశాను. తర్వాత కొద్దిగా తెలుసుకున్నాను. ఇప్పుడు మీ దయవలన ఇంకా తెలుసుకొంటున్నాము.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP